koodali

Thursday, October 29, 2015

పిల్లలకు పంచతంత్రం కధలు..పెద్దవాళ్ళకు పురాణేతిహాసములు..


పురాణేతిహాసములను కొందరు విమర్శిస్తారు.

అందులోని నీతిని గ్రహించకుండా  వితండవాదాలు చేస్తారు.

పిల్లలకు పంచతంత్రము వంటి కధల ద్వారా , పెద్దవారికి పురాణేతిహాసములు, ఇంకా ఇతర ప్రాచీనగ్రంధముల ద్వారా దిశానిర్దేశం చేశారు పెద్దలు.

పిల్లలకు ఎన్నో కధలు చెప్పారు పెద్దలు. 

ఉదా.. పంచతంత్రము లోని కధలలో జంతువులను ప్రధాన పాత్రలుగా చేసి లోకంలోని ఎన్నో విషయాలను బోధించారు .

జంతువులను పాత్రలుగా పెట్టి కధలు చెబితే పిల్లలు ఇష్టంగా కధలు వింటారు కాబట్టి , అలా జంతువులు పాత్రలుగా కధలను చెప్పటం జరిగింది.

తెలివిగల పిల్లలు ఆ కధల ద్వారా అందులోని నీతిని నేర్చుకొని, జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు.

వితండవాదులైన వారు ఆ కధలలోని నీతిని వదిలేసి ....... అసలు జంతువులు ఎక్కడయినా మాట్లాడుతాయా ? జంతువులు ఎక్కడయినా మనుష్యుల్లా ఆలోచిస్తాయా ? నిరూపించండి. అని  వాదిస్తారు.

అంతా ట్రాష్,  మూఢత్వం. ...... అంటూ వితండవాదాలు కూడా  చేస్తారు.

పురాణేతిహాసములలోని నీతిని నేర్చుకోవాలి . అంతేకానీ , వితండవాదం చెయ్యటం సరి కాదు.
 
 పిల్లలకు పంచతంత్రం కధలు..పెద్దవాళ్ళకు  పురాణేతిహాసములు..
............................

 మరికొన్ని అభిప్రాయములు...

దుర్యోధనుడికి రాజ్యభోగములు ఎన్నో ఉన్నా కూడా , పాండవులను ఏ విధంగా కష్టాలపాలు చెయ్యాలి ?   ఒకవేళ పాండవులు వనవాసం మధ్యలో మానేసి తనమీదకు దండయాత్రకు వస్తారేమో ? వంటి  ఆలోచనలతోనే  అతని జీవితంలో ఎక్కువ భాగం గడిచిపోయింది.

అష్టైశ్వర్యాలు చుట్టూ ఉన్నా ఇలాంటివారు ఏమీ మనశ్శాంతిగా ఉండలేరు.

మనశ్శాంతి లేనప్పుడు అష్టైశ్వర్యాలూ ఉన్నా ఏం లాభం?

కొందరు  వారికి ఉన్నంతలోనే  సంతోషంగా ఉంటారు. ( వారికి అత్యాశలు ఉండవు కాబట్టి ).

ఈ రోజుల్లో కూడా చూడండి.

కొందరు  తమకు  ఉన్నంతలో సంతోషంగా , తృప్తిగా జీవితాన్ని గడుపుతున్నవారు  ఉన్నారు.

మరికొందరికి  బోలెడు  సంపాదన ఉన్నా కూడా అసహనంతో, అభద్రతతో మనసంతా అల్లకల్లోలంగా ఉండే వారు ఉన్నారు.
...............
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
.........................
 మనం తెలుసుకోవలసింది ఏమంటే ......

* దైవం దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.....అని. 

దైవకృపను పొందటానికి ప్రయత్నించాలి.


No comments:

Post a Comment