koodali

Thursday, April 30, 2020

పేదరికం, నిరుద్యోగ సమస్య తగ్గించటం.. కష్టమైన పనేమీ కాదు. .



అందరికీ ఉద్యోగాలు కల్పించటం కష్టమైన పనేమీ కాదు. 


ఇప్పుడు , దేశంలో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వైద్య శాఖలో ఎందరినో నియమించాలి. ప్రభుత్వ కార్యాలయాలలో ఎన్నో శాఖలలో చాలా మందిని నియమించవచ్చు.


************
కొందరు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలు తమకు కొన్ని వందల ఎకరాలను ఇస్తే, తాము కొన్ని వందలమందికి మాత్రమే ఉపాధి కల్పిస్తామంటున్నారు.

వ్యవసాయం వల్ల కూడా ఎక్కువమందికి ఉపాధి లభిస్తోంది.


ఉదా..కడియం తోటలపై ఆధారపడి సుమారు 20,000వేలమంది ఉపాధి పొందుతున్నారట. ఇవన్నీ గమనిస్తే, పారిశ్రామీకరణ వల్ల మాత్రమే ఉపాధి ఎక్కువగా లభించటం అనేది నిజంకాదని తెలుస్తుంది.


*************
ప్రభుత్వాలు దేశంలోని సహజవనరులను తమ అధీనంలో ఉంచుకుని, ప్రభుత్వరంగ సంస్థలను సమర్ధవంతంగా నడిపించాలి. ఉద్యోగుల జీతాలను తగ్గించాలి. అలా వచ్చిన ఆదాయంతో మరెందరికో ఉపాధిని కల్పించవచ్చు.

పాతకాలంలో ప్రభుత్వరంగ సంస్థలు సమర్ధవంతంగా పనిచేసేవి. క్రమంగా ప్రైవేట్ ఆధిపత్యం పెరిగింది.


 అయితే, ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగులు తరచూ జీతాల పెంపు వంటి విషయాలకొరకు సమ్మెలు చేయటం వంటి వాటి ద్వారా కూడా ప్రభుత్వాలు విసిగిపోయి, ప్రైవేటీకరణ వేగవంతం చేసిఉండవచ్చు.


 ప్రభుత్వాలకు ఆదాయం బాగుండాలి.  కనీసం ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంలో సంస్థలను నెలకొల్పాలి. అంతేకానీ, సంస్థలను పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వాల పరిస్థితి బలహీనమవుతుంది.


అయితే, ప్రైవేట్ లో  కూడా కొందరు మంచి యజమానులు ఉంటారు. . అలాంటి వారి  సంస్థలను  ప్రోత్సహించవచ్చు.

******************
వస్తువుల తయారీ మాత్రమే కాకుండా ప్రపంచంలో ఇంకా చాలా పనులున్నాయి...

ప్రభుత్వాల వద్ద ..  జీతాలు ఇవ్వటానికి  డబ్బు బాగా ఉంటే,  ప్రజలకు   రకరకాల  ఉపాధి  పనులు ఎన్నయినా కల్పించవచ్చు...   

ఉదా.. రోడ్లపై ఎన్ని గుంటలున్నాయో చూసి పూడ్చటం, దేశంలో రహదార్ల ప్రక్కన, చెరువుల ప్రక్కన, ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ మొక్కలు నాటి అవి బాగా పెరిగేలా పెంచటం, 


ఇంకా ఉద్యోగాలు సృష్టించాలంటే..  ప్రతి 50 మొక్కలకు ఒక్కొక్క ఉద్యోగిని ఉద్యోగంలో నియమించవచ్చు.

*******************************
పాతకాలంలో డబ్బుకు బదులు వస్తుమార్పిడి విధానం ఉండేది. కొంతకాలం తర్వాత వస్తుమార్పిడి విధానం మరియు జీతం ఇవ్వటం కలిపి ఉండేవి. 

ఉదా..పొలాల్లో పనిచేసే వారికి జీతంగా కొంత డబ్బు  మరియు  కొంత ధాన్యం ఇవ్వటం కూడా ఉండేది. 

************
చాలా కంపెనీలు తక్కువమంది ఉద్యోగులతోనే సంస్థలను నడిపిస్తున్నారు.  ఇద్దరు చేసే పనిని ఒకరితోనే చేయిస్తున్నారు.

జీతాలు తగ్గించి, ఎక్కువమంది  సిబ్బందిని  నియమించుకుంటే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. 


అప్పుడు ఉద్యోగస్తులకు కూడా  పని భారం తగ్గి , టెన్షన్ తగ్గి అనారోగ్యాలు తగ్గుతాయి.  పనిలో నైపుణ్యత కూడా మెరుగుపడుతుంది.


*********************

 పరిశ్రమల యజమానులు లాభాలలో తమ వాటాను కొంత తగ్గించుకుని, ఎక్కువమందికి ఉద్యోగాలివ్వాలి. ఉద్యోగస్తులు జీతాలను తగ్గించుకోవాలి.

