మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవటం మంచివిషయం.
జీవితంలో దైవభక్తి, సత్ప్రవర్తన.. చాలా అవసరం.
దైవకృపను పొందడానికి మరియు చక్కటి జీవితానికి ఉపయోగపడేలా పెద్దలు చక్కటి పూజావిధానం మరియు ఆచారవ్యవహారాలను తెలియజేసారు.
అయితే, కొందరి వల్ల కొన్ని ఆచారవ్యవహారాలలో కొన్ని మూఢనమ్మకాలు కూడా చేరటం జరిగింది.
సనాతనధర్మం మూఢాచారాలను ప్రోత్సహించలేదు. కొందరు మనుషులే ప్రతిదానికి భయపడుతూ మూఢనమ్మకాలను పాటించారు. వాళ్ళు ప్రతిదానికి భయపడుతూ అందరినీ భయపెడుతుంటారు.
దైవభక్తి పెరిగేలా ఆచారవ్యవహారాలు ఉండాలి .
అంతేకానీ, ఆచారవ్యవహారాలంటేనే విసుగు, భయం కలిగే పరిస్థితి తెచ్చుకోవటం సరైనది కాదు.
కొందరు ప్రజలు ఆచారవ్యవహారాలను విపరీతధోరణితో చేస్తున్నారు.
ఏం చేస్తే ఏం తప్పో ? అన్నట్లు భయపడే ధోరణి పెరుగుతోంది.
ఇలాంటి విపరీతధోరణి ఇంకా పెరిగితే ....
నోరు అంటే ఉమ్మి ఉంటుంది, ఉమ్మిఅంటే ఎంగిలి, అశుచి, అంటు కాబట్టి .. నోటితో పవిత్రమైన దైవనామాలను, మంత్రాలను పలకడం కూడా తప్పేమో ? అని కూడా ముందుముందు ఎవరికైనా సందేహాలు కలుగుతాయేమో ?
ఇలాంటి పరిస్థితి రాకూడదు .
...............
ఆచారవ్యవహారాల్లో క్లిష్టతను పెంచితే , అవన్నీ పాటించలేక కొందరు ప్రజలు సరళంగా ఉండే ఆచారవ్యవహారాలు గల మత పద్ధతిలోకి మారే పరిస్థితి కూడా కలగవచ్చు.
***************
కొందరు పూజ చేసేటప్పుడు భక్తి కన్నా పూజలో ఎక్కడ పొరపాట్లు వస్తాయో ? వస్తే ఏమవుతుందో ? అనే భయంతో పూజలు చేస్తూ ఉంటారు.
కానీ ఆ భయం వల్ల పూజకే దూరం అయ్యే పరిస్థితి రాకూడదు .
కష్టంలోనూ, సుఖం లోనూ అందరికి తోడునీడ దైవమే.
మన అందరికీ హితులు, స్నేహితులు, జన్మజన్మల బంధువు, ఆత్మ, పరమాత్మ అన్నీ దైవమే.
మనకు ఎవరైనా విసుగుతో పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టిన దానికన్నా .....ప్రేమతో పెట్టిన పదార్ధాలే బాగుంటాయి.
ఎవరైనా భయం వల్ల .. మనల్ని పలకరించటం కన్నా ..... ప్రేమగా పలకరించటమే బాగుంటుందని మనకు అనిపిస్తుంది కదా !
దైవం కోరుకునేది.. అందరూ పరమపదాన్ని పొంది ఎప్పటికీ పరమానందంగా ఉండాలనే.
ప్రజలు మూఢత్వాన్ని వదిలి దైవానికి దగ్గరకావడానికి ప్రయత్నించడం మంచిది.
***********************
మరికొన్ని విషయములు...ఈ విషయాలను కొంత కాలం తరువాత వ్రాసి పై పోస్ట్ క్రింద పోస్ట్ చేసాను.
సమాజంలోని వారికి రకరకాల అభిప్రాయాలుంటాయి. మనం గౌరవించే వారి అభిప్రాయాలు ..మన అభిప్రాయాలు.. కొన్నిసార్లు ఒకటిగా ఉండకపోవచ్చు.
ఇలాంటప్పుడు మన అభిప్రాయాలను చెబుతాము. ఇలాంటప్పుడు ఎవరూ తప్పుగా
భావించకూడదు. అందరి అభిప్రాయాలు ఒకటిగానే ఉండవు కదా..
