koodali

Wednesday, November 4, 2020

కొన్ని విషయములు.. కలశజలాన్ని నేలపై ..ఆహారంలో వెండ్రుకలు కనిపిస్తే..

 

దేవాలయాలలో పూజలు, హోమాలు జరిగినప్పుడు పూజ తరువాత కలశంలోజలాన్ని  భక్తుల శిరస్సులపై చల్లుతారు. 

అలాంటప్పుడు ఆ మంత్రజలం నేలపై పడి  ప్రజలు ఆ నీటిని త్రొక్కడం కూడా జరుగుతుంది. 

పవిత్రంగా భావించే కలశజలాన్ని అలా నేలపై విచ్చలవిడిగా పడేటట్లు చల్లటం మంచిది కాదు.

 పూజ తరువాత అందరూ తీర్ధ ప్రసాదాలు తీసుకుంటారు. తీర్ధం ఇచ్చే దగ్గర  నేలపై చిన్న పట్టా వేసి, పైన స్టూల్ వేసి, దానిపైన కలశం పెట్టి.. తీర్ధం తీసుకోవడానికి వచ్చే భక్తుల శిరస్సులపై  కలశ జలాన్ని ఆకుతో కొద్దిగా చిలకరిస్తే సరిపోతుంది.

ఒక పంతులు గారు  కలశం వద్ద ఉండి,  ఒకటి లేక రెండు మామిడాకులతో ఒక్కొక్క భక్తునిపై  కలశజలాన్ని చిలకరించవచ్చు.  ఇంకొక పంతులుగారు తీర్ధాన్ని ఇవ్వవచ్చు.

 అప్పుడు నేలపై కలశజలం పడటం.. భక్తులు త్రొక్కటం.. అంతగా జరగదు. కొద్దిపాటి జలం పడినా అంతవరకూ తుడిచేస్తే సరిపోతుంది.

*********

వంట చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  ఆహారంలో వెంట్రుకలు కనిపిస్తే మంచిది కాదు. 

దైవానికి నివేదించే పదార్ధాలలో వెంట్రుకలు  కనిపిస్తే ఆ పదార్ధాన్ని దైవానికి నివేదించకూడదు. 

కష్టపడి వంట చేసిన తరువాత వెంట్రుకలు కనిపిస్తే ఎంతో బాధగా ఉంటుంది. 

బంధువులెవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారికి వడ్డించిన భోజనంలో వెంట్రుకలు  కనిపిస్తే బాగోదు కదా..

వంట చేసేటప్పుడు   తలకు కాప్ ధరిస్తే మంచిది.  

ఇంట్లో వంట చేసేటప్పుడు స్త్రీలు జుట్టును పైకి మడిచి కట్టుకుని కాప్  పెట్టుకుంటే సులభంగా ఉంటుంది.

 పెద్ద పెద్ద హోటల్స్ లో వంటచేసే వాళ్ళు(చెఫ్ లు)ధరించే పెద్ద కాప్  ధరించాలంటే అందరికీ కుదరకపోవచ్చు. 

చిన్నగా ఉండే షవర్ కాప్  బాగుంటుంది. ఇది 100 రూపాయలకే లభిస్తుంది. చెవులు కూడా కవర్ చేస్తుంది. ఈ ప్లాస్టిక్ కాప్ ను శుభ్రం చేయటం తేలిక.

వెంట్రుకలు, గోళ్ళు .. ఆహారం ద్వారా కడుపులోకి వెళ్తే అనారోగ్యం వచ్చే అవకాశాలు  ఎక్కువగా ఉన్నాయట.

 జుట్టుకు నూనె రాసి జడ వేసుకుంటే వెండ్రుకలు ఎగిరిపడే అవకాశం తక్కువ. జుత్తు విరబోసుకున్నప్పుడు లేక తలస్నానం చేసి, జుట్టు ఆరటానికి వదిలేసినప్పుడు వెంట్రుకలు రాలిపడే అవకాశాలు ఎక్కువ.

ఇంట్లో వంట చేసేటప్పుడు స్త్రీలు రోజూ కాప్ పెట్టుకోవటం కష్టం అనుకుంటే .. తలస్నానం చేసినప్పుడు జుట్టు వదులుగా ఉండేలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని  కాప్ ధరించవచ్చు. కాప్ ధరించనప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది.

