koodali

Sunday, January 21, 2018

శాస్త్రీయ నిరూపణ.... టెక్నాలజీ.



నేను ఆధునిక శాస్త్రవిజ్ఞానానికి వ్యతిరేకిని కాదు. అయితే విజ్ఞానాన్ని ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవాలి అన్నది నా అభిప్రాయం.

కొందరు ఏమంటారంటే శాస్త్రీయంగా నిరూపణ అయితేనే ఏ విషయాన్నయినా నమ్ముతాము అంటారు.

ఆధునిక శాస్త్ర విషయాలు కొన్ని , ఒకసారి నిరూపణ అయిందని భావించాక కొంతకాలానికి ఆ విషయం పొరపాటు అని తేలుతోంది.

ఇలా పదేపదే మార్పులుచేర్పులు జరుగుతున్నప్పుడు శాస్త్రబద్ధంగా నిరూపించటం అనేది ఎప్పటికి జరుగుతుంది ?

అంతిమంగా ఏ విషయమైనా ఇదీ సత్యమని తేలినప్పుడే కదా ! అది నిజమని నిరూపణ అయ్యేది.

ఒకసారి సత్యం అని నిరూపణ అయ్యాక కొంతకాలానికి మళ్ళీ అది పొరపాటని మళ్ళీ కొత్త సత్యం కనుక్కుంటే ఇకఏది శాస్త్రీయమని నమ్మాలి?

అందరూ తెలియని వాళ్ళే అయినప్పుడు ఏది తప్పో ? ఏది ఒప్పో ? ఎవరు నిర్ణయిస్తారు ?

హేతువాదులు చెప్పే శాస్త్రీయత అంటే ఏమిటి ? ఏదైనా అంతిమంగా నిర్ధారణ అయినప్పుడే గదా నమ్ముతారు.

ఎప్పటికప్పుడు మారుతూ ఉండే విషయం .శాస్త్రీయంగా నిరూపణ అయింది అని ఎలా చెప్పగలరు ?

అలా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటూ, నిరూపణ నిరంతరాయంగా జరుగుతున్నప్పుడు దాన్ని ఎలా నమ్మాలి ?

........................

కొందరు నాస్తికులు ఏమంటారంటే , ఆస్తికులు కూడా ఈ నాటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు కదా ! అంటారు. 

మరి దైవం లేరనే నాస్తికులు కూడా ఆ దైవం ప్రసాదించే గాలిని పీల్చే బ్రతుకుతున్నారు.

వాళ్ళు తయారుచేసే అనేక వస్తువులు కూడా దైవసృష్టిలోని పదార్ధాలతో తయారుచేయబడినవే.

విమానాలు తయారుచేయటానికి ముందే పక్షులు గాలిలో ఎగురుతున్నాయి. నౌకలు తయారుచేయబడటానికి ముందే చేపలు నీటిలో ఈదుతున్నాయి.


సృష్టిలోని టెక్నాలజీని చూసి ఎంతో నేర్చుకుంటూ కూడా కొందరు ..... దైవం లేరు అంటారు. ఇది అన్యాయం.

ఈ నాటి టెక్నాలజీ లేకపోయినా ప్రాచీన కాలం నుంచీ ఆచారవ్యవహారాలు, పురాణేతిహాసాలు, ఇంకా ఎన్నో ప్రాచీన గ్రంధాలు ఇప్పటికీ అందుతూనే ఉన్నాయి. ఇక ముందూ కొనసాగుతాయి..
..............

కొందరు ఏమంటారంటే , మన దేశంలోని ప్రజల ఆలోచనాధోరణి వల్ల దేశం ఎంతో వెనకబడిపోయింది. ఇతరదేశాలు టెక్నికల్ గా ఎంతో అభివృద్ధిని సాధించాయి అంటారు.

ఆ దేశాలు మొదట అలా అభివృద్ధిని సాధించినట్లు కనిపించినా ఇప్పుడు చూడండి. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించిన దేశాలు అనుకున్న దేశాలు ఆర్ధికమాంద్యంతో ఇబ్బందులు పడుతున్నాయి.

మరి వారికి పారిశ్రామికాభివృద్ధి జరిగీ కూడా ఆర్ధికమాంద్యం ఎందుకువచ్చింది ?

...........
 
అభివృద్ధి చెందిన టెక్నాలజీతో గొప్పగా కట్టిన కట్టడాలను చూసినప్పుడు గొప్పగానే అనిపిస్తుంది.

అబ్బో ! మనుషులు ఎంత ఎదిగిపోయారు కొండల్ని కూడా పిండి చేయగలుగుతున్నారు అనిపిస్తుంది.

కానీ, అలా కట్టడానికి వెనుక ఎంత ఇనుము, ఎంత ఇసుక, ఎంత కంకర ఇలా ఎన్ని సహజవనరులు వాడారో కూడా తెలుసుకుంటే..కట్టడాలనే కాదు ఈ రోజుల్లో మనం వాడుతున్న వస్తువుల్లో చాలా మనకు అనవసరమైనవే.


ప్రాధమిక అవసరాలైన ఆహారం, వైద్యం, రక్షణ, విద్య, వసతి.........ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వటం మాని విలాసవంతమైన వస్తువుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నాము. అందువల్ల పేదరికం అలాగే ఉండిపోతూంది.

. మన పూర్వులు ఇలాగే విచ్చలవిడిగా సహజవనరులను వాడి ఉంటే , ఇప్పుడు మనకు ఇవేమీ ఉండేవి కాదు.

ఇలా అన్ని సహజవనరులను విపరీతంగా వాడేస్తే మనం మళ్ళీ ఇనుప గనులను, సృష్టించగలమా ? పిండి చేసిన కొండలను తిరిగి సృష్టించగలమా ?

కోరికలకు అంతెక్కడ ? మనిషి కోరికలను పెంచుకుంటూ పోతే భూమి లాంటి పది గ్రహాలలోని సహజవనరులైనా సరే సరిపోవు.

రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకొని అయినా మనం మన అలవాట్లను మార్చుకోవాలి.

************
 
ప్రకృతి ముందు మనిషి ఎంత ?

* దైవం అంటూ ఎవరూ లేరు..... మనిషే గొప్ప . అని ఎవరైనా భావించటం హనుమంతుని ముందు కుప్పిగంతులు వెయ్యటంలా హాస్యాస్పదం.

Wednesday, December 14, 2011

 

No comments:

Post a Comment