ఆచారవ్యవహారాల్లో రకరకాలుంటాయి. కొన్ని కుటుంబాల్లో వారి పెద్దల నుంచి కొన్ని పద్ధతులుంటాయి. కొందరు ఉల్లి, వెల్లుల్లి వంటివి తినరు. కొందరు తింటారు.
అయితే ఈమధ్య కొందరు , ఎవరైనా కూడా.. ఉల్లివెల్లుల్లి తినకూడదని చెబుతున్నారు. కొందరికి ఇలాంటివి వింటే భయం కలుగుతుంది.
బెంగాల్లో బ్రాహ్మణులు కొందరు చేపలు తింటారట.. మన ప్రాంతాలలో శూద్రులు చాలామంది ఉల్లి, వెల్లుల్లి తింటారు..ఇలా వివిధ పద్ధతులున్నాయి.
ఉల్లి, వెల్లుల్లి.. తినకూడదని వంటలో వేయకపోతే, ఇంట్లో కొందరికి కోపం
రావచ్చు. కొత్తగా ఇవన్నీ ఏమిటని..గొడవలయ్యే పరిస్థితి ఉంటుంది.
విదేశాల నుంచి వచ్చిన టమేటో, కారట్, ముల్లంగి, కాబేజ్, మిర్చి..వంటివెన్నో తింటున్నాము.
కూరల్లో గుజ్జు(గ్రేవీ) రావటానికి, రుచికొరకు.. కొందరు ఉల్లిపాయ బదులు కొబ్బరి, పప్పులపొడులు వాడుతారు. కొందరు కొబ్బరి ఎక్కువ తినరు. ..ఉల్లిపాయలు వాడుతారు.
ఉల్లి, వెల్లుల్లి, నిల్వ పదార్ధాలు, కారం ఎక్కువున్న పదార్ధాలు వంటివి.. సాత్వికాహారం కాదని అంటారు. మరి, పండుగలప్పుడు, ఎప్పుడైనా సాత్వికాహారం తినాలనుకున్నప్పుడు నిల్వ పచ్చళ్లు , ఫ్రిజ్లో నిల్వ ఉంచినవి తినకూడదా? అని సందేహాలు వస్తుంటాయి.
గ్రంధాలలో రాజసికాహారం గురించి కూడా ఉంది.
సాత్వికాహారం తింటే మంచిదే. అయితే..ఉల్లి, వెల్లుల్లి ..రాజసికఆహారమని కొందరు, తామసికాహారమని కొందరు అంటున్నారు. గుమ్మడికాయ, బంగాళాదుంప(ఆలుగడ్ద) , మినపప్పు..వంటివి..తామసికాహారమని నేను ఒక దగ్గర చదివాను. మరి, మినపప్పుతో చేసిన గారెలు, ఇడ్లి, దోసె..వంటి పదార్ధాలను చాలామంది తింటారు కదా..
నిల్వ ఉన్న ఆహారం తామసికాహారం అంటున్నారు. చాలామంది స్త్రీలు, ఉదయం వండగా మిగిలిన అన్నం, కూరలు..రాత్రికి తింటారు.. ఆహారం వృధాకాకుండా అలా తింటారు..
పూజలు చేసేవారు.. రాజసిక, తామసిక ఆహారాన్ని తినటం మానేయాలంటే..ఉల్లి, వెల్లుల్లితో పాటు..మినపప్పుతో వండిన వంటలు, ఆలుగడ్ద, కాఫీ, టీలు, నూనెలో బాగా వేయించిన పిండివంటలు, నిల్వ పచ్చళ్ళు, చద్దనం, వండినిలువ ఉన్న కూరలు..ఇలాంటివెన్నో తినకూడదు...మరి ఇవన్నీ మానేయాలంటే ఎంతమంది పాటించగలరు?
ఎవరినీ బాధపెట్టాలని ఇవన్నీ వ్రాయలేదండి. అందరూ అన్నీ పాటించాలంటే చాలా కష్టం అవుతుంది. మొదటినుంచి ఉల్లి, వెల్లుల్లి అలవాటులేని వారి ఇళ్ళలో ఇబ్బంది ఉండదు కానీ..ఉల్లి, వెల్లుల్లి తినే వారి కుటుంబాల్లో అవి మానేయాలంటే కష్టం అవుతుంది. అందువల్ల ఇలా వ్రాయవలసి వచ్చింది.
