koodali

Wednesday, May 30, 2012

జంట అంటే అర్ధం ఇద్దరు అని....


జంట అంటే  అర్ధం  ఇద్దరు  అనేకానీ   బోలెడుమంది  అని  కాదు. ఒక  భార్యను  ఒక  భర్తను    ఒక జంట   అని  పెద్దలు అంటారు.

  వారు     చక్కటి  జంటగా    జీవితాంతమూ  తోడునీడగా  ఉన్నప్పుడు  ఆ  కుటుంబమూ  ఆ  సమాజమూ  చక్కగా  ఉంటాయి. 


 అందుకే  జీవితాంతం    కష్టసుఖాలలో  ఒకరికొకరు  తోడునీడగా  ఉండాలని  వివాహసమయంలో  వధూవరులతో  పెద్దలు   ఎన్నో  ప్రతిజ్ఞలు  చేయిస్తారు...... అలా  చక్కగా  ఉండే  జంట   అదృష్టవంతులే. 


 అయితే  అందరి  జీవితాలూ  ఒకలా  ఉండవు  కదా  !   ఎన్నో  కారణాల  వల్ల   కాపురాల్లో   మార్పులు  చేర్పులు  వస్తుంటాయి. 



ఎక్కువ  వివాహాలు  చేసుకోవటం  వల్ల  వచ్చే    కొన్ని  కష్టాలను  పురాణేతిహాసాల  ద్వారా  తెలుసుకోవచ్చు.



ఉదాహరణకు .....  ఏవైనా    కారణాల  వల్ల   భర్త  వేరే  వివాహం  చేసుకున్నప్పుడు   ఆ   సవతి  తల్లి  వల్ల  మొదటి  భార్య  సంతానానికి  కష్టాలు  వచ్చే  అవకాశం  ఉంది.


ఉదాహరణకు.....   రామాయణంలో  కైకేయి  వల్ల  రాముని  పట్టాభిషేకం  ఆగిపోవటం,  తరువాతి  సంఘటనలు     అందరికీ  తెలిసిన  కధే.  



ఇక     శంతనుని  విషయంలో  కొంచెం  వేరే  కధ. ....... మొదటి  భార్య  గంగాదేవి  భీష్ముని  పుట్టుక  తరువాత  శంతనుని  వదిలి  వెళ్ళిపోయింది.  (వివాహానికి  ముందు  జరిగిన  ఒప్పందానికి  వ్యతిరేకంగా  శంతనుడు   గంగాదేవిని  ప్రశ్నించేసరికి. )  



  చాలాకాలం  తరువాత   శంతనుడు    మళ్ళీ   వివాహం  చేసుకోవాలని  అనుకున్నారు. తనకు   భార్య  లేదు  కాబట్టి,  మళ్ళీ  వివాహం  చేసుకోవాలని  అనుకున్నప్పుడు , వివాహానికి     ఆంక్షలు  విధించిన      సత్యవతీదేవి  యొక్క  సంబంధాన్ని  కాకుండా,    శంతనుడు  ఇంకొక  స్త్రీని  వివాహం  చేసుకుంటే  బాగుండేది.


శంతనుడు  సత్యవతీదేవిని  వివాహం  చేసుకోవాలనుకున్నప్పుడు   సత్యవతీదేవి  తండ్రి  కోరిన  కోరికల  వల్ల  భీష్ముడు  వివాహాన్ని,  రాజ్యార్హతను  వదిలేయవలసి  వచ్చింది  కదా  !


    భీష్ముడు  వివాహాన్ని  చేసుకుని,  రాజ్యాన్ని  పాలిస్తే   మహాభారత  కధ  ఇంకోలా  ఉండేదేమో! 

