koodali

Thursday, May 21, 2020

దైవభక్తి...


దేవాలయాలు త్వరలో  ప్రజలందరి  కొరకు తెరుచుకోనున్నాయి..

ఇంతకాలం  అందరు  ప్రజలకు దేవాలయాలలో దైవదర్శనం లేని పరిస్థితి ఏర్పడటం ఆశ్చర్యం మరియు బాధ కలిగించే విషయం.

***********
కోరోనా వల్ల ప్రపంచంలో జనజీవనం చాలావరకు   స్థంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ సమయంలో దేవాలయాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది.

దైవానికి ఆగ్రహం కలిగిందేమో..  అని  చెప్పాలని కాదు.. కానీ, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయో ఇప్పటికైనా ఆలోచించుకోవాలి.

చాలామంది మనుషుల అత్యాశ, అంతులేని కోరికలు,  అవినీతి,   అనేకవిషయాలలో తమకు తోచినదే సరైనదని మొండిగా ముందుకు వెళ్ళటం, పర్యావరణానికి హాని కలిగించటం..ఇలాంటివాటి  గురించి మనుషులకు కనువిప్పు కలగటం కొరకు దైవం ఒక హెచ్చరిక  చేసి  ఉండవచ్చు కదా.. అని నాకు అనిపించింది.

ఇక నుంచి అయినా సమాజంలో మంచిమార్పులు రావాలని కోరుకుందాము.

**********************
లాక్ డౌన్ సమయంలో  అనువుగాని పరిస్థితి వల్ల  దేవాలయాలకు  వెళ్లలేకపోయారు.

  దేవాలయాలకు వెళ్ళి దైవాన్ని దర్శించుకోవటం విషయంలో ....  పరిస్థితి అనుకూలించనప్పుడు మనస్సులో దైవాన్ని దర్శించుకుని, పరిస్థితి అనుకూలించిన తరువాత దేవాలయాలకు వెళ్ళవచ్చు.

************
ఇంతకాలం ప్రజలు దేవాలయ దర్శనాలకు ఎందుకు దూరమయ్యారో ? తెలియదు కానీ, కొన్ని విషయాల గురించి  ఆలోచించుకోవాలి.

వేలమంది ప్రజలు దేవాలయాలకు వెళ్తుంటారు. వీళ్ళందరూ నిజజీవితంలో ధర్మాన్ని పాటిస్తూ.. అవినీతి వంటి పనులకు దూరంగా జీవిస్తే దైవానికి ఎంతో ఇష్టులవుతారు.


 దైవపూజ దైవ ప్రీతి కొరకు చేయటం మంచిది.

మనం జీవించడానికి అవసరమైన గాలి, నీరు, ఆహారం, వాతావరణం..వంటివెన్నో ప్రసాదించిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవటం కూడా పూజయే.

కోరికలు తీరటం కోసం, బాధలు తీరటం కోసం కూడా దేవాలయాలకు 
వెళ్ళటం తప్పు కాదు కానీ , జీవితంలో మన నడవడికలో తప్పులుండకూడదు. 

దైవకృపను పొందాలంటే ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి.


****************************
దేవాలయాలలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు   కొన్నిసార్లు ఒకరినొకరు నెట్టుకుంటూ ఉండేవారు.

అలా కాకుండా ఒక పద్ధతిలో వెళ్తే ప్రశాంతంగా దైవదర్శనం చేసుకోవచ్చు.

ఇప్పుడు కొరోనా భయంతో కొన్నాళ్ళైనా ఒకరినొకరు నెట్టుకోకుండా దైవదర్శనం చేసుకుంటారేమో?

రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే దైవం ముందు నిలబడి దర్శించుకోవటానికి కుదరదు. వెనుక చాలామంది ఉంటారని గుర్తుంచుకోవాలి.
****************
హిందువులకు ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలలో సనాతనకాలం నుండి వచ్చినవీ ఉంటాయి. మధ్యలో  కొందరి  చేత చేర్చబడ్డవీ కూడా ఉంటాయి. వాటిని గమనించుకోవాలి.

 మూఢాచారాలను వదిలేయాలి. సమాజానికి ఉపయోగపడే ఆచారాలను పాటించాలి.సమాజానికి  నష్టం కలిగించేవాటిని వదిలేయాలి.


***************
దయచేసి ఈ లింక్ ల వద్ద కూడా క్లిక్ చేసి చదవగలరు.

 దైవం యొక్క చాకచక్యం ఎవరి అంచనాలకూ అందనిది.

కొన్ని ఆచార వ్యవహారాలు.. కొన్ని మార్పులుచేర్పులు.....

మాకు తెలిసిన ఒక కుటుంబం ఇంకో మతం ..

ఆచారవ్యవహారాలు ...మరి కొన్ని విషయములు...

భక్తి ముఖ్యం.