 మరీ  ఎక్కువ ధరకు వస్తువులను అమ్మకూడదు . 
ధరలు తగ్గితే ..జీతాలు తగ్గినా సమస్యలు ఉండవు. 


జనాభా విపరీతంగా పెరగకూడదు.

ప్రజలు కూడా కోరికలను తగ్గించుకోవాలి.ఉన్నంతలో పొదుపుగా జీవించటం అలవాటుచేసుకోవాలి.


ఇవన్నీ జరిగితే, సమాజంలో సంపద అందరికీ న్యాయంగా లభిస్తుంది. నిరుద్యోగ సమస్య ఉండదు. పేదరికం ఉండదు.


************
 

వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమల వల్లే ఉపాధి ఎక్కువగా కల్పించగలం..అని చాలా మంది అపోహపడుతున్నారు.

మరి, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలలో కూడా నిరుద్యోగ సమస్య, ఆర్ధికమాంద్యం ఎందుకు ఉన్నాయి ?


ఈ విషయాలను గమనిస్తే, ఆధునిక ఆర్ధికవ్యవస్థ ధనవంతులను మరింత ధనవంతులుగా, పేదవారిని మరింత పేదవారుగా చేస్తున్నట్లు అనిపిస్తోంది.



***************
ఇప్పుడు అందరూ డబ్బు సాయం చేయాలని కేంద్రప్రభుత్వాన్ని అడుగుతున్నారు...అందుకే ప్రభుత్వాల వద్ద సంపద ఉండాలి.

అయితే, లాక్డౌన్ వల్ల బాగా నష్టపోయిన చిన్న, మధ్య తరహా సంస్థలను ప్రభుత్వాలు ఆదుకోవచ్చు కానీ,

 పెద్ద సంస్థల వాళ్ళ వద్ద  ఇంతకుముందు వచ్చిన లాభాలతో చాలా సంపద వాళ్ళ వద్ద ఉంటుంది కదా... వాళ్ళకు ఈ నష్టం పెద్ద లెక్కలోనిది కాదు.

****************
ప్రజలు అందరూ కూడా జీవితంలో వాస్తవపరిస్థితిని గుర్తించాలి. 

ఎలాపడితే అలా  చేసి పది తరాలకు సరిపడేలా విపరీతంగా డబ్బు సంపాదించినా కూడా మనశ్శాంతిని పొందటం మాత్రం కష్టం. 





యుద్ధాలు రాకుండా అందరూ ఆలోచించాలి....



ఒక జబ్బు వస్తేనే ప్రజలు తట్టుకోలేకపోతున్నారు.


యుద్ధం అంటే మరెన్నో ఇబ్బందులు ఉంటాయి కదా!


************

 చాలామంది ప్రజలు యుద్ధం అంటే సైనికుల వరకే పరిమితం అనుకుంటారు. యుద్ధం అంటే సైనికులు మాత్రమే త్యాగాలు చేయటం కాదు.

యుద్ధం అంటే.. పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.


శత్రుదేశం బాంబులు వేస్తుందనే భయంతో రాత్రిపూట విద్యుత్ నిలిపివేయవచ్చు.


ఎప్పుడు ఎక్కడ బాంబులు పడతాయో ? ఎందరు మరణిస్తారో ? ఎందరు వికలాంగులు అవుతారో? తెలియదు.


ఎన్నో  వ్యవస్థలు స్థంభిస్తాయి.  ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది.


 ఇతరదేశాలపై మనం యుద్దం  చేయాలా? వద్దా ? అనేది మనం నిర్ణయించుకోవచ్చు.


 తరువాత, మనదేశంపై ఇతరులు యుద్ధం చేస్తారా ? లేదా ? అనేది మన చేతిలో విషయం కాదు.


************* 

ప్రజలు కరోనా  కష్టాలే తట్టులేకపోతున్నప్పుడు యుద్ధం వల్ల వచ్చిపడే కష్టాలు అస్సలు తట్టుకోలేరు.


యుద్ధం వల్ల ఏ దేశానికైనా కష్టాలు తప్పవు. కరోనా వల్ల ప్రపంచ ఆర్ధివ్యవస్థ కూప్పకూలుతుందని  చెబుతున్నారు . 


యుద్ధాలు వస్తే.. ఆర్ధికవ్యవస్థ కుప్పకూలటం మాత్రమే కాకుండా, అన్నీ కుప్పకూలుతాయి.


*************** 

 విదేశాలకు, ఇతరదేశాలకు  వెళ్లిన వారు .... 
ఇప్పుడు కరోనా లాక్డౌన్ వల్ల   స్వస్థలాలకు వస్తామంటున్నారు.


విదేశాలలో చదువుల కోసం వెళ్ళి హాస్టల్స్లో ఉన్నవారు.. మమ్మల్ని ఇక్కడ హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్లమంటున్నారు. ఇప్పుడు విమానాలు లేవు, మాకు ఇక్కడ వసతి, ఆహారం సరిగ్గా లేదు.. మమ్మల్ని స్వస్థలాలకు తీసుకెళ్ళాలంటూ ప్రభుత్వాలను అడుగుతున్నారు.