సంప్రదాయబద్ధంగా ఎన్నో నియమాలను పాటిస్తూ..జీవితం గడిపేవారు.. వేదాలను
నేర్చుకున్నవారు..ఇలాంటి వారు ఎన్నో నియమాలను పాటిస్తారు. ఎవరి ఆచారం
ప్రకారం వారు ఆహారాన్ని తీసుకోవచ్చు. అందరూ అలాగే పాటించాలంటే చాలామంది
పాటించలేరు.
సమాజంలో వివిధ వృత్తులవారున్నారు.. కొంత చద్దన్నం తిని ఉదయానే పనికి వెళ్ళేవారుంటారు. నాకు తెలిసినంతలో..కాయకష్టం చేసేవారికి కొంతమోతాదులో తీసుకునే మినుములు..వంటివి బలాన్ని కలుగజేస్తాయి. రాజసిక, తామసిక ఆహారాలను ఎక్కువగా తినకూడదు కానీ, కొంతవరకూ తింటారు కదా..
కొద్దిగా నిల్వ ఉన్న అంబలి.. వంటివి ఆరోగ్యానికి మంచిదని, బి12 వంటివి లభిస్తాయని కొందరు అంటున్నారు.
రజోగుణం
వంటివి పెరగకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రజోగుణం, తమోగుణం
అంటే..హింస మరియు అసభ్యకరమైన సంభాషణలు, దృశ్యాలు వంటివాటి జోలికి
అనవసరంగా పోకూడదు.
అయితే, జీవితంలో కొంత రజోగుణం, తమోగుణం కూడా ఉంటుంది. సత్వగుణం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
ఈ విషయాలలో చాలా సందేహాలు కలుగుతాయి. ఏం చేయాలో? ఏం చేయకూడదో? దైవానికి మాత్రమే సరిగ్గా తెలుస్తుంది..దైవమే దారి చూపాలి.
కొందరికి గొప్పమంత్రాలను పఠించటానికి నోరు తిరగదు. అలాంటప్పుడు, దైవనామాన్ని స్మరించుకుని కూడా తరించవచ్చు.
****************
అనేక విషయాల వల్ల తామసగుణం పెరిగే పరిస్థితి ఉంది.
ఆహారం గురించిన విషయాలు మహాభారతంలో భీష్ముల వారు తెలియజేసినవి ఉన్నాయి.
link..పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాలని..
**********
గ్రంధాలలో ఒక కధ ఉంటుంది. ఒక ముని ఒకరి ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తరువాత ముని ఆ ఇంట్లో ఒక వస్తువును దొంగిలించి పట్టుకుపోతారు. తాను అలా ఎందుకు చేసాను? అని ముని ఆలోచించి దివ్యదృష్టితో గ్రహిస్తే తెలిసిదేమిటంటే, భోజనం పెట్టిన ఇంట్లో వారికి దొంగతనాలు చేసే అలవాటుందని మునికి తెలుస్తుంది.
పాపపు సొమ్ముతో కొన్న పదార్ధాలతో భోజనం చేయటం వల్ల, మునియొక్క మనస్సులో దొంగతనం చేయాలని బుద్ది పుడుతుందట. ఇలా ఎన్నో విధాలుగా తామసగుణం వచ్చే కలిగే అవకాశాలుంటాయి.
అయితే, చాలా విషయాలుంటాయి. ఉదా.. మునికి భోజనం పెట్టిన వారింట్లో ఎవరైనా మంచివారు కూడా ఉంటే ఏమవుతుంది? ఒకే మనిషిలో కొంత మంచి, కొంత చెడు గుణాలుంటే ఏమవుతుంది? ...
పాపపు సొమ్ముతో మంచి పనులు చేస్తే.. కొంత మంచి, కొంత చెడు ఫలితాలుంటాయా? చేసిన పాపాన్ని బట్టి, ఎక్కువ..తక్కువ..చెడు.. ఫలితాలుంటాయా? ఇలా చాలా సందేహాలు, విషయాలుంటాయి.
