koodali

Wednesday, May 9, 2012

అంశావతారాలు విషయంలో....


పురాణములు వాటిలోని కధలను మనము చిన్నతనములో చదివినప్పుడు ఒక అర్ధం లో గోచరించవచ్చు. అదే మనకు వయస్సు పెరిగి బుధ్ధి పరిపక్వత చెందేకొద్దీ సత్యం కొంచెం కొంచెముగా అర్ధమవుతూ ఉంటుంది. అందుకని త్వరపడి వాటిని అపార్ధం చేసుకోకూడదు. అందుకే తరాలు మారినా అందులోని అర్ధములు అనంతములు. పురాణములలో చాలా లోతైన గొప్ప విషయాలుంటాయి. అవి పండితులకు మాత్రమే అర్ధమవుతాయి. నేను వాటి జోలికి పోదలుచుకోలేదు, నాకు అవి అర్ధం కావు కాబట్టి. నాకు తెలిసిన సామాన్య విషయాలే రాయటం బాగుంటుంది లెండి .


ఇప్పుడు ....... బ్రహ్మ దేవుడు సృష్టి చేస్తారు కదా. సృష్టి రచనకు విజ్ఞానం అవసరం. అందుకే వారికి భార్యగా చదువుల తల్లి సరస్వతీ దేవి ఉండటం ,......మరి మహా విష్ణువు పాలన చేస్తారు. అందుకే వారికి సంపదలనిచ్చే తల్లి మహాలక్ష్మీ దేవి భార్యగా ఉండటం., ...... అలాగే పరమశివుడు సం హారాన్ని చేస్తారు గదా... అందుకే వారికి శక్తి స్వరూపిణి తల్లి పార్వతీ దేవి భార్యగా ఉండటం ......... ఇవన్నీ ఎంత చక్కగా అర్ధవంతముగా ఉన్నాయో గదా.
...........

 
ఇంకా త్రిమూర్తులు వారివారి పదవీబాద్యతల ప్రకారం వారి వస్త్రధారణ ఉన్నట్లు కూడా నాకనిపించింది.

సృష్టిని చేసే బ్రహ్మ ఈ నాటి శాస్త్రవేత్తల వలె గడ్డం కలిగిఉండటం ...


మహావిష్ణువు స్థితి కి సూచనగా ఆభరణములు ధరించుట ఇలా అలంకారప్రియులు.

పరమశివుడు లయకారత్వానికి చిహ్నమైన భస్మమును ధరించుట, ఇంకా అభిషేకప్రియులు. ఇలా మనపెద్దలు ఎంత బాగా చెప్పారు...

 
********
పైన  వ్రాసిన  విషయాలు  పాత  టపాలలోనివండి.   బ్రహ్మదేవునికి  గడ్డం  ఉండదని  కొందరు  పండితులు  చెబుతున్నారు.
************************

ఈ  రోజు  పోస్ట్.


ఓం.
మూలదైవం ...... తానే  త్రిమూర్తులుగానూ  త్రిశక్తులైన  లక్ష్మీ  సరస్వతీ  పార్వతీలు గానూ  రూపాలను  ధరించి ,  అన్నీ  తామై    సృష్టిని  నడిపించటం  జరుగుతుంది. 



  మూలదైవానికి   సగుణగానూ  నిర్గుణగానూ,   సాకారంగానూ  నిరాకారంగానూ ..... అప్పటి  పరిస్థితిని  బట్టి  ఎలా  కావాలంటే  అలా    తనను  తాను  మార్చుకోగల  శక్తి  ఉంటుంది. 


మనం  పురాణేతిహాసాలను  చదివి  ఎన్నో  అపోహలకు  లోనవుతాము. కాని   అలా అపోహ  పడటం   తప్పు.  


 దేవతామూర్తులు  అవసరాన్ని  బట్టి   ,  లోకోపకారం  కోసం  తమ  అంశలతో   ఎన్నో  అవతారాలను  ధరిస్తారు.


 సరస్వతిదేవి    బ్రహ్మలోకంలో  ఉంటుందని  మనకు  తెలుసు.  విష్ణులోకంలో  కూడా  సరస్వతీదేవి   యొక్క  అంశ  ఉంటుందని  పెద్దలు  చెబుతారు.   విష్ణు  లోకంలో  సరస్వతీదేవి అంశ    అంటే  ......?
ఈ   విషయం  అలా  ఉంచితే....


లక్ష్మీదేవి  యొక్క  అష్టలక్ష్మీ  స్వరూపాల్లో   విద్యాలక్ష్మి  కూడా  ఒకరని    అంటారు.   
 