ఇప్పుడంటే ఇంకా ఫో న్ కాల్స్, ఇంటర్నెట్..సౌకర్యాలు చక్కగా పనిచేస్తున్నాయి కాబట్టి,  ఏ దేశంలో ఉన్నవాళ్ళయినా స్వదేశంలో ఉన్న బంధువులతో మాట్లాడగలుగుతున్నారు.



యుద్ధంలాంటివి వస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఫో న్ కాల్స్, ఇంటర్నెట్..సౌకర్యాలు ఉంటాయో ? ఉండవో ? తెలియదు. ఎవరి పరిస్థితి ఎలా ఉందో  తెలిసే సమాచార వ్యవస్థ ఏమవుతుందో తెలియదు.


*****************

ఎప్పుడు ఎక్కడ బాంబులు పడతాయో తెలియదు. అప్పుడు క్షతగాత్రులకు వైద్యసేవలు అందించటానికి హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.


యుద్ధం ఏమీ లేకపోయినా కూడా కరోనా వల్ల కొంత ఎక్కువమంది రోగులు వస్తేనే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా హాస్పిటల్స్ , వైద్యులు సరిపోక  కొందరికి వైద్యసేవలు అందించలేకపోయారట.



ఇక యుద్ధాలు వస్తే పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. ఎంతమందికి వైద్య సేవలు అందుతాయో? ఎంతమందికి అందవో ? చెప్పలేం.


అందరికీ వైద్యసేవలు అందించాలని ప్రభుత్వాలు భావించినా కూడా.. పరిస్థితి అనుకూలించాలి కదా!


*****************

భవిష్యత్తులో బయోవార్లు మాత్రమే జరుగుతాయంటూ కొందరు అంటున్నారు.

 పాతకాలం లో కూడా బయోవార్ జరిపే  విషయంలో ప్రయత్నాలు జరిగాయంటారు. అయితే, బయోవార్లు చేయకూడదని అంతర్జాతీయంగా ఒప్పందాలు ఉన్నాయట.

 అయినా, భవిష్యత్తులో యుద్ధాలు జరిగితే ? జీవాయుధాలతో పాటు ఇప్పటికే గుట్టలుగా పోగయి ఉన్న ఆయుధాలను కూడా ఉపయోగించే అవకాశం ఉంటుందేమో ?

*************
 కొంతకాలం క్రిందట ఒక దేశంలో యుద్ధం జరుగుతుంటే, అక్కడ ఉన్న కొందరు భారతీయులు అప్పటివరకూ తాము కూడబెట్టిన  ఆస్తులన్నీ వదులుకుని భారతదేశానికి వచ్చేశారు.


కొందరు ఉన్నతచదువుల కోసం వెళ్లినా .. అక్కడ శాశ్వతంగా ఉండకపోవటమే మంచిది.


 కొన్ని సార్లు మరి కొన్ని సమస్యలు వస్తుంటాయి. 


ఉదా..కుటుంబంలో తల్లితండ్రి యొక్క వీసా సమయం ముగిసి స్వదేశానికి వెళ్ళవలసివస్తుంది. వాళ్ళ సంతానమేమో విదేశాల్లో జన్మించి అక్కడి పౌరసత్వం కలిగిఉంటారు. 


 ************

మొత్తానికి కరోనా ఎన్నో ప్రశ్నలను సృష్టించింది.

పరిస్థితి ఎలా ఉన్నా కూడా విదేశాల్లోనే ఉంటాము ..అనే వాళ్ళ గురించి ఆలోచించనక్కరలేదు.


శాశ్వతంగా విదేశంలో స్థిరపడాలా? వద్దా ? అనే  ఆలోచనలు ఉన్న వాళ్లు సరైన నిర్ణయం తీసుకోవటం మంచిది. 


విదేశాల్లో స్థిరపడటం అంటే మన తరువాత మన పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుంది ? అనికూడా ఆలోచించుకోవాలి.



భవిష్యత్తులో విదేశాల్లో తరువాత తరం వాళ్లు స్వేచ్చగా ఉండగలరా ? లేక రెండవతరగతి పౌరులుగా ఉండవలసి వస్తుందా ? అని కూడా ఆలోచించాలి.



అక్కడ పుట్టి పెరిగిన పిల్లలు..తల్లితండ్రులు పుట్టి పెరిగిన దేశానికి రావటానికి ఇష్టపడకపోవచ్చు. 


కారణాలు ఏమైనా కూడా, అటు విదేశాల్లోనూ సరిగ్గా ఉండలేక , స్వదేశానికీ రాలేక బాధపడే  పరిస్థితి మాత్రం ఎవ్వరికీ ఎదురుకాకూడదు.