మూఢనమ్మకాలను , మూఢత్వాన్ని వదిలి......

**************

దైవభక్తి కలిగి, జీవితంలో నైతికవిలువలను పాటిస్తూ జీవించటానికి ప్రయత్నిస్తే   దైవానికి ఇష్టులవుతారు.  దైవకృప కలుగుతుంది. 

*******
జీవితంలో సరైన విధంగా ప్రవర్తించటానికి ప్రయత్నించాలి. 

సరైన విధంగా ప్రవర్తించే శక్తిని అనుగ్రహించమని దైవాన్ని ప్రార్ధించుకోవాలి.

మంచిగా అందరూ దైవకృపను పొందాలి.



దైవమే దిక్కు....



ఏదైనా పుణ్యక్షేత్రం వద్ద 10 కిలోమీటర్లు నడవాలంటేనే పెద్దవాళ్ళకు కూడా కాళ్లు లాగేస్తాయి..

అలాంటిది కొందరు వలస కార్మికులు  ఎండలలో వందల కిలోమీటర్లు నడవటం ఏమిటో.... పిల్లలు మేము నడవలేమంటూ ఏడుస్తున్నా కూడా పెద్దవాళ్లు నడిపించటం ఏమిటో.

దేశంలోని  ప్రభుత్వాలు కూలీల కోసం తాము రైళ్ళను ఎక్కువగానే వేశామంటారు.కొందరు కూలీలను రైళ్ళలో వారి స్వస్థలాలకు పంపారు.

మరి, రైళ్ళలో ప్రయాణం కొరకు ఆన్ లైన్  బుకింగ్ తెలియకపోవటం వల్లనో? లేక ట్రైన్ దిగిన తరువాత క్వారైటైన్లో ఉండాలని భయం వల్లనో ? లేక మరేదైనా కారణాలో తెలియటం లేదు..  నడిచే వాళ్లు కొందరు నడుస్తూనే ఉన్నారు.

*************
ఏం చేయాలో తెలియని నిస్సహాయతతో కుటుంబసభ్యులు అందరూ అలా నడుస్తూ ఉండవచ్చు. నిస్సహాయత ఉన్నాకూడా అంతదూరాలు  అలా నడవటం  సరైనపనికాదు.

 పరాయి చోట ఉపాధి లేక చనిపోతామేమోనని భయం వల్ల  నడిస్తే.. నడవలేక కూడా చనిపోవచ్చు .. చనిపోకపోయినా .. తరువాత జబ్బు పడొచ్చు.

**************
లాక్డౌన్ సమయంలో ప్రజల కష్టాలు తీరటానికి ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు సహాయక చర్యలు చేసారు.

దేశంలోని ప్రభుత్వాలు పేదలకు కొంత ఆహారాన్ని అందించారు, కొన్ని రైళ్ళను వేసారు. కొందరిని స్వస్థలాలకు పంపించారు.

అయితే, ఆహారధాన్యాలు దండిగా ఉన్నాయంటున్నారు కాబట్టి, మొదటిసారి లాక్ డౌన్ నుండి ఉపాధి లేక ఆహారానికి ఇబ్బందులు పడుతున్న వారికి సరిపడా ఆహారధాన్యాలను ఇవ్వటం.... 


రెండవ లాక్ డౌన్ కు ముందు రెండు రోజులు గాప్ ఇచ్చి  స్వస్థలాలకు వెళ్తామనేవారిని సరైన వాహన ఏర్పాట్లు చేసి పంపించటం వంటివి మరింత సమర్ధవంతంగా చేస్తే ,
 వలసకూలీలు రోడ్లపై నడవటం ఉండేది కాదు.

 ఇళ్ళలో ఉన్న కొందరు పేద కుటుంబాల వాళ్లు ఆకలితో బాధలు పడేవారు కాదు. కరోనా లాక్డౌన్ సమయం లో వలసకూలీల  విషాదగాధల జ్ఞాపకాలు ఉండేవి కావు.

అయితే, సమాజం బాగుండాలంటే .. ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు ఎవరి పని వారు సక్రమంగా చేయాలి.


*********************
ఈ మధ్య ఒక చిన్న పిల్లతో కొందరు పోలీసులు ఒక గది తుడిపించటం చూసి  అందరూ అన్యాయం అన్నారు. చిన్న పిల్లతో పనిచేయించటం అన్యాయమే.

మరి వలసకూలీలు తమ చిన్నపిల్లలను  అలా నడిపించటం కూడా అన్యాయమే. తల్లితండ్రి ..పిల్లలను కని, పెంచుతున్నారు కాబట్టి వాళ్లు వాళ్ల పిల్లల్ని కష్టపెడితే అన్యాయం అనకూడదా ?