ఇంకా,   గంగాదేవి     ఇంద్రలోకంలో  మందాకినిగా,  పాతాళంలో  భోగవతిగా,   భూలోకంలో  అలకనందగా   ( భాగీరధి  ) పిలవబడుతూ ,   ఇంకా ....ఎన్నో  లోకాల్లో  కూడా    ప్రవహిస్తుందట. 


  గంగాదేవి   అంటే    జలం .  లోకాలకు  ఎంతో  అవసరమైనది  జలం.   సృష్టి    పాలనకు  జలం  ఎంతో  అవసరం. 


 ఆ  విధంగా    వైకుంఠంలో  పాలనా  బాధ్యతలు  స్వీకరించిన  విష్ణుమూర్తికి  సహాయంగా లక్ష్మీ ,    సరస్వతి,  గంగ,  ఉంటారంటే ..... లోకపాలనకు    లక్ష్మీ(సంపద)   సరస్వతి, (  విజ్ఞానం  ) గంగ  (  జలం )  ,  ఎంతో  అవసరమే  కదా  !

 (  గంగమ్మను  జ్ఞానానికి  సంకేతంగా  కూడా  చెబుతారు.)

ఇంకా,  గంగాదేవి   సృష్టి  పాలనకే  కాకుండా  ,   సృష్టి   సంహారం  విషయంలో  కూడా  పాల్గొనే  అవకాశం  ఉంది.



  మానవులకు   నీరు  దాహాన్ని  తీర్చి   ప్రాణాలనూ     నిలుపుతుంది  ....  ప్రచండ  వేగంతో  ఊళ్ళమీద  పడితే  అదే  జలం  ప్రాణాలనూ    తీసి  సంహరిస్తుంది.  అలా   సంహరించకుండా  గంగమ్మ  యొక్క  ప్రచండతను  శివుడు  తన  జటాజూటంలో  నిలిపి  తగ్గించారు. .   అవసరమైతే   ఆ  జలమే    వరదల  రూపంలో   సంహారాన్నీ  చేస్తుంది.  


జలం   ప్రాణులకు  సంక్షేమాన్నీ    కలిగించగలదు.     సంహారాన్నీ    కలిగించగలదు..

 అలా  గంగాదేవి   
వైకుంఠంలోనూ   ఉండవచ్చు.     కైలాసంలోనూ  ఉండవచ్చు  అని  నాకు  అనిపించింది.


రాక్షసులు  వరాలు  కోరినప్పుడు  ఇచ్చి,  ఆ  వరభంగం  కాకుండానే  ఎంతో  చాకచక్యంగా  ఆ  రాక్షసులను  సంహరించిన  దైవానికి   ధర్మవిరుద్ధం  కాకుండా  అవతారాలను  ధరించటం  కూడా  తప్పక   తెలుస్తుంది.


   కలియుగంలో  కొంతకాలం   గడిచిన    తరువాత ,  భూలోకంలోని    గంగానది  అదృశ్యమవుతుందట.  ఇప్పుడు  గంగానదిని    పొల్యూట్  చేస్తున్న  తీరు  చూస్తుంటే   గ్రంధాలలో  చెప్పినది  నిజమేనని  స్పష్టంగా  తెలుస్తోంది. 

ఆ  విషయం అలా   ఉంచితే,...

దేవతామూర్తులు      అంశావతారాలు , కళాంశ  రూపాల   విషయంలో,    పరిస్థితిని  బట్టి  మార్పులుచేర్పులు  జరుగుతుంటాయి  అనిపిస్తుంది.  


గంగాదేవి  కైలాసంలో  పార్వతీదేవి  అంశతోనూ,  వైకుంఠంలో  లక్ష్మీదేవి  అంశతోనూ ఉంటుందని  నాకు  అనిపించింది.


   గంగాదేవికి  గల   నామములలో  గిరిజాయై  అన్న  నామము    కూడా  ఉంది.   పార్వతీదేవికి  కూడా  గిరిజాయై  అనే  నామము  ఉంది.

ఇంకా , గంగాదేవిని  లక్ష్మీ  స్వరూపిణి  అని  కూడా   గ్రంధాలలో  చెప్పారు.  


 వ్రాసిన  విషయాలలో  పొరపాట్లు  ఉంటే  దయచేసి   క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను. ఈ  టాపిక్  కొంచెం  క్లిష్టమయినదే.  బ్లాగులో  వ్రాయనా  వద్దా  అని  ఎంతో  ఆలోచించి  వ్రాయటం  జరిగిందండి.




No comments:

Post a Comment