koodali

Monday, December 30, 2019

ధర్మామీటర్ మరియు కొన్ని విషయములు...


ధర్మామీటర్ గురించి కొన్ని విషయములు..


  చాలాకాలం క్రిందట మా ఇంట్లో ధర్మామీటర్ ఉండేది.  అంటే, మా పిల్లల చిన్నప్పుడు వాళ్ళకు అప్పుడప్పుడు జ్వరాలు వచ్చేవి. 


తరువాత దైవం దయవల్ల అనారోగ్యాలు తక్కువగా వచ్చాయి. ధర్మామీటర్ అవసరం కలగలేదు.


 కొద్ధి  రోజుల క్రితం ,  నాకు కొద్దిగా జ్వరం, జలుబు..  ఉంటే కొత్త  ధర్మామీటర్ కొన్నాం. నార్మల్ కన్నా వేడి ఒక పాయింట్ ఎక్కువ ఉంది.


అయితే, మేము కొన్న ధర్మామీటర్ చూసిన తరువాత కొన్ని సందేహాలు కలిగాయి.



 పాతరోజుల్లో గాజుతో తయారుచేసిన ధర్మామీటర్ లో పాదరసం కనబడుతూ ఉండేది. 



జ్వరం చూడటానికి పిల్లల నోట్లో ధర్మామీటర్ పెడితే పిల్లలు కొరికేస్తారేమోననే భయం ఉండేది.



అయితే, పాత రోజుల్లో ధర్మామీటర్లు గ్లాసుతో చేసినవైనా ఉపరితలం అంతా నున్నగా ఉండి నీటితో శుభ్రంచేస్తే చక్కగా  శుభ్రం అయ్యేది.



మేము కొన్న కొత్త ధర్మామీటర్ ప్లాస్టిక్ తో చేయటం బాగుంది కానీ, మధ్యలో రీడింగ్ చూసే దగ్గర ఒక నొక్కు ఉన్నది.



నొక్కు ఉండటం వల్ల అక్కడ నీటితో శుభ్రం చేయవచ్చో, లేదో  తెలియలేదు. శుభ్రం చేసినా నొక్కు వద్ద సరిగ్గా శుభ్రం కాకపోవచ్చు.



ఇలా నొక్కు ఉండటం వల్ల హాస్పిటల్స్లో రోగులకు ధర్మామీటర్ వాడేటప్పుడు జాగ్రత్తగా క్లీన్ చేయాలి. 



 ధర్మామీటర్ సరిగ్గా శుభ్రం చేయకపోతే ఒకరి నుంచి మరొకరికి జబ్బులు వ్యాపించే  అవకాశముంది.



 ప్లాస్టిక్ ధర్మామీటర్ పైన నొక్కు లేకుండా  నున్నగా ఉండే విధంగా  తయారుచేస్తే శుభ్రం చేయటానికి సులువుగా ఉంటుంది.



ఇప్పుడు ఎన్నో కొత్త రకం ధర్మామీటర్లు వచ్చాయట. రోగులను తాకించకుండానే దూరంగానే ఉంచి జ్వరం చూసే విధంగా డిజిటల్ ఇంఫ్రారెడ్ ధర్మామీటర్లు కూడా విదేశాల్లో వచ్చాయట.


 అయితే మనదేశంలో ఇంకా అవి అంతలా వాడకం లేదు కాబట్టి , మనం  ధర్మామీటర్లు శుభ్రం చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది.


***********


 కొత్త ధర్మామీటర్ చూసిన  తరువాత,  నాకు కలిగిన అభిప్రాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో  ఈ పోస్ట్ రాయటం జరిగింది. 

బయట హాస్పిటల్స్లో ధర్మామీటర్ను స్పిరిట్ తో క్లీన్ చేస్తారట. 


అయినా  కూడా , రీడింగ్ కనిపించే దగ్గర నొక్కు లేకుండా నున్నగా ఉంటేనే శుభ్రం చేయటం సులువని నాకు అనిపించింది. 


***************


*  ప్రస్తుతం  సమాజంలో ,
  సరైన పద్ధతిలో జీవించే విధంగా సహాయం చేయమని దైవాన్ని ప్రార్ధించటం మంచిది.


Saturday, October 19, 2019

విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయం గురించి కొన్ని విషయాలను వ్రాయాలనిపించి.......


  విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి  ఆలయం గురించి కొన్ని విషయాలను వ్రాయాలనిపించి వ్రాస్తున్నానండి.


దైవం, దేవాలయం కొరకు ఎందరో  అర్చకులు, భక్తులు, అధికారులు మరియు సిబ్బంది చక్కటి  కృషి చేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు.