ధర్మసూక్ష్మాలు, ధర్మవ్యవస్థ చాలా క్లిష్టమైనవి. ఏది ఎందుకు జరుగుతుందో..తెలుసుకోవటం చాలా కష్టం. సర్వాంతర్యామి అయిన దైవానికి మాత్రమే అంతా తెలుస్తుంది.
***********
స్త్రీలు..గుమ్మడికాయ, కొబ్బరికాయ కొట్టకూడదంటున్నారు. వంటకు కొబ్బరికాయ, గుమ్మడికాయ కొట్టాలంటే సమయానికి పురుషులు ఇంట్లో లేకపొతే ఇక వాటిని వాయిదా వేయాలి. ఇలా ప్రతిదానికి అడ్డుకట్టలు వేస్తే కొబ్బరి, గుమ్మడి.. వంటివి వాడకం తగ్గించే పరిస్థితి ఉంటుంది.
అన్నీ తగ్గించుకుంటూ పోతే హిందువులు పోషహాకారం లోపంతో బలహీనులయ్యే పరిస్థితి రావచ్చు. అందువల్ల, పరిస్థితిని బట్టి ఆలోచించుకుని చేయాలి. . గుమ్మడి, కొబ్బరికాయను కొట్టడం వెనుక ఇంకా ఏమైనా కారణాలుంటాయేమో నాకు అంతగా తెలియదు..
కేరళలో కొందరు హిందు స్త్రీలు కొబ్బరికాయను వారే కొడతారు. తెలుగువాళ్లలో కూడా పూజలప్పుడు స్త్రీలు కొబ్బరికాయను కొడతారు. మరి, స్త్రీలు కొబ్బరికాయ కొట్టకూడదంటూ కొందరు ఎందుకు చెబుతున్నారో? తెలియటం లేదు.
***************
ఈమధ్యన కొందరు చాలావిషయాలను చెబుతున్నారు. విన్నవాళ్ళకు ఏంచేయాలో అర్ధం కాదు.
ఉదా..కొబ్బరికాయను కడిగి దేవుని వద్ద కొట్టకూడదంటూ కొందరు చెబుతున్నారు. కొన్నిసార్లు మార్కెట్లో కొబ్బరికాయలు ఉంచే ప్రదేశం అంత శుచిగా ఉండకపోవచ్చు..కాయకొట్టినప్పుడు నీటితోపాటు మురికి కూడా క్రిందకు దిగుతుందికదా..ఆ నీటిని దేవునికి సమర్పించటం బాగుండదనే అభిప్రాయంతో కాయలను కొట్టేముందు కడగాలనిపిస్తుంది.
అందువల్ల కాయలను కడిగి, తడి కొంత ఆరినతరువాత కొట్టవచ్చు. ఇంటివద్ద కొబ్బరిచెట్టు ఉండి కాయలు శుభ్రంగా ఉంటే కడగకుండానే కొట్టుకోవచ్చు. నేను చాలాసార్లు కొబ్బరికాయను కడిగి దేవునికి కొడుతుంటాను.
*******************
నెలసరిలో పక్కన కూర్చోవటం అనే ఆచారాన్ని పాతకాలంలో చెప్పినట్లు పాటించాలంటే, స్త్రీలు ఖచ్చితంగా పక్కన కూర్చోవాలి. అంతేకానీ స్కూల్స్ కు, ఉద్యోగాలకు వెళ్ళకూడదు. బయటకు వెళ్ళి నెలసరి మైలను అందరికీ కలపకూడదు.
ఈ రోజుల్లో స్కూల్స్, కాలేజీలకు, ఉద్యోగాలకు వెళ్ళక తప్పదు కదా..అంటారు కొందరు. మరి,తప్పనిపరిస్థితిలో కొందరు స్త్రీలు ఇంట్లో వంట చేయకతప్పదు .
ఇతరుల అంటుముట్టు గురించి మనకు తెలియనప్పుడు..బయటకు వెళ్ళి వారిని ముట్టుకున్నా తప్పు లేదంటారు కొందరు. తెలియకపోవటం ఏముంది..బయటకు వెళ్ళినా, ఒక బస్సు ఎక్కినా..ఎందరో స్త్రీలుంటారు. వారిలో ఖచ్చితంగా కొందరు నెలసరిలో ఉన్నవాళ్లుంటారు.