 వండిన గిన్నెలపై మూతలు పెట్టకుండా నేలపై ఉంచితే.. నేలపై ఉన్న వెండ్రుకలు వచ్చి ఆహారపదార్ధంపై పడే అవకాశం ఉంది. అలా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 తలపైనుంచి రాలిపడే వెండ్రుకలు దుస్తులపై ఉండి, వంట చేసేటప్పుడు ఆ  వెంట్రుకలు  ఆహారంలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. 

నోటి నుండి తుంపరలు పడకుండా నోటికి మాస్క్ కూడా ధరించవచ్చు.

************

పెద్దవయస్సు వారికి చాలామందికి నిద్ర సరిగ్గా  రాదు.రాత్రి అందరూ నిద్ర పోతుంటే తమకు నిద్ర రావటం లేదని బాధపడుతూ కూర్చుంటారు. నిద్ర బిళ్ళలు వేసుకుంటారు కొందరు. 

నిద్ర త్వరగా రావటానికి ఆయుర్వేద చిట్కాలు చెబుతున్నారు కొందరు.ఇంటర్నెట్ ద్వారా కూడా ఈ చిట్కాలను తెలుసుకోవచ్చు.

నిద్ర పట్టనప్పుడు.. కూర్చుని కాని, పడుకుని కానీ కన్నులు  మూసుకొని  దైవస్మరణ.. ధ్యానం చేస్తే పుణ్యం వస్తుంది. నిద్రకూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నిద్ర రాకపోయినా ..ధ్యానం వల్ల శరీరానికి, మనస్సుకు చాలా విశ్రాంతి లభిస్తుంది.

అయితే, డీప్ మెడిటేషన్ , ప్రాణాయామం వంటివి   తెలిసిన వారి వద్ద నేర్చుకుని ఆచరించటం మంచిది. 

 దైవస్మరణ, దైవస్తోత్రాలు, భక్తిపాటలు మొదలైనవి మెల్లగా  ఎంతసేపైనా చక్కగా అనుకోవచ్చు. 

************
  ఇక, దైవం యొక్క చిత్రాలను ఎక్కడపడితే అక్కడ ప్రింట్ వేసి, తరువాత చెత్త కుప్పలలో పడవేస్తున్నారు. ఇలా చేయటం సరైనది కాదు.

న్యూస్ పేపర్లలోనూ, హారతి కర్పూరం పాకెట్ పైనా, ఇంకా అనేక చోట్ల దైవ చిత్రాలను ముద్రించటం.. తరువాత ఆ పేపర్లను, ప్లాస్టిక్ కవర్లను చెత్తలో వేయటం జరుగుతోంది. 
 ఈ విషయాన్ని ఈ బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తలోనే వ్రాయటం జరిగింది. 



   విషయాలను ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా .. ఆచరణ సరిగ్గా ఉంటేనే ప్రయోజనం కలుగుతుంది.


Sunday, November 1, 2020

జాతకంలో రాసిపెట్టి ఉన్నది అనుభవించక తప్పదా ?

 Friday, April 21, 2017


 చాలామంది జీవితంలో ముందు ఏం జరుగుతుందోనని ఉత్సుకతతో జాతకాలను చూపించుకుంటారు. జాతకం మంచిగా ఉంటే సంతోషాన్ని , ఏమైనా తేడాగా ఉంటే బాధను పొందుతారు.

( ఈ రోజుల్లో జాతకాలు చెప్పటం సరిగ్గా తెలిసిన వారు అరుదుగా ఉన్నారు .)

ఆ జాతకమంతా పూర్వం తాను చేసిన మంచిచెడు కర్మల ఫలితమేనని తెలిసినా జీవితంలో చెడు జరగకూడదనే ప్రతివ్యక్తి కోరుకోవటం జరుగుతుంది.
*******************

రాసిపెట్టిఉన్నది ఎలాగూ తప్పనప్పుడు మనం ఏం చేయగలం? అని చాలామంది నిరాశగా అనుకుంటారు. అలా భావించటం పొరపాటు.


