koodali

Monday, May 24, 2010

అనుకున్నది ఒకటి .......జరుగుతున్నది ఒకటి........

 

నేను ఒక విషయం చెప్పాలను కుంటున్నానండి. నేటి శాస్త్రవేత్తలను అగౌరవపరచాలని నా ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదండి. వారిలో కూడా దైవభక్తులు, ప్రజలకు మంచి చేయాలని తాపత్రయ పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు.


ఆ మద్య ఒక న్యూస్ లో కరెంట్ వల్ల కూడా మనుష్యులకు స్కిన్ కాన్సర్ వస్తుందని చెప్తున్నారు. ఇలా కరెంట్ వల్ల కాన్సర్, సెల్ ఫోన్ వల్ల బ్రైన్ కాన్సర్ ఇలా అంటే మాలాంటి సామాన్యులకు భయమే కదండీ. ఇవన్నీ కనిపెట్టటం ఎందుకు అని ఒక ఆలోచన కూడా వస్తుంది మరి..


అయినా కాన్సర్ కు కూడా ఎవరూ భయపడనంత స్టేజ్ కి ఈ వస్తువులు మనకి అలవాటు అయిపోయాయి లెండి.

నాకు తెలిసినంతలో ఇంకో ఉదాహరణ చెప్పాలనుకుంటున్నానండి.మొక్కలు బ్రతకడానికి నత్రజని , కాల్షియం ఇలాంటివి అవసరం. భూమిలో ఉండే నత్రజనిని మొక్కలు స్వయముగా పీల్చుకోలేవు. భూమిలో, వాతావరణములో ఉండే బాక్టీరియా, వైరస్, ఇలాంటివి రాలిన ఆకులు వేరే వ్యర్ధపదార్దములు వీటిని కుళ్ళపెడతాయి. వాటి ద్వారా మొక్కలు నత్రజని స్వీకరిస్తాయి. అలా మొక్కలు, బలంగా పెరుగుతాయి. బలంగా ఉన్న మొక్కలు గాని, మనుష్యులు గాని త్వరగా జబ్బు పడవు. ఒకవేళ ఆకులను తినే పురుగులు ఆశించినా ఆ పురుగులను తినటానికి చిన్న, చిన్న పక్షులు వస్తాయి. ఇలా ప్రక్రుతిలో ఒక సహజమయిన రక్షణ సర్కిల్ ఏర్పడి ఉంది. పాత కాలం ప్రజలు కూడా వేప, పసుపు ఇలాంటి సేంద్రియ ఎరువులు వాడేవారు.


ఇక ఇప్పుడు మనం రసాయనిక ఎరువులు వాడుతున్నాము. దానివల్ల ఏమవుతోంది....మొక్కలపైన చీడ పీడలతో పాటు, నత్రజని లాంటి పోషకాలను అందించే మంచి బాక్టీరియా కూడా చనిపోతోంది.ఈ మద్య పక్షులు కూడా పెద్దగా కనిపించటము లేదు. ఆశ్చర్యకరమయిన విషయమేమిటంటే మొక్కలకు హాని కలిగించే పురుగులు మాత్రం ఆ మందులకు తట్టుకుని విపరీతంగా పెరిగిపోవటం. ఇలా మనం ఒకటనుకుంటే ఇంకోటి జరుగుతోంది. మొక్కలకు సహజమయిన నత్రజని ఇచ్చే బాక్టీరియా చనిపోవటం వల్ల రసాయనిక నత్రజని, యూరియా వాడుతున్నాము.ఇలా మొక్కల ప్రక్రుతిలోని సహజమయిన సైకిల్ అంతా డిస్ట్రబ్ చేశాం గదా..



ఇక పాత కాలం నాటి మనుష్యులు ఎంత బలంగా ఉండేవారో, నేడు మనం ఎలా ఉన్నామో అలోచిచండి. అప్పుడు పెరట్లో గోంగూర తెచ్చి ఒక పచ్చడి, ఒక కూర తో భోజనం చేసినా అప్పటి వాళ్ళు ఈజీగా 5,10 కిలోమీటర్లు నడిచేవారు. ఇప్పుడు మనం రోజూ రకరకాల జ్యూసులు, కాలరీస్ లెక్కపెట్టుకుని ఎంత ఆహారం తిన్నా ఒక కిలోమీటర్ నడవటం కష్టంగా ఉంది.


ఆ ఆహారం కొంచెమయినా బలమయినది. ఇప్పుడు హైబ్రీడ్ పంటల వల్ల ఎన్ని టన్నులు పంట తిన్నా లావు అవ్వటం తప్ప ఓపిక రాని ఆహారం. మరి ఎక్కడ ప్రాబ్లం ఉందో అందరం ఆలోచించాలి.