 ఇక  స్త్రీలు  ఎక్కువ  వివాహాలు  చేసుకోవటం  ...... ఉదాహరణకు ....  ఊహించని   విధంగా      ద్రౌపదికి   పంచపాండవులతో   వివాహం    జరిగింది  కదా  !  ద్రౌపది  పంచ  పాండవుల  వద్ద   ఒక్కొక్కరి  వద్ద  ఒక్కొక్క  సంవత్సరం  ఉండేటట్లు  ఏర్పాటు  జరిగింది  . 


 ధర్మరాజు  వద్ద  ద్రౌపది  ఉన్న    సంవత్సరంలో  మిగతా  నలుగురు    వారింటికి   రాకూడదన్న  మాట.    ఒకసారి  ఒక  తప్పనిసరి   పనివల్ల  అర్జునుడు  ద్రౌపది  ఉన్న  ధర్మరాజు   ఇంటికి  రావటం   వల్ల  ,     అర్జునుడు  తీర్ధయాత్రలు  చేయవలసి  వచ్చింది.  అప్పుడే   అర్జునుడు   సుభద్ర  మొదలగు  వారిని  వివాహం  చేసుకున్నాడు.


 ఎక్కువ  వివాహాలు  చేసుకోవటం  వల్ల  ఇలాంటి  సున్నితమైన  ఇబ్బందులు  ఎన్నో   ఉంటాయని   ద్రౌపది  కధ  ద్వారా  మనం  తెలుసుకోవచ్చు.


ఈ  రోజుల్లో  కొందరు   ఆడవారు    వేరే  వివాహాలు  చేసుకుంటున్నారు.  ఇలాంటి    సందర్భాలలో ఎక్కువగా    ఇబ్బందులు  పడేది    వారి  సంతానామే. 



  స్త్రీలు  రెండవ  వివాహం  చేసుకుంటే  ఆ  స్త్రీకి     మొదటి  భర్త  వల్ల   కలిగిన  సంతానానికి , మారుటి  తండ్రి  వల్ల  కష్టాలు  వచ్చే  అవకాశం      ఉంది.  ఆమెకు  ఆడపిల్లలు  ఉంటే    ఆ  పిల్లలకు   కొత్తరకం  కష్టాలు    వచ్చే   అవకాశాలు  కూడా    ఉండొచ్చు.


ఈ  రోజుల్లో  తల్లిదండ్రులు    తమ  పిల్లల  ఇష్టాఇష్టాలను  పట్టించుకోకుండా   తమ  సంతోషమే  ముఖ్యంగా  భావిస్తూ  వేరే  వేరే   వివాహాలు  చేసుకుంటున్నారు.



 తమ  పిల్లల  మనసులు  ఎంత  గాయపడతాయో   వాళ్ళకు  తెలిసినా  తాము  చేసిన  పనిని   సమర్ధించుకుంటున్నారు.      సొంతతల్లి  బదులు  కొత్త  తల్లి,  సొంత  తండ్రి  బదులు  కొత్త  తండ్రి   ఇంట్లో   ఉంటే        ఆ  పిల్లల  మానసిక  పరిస్థితి  ఎలా  ఉంటుందో  ఊహించుకుంటేనే  బాధగా  ఉంటుంది.


 ఇలాంటి    ఎందరో    జీవితాలలోని     సంఘటనల  సమాహారమే  పురాణేతిహాసాలు.  వాటిని  చదివి ,  జాగ్రత్తపడి    రాబోయే  తరాల  వాళ్ళు   తమ    జీవితాలను  చక్కగా  తీర్చిదిద్దుకోవాలని  ఆశించి ,  దైవం  , పెద్దలు  ఒక  ప్రణాళిక  ప్రకారం   పురాణేతిహాసాలను  మనకు  అందించారు . అని  నాకు అనిపిస్తుంది. 


 పురాణేతిహాసాలలో  ఇంకా  ఎన్నో  అంతరార్ధాలు  కూడా   ఉన్నా,  ఒక  సామాజిక  కోణం  ద్వారా  చూస్తే  నాకు  ఇలా  అనిపించింది...

...................................


No comments:

Post a Comment