ఎప్పుడైనా బస్సులో దేవాలయానికి వెళ్ళినప్పుడు, బస్సులో ఎందరో కాలేజ్ పిల్లలు, ఉద్యోగానికి వెళ్లే స్త్రీలు ఉంటారు. వీళ్లలో కొందరైనా నెలసరి ఉన్నవాళ్లు ఉంటారు కదా..వీళ్లను ముట్టుకుని దేవాలయానికి వెళ్ళవలసి వస్తోంది.. అనిపిస్తుంది.
కొందరు స్త్రీలు తప్పనిపరిస్థితిలో బయట ఉద్యోగాలకు వెళ్తారు. భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఇల్లు గడవటానికి డబ్బు లేక, ఉద్యోగాలకు వెళ్లే స్త్రీలు కూడా ఉంటారు. అలాంటప్పుడు కూడా బయటకు వెళ్ళక తప్పదు.
అవసరాలు, పరిస్థితులను బట్టి , గ్రంధాలలో చెప్పినవాటిని కొన్నింటిని కాలానుగుణంగా మార్చుకుంటున్నారు..
అయితే, నెలసరి విషయంలో గట్టిగా చెప్పాలనుకునేవారు..నెలసరిలో ఉన్నవారు వంట చేయకూడదని చెప్పటం మాత్రమే కాకుండా, నెలసరిలో ఉన్న వారు బయటకు వెళ్లకూడదని కూడా చెప్పగలగాలి.
ఈ రోజుల్లో ఆడవారు నెలసరిలో బయటకెళ్ళి కలిపేసి.. ఇంటికొచ్చి పక్కన కూర్చుంటే అది సరైన పద్ధతి అవుతుందా?
మనం పాటించినా, పాటించకపోయినా గ్రంధాలలో ఉన్న విషయాలను (ప్రక్షిప్తాలు లేకుండా) చెపితే, తెలుసుకుని, ఆలోచించుకుని.. పాటించడానికి ప్రయత్నిస్తారు. పాటించడానికి కుదరని వాళ్ళు పాటించలేరు.
అంతేకానీ, ఈ రోజుల్లో చాలామంది స్త్రీలకు బయటకు వెళ్ళకుండా కుదరదు కాబట్టి, ఆ విషయంలో పాటించటం గురించి గట్టిగా చెప్పకుండా, వంటచేస్తే మాత్రం కష్టాలొస్తాయని భయపెడితే ఎలా?
నెలసరిలో ఇంట్లో ఎవరైనా సాయం చేసే పరిస్థితి ఉంటే, పక్కన కూర్చుని విశ్రాంతి తీసుకుంటే మంచిది. అయితే, కుదరనప్పుడు ఏం చేయగలరు? కొన్ని జాగ్రత్తలు తీసుకుని వంట చేస్తారు.
****** ************
ప్రజలకు ఒకదాని తర్వాత ఒకటిగా సందేహాలు వస్తుంటాయి..కొబ్బరి చిప్పలో దీపం... ఎండు కొబ్బరి చిప్పా? పచ్చి కొబ్బరి చిప్పా? అంటూ సందేహాలు. మట్టిప్రమిద వాడినవి మళ్ళీ వాడచ్చా? లేక ఎప్పటికప్పుడు కొత్తవి వాడాలా? ఇలా అంతులేని సందేహాలు..
మట్టిప్రమిదలు ఎప్పటికప్పుడు కొత్తవి వాడితే, ప్రమిదలు తయారుచేసేవారికి పని లభిస్తుందని కొందరు అంటారు. పని లభించే మాట నిజమే కానీ, లక్షలాది ప్రమిదల తయారీకి మట్టి ఎక్కడినుంచి తెస్తారు?
మురుగు కలవని స్వచ్చమైన మట్టి లభించాలంటే ఎంతో వెతకాలి. ఈ రోజుల్లో ఎన్నో కట్టడాలు పెరిగి మట్టినేల తరిగిపోతోంది. మట్టి కొరకు పొలాలను తవ్వుకుంటూ పోతే ఎలా?
మధ్యేమార్గంగా.. ప్రతిసారి కొత్త ప్రమిదలు కాకుండా, ఒకసారి కొన్న ప్రమిదలు కొన్నిసార్లు వాడిన తరువాత కొత్త ప్రమిదలు మార్చుకోవచ్చు.