అయితే, ఇంకో విషయం ఏమిటంటే,   శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి  దేవాలయానికి సమీపంలో  (మెట్ల  ప్రక్కన )  ఉన్న కొండ ప్రాంతాన్ని పైనుంచి త్రవ్వినట్లు కనిపించింది.


శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి  వారి  ఆలయం కొంతభాగం కొండ అంచుకు సమీపంలో ఉంది.... 

అలాంటప్పుడు,  దేవాలయానికి సమీపంలో అలా  కొండను చెక్కటం ఎంతవరకు సరైనదో? అనే సందేహం కలిగింది.


ఒక ప్రక్క కొండను పటిష్టపరిచే చర్యలు జరుగుతున్నట్లుగా  కూడా అనిపిస్తోంది.


  ఒక  ప్రక్కన కొండను పటిష్టపరిచే పనులు జరగటం మంచి విషయం. 


ఇంకో ప్రక్కన కొండ త్రవ్వి ఉండటం చూసిన తరువాత ఆందోళన కలిగింది.

  ఈ  విషయాలను   రాయాలనిపించి వ్రాస్తున్నాను.


అక్కడ జరుగుతున్న పనుల గురించిన వివరాలు నాకు సరిగ్గా తెలియదు.నాకు తెలిసినంతలో విషయాలను వ్రాసాను.


వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

అంతా  దైవం దయ.



Friday, February 8, 2019

ఓం..దైవానికి కృతజ్ఞతలు..వందనములు.



లోకంలో ఎవరైనా   సహాయం చేస్తే, వారికి కృతజ్ఞతలు లేక ధన్యవాదాలు లేక థాంక్స్ అని చెప్పటం చేస్తుంటారు.
అలా ధన్యవాదాలు చెప్పటం కనీస మర్యాద అంటారు.


 మరి, లోకంలో  జీవులు జీవించడానికి అవసరమైన వాతావరణం, గాలి, నీరు, వెలుతురు, ఆహారం....ఇలా ఎన్నింటినో అందించిన  దైవానికి కృతజ్ఞతలు చెప్పటం కూడా ఎంతో అవసరం.

  
  దైవానికి  దైవమే  సాటి .

 అంతా  దైవం  దయ.

 దైవానికి కృతజ్ఞతలు. వందనములు. 


Wednesday, February 6, 2019

పూజామందిరం వద్ద దీపం..



దైవపూజామందిరాలు ఎన్నో విధాలుగా ఉంటాయి.

కొందరు ఒక పీఠంపై దైవమూర్తిని లేక దైవమూర్తులను ఉంచి పూజించుకుంటారు. 


కొందరు అలమారలో దైవమూర్తులను ఉంచి పూజిస్తారు. 

అయితే ఎక్కువ దైవవిగ్రహాలు, పటాలు ఉన్నప్పుడు.. 

అలమారలో రెండు అరల్లో అంటే.. ఒక అరలో కొన్ని దైవ పటాలను, మరొక అరలో మరికొన్ని  దైవ పటాలను ఉంచి పూజిస్తారు. ఇలాంటప్పుడు  రెండు అరల్లోనూ దీపాలను వెలిగిస్తారు కొందరు.


 ఇలాంటప్పుడు, క్రింద అరలో దీపం వెలిగించినప్పుడు ఆ వేడిసెగ పైన అరలో ఉన్న దేవతా విగ్రహాలకు, పటాలకు తగిలే అవకాశం ఉంది.

  పైన అరలో ఉన్న దేవతా విగ్రహాలకు క్రింద దీపం పెట్టటం  మంచిది కాదని నాకు అనిపించింది.


 అందువల్ల దేవతా విగ్రహాలను అన్నింటినీ ఒక పీఠంపైనే ఉంచి, అక్కడ దీపం వెలిగించటం మంచిదనిపిస్తోంది. 


లేదంటే అల్మరాలో దేవతా పటాలుంచి, బయట చిన్న స్టూల్ పైన దీపం వెలిగించటం మంచిది.

 అయితే, అటూఇటూ తిరిగేసమయంలో  స్టూల్ పైన ఉన్న దీపం చేతులకు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.


వీటన్నింటికన్నా ..ఉన్న దేవతా పటాలన్నీ ఒకే అరలో ఉంచి అక్కడ  దీపం వెలిగించటం మంచిదనిపిస్తోంది.


Thursday, January 24, 2019

తిరుమలలో..శ్రీ కాళహస్తిలో ..కొన్ని విషయాలు..


ఈ మధ్య మేము తిరుమల, శ్రీ కాళహస్తి  దర్శించుకుని వచ్చాం. దైవం దయ వల్ల దర్శనాలు బాగా జరిగాయి.

తిరుమలలో అన్నదానం హాల్ వద్ద అద్భుతమైన చిత్రాలను వేసారు. ఆ చిత్రాలు చాలా బాగున్నాయి.

