మా ఇంటిపక్కన ఒకామె ఒకరోజు సాయంత్రం మా ఇంటికొచ్చి వాకింగ్ వెళ్దాం రమ్మంటే వెళ్లాను. దారిలో ఒకగుడి ఉంది, బయటనుంచి చూద్దామని రమ్మంటే, వద్దు తను నెలసరిలో ఉందని చెప్పింది ఆమె.
నెలసరిలో వాకింగ్ ఎందుకు వచ్చారంటే ఏమీ కాదంది. తనకు మనసు బాగోలేదు, అందుకు వచ్చానన్నట్లు చెప్పారు ఆమె.
మాకు తెలిసిన ఒకామెకు ఆరోగ్యం బాలేదు చూద్దాం అన్నది. నేను ఏం అనలేక సరే అన్నాను. ఇద్దరము వాళ్లింటికి వెళ్లాం.
ఎప్పుడైనా నెలసరిలో మా ఇంటికి కూడా వస్తుందేమో తెలియదు. ఏం చేయాలో అర్ధం కావటం లేదు. ఇప్పటికే నాకు ఉన్న నియమాల వల్ల నేను చాలామందితో ఫ్రెండ్ గా ఉండలేకపోతున్నాను. అందరిని దూరం పెడితే నాదే తప్పంటారు.
ఆమె, వాళ్ల అమ్మాయి నెలసరిలో ఉన్నప్పుడు పూజ చేయకుండా స్ట్రిక్టుగా ఉంటారట. వాళ్లకు అంత పట్టింపు ఉన్నప్పుడు అందరికి పట్టింపు ఉంటుంది..
ఆచారవ్యవహారనియమాల ప్రకారం..బయటకు వచ్చి అందరి మధ్య తిరగటం తప్పుకదా.
....................
నేను ఒకసారి సూపర్ బజార్ కు వెళ్లినప్పుడు, సరుకులు తీసుకుని బిల్ పే చేసి సర్దుకుంటుంటే, బిల్ చేసి నాకు ఇచ్చిన అమ్మాయి పక్కన ఉన్న ఇంకో అమ్మాయితో.. తనకు నెలసరి వల్ల నీరసంగా ఉందని చెబుతోంది. నేను ఇంటికి వచ్చి కొన్ని పసుపు నీటిని సరుకులపై చల్లాను. అంతేకదా.
షాప్స్ లో పనిచేసేవారికి కూర్చోవటానికి కూడా ఎక్కువవీలు కుదరదు. మగవాళ్లకు కూడా కాళ్లనొప్పులుంటాయి. స్త్రీలకు అయితే, నెలసరి, గర్భధారణ సమయంలో మరికొంత విశ్రాంతి అవసరం.
......................
బస్సులో గుడికి వెళ్తే బస్సులో కాలేజీలకు, ఉద్యోగానికి వెళ్లే స్త్రీలుంటారు. వాళ్ల మధ్య బస్సులో కూర్చోవాలి. మరి అలాగే గుడికి వెళ్ళవలసి వస్తుంది.
............................
స్త్రీలు బయటకు తిరుగుతున్న ఈ రోజుల్లో నెలసరి వాళ్ళు తగలకుండా ఎలా ఉండాలో అర్ధం కావటం లేదు.
నాకు తెలిసినంతలో, ఎవరింట్లో అయినా నెలసరిలో పక్కన కూర్చునే అలవాటు లేనప్పుడు, ఆ స్త్రీ కాకుండా, వాళ్లింట్లో ఉన్నవాళ్లు బయటకు వెళ్లటంలో తప్పులేదని నేను అనుకుంటున్నాను. తప్పు ఉన్నా తప్పదు మరి.
..........................
నెలసరి సమయంలో పక్కన కూర్చుని విశ్రాంతి తీసుకోవాలన్నది కరెక్టే.
నెలసరిలో ఉన్నవాళ్లు, ఇంట్లో ఒకదగ్గర కూర్చోవాలని, లేకపోతే కష్టాలు వస్తాయని చెబుతారు కదా. నాకు సందేహం ఏమిటంటే, స్కూల్స్, కాలేజీలకు వెళ్ళే అమ్మాయిలకు నెలసరిలో రోజుల్లో కాలేజీలో పరీక్ష ఉంటే వెళ్ళకుండా మానేయటం కుదురుతుందా? ఆఫీసులో ముఖ్యమైన పని ఉంటే సెలవు ఇస్తారా? అలాంటప్పుడు ఏం చేయాలో తెలియదు.
.....................................
నెలసరిలో ఇంట్లో కలుపుకుంటే ఇంట్లో వారికే దోషం ఉంటుంది. బయటకొచ్చి తిరిగితే అందరికి దోషాన్ని తాకించిన వారవుతారు. అది మరింత దోషం.
ప్రాచీనులు చెప్పినట్లు అన్నీ సరిగ్గా పాటించాలంటే స్త్రీలు ఉద్యోగాలు చేయకూడదు. చక్కగా ఇంటిని చూసుకుంటే చంటిపిల్లలను దగ్గరుండి పెంచుకోవచ్చు. ఇంకా చాలా లాభాలున్నాయి. ఇవన్నీ చెబితే వింటారా?నన్ను తిట్టేస్తారు.
...............
నియమాలను కుదిరినంతలో పాటించటం తప్ప ఏం చేయగలం? పరిస్థితిని బట్టి పట్టువిడుపుతో ఉండకతప్పటం లేదు.
ఈ పోస్ట్ కొంతకాలం తరువాత ఇక్కడ నుంచి డిలిట్ చేస్తాను.