ఇప్పుడు చాలా చోట్ల స్థానికులు..  వలసలు వచ్చిన వారి వల్ల తమకు ఉద్యోగాలు పోతున్నాయని భావిస్తున్నారు.....ఎప్పుడు ఎవరి బుద్ధి ఎలా మారుతుందో చెప్పలేం ?

*************


ఏ దేశ పౌరులైనా కొంతమంది వరకూ విదేశాలకు వెళ్ళటం జరుగుతుంది. అయితే, ఆ సంఖ్య విపరీతంగా పెరిగితే మాత్రం దేశానికి మంచిది కాదు. 


 విదేశాల్లో ఉన్న కొందరి కోసం.. స్వదేశీయుల అవసరాలను త్యాగం చేయకూడదు కదా.(ఇలాంటి పరిస్థితి రావటానికి అనేక కారణాలుంటాయి.)


*************

 కష్టమైనా, సుఖమైనా ఎవరి స్వస్థలంలో వారు జీవించటం మంచిది. భారతదేశం లో ఎన్నో సహజవనరులున్నాయి. 

అందరూ కలిసి అభివృద్ధి చేసుకుంటే వలసలు వెళ్ళవలసిన అవసరం ఉండదు.


ప్రభుత్వాలు  కూడా స్వదేశంలోనే  ఉన్నతచదువులు, ఉపాధి కల్పించాలి. 


 *****

యుద్ధాల వల్ల ఎన్నో కష్టాలు, నష్టాలు ఉన్నాయి. 

అందువల్ల, అన్ని దేశాలవాళ్ళు ఇతరదేశాలను ఎలా దెబ్బకొట్టాలా..అని ఆలోచించటాన్ని మాని, ఎవరిదేశాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవటంపై దృష్టి పెడితే మంచిది.


అందువల్ల,  యుద్ధాలు రాకుండా అందరూ మంచిగా ఆలోచించాలి.



Saturday, April 25, 2020

సూర్యరశ్మి..ద్రాక్ష ..మరియు కొన్ని విషయములు..


కొన్ని వివరాలను ఈ క్రింద లింకుల వద్ద  చూడగలరు.
లింక్ డైరెక్టుగా ఇవ్వవచ్చో లేదో నాకు తెలియదు. అందుకని లింక్ డైరెక్టుగా ఇవ్వట్లేదు.
 క్రింద ఇచ్చిన సమాచారాన్ని ..కాపీ..పేస్ట్..చేసి.. ఆ సైట్ కు వెళ్ళి చూడగలరు. 

* Study: Vitamin D from sunlight can help control asthma symptoms - US Air Purifiers


* Grape seed extract may help with asthma symptoms - US Air Purifiers

**************
సూర్యరశ్మి వల్ల  వ్యాధులు, శ్వాసకోశసమస్యలు .. తగ్గుతాయట. సూర్యరశ్మి వల్ల D విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.

  ఉదయం, సాయంకాలం కొంతసేపు ఎండ తగిలేలా చూసుకుంటే మంచిది.

************
ద్రాక్ష గుత్తులు ఊపిరితిత్తులలోని alveoli  అనే భాగాన్ని పోలి ఉంటాయట.

ద్రాక్ష గింజలలోని ఒక రసాయనం వల్ల ఊపిరితిత్తులకు మేలు కలుగుతుందట.

ద్రాక్ష గింజల నుంచి కూడా ఊపిరితిత్తులకు మందు తయారుచేయవచ్చు.

************** 
కొరొనా వైరస్ ఊపిరితిత్తులలోని  alveoli భాగాన్ని  మూసివేయటంతో శ్వాస అందక ప్రమాదం జరిగే అవకాశం ఉందట.

ద్రాక్షపండ్లను పోలిఉండే alveoli  భాగాన్ని రక్షించితే కొరోనా తగ్గే అవకాశం ఉండవచ్చు. 

ద్రాక్ష విత్తనాల నుండి తీసిన పదార్ధం అస్త్మా..వంటి శ్వాసకోశ వ్యాధులను తగ్గించటానికి ఉపయోగపడుతుందని పరిశోధనలలో తేలిందట. 


ద్రాక్షగింజలనుండి మందు తయారు చేస్తే కొరోనా తగ్గుతుందేమో..


ఆయుర్వేదంలో శ్వాసకోశ వ్యాధులకు మరెన్నో మందులు కూడా ఉన్నాయి. 


 శ్వాససంబంధిత సమస్యను తగ్గించి, ఊపిరి సరిగ్గా ఆడేలా చేయగలిగితే ...తరువాత అశ్వగంధ , పునర్నవ, త్రిఫల, త్రికటు.. వంటి మందులతో రోగులను పూర్తిగా రోగం బారినుండి కాపాడువచ్చు అనిపిస్తుంది. 


****************
హెచ్చరిక....ద్రాక్ష గింజలను ఎవరికి వారు తినకూడదు. వైద్యుల సూచనప్రకారం మందులను వాడుకోవాలి.

కొన్ని  మందులు గర్భిణులు, చంటి పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు వాడకూడదు. వైద్యుల సూచనల ప్రకారం మందులను వాడాలి.