 దైవానుగ్రహాన్ని పొందగలిగితే భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉందని కొందరి చరిత్రల ద్వారా పెద్దలు తెలియజేసారు..

ఉదా..సతీ సావిత్రి చరిత్రలో సావిత్రి యమధర్మరాజును  మెప్పించి , సత్యవంతుని ఆయుర్దాయాన్ని పెంచుకోవటమే కాకుండా ఎన్నో వరాలనూ పొందటం జరిగింది.

 భక్త మార్కండేయుని చరిత్రను గమనించినా ..దైవానుగ్రహాన్ని  పొందగలిగితే  మంచి జరుగుతుందని తెలుస్తుంది.

*********

జాతకంలో చెడు సూచనలు కనిపించినప్పుడు బాధపడుతూ కూర్చోకుండా .. తమ చెడు ప్రవర్తనను మార్చుకుని,  దైవప్రార్ధన, పుణ్యకార్యాలు చేయటం, సత్ప్రవర్తనతో మెలగటం, ఇలాంటివి చేయటం ద్వారా రాబోయే కష్టం చాలావరకూ తగ్గే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు.

పూర్వం ఎందరో ఇలా చేసి తమ జీవితాలను సరిదిద్దుకున్న సంఘటనలు గ్రంధాలలో కనిపిస్తాయి.

*************

ఈ రోజుల్లో కూడా ..జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనను కలిగిఉన్నప్పుడు , ప్రభుత్వం వారు , వారి శిక్షా కాలాన్ని తగ్గించి ముందే వదిలిపెట్టడం, ఒకోసారి శిక్షను రద్దు చేయటం జరుగుతోంది కదా!

************
భగవంతుడు ఎంతో దయామయుడు. చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపపడిన వారిని వారు తప్పక క్షమిస్తారు.
....................

షిరిడి సాయిబాబా .. భక్తులు తమ జాతకాలలోని దోషాల గురించి భయపడినప్పుడు, వారిని భయపడవద్దనీ, ఆ జాతకాలను ప్రక్కన పెట్టి, తనపైన భారం వేయమని చెప్పిన సంఘటనలు జరిగాయి.

 ఇంకా, శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము గ్రంధములో భీమాజీపాటీలు కధ వద్ద , షిరిడి సాయి భక్తుడు తన  స్వప్నములో బాధలుపడటం ద్వారా...  సాయి అతని జబ్బును పోగొట్టడం గురించి తెలుసుకోవచ్చు.

 (.గతజన్మలోని పాపకర్మల ఫలితముగా జబ్బు రాగా దానిలో జోక్యము కలుగజేసికొనుటకు బాబా యిష్టపడకుండెను.కాని రోగి తనకు వేరే దిక్కులేదనియు, నందుచే చివరకు వారి పాదముల నాశ్రయించితిననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. వెంటనే బాబా హృదయము కరిగెను. భక్తుడు స్వప్నములో బాధలుపడటం .. సాయి అతని జబ్బును పోగొట్టడం జరుగుతుంది.)

ఎందరో పూజ్యులు.. తమను ఆశ్రయించిన భక్తులను వారి పూర్వకర్మ ఫలితాలనుండి రక్షించిన సంఘటనలు గ్రంధాలలో చెప్పబడ్డాయి.

**************

కొందరు ఎంత మంచిగా జీవిస్తున్నా వారి జీవితం కష్టాలమయంగానే ఉంటుంది. అంటే.. వారు క్రితం జన్మలో అంత ఎక్కువ తప్పులు చేసారని అర్ధం చేసుకోవాలి.( ఇలా కాకుండా మనకు తెలియని ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.)

అలాంటివారు ఈ జన్మలో ఎంతో శ్రమకు ఓర్చి  నియమనిష్టలు కలిగిఉండటం, దానధర్మాలు చేయటం ద్వారా ఆ కష్టాలనుంచీ బైట పడగలరు.

****************
 దైవం ఎన్నో జీవులకు ఇవ్వని తెలివితేటలను మానవులకు ఇచ్చారు. అయితే, ఎన్నో జీవులు లోకానికి ఉపయోగపడుతుండగా , మనుషులు మాత్రం  దైవానికి ఇష్టం లేని అధర్మమైన పనులు చేస్తూ.. సమాజానికి సమస్యగా తయారవుతున్నారు.  ఇలా ప్రవర్తించటం సరైనది కాదు.