మనం అంతులోని ఆశలతో మన భావితరా అంటే మన పిల్లలకు నిజంగా మంచి చేస్తున్నామా.....లేక ప్రక్రుతిని అంతా గందరగోళం చేసి అస్తవ్యస్తమయిన భావి జీవితాన్ని వాళ్ళ కిస్తున్నామా అన్నది నాలాంటి సామాన్యుల బాధ...శాస్త్రవేత్తలు ఈకోఫ్రెండ్లీ టెక్నాలజీ తయారు చేస్తే ఎంత బాగుంటుందో. వాళ్ళు ఆ ప్రయత్నాలలో ఉన్నట్లు న్యూస్ లో చెబ్తున్నారు లెండి.. . .

మీ ప్రయత్నాలు సఫలం కావాలని ఆ దైవాన్ని కోరుకుంటున్నాను అండి.


నేను ఒక ముఖ్యమయిన పని వల్ల ఒక వారం బ్లాగ్ రాయటం కుదురుతుందో లేదో తెలియటం లేదండి. ఇంతకు ముందు ఇలా నా అభిప్రాయములు చెప్పుకోవాలని ఎంతో అనుకోవటం జరిగేది. ఏదో ఇలా మీ అందరి దయవలన నా బాధలు మీ అందరితో చెప్పుకుంటున్నాను. దీనికి సహాయం చేస్తున్న ప్రతిఒక్కరికి నా క్రుతజ్ఞతలు.మా ఇంట్లో వారు కూడా విన్నా వారందరికి నా మీద జాలి దేశం లోని సమస్యలు అన్నీ నెత్తి మీదకు తెచ్చుకుని బాధ పడతానని.అయితే నేను కూడా అప్పుడప్పుడు ఆనందముగా ఉంటానండోయ్..మా బంధువులు ఏమటారంటేనండీ, నీకు దేవుడు అన్ని ఇచ్చినా సంతోషముగా ఉండటం చేతరాదని.

 నిజమే భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. కోట్ల కొద్ది రూపాయలు లేకపోయినా మాకు మరీ అత్యాశ లేదు కాబట్టి అన్నీ ఉన్నట్లే.ఇంతకు ముందు ఒక ఊర్లో అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం. వారిలో కొందరు ఏమని అనేవాళ్ళంటే ఇక్కడ ఉన్న అందరికంటే మీరు అద్రుష్టవంతులని.

 

 అయితే నేను ఎందుకు బాధగా ఉంటానని మీ సందేహము కాబోలు ....నాకున్న చిన్న బాధలను పెద్దవిగా ఆలోచించటం ,మళ్ళీ దేశం లోని సమస్యలను గురించి బాధపడటం అనే అలవాట్ల వల్ల మా బంధువులు నా మీద అలా జాలిపడుతుంటారండి. సంతోషంగా లేకపోవటం నా ఖర్మ అని . ఇంకా దేశం లోని సమస్యలు నువ్వు ఏమయిన తీర్చగలవా అనికూడా కోప్పడతారు.ప్రపంచములోని ప్రతి జీవి ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కొరుకుంటున్నాను.

 

Friday, May 21, 2010

అందరికి ఆహారం మన మొదటి కర్తవ్యమ్ .........

 

  అసలు ప్రజలకు ప్రాధమిక అవసరాలు ఇవే కదండి 1. ఆహారం, 2. ఇల్లు, 3. విద్య, 4. వైద్యం, 5.రక్షణ. ఇలా... వీటన్నింటికి చాలా ప్రణాలికలే ఉన్నాయి కానీ అండి వాటిని చిత్తశుద్ధిగా అమలుపరచ గలిగితే మన దేశం అభివ్రుద్ధిలో ఉండేది చాలా. 

 

 అసలు ఒక ఆశ్చర్యకరమయిన విషయమేమిటంటేనండి ... ఆహారం లేక మనుష్యులు చనిపోవటం. ఆ భగవంతుడు మనకు ఎంతో ఆహారాన్ని కల్పించాడు. 

 

ఒక చిన్న విత్తనాన్ని గాని, కొమ్మని గాని నాటితే చాలు అలా అలా ఎన్నెన్నో మొక్కలు, చెట్లు వచ్చే విధానాన్ని స్రుష్టించాడు.అయినా మనకు ఆహార కొరత ఉందంటే అది మనకు సరీయిన ప్రణాలిక లేకపోవటం వల్లే అని నా అభిప్రాయం.