Friday, April 24, 2020

హనుమంతుని ఫలం లేక లక్ష్మణ ఫలం ...కాన్సర్ మరియు ఎన్నో రోగాలకు ..


కాన్సర్ సెల్ల్స్ ను పోలినట్లు బొడిపలుగా ఉండే హనుమంతుని ఫలం లేక లక్ష్మణ ఫలం గురించి కొన్ని విషయాలు .. 


ఈ పండుకు, ఆకులకు ..కేన్సర్ మరియు దగ్గు, శ్వాసకోశ రోగాలు ఇంకా ఎన్నో జబ్బులను తగ్గించే లక్షణాలున్నాయట. 

ఈ  ఆకురసం తగు మోతాదులో తీసుకుంటే కాన్సర్ విషయంలో కీమోథెరపీ లా పనిచేసి కాన్సర్ తగ్గటానికి పనిచేస్తుందని వార్తలు వచ్చాయి.


* అయితే, వైద్యుల సలహాను అనుసరించి వాడుకోవాలి. 

 మరిన్ని వివరాల కొరకు క్రింద లింక్ వద్ద చూడగలరు. 


కొన్ని విషయాలు....ఇందులో కాన్సర్ వంటి రోగాలను ...


Awesome Soursop Fruit Farm and Harvest - Soursop 

Cultivation Agriculture Technology




Saturday, April 18, 2020

మానవ శరీర అవయవాలను పోలిన కొన్ని పండ్లు, మొక్కలు, కూరలు..కొన్ని మందులు. ..మరికొన్ని విషయములు..


ప్రపంచంలో కొన్ని  మానవ శరీర భాగాలను పోలియుంటాయి. ఉదా.. అక్రూట్ కాయ ఆకారం ...మానవ మెదడు ఆకారాన్ని  పోలి ఉంటుంది.


 అక్రూట్ ను తగు మోతాదులో వాడుకుంటే మెదడుకు మంచిదంటారు. అక్రూట్ మరి ఎక్కువగా తినకూడదు. 


అల్లం ఆకారం జీర్ణాశయాన్ని పోలి ఉంటుందట.


అజీర్ణం చేసినప్పుడు అల్లం ఎండిన  శొంఠి  బాగా ఉపయోగపడుతుందని మనకు తెలుసు కదా! 



 నల్లేరు మొక్క ఎముకలు ఆకారంలో ఉంటుంది. ఎముకలు బలంగా ఉండటానికి, ఎముకలు విరిగినప్పుడు ఆయుర్వేదంలో ఈ మొక్క కాడలను వాడతారట.


బాదాం కాయలు కన్ను ఆకారంలో ఉంటాయి. కొన్ని మాత్రం బాదాం పప్పు నానబెట్టి, పొట్టు తీసి తింటే కళ్ళకు మంచిదంటారు.



మరికొన్ని విషయాలను క్రింద ఇచ్చిన లింక్ వద్ద చూడగలరు.

10 Foods That Look Like the Body Parts They're Good For



మరికొన్ని ముఖ్యమైన విషయాలను కామెంట్స్ వద్ద  వ్రాసాను. దయచేసి చదవగలరు. 

  *************
కొరోనా లో శ్వాస సరిగ్గా ఆడకపోవటం వల్ల కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉందంటున్నారు.

ఆయుర్వేదంలో శ్వాసకోశ జబ్బులకు ఎన్నో మందులున్నాయి. 

అలాంటప్పుడు .. ఎవరైనా ఊపిరి  సరిగ్గా  అందక ఇబ్బంది పడుతున్న కొరోనా పేషెంట్లకు ఆయుర్వేద విధానాల ద్వారా శ్వాస తీసుకోవటాన్ని సులభం చేసి, కొంచెం  ఊపిరి సులభం అయిన తరువాత అశ్వగంధ వంటి మందులు వాడి పూర్తిగా కోలుకునేలా చేయవచ్చేమో..ఆలోచించాలి.

***************
కొన్ని విషపు మొక్కల నుండి కూడా ఎన్నో మందులు తయారు చేస్తారు . 

 హోమియోలో... విషపూరితమైన మొక్కల భాగాలనుంచి తీసిన పదార్ధాన్ని కూడా పొటెన్సీలలోకి మార్చి  మందులగుళికలను తయారుచేస్తారట.

**************

Datura stramonium Medicinal Uses, Side Effects and Benefits


దత్తుర ఆకును ఎండబెట్టి కాల్చి, ఆ పొగను పీల్చినా శ్వాసకోశము ఫ్రీ అవుతుందట.

అయితే, దత్తుర విషపు మొక్క.....ఆ మొక్కతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మొక్క రసం తినటం, త్రాగటం చేయరాదు. 

 దత్తుర మొక్క రసం కళ్ళకు తాకితే కళ్ళకు ప్రమాదమంటారు.