అయితే, నాకు ఒక సందేహం కలిగింది. చిత్రానికి రెండువైపులా గరుత్మంతుని మరియు హనుమంతుని విగ్రహాలు పెద్దవి ఉన్నాయి.అవి చూడటానికి ఒక ప్రక్కకు ఉన్నట్లుగా తయారుచేసారు.  

అయితే, గరుత్మంతుని  మరియు హనుమంతుని  బొమ్మలను చూసినప్పుడు, ముప్పావువంతు భాగం మాత్రమే తయారుచేసారా? అనే సందేహం కలిగింది. 

అయితే, దైవ విగ్రహాలను అలా అసంపూర్తిగా తయారుచేయరు కదా.. బహుశా పక్కకు ఉండటం వల్ల ఇంకో వైపు  కనిపించటం లేదేమో తెలియదు. 

ఈ విషయం అలా ఉంచితే,  మిగతా చిత్రం మాత్రం అద్భుతంగా ఉంది.

***************

శ్రీ కాళహస్తిలో పాతాళ గణపతి దర్శనానికి కొంచెం క్రిందకు మెట్లు దిగి వెళ్ళాలి. పాతాళ వినాయక దైవదర్శనం చక్కగా జరిగింది. 

 ఇంకో విషయం చెప్పాలనిపిస్తోంది.

మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకోవటానికి ఒక వైపున సపోర్టుగా రెయిలింగ్ అమర్చారు.ఒకవైపునే రెయిలింగ్ ఉండటం, మెట్లు ఎక్కి, దిగేటప్పుడు ఆ గ్రిల్ గట్టిగా పట్టుకోవటం వల్లనేమో గ్రిల్ కొద్దిగా ఊగినట్లుగా అనిపించింది.


ఈ గ్రిల్ మధ్య గాప్ కూడా ఎక్కువ ఉన్నట్లుగా  అనిపించింది. గాప్ తగ్గించటానికి మెష్ వంటిది వేస్తే చిన్న పిల్లల విషయంలో మరింత బాగుంటుంది.


 రెండోవైపున కూడా సపోర్టుగా రైలింగ్ అమర్చితే బాగుంటుంది. అయితే, ఇక్కడ మెట్ల దారి ఎక్కువ వెడల్పుగా లేదు కాబట్టి, ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు సపోర్టుగా పట్టుకోవటానికి రెండో వైపున కూడా ఎక్కువగా రెయిలింగ్ వేస్తే దారి మరింత ఇరుకయ్యే అవకాశం ఉంది కాబట్టి, భుజాల ఎత్తుకు కొంచెం పైన ఒక స్టీల్ రాడ్ రెయిలింగ్ గా అమర్చితే బాగుంటుంది.


 ఇప్పటికే ఉన్న రెయిలింగ్ ను మరింత పటిష్టం చేసి, రెండో వైపున గోడకు పొడుగునా ఒక స్టీల్ రాడ్ ను ( రెయిలింగ్ లేక హాండ్ రెయిల్ ) ను అమర్చితే  బాగుంటుందనిపించింది.

రెండోవైపున ఇప్పటికే అలాంటిది ఏమైనా ఉన్నదేమో నేను సరిగ్గా గమనించలేదు.

కొత్తగా ఇంకో రెయిలింగ్ సంగతి అలా ఉంచితే, ఆ మార్గంలో అలా మెట్లు మరియు రెయిలింగ్  కట్టడమే  అద్భుతం. చక్కగా   నిర్మించారు. 

****************
నాకు తోచినంతలో  రాసాను. వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్దిస్తున్నాను.

అంతా  దైవం దయ. 


Tuesday, January 8, 2019

కొన్ని విషయాలు ...రేబిస్ వ్యాధి..


కొన్ని రోజుల క్రిందట ఒక వార్త తెలిసింది.(మా కుటుంబంలో వారు .. వైద్యులుగా చేస్తున్నారు. అలా ఈ విషయం తెలిసింది. )

హాస్పిటల్ కు వచ్చిన  14 సంవత్సరాల ఒక అబ్బాయికి వారి ఇంట్లో పెంచుకుంటున్న కుక్క కరవటమో? గీరటమో? జరిగిందట. ఇంట్లో పెంచుకుంటున్నదే కదా.. అని ఇంజక్షన్ చేయించుకోలేదట.

 కొంతకాలానికి ఆ అబ్బాయికి కొన్ని వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్ళారట.  ఈ విషయం జరిగి కొన్ని రోజులు గడిచాయి.

అయితే, నాకు కొన్ని సందేహాలు కలిగాయి. . ఇంట్లో పెంచుకుంటున్న కుక్కకు రేబిస్ వ్యాధి ఉంటే కుక్క కూడా చనిపోయి ఉండాలి కదా? వారి ఇంట్లో కుక్క పరిస్థితి ఎలా ఉంది ? అబ్బాయికి ఇంట్లో పెంచుకుంటున్న కుక్క వల్లే  వ్యాధి సోకిందా? లేదా ? అనే సందేహాలు కలిగాయి.

