ఈ రోజుల్లో కొందరు నాస్తికులు ఏమంటున్నారంటే , సైన్స్ కు దైవానికి, ఆస్తికులకు .. ఏమీ సంబంధం లేదంటున్నారు.
సైన్స్ అంటే కేవలం నాస్తికులకు మాత్రమే సంబంధించిన విషయం అన్నట్లు మాట్లాడటం ఏమిటి ?
నాస్తికులు ఏమైనా ఈ సృష్టిని, అందులో సైన్స్ ను సృష్టించారా? ప్రకృతి అంతటా సైన్స్ ఉన్నది. సైన్స్ అనేది అందరికీ సంబంధించిన విషయం.
సృష్టికర్త దైవమే అసలైన శాస్త్రవేత్త. శాస్త్రవేత్తలలో దైవాన్ని నమ్మేవారూ ఉన్నారు.
ఆధునిక శాస్త్రాలలో ఉన్నదే విజ్ఞానం.. ప్రాచీనులు తెలియజేసిన విజ్ఞానం సైన్స్ కాదన్నట్లు కొందరు మాట్లాడుతున్నారు.
ప్రాచీన విజ్ఞానం అంతా ట్రాష్ ...ఆధునిక విజ్ఞానమే అసలైన విజ్ఞానం అనటం ...ప్రాచీన విజ్ఞానాన్ని, ఆ విజ్ఞానాన్ని కనుగొన్నవారిని అవమానించటమే.
************
సృష్టి ఎలా ప్రారంభమయ్యింది ? అనే ప్రశ్నకు , దైవం వల్ల ప్రారంభమయ్యింది. . అని ఆస్తికులు ఖచ్చితమైన సమాధానం చెప్పగలరు.
సృష్టి ఎలా ప్రారంభమయ్యింది ? అనే ప్రశ్నకు , సృష్టి దానికదే ప్రారంభమయిందని.. నాస్తికులు అంటారు.
కొందరు నాస్తికులు ఏమంటారంటే, దైవం ఎలా ఉద్భవించారని ప్రశ్నిస్తారు.
సృష్టి దానికదే ప్రారంభమవటం సంభవమని వారు నమ్ముతున్నప్పుడు..
మరి, దైవం తమకు తామే ఉద్భవించలేరా....
సృష్టి దానికదే ప్రారంభమయిందని చెప్పే నాస్తిక భౌతికవాదులు... దైవం ఎలా ఉద్భవించారని అడగటం విడ్డూరం.
**********
పదార్ధాల లక్షణాలను కనుగొని చెప్పే శాస్త్రవేత్తలే గౌరవనీయులైనప్పుడు, ఎన్నో పదార్ధాలను, మరెన్నింటినో సృష్టించిన దైవం మరెంతో గౌరవనీయులు.
*********
"Matter and energy cannot be created or destroyed " అనే సూత్రాన్ని .. గమనిస్తే శక్తి మరియు పదార్ధం..ఎప్పుడూ ఉంటుందని తెలుస్తుంది.
ఒక విత్తనంలో మహావృక్షం దాగున్నట్లు ప్రపంచం అంతటా సూక్ష్మరూపంలో దాగుండే అవకాశం ఉందనిపిస్తుంది.
ప్రళయసమయంలో సృష్టి అంతా సూక్ష్మరూపంలో ఒదిగిపోవటం , తిరిగి సృష్టి ఆరంభ సమయంలో విత్తనం నుండి మహావృక్షం పెరిగినట్లు ప్రపంచం వ్యాపిస్తున్నదని అనుకోవచ్చు.
ఇంతటి అద్భుతమైన విచక్షణతో కూడిన సృష్టి రచన జరగాలంటే అద్భుతమైన ఆలోచనాశక్తి తప్పక అవసరం. ఆలోచన కూడా ఒక శక్తే.
దైవం యొక్క ఆలోచన కారణంగా ఇంతటి వైవిద్యభరితమైన సృష్టి రచన జరుగుతుంది.
****
ఆధ్యాత్మికవాదులు, ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం.. పదార్ధాన్ని శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము అని , తెలుస్తోంది కదా!
ఇవన్నీ రూపాలను మార్చుకున్నా కూడా ఎప్పుడూ విశ్వంలో ఉంటాయని తెలుస్తోంది.
అంటే, ఆద్యంతములు లేని ఒక మహాశక్తి ఎప్పుడూ ఉంటుందని మనకు తెలుస్తోంది. ఈ శక్తి ఊహాతీతమైన అద్భుతమైన ఆలోచనా శక్తి కూడా ఉన్నశక్తి. ( ఆలోచన కూడా ఒక శక్తే.. )
సృష్టిలో ప్రాణశక్తి , ఆలోచనాశక్తి నిత్యమూ ఉంటాయి. అన్ని శక్తులూ కలబోసిన మహా శక్తినే ఆస్తికులు దైవం అని భావిస్తారు.
మనిషి యొక్క భౌతిక శరీరంగురించి ఆధునికులు కొంతవరకూ చెప్పగలుగుతున్నారు కానీ , ప్రాణశక్తి.. ఆలోచనాశక్తి.. మనస్సు బుద్ది వంటి విషయాల గురించి ఆధునికులకు తెలిసింది చాలా తక్కువ.
సృష్టిలో మనకు తెలిసిన విజ్ఞానం సముద్రంలో నీటిబొట్టంత అయితే, మనకు తెలియని విజ్ఞానం సముద్రమంత, ఇంకా ఎక్కువ కూడా.
******************
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
No comments:
Post a Comment