తల్లితండ్రి తమ పిల్లలను కష్ట పెట్టకూడదు. అలాగని పిల్లలను అతి గారాబం చేసి పెంచకూడదు.

******
మరికొంత మంది తల్లితండ్రి చదువుల్లో ర్యాంకుల కోసం పిల్లల్ని దండిస్తారు. పిల్లల మంచికోసమే అలా చేస్తున్నామంటారు.

కొన్నిసార్లు పిల్లలు వాళ్ల శక్తికి మించిన చదువులు చదవలేక, తమ బాధలు ఎవరూ పట్టించుకోవటంలేదనే అభిప్రాయంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.

ఈ రోజుల్లో  చదువు, ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉంది. ఇష్టమైన చదువులో సీటు లభించాలన్నా విపరీతమైన పోటీ ఉంది.
 పిల్లల శక్తిని, ఇష్టాఇష్టాలను కూడా పెద్దవాళ్లు కొంత పట్టించుకోవాలి.

****************
 ఇక కొందరు పెద్దవాళ్ల విషయాలను గమనించితే,  సమాజానికి మంచి చెప్పవలసిన కొందరు పెద్దవాళ్లే... మద్యపానం  చేయటం , స్త్రీ పురుషులు తమ ఇష్టానికి తిరగటం .. వంటివి తప్పులేదంటున్నారు.

***********
ప్రభుత్వాలు ..ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు. తల్లితండ్రి..తమ పిల్లలు ఇబ్బందులు పడకుండా చూసుకుంటారు.

అయితే, కారణాలు ఏమైనా..సమాజంలో బలహీనులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

 సమాజంలో ...పేదవారు బలహీనులు. కుటుంబంలో...పిల్లలు బలహీనులు.

 సమాజంలో ఏదైనా సమస్య వస్తే,  పేదవారు ఎక్కువ ఇబ్బందులు పడతారు.

 కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే,  పిల్లలు ఎక్కువ ఇబ్బందులు పడతారు.

****************
 పిల్లలు తప్పులు చేస్తే పెద్దవాళ్ళు దండిస్తారు. ప్రజలు తప్పులు చేస్తే ప్రభుత్వాలు, చట్టం ద్వారా దండన ఉంటుంది. 

మరి, ఎప్పుడైనా  సమాజంలో పెద్దవాళ్ళు, ప్రభుత్వాలు..ఏమైనా తప్పులు చేస్తే ఎవరు దండిస్తారు ?

ఇప్పుడు చాలామందికి  నైతికవిలువల సంగతి అలా ఉంచి, డబ్బు సంపాదనా, విలాసంగా జీవించటం వంటివి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎవరి ఖర్మ వారిది.  

ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయో దైవానికే తెలియాలి.  దైవమే దిక్కు.



Saturday, May 16, 2020

ఎంత కాలమో ?.....


వలస కార్మికుల బాధలు ఎంతో దారుణంగా ఉన్నాయి.

కనీసం రెండో విడత లాక్డౌన్ ముందు అయినా.. కొంత సమయం ఇచ్చి స్వస్థలాలకు వెళ్ళాలని అనుకున్న వారిని పంపించవలసింది.

వాళ్ళు నడిచి వెళ్ళకుండా అవసరమైనన్ని రైళ్ళు వేయాలి.


 రైళ్లలో ప్రయాణించటానికి సవాలక్ష రూల్స్ పెట్టకుండా.. తేలికగా టికెట్ బుక్ చేసుకునే విధానం ఉండాలి.

వాహనాలలో ఊళ్ళకు వెళ్ళాలంటే ఆన్లైన్లో వివరాలు ఇవ్వటం వంటివి వాళ్ళకు చేతనవుతుందా ?

రోజులతరబడి వాళ్ళు అలా బాధలుపడవలసి రావటం దారుణం.


ఊళ్ళకు వెళ్లనీయకుండా బలవంతంగా వారితో పనిచేయించాలనుకుంటే మానవహక్కులను ఉల్లంఘించటమే అవుతుంది.

**************

వలస కార్మికులు రోజుల తరబడి సరైన సౌకర్యాలు లేకుండా గుంపులుగా ఒకే దగ్గర ఉండటం వల్ల కూడా వారికి కోరోనా వచ్చే అవకాశం ఉంది.

కొరోనా వచ్చిన వారిని స్వస్థలాలకు రానివ్వమని అనటం కూడా అన్యాయం.

వ్యాధిలేనివారే.. తమను పరాయి ప్రాంతంలో సరిగ్గా పట్టించుకోవటం లేదని అంటున్నప్పుడు, ఇక వ్యాధి వచ్చిన వారిని పరాయిప్రాంతంలో ఏం పట్టించుకుంటారు? ఇవన్నీ గమనిస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

స్వస్థలాలకు వెల్తామనే వారిని స్వస్థలాలకు పంపించి , వారిని హోం క్వారైటైన్ లో ఉంచవచ్చు. అప్పుడప్పుడు వైద్యులు రోగుల ఇళ్లకు వెళ్లి వారిని పరీక్షించవచ్చు.