**********

* ఏ జాతకాలూ తెలుసుకోకపోయినా చెడుపనులకు దూరంగా ఉంటూ, సత్ప్రవర్తనను కలిగిఉండి, దైవభక్తి కలిగి జీవించే వ్యక్తికి దైవమే సరియైన దారిని చూపిస్తారు.

***********

జాతకాలు విషయంలో నాకు కలిగిన కొన్ని సందేహాలు....

 

రెండు పంచాంగాలలో ..ఒకే నక్షత్రం విషయంలో గంటల సమయం తేడా చూసి ఈ విషయం గురించి వ్రాయాలనిపించింది.

 సమయం విషయంలో ఇంత తేడా ఉంటే ..ఈ  మధ్యలో జన్మించిన పిల్లలు  ఏ నక్షత్రంలో జన్మించినట్లు? అనేది సందేహం కలుగుతుంది.

 

 ఉదాహరణ .. ఒక కాలెండర్లో  ఆశ్లేష నక్షత్రం రాత్రి 8 గంటల 38 నిమిషాల వరకూ అని ఉంటే, అంతర్జాలంలో కొన్ని పంచాంగాలలో అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల వరకూ ఆశ్లేష నక్షత్రం ఉన్నది..అని ఉంటే ఏ సమయాన్ని తీసుకోవాలో అర్ధం కాదు.

 

  సుమారు నాలుగు గంటల సమయం తేడా ఉంటే.. ఈ నాలుగుగంటల మధ్య జన్మించిన పిల్లలు ఆశ్లేష నక్షత్రంలో జన్మించినట్లా ? లేక  మఘ నక్షత్రంలో జన్మించినట్లా ? అనేది సందేహం.

 

  చాలామంది వివాహసంబంధాల విషయంలో నక్షత్రపొంతన వంటివి చూస్తారు. సంబంధాల విషయంలో చాలా విషయాలు నచ్చినా.. వివాహపొంతన కుదరలేదని సంబంధాలు వదులుకునే వారూ ఉంటారు.

  ఇలాంటప్పుడు జాతకాలు మొదలైన వాటి విషయంలో ఎన్నో సందేహాలు వస్తాయి.

 

 పంచాంగం రాష్ట్రంలోని వేరువేరు ప్రదేశాలలో ప్రింట్ వేసినా కూడా ఒకే రాష్ట్రంలో గంటల సమయం తేడా ఉండదు కదా? మరి ఎందుకు ఇలా జరిగిందో అర్ధం కాదు.

 మేము ఒక ముహూర్తం కొరకు సాధనతార, నైధనతార ..చూద్దామని వెతుకుతుంటే నక్షత్రం సమయంలో తేడా కనిపించింది.

 

 వివాహం విషయం మాత్రమే కాకుండా, ముహూర్తాల కొరకు సాధనతార, విపత్తార .. వంటివి పరిశీలించడానికి కూడా నక్షత్రం యొక్క సమయం అవసరం ఉంటుంది.

 

   ఇవన్నీ గమనిస్తుంటే ఏమనిపిస్తుందంటే.. కాలెండర్లను, కంప్యూటర్లో విషయములను చూడవచ్చు కానీ, తరువాత ముఖ్యమైన విషయముల కొరకు ..తెలిసిన పండితులను సంప్రదించటం మంచిది.

 

 సాయనవిధానము, నిరయన విధానము ..అయనాంశ..ఈ విధానాల గురించి  అభిప్రాయ భేదాలు ఉన్నాయట. అందువల్ల కొన్నిసార్లు .. సమయంలో  తేడా వచ్చే అవకాశముందని పండితుల ద్వారా తెలుస్తోంది. 

ఏ విధానాన్ని అనుసరించేవారు ఆ విధానాన్ని అనుసరించి చెబుతారు. 

***********

పై విషయములలో కొన్నింటిని క్రింద పోస్ట్ యొక్క  కామెంట్ వద్ద గమనించగలరు.

******************