అందువల్ల, దత్తుర ఆకును ఇంటర్నల్ గా తీసుకోకుండా,ఎండిన ఆకును కాల్చి, ఆ పొగను పీల్చటం వల్ల  శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయంటున్నారు.

ఈ పొగను పీల్చేటప్పుడు కళ్ళలోకి పొగ వెళ్ళకుండా కళ్ళు మూసుకోవటం మంచిది.
పొగ ఒక గొట్టం నుండి నేరుగా ముక్కులోకి వెళ్లేటట్లు పరికరం తయారుచేస్తే బాగుంటుంది.

* అయినా,  శ్వాసకోశ సమస్యలు తగ్గటానికి ఆయుర్వేదంలో మరెన్నో మందులు ఉన్నాయి.

* ప్రజలు  దత్తూర వంటి విషపు మొక్కలను వాడటం కన్నా, మిగతా మందులను వాడుకోవటం మంచిదనిపిస్తోంది.

 ఒకవేళ వాడాలనుకుంటే ఎవరికి తోచినట్లు వారు వాడకుండా, వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ మందులను వాడాలి.

************
దత్తుర తో కుక్క కాటుకు కూడా చికిత్స చేయవచ్చట. సుశ్రుతసంహిత ద్వారా తెలిసిన విషయాలు..

ఆ వివరాలు కూడా క్రింద ఇచ్చిన లింక్ వద్ద ఉన్నాయి.

Datura (Datura stramonium ) Seeds & Leaves, Their Uses, Health Benefits, Dosage & Side Effects 


కుక్క కరిచినప్పుడు వెంటనే అల్లోపతి ఇంజక్షన్లు వేయించుకుంటే ప్రమాదముండదు. 


ఏమి అవదులే అనుకుని ఇంజక్షన్లు వేయించకుండా తరువాత రేబిస్ వ్యాధి వస్తే మాత్రం అప్పుడు సరైన మందులు లేవంటున్నారు.

అలాంటప్పుడు ఆయుర్వేదంలో చెప్పిన సుశ్రుతుల వారు చెప్పిన మందును ప్రయత్నించవచ్చేమో?



ఏ మందులైనా ఏ విధంగా వాడాలో వైద్యుల సలహాతో వాడాలి.

***************

పోస్ట్ పెద్దగా అయితే బాగుండదని..  మరికొన్ని ముఖ్యమైన విషయాలను కామెంట్స్ వద్ద  వ్రాసాను. దయచేసి చదవగలరు. 



Friday, April 17, 2020

లాక్ డౌన్ వల్ల.. ప్రజలకు తక్కువ డబ్బు ఖర్చు అవుతోంది. ..



బయటకు ఎక్కువదూరం వెళ్లట్లేదు కాబట్టి పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది. 

విందులు, వినోదాలు లేవు కాబట్టి ఆ ఖర్చు తగ్గింది.

 షాపింగ్ తగ్గింది కాబట్టి విపరీతంగా దుస్తులు, ఫాన్సీ వస్తువులు.. కొనేవారికి ఆ డబ్బు మిగిలింది.

 బయటకు వెళ్లి తినటం లేదు కాబట్టి హోటల్ బిల్లు తగ్గింది.  

ఆడవాళ్లు బ్యూటీపార్లర్లకు వెళ్లటం లేదు కాబట్టి ఆ విధంగా ఖర్చు తగ్గింది. 

మగవాళ్ళకేమో మందుపార్టీల వంటివి లేవు..

సినిమాలు, షికార్లు లేవు కాబట్టి  అలా ఖర్చు తగ్గింది.
ఇంకా చాలా ఖర్చులు తగ్గాయి.

************
ప్రజలకు విశ్రాంతి, వినోదం వంటివి కూడా అవసరమే.

 అయితే కొందరు ప్రజలు...  జీవితంలో నైతికవిలువలు, డబ్బు విషయంలో  పొదుపు వంటి విషయాలను వదిలి,  వీలున్నంతలో డబ్బు ఖర్చు పెట్టి జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే అభిప్రాయానికి వచ్చారు.

అవినీతికి పాల్పడైనా సరే డబ్బు సంపాదించి , ఖర్చుపెట్టడం చేస్తున్నారు.

దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా! పద్ధతిగా ఉన్నంతవరకు అంతా బాగుంటుంది. పద్ధతి తప్పితే కష్టాలు తప్పవు.

**********
గత 50 సంవత్సరాలలో ప్రజల జీవితవిధానంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. 

అప్పట్లో ఒక వ్యక్తి జీతం సుమారు 50 రూపాయలు కానీ 500 రూపాయలు గానీ ఉంటే ...కిలో బియ్యం 5 రూపాయలు ఉండేవి.


ఇప్పుడు జీతాలు 5,000 వేలు గానీ 50,000 వేలు గానీ ఉంటే కిలో బియ్యం 50 రూపాయలు ఉన్నాయి. 


డబ్బు విలువ తగ్గిపోతోంది. జీతాలు పెరిగితే ధరలు పెరుగుతున్నాయి.