అయినా, అనేక సందేహాలతోనే జీవితం గడపటం భక్తి అంటారా? అనేక సందేహాలతో కాకుండా, దైవభక్తి కలిగి.. ధర్మబద్ధంగా జీవించడానికి ప్రాముఖ్యతను ఇస్తే దైవకృప లభిస్తుంది.
***********
నేను ఎవరి పట్లా కోపంతో ఇవన్నీ వ్రాయలేదండి. ఎందరో ఎన్నో గొప్ప విషయాలను చక్కగా తెలియజేస్తున్నారు. వాటిని విని ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాము. అవి ఎందరికో ఉపయోగపడుతున్నాయి.
అయితే, కొన్ని విషయాలను పాటించటంలో సందేహాలు కలుగుతున్నాయి. కొన్ని పద్ధతులను పాటించాలంటే చాలా కష్టంగా కూడా ఉంటుంది.
పద్ధతులు ఎక్కువైతే దైవం గురించి ఆలోచించటం కన్నా, పద్ధతులను సరిగ్గా పాటిస్తున్నామా? లేదా? అనే దాని గురించి ఎక్కువగా ఆలోచించవలసి వస్తుంది.
అందువల్ల కొన్ని పద్ధతులను పాటించి.. దైవంపట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. పాటించే శ్రద్ధ ఉన్నవారు అన్నీ పాటించవచ్చు. ఎవరి శక్తి వారిది.
కొన్ని విషయాలను అందరూ తప్పక పాటించాలి. ఉదా..పాపాలు చేయకూడదు ..వంటివి పాటించటం కష్టంగా ఉన్నా కూడా.. అందరూ పాటించడానికి ప్రయత్నించాలి.
దైవభక్తి కలిగి ఉండటం, నీతిగా, నిజాయితీగా జీవించటం గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అంతేకానీ, ప్రతిదానికి అనేక సందేహాలతో ఉంటే, ఇక దైవం పట్ల ధ్యాస ఎప్పుడు ఉంటుంది?
చాలావిషయాలను పాటించలేక నాకు తోచినట్లు దైవాన్ని ప్రార్ధించుకుంటే బాగుంటుందని ఎన్నోసార్లు అనిపించింది....పాటించకపోతే కష్టాలొస్తాయని చెబుతుంటే, భయపడి అవన్నీ పాటించలేక మతాన్ని వదిలేసే వారు ఉండరా?
తరతరాలనుంచి కొన్ని గ్రంధాలలో కొన్ని మార్పులుచేర్పులు జరగటం వల్ల కూడా అనేక విషయాల్లో అనేక సందేహాలు వస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా, కొందరు ఎవరికితోచింది వారు చెబుతున్నారు. కొందరు పరస్పర విరుద్ధంగా చెబుతున్నారు. ఇలాంటప్పుడు, తరతరాల నుంచి గ్రంధాలలో ఎన్ని ప్రక్షిప్తాలు చేరాయో?
అందువల్ల, జీవితంలో ఏది ఎలా చేయాలో సరిగ్గా తెలియనప్పుడు దైవాన్ని ప్రార్ధించుకోవాలి. మన ప్రవర్తన బట్టి మనకు ఫలితాలు లభిస్తాయి. సరైన విధంగా జీవించేలా మంచిబుద్ధిని ప్రసాదించమని అందరూ దైవాన్ని ప్రార్ధించుకోవాలి.
***********
ఒక సినిమాలో ఒక బామ్మగారు తన మనుమరాలితో.. తనకు ఇష్టం లేకపోయినా జీవితంలో ఎన్నో కట్టుబాట్లను పాటించి విసిగిపోయానని, తాను ఏమీ సుఖపడలేదని, తన మనుమరాలైనా ఎటన్నా పోయి, వేరేవారిని ఎవరినైనా వివాహం చేసుకుని సుఖంగా ఉండమని..సలహా ఇస్తారట. ఆ సినిమా నేను చూడలేదు కాబట్టి, డైలాగులు అక్కడ ఉన్నదున్నట్లు వ్రాయలేకపోయాను. ఒక దగ్గర రివ్యూ చదివాను.