(ఇంట్లో పెంచుకునే జంతువులకు రేబిస్ రాకుండా ముందే టీకాలు ఇప్పించాలట. )


రేబిస్ గురించి అంతర్జాలంలో వెతికితే కేరళలో ఒక ఆయుర్వేద వైద్యుడు  రేబిస్ వ్యాధికి ఆయుర్వేదం ద్వారా  మందు తయారుచేస్తున్నారని తెలిసింది. 

ఆ లింక్..

Kozhikode Native Gets Patent For Ayurveda Medicine To Cure Rabies

అడ్రస్..

CM Sivaraman Vaidyar
Gurudev Ayurveda,Noor Building, Rly link road, near Apsara theatre calicut, 673002


ఆ పిల్లవాడికి ఏమైనా ఉపయోగపడుతుందేమోననే ఆశతో .. కేరళ వైద్యుల గురించిన అడ్రస్ కాగితం మీద వ్రాసి,  వీలుకుదిరితే వాళ్ళకు ఇవ్వమని పంపించాను. 

అయితే, అప్పటికే అతని పేరెంట్స్ పిల్లవాడిని తీసుకుని విజయవాడ ఆసుపత్రి నుండి గుంటూరు వెళ్లారట. .

చికిత్స కొరకు గుంటూరులో కొంత మెరుగైన ఫెసిలిటీస్ ఉన్నాయట. 

 చిన్న అబ్బాయికి అలాంటి పరిస్థితి రావటం అత్యంత బాధాకరం.
 అబ్బాయి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. 

************
అడవులలో నివసించే గిరిజనులు ఎవరికైనా జంతువులు కరిస్తే వనమూలికలను వాడుకుంటారని అంతర్జాలంలో చదివాను. (అయితే, ఈ విషయాలు నాకు సరిగ్గా అర్ధం కాలేదు.)

 గిరిజనులు వాడే మూలికలపై కూడా పరిశోధనలు జరిగితే బాగుంటుంది. 
*************
లూయి  పాశ్చర్ రేబిస్ వ్యాధికి టీకాను కనుగొన్నారు.

రేబిస్ వ్యాధి ఉన్న జంతువులు ఎవరినైనా  కరిచినప్పుడు..  వెంటనే ఇంజక్షన్లు చేయించుకుంటే రేబిస్ వ్యాధి సోకదంటున్నారు.

 ( రోజుల్లో ..  పొట్టకు కాకుండా, భుజానికే  ఇంజక్షన్లు చేసే విధానం వచ్చిందట .)

ఇంజక్షన్ వేయించుకోకుండా ...తరువాత వ్యాధి లక్షణాలు కనిపిస్తే వ్యాధి తగ్గటానికి సరైన మందు లేదంటున్నారు?

 ఆ వ్యాధి సోకిన వారికి  బ్రెయిన్  బలహీనమయి అనేక భయాలు, భ్రాంతులు  కలుగుతాయంటారు. 

ఉదా..నీరంటే భయం కలిగి, నీటిని త్రాగకపోవటం వల్ల డీహైడ్రేషన్ వస్తుందట. 


ఇవన్నీ గమనిస్తే నాకు ఏమనిపించిందంటే.. బ్రెయిన్   శక్తివంతం అవ్వటానికి, నరాల శక్తికి  ఆయుర్వేదంలో సరస్వతీ ఆకు, అశ్వగంధ, మరియు పునర్నవ..వంటి అనేక మూలికలు ఉన్నాయి కదా ..

ఎన్నో వ్యాధులకు పెన్నేరును ( అశ్వగంధ)  మందుగా వాడవచ్చని అంటారు.

ఎవరైనా రేబీస్ వ్యాధికి గురయ్యి... ఆఖరి రోజులలో  ఉన్నవారికి ఈ ఆయుర్వేదమూలికలను ఉపయోగించి చూస్తే మంచి ఫలితాలు కలుగుతాయేమో? వైద్యులు పరీక్షించి చూడవచ్చు..  అనిపించింది.

 శ్రీ కాలభైరవ స్వామిని పూజించటం మంచిది.  దైవానికి వందనములు.

*************
కొత్తగా టపా వ్రాయటం అంటే ప్రస్తుతం ఆసక్తి లేక ... కొన్ని రోజులక్రితం ఈ విషయాలను వ్రాసి, పాత టపాలలో  చేర్చాను. 

అయితే , పాత టపాలలో చేర్చితే... ఇప్పుడు చదువుతారో ? లేదో ? అనిపించి టపా వేసాను.