 జీతాలు పెరగటానికి అవకాశం లేని వాళ్లు నిత్యావసరాలు కొనలేక ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. 

జీతాలు తగ్గాలి, ధరలు కూడా తగ్గాలి.


ప్రజలు జనాభా నియంత్రణ విధానాలు కూడా పాటించాలి.


చాలామంది ప్రజలు విలాసాలనే నిత్యావసరాలుగ మార్చుకుని బ్రతకటానికి అలవాటుపడ్దారు.

***********
యంత్రాలు వచ్చాక వస్తు వినియోగం బాగా పెరిగింది. 

ఇన్ని వస్తువులను తయారుచేయటానికి ఎన్నో ఖనిజాలు అవసరమవుతాయి. 

ఖనిజాలు భూమిలో తయారుకావటానికి వేల సంవత్సరాలు పడుతుందట. అందువల్ల ఖనిజసంపదను పొదుపుగా వాడుకోవాలి. 

పాతకాలంలో ఇప్పుడు వాడినంత ఎక్కువగా వస్తువుల వాడకం లేదు. ...  అయినా, అప్పటివాళ్ళు చక్కగా జీవించారు. 

ఇప్పుడు వస్తువినియోగం విపరీతంగా పెరిగింది...ఉపాధి కోసం అనీ, ఆర్ధిక వృద్ధిరేటు అనీ కర్మాగారాలలో ఎక్కువగా వస్తువులను తయారుచేస్తున్నారు. 

 విపరీతంగా ఖనిజాలను త్రవ్వేసి వస్తువులను తయారుచేసి వాడటం, వాతావరణ కాలుష్యం వంటి చర్యలు సరైనవి కావు. 

నైతికవిలువలతో జీవించటం, తక్కువ వస్తువులతో సరిపెట్టుకుని తృప్తిగా జీవించటం, పొదుపు వంటివి పాటించటం మంచిది.

అధర్మం చేసైనా సరే, డబ్బు సంపాదించి విలాసంగా జీవించాలనే పద్ధతి సరైనది కాదు.

*************
 ఒక్క వైరస్ తో ప్రపంచమంతా స్థంభించిపోయింది.

భవిష్యత్తులో మనుషులు తమ జీవనసరళిని సరైన విధంగా మార్చుకోవాలి. లేకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకోవటం ఉండదు.




వలస కూలీలు..స్వస్థలాలకు వెళ్తాము ..అనే వారిని వారి స్వస్థలాలకు వెళ్ళటానికి ...



లాక్డౌన్ సమయంలో ఎందరో వలస కూలీలు, కొందరు బాచిలర్స్..స్వస్థలాలకు వెళ్తామని అంటున్నారు.

 కొందరు గుంపులుగా గుమికూడుతున్నారు. కొందరు వందల మైళ్ల దూరం నడవటానికీ సిద్ధపడుతున్నారు.  


 అంతదూరం పెద్దవాళ్ళు కూడా నడవలేరు. అలాంటిది  పిల్లల్నికూడా  అలా నడిపించి హింసించటం సరైనది కాదు. అంతదూరం నడిస్తే చనిపోయే అవకాశం కూడా ఉంది.

వలసవెళ్లిన చోట వసతి, సరైన ఆహారం  లభించక  అలా  స్వస్థలాలకు బయలుదేరి ఉండవచ్చు . 

 వాళ్ళేమో వెళ్లాలంటారు. ప్రభుత్వాలేమో వెళ్ళకూడదంటారు. ఏమిటో ? ఇదంతా బాధాకరం.  

ఇప్పుడు ఆహారధాన్యాల నిల్వలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు...

 మరి, వారికి  ఉన్న చోటే  సరిగ్గా  ఆహారాన్ని అందిస్తే .. అలా స్వస్థలాలకు బయలుదేరకపోవచ్చు . 

ఈ విషయంలో ప్రభుత్వాలు తప్పకుండా సరైన చర్యలు తీసుకోవాలి. 

కొరోనా వల్ల చనిపోతారని చెప్పి, లాక్డౌన్ విధించినప్పుడు ఆహారం లభించని వారికి ఆహారాన్ని అందించటం ప్రభుత్వాల బాధ్యత. 

మొదట , ఎక్కడివాళ్లు అక్కడే ఉండటానికి ఒప్పించటానికి ప్రయత్నించాలి. 

వరదలు వంటివి వచ్చినప్పుడు ఊళ్ళకు ఊళ్ళే ఖాళీ చేసి ప్రజలను స్కూల్స్ వంటి పెద్దభవనాలలో.. అంటే శరణార్ధశిబిరాలలో ఉంచుతారు కదా..అలా వలసకూలీలకు కూడా  ఆశ్రయం కల్పించవచ్చు. 

అయితే, అందరినీ ఒకే దగ్గర కాకుండా వేరువేరు భవనాలో ఉంచి ఆశ్రయం ఇవ్వవచ్చు.