**************
ఆచారవ్యవహారాలు అంటే విసుగు వచ్చే పరిస్థితి ఉండకూడదు. హిందువుల్లో కొందరు నచ్చినానచ్చకపోయినా తప్పనిపరిస్థితిలో భయంతో పాటిస్తున్నారు.
ఆధునికకాలంలో కొందరు స్వదేశంలో ఉన్నవారు, కొందరు విదేశాలకు వెళ్లిన వారూ చాలా పద్ధతులను వదిలేస్తున్నారు. ఈ పరిస్థితులు రాకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులను సరళం చేసుకోవాలి.
అలాగని ఆచారవ్యవహారాలన్నీ వదిలేయమని నా అభిప్రాయం కాదు. ప్రాచీనులు ఎంతో విజ్ఞానంతో ఎన్నో మంచివిషయాలను మన ఆచారవ్యవహారాల్లో పొందుపరిచారు. అయితే, మారిన కాలమానపరిస్థితులను బట్టి పూర్తిగా పాటించటం అందరికి కుదరకపోవచ్చు.
కొందరు స్వార్ధపరులు, తెలిసీతెలియని వారి వల్ల కాలక్రమేణా కొన్ని ప్రక్షిప్తాలు .. మూఢాచారాలు కూడా ప్రవేశించాయి. ఇవన్నీ గమనించుకుని విచక్షణతో.. వివేకంతో ప్రవర్తించాలి.
కొన్ని పద్ధతులను పాటించటంలో కొంత కష్టం ఉండవచ్చు. జీవితంలో ఏదైనా పాటించాలంటే కొంతైనా కష్టపడాలి. ఒకపెద్ద చదువు చదవాలన్నా ఎంతో కష్టపడాలి.
అలాగే కొన్ని ఆచారవ్యవహారాలు కష్టంగా ఉన్నాకూడా, మన మంచికొరకు పాటించాలి. అయితే, అతి కాకూడదు. విపరీతమైన కష్టం ఉంటే.. అందరూ తట్టుకోలేరు. అందువల్ల, ఎవరి శక్తిని బట్టి వారు పాటించవచ్చు.
*************
పుణ్యం రావాలన్నా..పాపం పోవాలన్నా ..దైవభక్తి కలిగి, ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి.
ఉపవాసాలు ఉండటం.. వంటివి కూడా పాటించవచ్చు. . ఉపవాసాలు అతిగా చేస్తే ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
దైవస్మరణ చేయటం, కష్టాలలో ఉన్నవారికి సాయం చేయటం, దానధర్మాలు చేయటం..వంటివాటి ద్వారా పుణ్యాన్ని పొంది..పాపకర్మల భారాన్ని తగ్గించుకోవచ్చు.
ఎక్కువ డబ్బుసాయం చేయలేనప్పుడు, కష్టాలలో ఉన్నవారికి కొంత సేవ చేయటం, శ్రమదానం చేయటం, గోసేవ, పశుపక్ష్యాదులను ఆదుకోవటం...వంటివాటి ద్వారా పుణ్యాన్ని పొంది..పాపకర్మల భారాన్ని తగ్గించుకోవచ్చు.
కొందరు,
దైవకీర్తనలు, భక్తిపాటలను..చక్కగా భక్తితో పాడుకుంటారు.. ఆడంబరత్వం
లేకుండా ప్రేమతో పాడుకుంటారు. సంగీతం తెలియకపోయినా భక్తికీర్తనలు
పాడుకోవచ్చు. భజనలు చేసుకోవచ్చు...ఇలా కూడా పుణ్యాన్ని పొంది..పాపకర్మల భారాన్ని తగ్గించుకోవచ్చు.
దైవం
పట్ల ప్రేమ ఉంటే చాలు. అనేక సందేహాలతో సతమతమవకుండా, బోలెడు డబ్బు ఖర్చు
లేకుండా కూడా దైవాన్ని స్మరించుకోవచ్చు..ఆరాధించుకోవచ్చు.
దైవభక్తి కలిగి..ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తే, దైవకృపను పొందవచ్చు. సందేహాలు వస్తే..దైవాన్ని ప్రార్ధించుకోవచ్చు.
******
ఆసక్తి ఉన్నవారు కొన్ని విషయాలను లింక్ వద్ద చూడవచ్చండి..
link....ఆచారవ్యవహారాలు ...మరి కొన్ని విషయములు...
No comments:
Post a Comment