వేరే ఊరి నుండి వచ్చే వారివల్లే కోరోనా వస్తుందని అనుకోనక్కర లేదు. ఇప్పటికే కోరోనా దేశంలోకి వచ్చి ఉంది . 

స్వస్థలంలో ఇళ్ళలో ఉన్న వారికి కూడా కోరోనా వస్తోంది కదా!


************
మద్యం షాపులు తెరిచినప్పుడు ఇక లాక్డౌన్ ఎందుకు ?

మద్యం తాగిన వారు ఆ మత్తులో సోషల్ డిస్టెన్స్, 
చేతులు శుభ్రం చేసుకోవటం  వంటివి   పాటిస్తారా ?

మద్యం తాగిన వారి వల్ల ఇంట్లో వారికి, బయట వారికి కూడా కొరోనా సోకే అవకాశం ఉంది.


**********
వలస కార్మికులు మాత్రమే  కాకుండా .. ఎన్నో రంగాల వారు , ఎందరో వ్యక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వీరి  బాధలు ఎప్పుడు తీరుతాయో?

**********
మద్యం తాగితే కొరోనా తగ్గుతుందని కొందరు అపోహపడుతున్నట్లున్నారు. మరి, అమెరికాలో, ఇంకా కొన్ని దేశాలలో   చాలామంది మద్యం త్రాగుతారు. అక్కడ  కొన్నివేలమంది చనిపోయారు కదా. 

ఇందువల్ల ఏం తెలుస్తుందంటే, మద్యం త్రాగితే కోరోనా తగ్గకపోగా ఇంకా పెరిగే అవకాశముంది అని .

**********

క్రమంగా  లాక్ డౌన్  తీసి డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తగా పనులు చేసుకోవచ్చు.

బయటకు వెళ్ళి ఎక్కడైనా కుర్చీలో కూర్చుని లేస్తే... ఇంకొకరు  వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటే... అప్పటికే కుర్చీకి అంటుకుని ఉన్న కొరోనా వైరస్... కుర్చీలో కొత్తగా వచ్చి కూర్చొన్న వారికి వచ్చే అవకాశం ఉండొచ్చు కదా ? 

ఇకమీదట.. లిఫ్ట్ బటన్లు, బస్సు లో సీట్లు, షాపింగ్ మాల్స్ లో వస్తువులు..ఇవన్నీ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలేమో ? 

**********
లాక్డౌన్ వల్ల పర్యావరణ కాలుష్యం కొంత తగ్గింది. లాక్డౌన్ తరువాత కూడా పర్యావరణ కలుషితం కాని విధంగా ఉపాధి పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. 

పారిశ్రామిక వ్యర్ధాలు విచ్చలవిడిగా గాలిలోనూ,నీటిలోనూ (నదుల్లోను, సముద్రంలోనూ..)  కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

పర్యావరణకాలుష్యం వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి. జబ్బులు వచ్చి మనుషులు చచ్చిపోయినా ఫరవాలేదు.. ఆర్ధికవృద్ధి రేటు పెరగటమే ముఖ్యం..  అనుకుంటే మాత్రం కష్టం.

అయితే, దైవం చూస్తూ ఊరుకోరు..ఎవరిని ఎలా దారిలోకి తీసుకురావాలో సమయం వచ్చినప్పుడు చూపిస్తారు.

ఇప్పుడు చిన్న కోరోనా వైరస్  వల్ల ప్రపంచమే విలవిలలాడే పరిస్థితి  జరుగుతోంది కదా.

టెక్నాలజీకి మరీ అలవాటుపడకండి. భవిష్యత్తులో సోలార్ తుఫాన్లు వంటివి వచ్చి టెక్నాలజీ కూడా స్థంభించే పరిస్థితి కూడా రావచ్చు? 

అందుకే టెక్నాలజీ లేకుండా కూడా జీవించటం ఎలా? అనేదానికి కూడా మనం  సిద్ధపడి ఉండాలి.

ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి,  పద్ధతిగా జీవించాలి. 

టెక్నాలజీ అవసరమే కానీ, టెక్నాలజీ ఎంతవరకూ అవసరమో అంతవరకే వాడుకోవాలి.

( సోలార్  తుఫాన్  గురించి కొన్ని వివరాలను కామెంట్స్ వద్ద చదవగలరు. )

*************
ఎవరైనా సరే, ఇతరులను బాధపెడితే దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది.

తప్పుచేసిన వారు ఇహలోకంలో  తీర్పు నుండి తప్పించుకున్నా కూడా... దైవం యొక్క తీర్పు నుండి మాత్రం తప్పించుకోలేరు.