***************
 సంస్థలు  పని ప్రారంభించినా ..  పూర్తి స్థాయిలో పనిచేస్తాయో ? లేదో ? తెలియదు. 

ఇంతకుముందు పని చేసిన  కార్మికులందరినీ పనిలోకి తీసుకుంటారో ? లేదో?   కూడా  తెలియదు. 

అందువల్ల, స్వస్థలాలకు వెళ్తామనే  వారిని  వారి స్వస్థలాలకు వెళ్ళటానికి అనుమతించటమే మంచిది.


అయితే,  వాహనాలలో దగ్గరగా  కాకుండా, కొంత దూరంగా కూర్చుని ప్రయాణించటానికి అనుమతి ఇవ్వవచ్చు.

స్వస్థలాలకు వెళ్లిన తరువాత కొంతకాలం హోం క్వారంటైన్లో ఉండమనవచ్చు.

**********
స్వస్థలాలకు వెళ్తామనే వలసకూలీలను  అడ్డుకోవటం, వారికి సరైన రవాణా వసతులు కల్పించకపోవటం జరిగితే  మాత్రం  దారుణం.

********

ఇక్కడివాళ్లు ఇతరప్రాంతాలకు వలస వెళ్తుంటే, ఇతర ప్రాంతాల వాళ్లు ఇక్కడికి వలస వచ్చి పనిచేస్తున్నారు. 


ఆశ్చర్యం ఏమిటంటే, ఇక్కడివారేమో మాకు పనులకు కూలీలు దొరకటం లేదు, ఉన్న స్థానిక కూలీలు కూడా ఎక్కువ జీతం అడుగుతున్నారు కాబట్టి, మేము ఇతర ప్రాంతాల కూలీలకు  పనులు ఇస్తున్నామని యజమానులు అంటారు.


స్థానికకూలీలేమో మాకు ఇక్కడ పనులు లేవు, ఉన్న పనులకు కూడా తక్కువ జీతం ఇస్తున్నారు  కాబట్టి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నామంటారు.

 ఇతర ప్రాంతాలలో జీతం ఎక్కువ ఇస్తుంటే.. అక్కడి కూలీలు ఇక్కడికి ఎందుకు వలస వస్తారు ?

జీతం విషయంలో కూలీలు, యజమానులు పట్టువిడుపు ప్రదర్సించి, వేతనాన్ని నిర్ణయించుకోవాలి. 


అయితే,  ఇతరప్రాంతాలకు వెళ్లిన కూలీలు  అక్కడ ఉండకుండా, ఇప్పుడు లాక్డౌన్ సమయంలో మేము మా స్వస్థలాలకు వెళ్లిపోతామంటున్నారు.


  లాక్ డౌన్ సమయంలో యజమానులు ..  తమవద్ద పనిచేసే కూలీలకు  కొంత జీతం ముందే ఇచ్చి ఆదుకోవచ్చు కదా! 

కూలీలందరూ స్వస్థలాలకు వెళ్లిపోతే , లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత మళ్ళీ కూలీలను వెతుక్కోవాలి కదా! 

 స్వస్థలాలకు వెళ్ళిన కూలీలు పనికోసం కొన్ని రోజుల తరువాత మళ్ళీ తిరిగివస్తారని యజమానుల ధీమా కాబోలు.

ప్రజలు వలసలు పోకుండా ప్రభుత్వాలు ఎక్కడికక్కడే ఉపాధి కల్పిస్తే బాగుంటుంది.

***************

భారతదేశంలో ఎన్నో సహజవనరులున్నాయి. అయినాకూడా, కొన్నిసార్లు ఆహారధాన్యాలను కూడా దిగుమతి చేసుకోవటమేమిటో అర్ధం కాదు.


మనదేశానికి అవసరమయ్యే వస్తువులను ఇతరదేశాలనుంచి దిగుమతి చేసుకోకుండా , ఇక్కడే తయారుచేసుకుంటే ఇక్కడివారికి నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుంది.


 పారిశుధ్యకార్మికులకు  కొరోనా సమస్య తగ్గిన  తరువాత కూడా  మాస్కులు, గ్లోవ్సు  ఇవ్వాలి. పెద్ద ఎత్తున ఉన్న చెత్తను ఎత్తడానికి యంత్రాలను ఉపయోగించాలి. తడిచెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ .. వేయటానికి మూడు డస్ట్ బిన్లను విడివిడిగా ఎక్కువసంఖ్యలో ఏర్పాటు చేయాలి.


చేయాలనే గట్టి సంకల్పం ఉంటే ఎన్నో చేయవచ్చు. అయితే ప్రజలకు కూడా బాధ్యత ఉండాలి.

ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో గుంపులుగా తిరగవద్దు ...అని ప్రభుత్వాలు చెబుతున్నా కూడా ప్రజలు కొందరు గుంపులుగా వీధుల్లోకి వచ్చి తిరుగుతున్నారు.

  ప్రభుత్వం, అధికారులు, ప్రజలు అందరూ దృఢంగా అనుకుంటేనే ఏమైనా చేయగలరు.