 

  కొన్ని విషయాలు సామాన్యులకు అర్ధం కావు. ఇప్పుడు చూడండి....ప్రబుత్వ గోడవున్స్ లో చాలా ధాన్యం ఫుల్ గా ఉందని, పేపర్స్ లో చదువుతున్నాము. కొత్తగా వచ్చే ధాన్యానికి గోదాములు సరిపడ లేవు అని కూడా చెప్తున్నారు.ఫ్యూచర్ కోసం ఆ ధాన్యం నిలువ చేస్తున్నారంట. 

 

ఎప్పుడో సంగతి తరువాత ఇప్పుడు అందులో సగం ధాన్యాన్ని పేదలకు రేషన్ షాప్స్ ద్వారా ఇస్తే వారికి ఉపయోగపడతాయి గదండి. . 

 

  ఇప్పుడు మనకు రకరకాల కొత్త కార్లు, కొత్త రకాల నగలు, కొత్తా కొత్త రకాల వస్తువులతో పొంగిపొర్లుతున్న ఇళ్ళు, వాడి పారేసిన వస్తువులతో నిండిపోతున్న భూగోళం ఇవన్నీ మన అభివ్రుద్ధికి సూచికలు.

  భూమిని ఇలా ఉద్ధరించినాక మన కన్ను చంద్రుని మీద పడింది. 

 

 ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆహారమో అనే వారి సంఖ్య మాత్రం పెరిగి పోతూనే...... ఇక అడవులు ,చెట్లు కొట్టటం వల్ల వరదల ముప్పు పెరుగుతోందని మీడియాలో పాపం చాలామంది బాధ పడుతూనే ఉన్నారు. 

 

నేను కూడా నాబాధ ఇలా పైకి చెప్పుకుంటే కాస్త మనశ్శాంతిగా ఉంటుందని ఇలా రాశాను.ఇవి అన్నీ అందరికి తెలిసిన విషయాలే లెండి ..ఎవరికయినా బాధ కలిగితే క్షమించాలి.

 

Monday, May 17, 2010

ఈ నాటి పిల్లలకు ఎ విధమయిన ఎడ్యుకేషన్ అవసరము అంటే .......

ఈ రోజుల్లో చదువు అన్న పదానికి అర్ధమే మారిపోయిందని నా అభిప్రాయం అండి.అంటే సంపాదన కోసమే చదువు అన్నట్లు ఉంది కదా మరి.

భుక్తితో పాటూ దైవ భక్తి, ఉన్నతవిలువలతో కూడిన చదువు అవసరమని నా అభిప్రాయం.సమాజములో పేదరికం పెరిగిపోవటానికి ..... ,ఇన్ని నేరాలు, ఘోరాలు జరగటానికి ముఖ్యకారణం అధర్మం పెరిగిపోవటం .....అంతేకాని డబ్బు లేకపోవటం కారణం కాదని నా అభిప్రాయం.

ఉదాహరణకు ....చూడండి......నైతిక విలువలు , ధర్మం మీద గౌరవం ఉన్నవారు ప్రపంచములో సంపద అంతా తనకే కావాలని అత్యాశ పడరు.దానివల్ల సంపద అందరికీ సమానముగా అందుబాటులోకి వచ్చి పేదరికం ఉండదు.తిండి లేక చనిపోయేవాళ్ళు ఉండరు.


నైతిక విలువలు పాటించేవారు మగవారయినా , ఆడవారయినా ,ఎటువంటి బలహీన క్షణము ఎదురయినా సరే పరాయి స్ర్తీ,పురుషులను పూజ్యభావంతో మాత్రమే చూస్తారు.దీని వల్ల అందరి కుటుంబములు పచ్చగా ఉంటాయి.కుటుంబ వ్యవస్త విచ్చిన్నం అవటం జరగదు.హత్యలు,ఆత్మహత్యలు ఉండవు.




నైతిక విలువలు పాటించేవారు అసూయ,లోభం, దొంగతనం, పరాయి సొమ్ముకు ఆశపడటం జరగదు.ధర్మబద్ధముగా అభివ్రుద్ది చెందటానికి ప్రయత్నిస్తారు. కుదరకపోతే తమకు అంతే ప్రాప్తం అని సరిపెట్టుకుంటారు. దీనివల్ల వ్యక్తులు,కుటుంబాలు,దేశాలు మద్యన కక్షలు, యుద్ధవాతావరణం ఉండదు. బోలెడు డబ్బు నష్టం ఉండదు..




ధర్మం ఆచరించేవారు సమస్త జీవకోటి యందు దయను కలిగి ఉంటారు.పర్యావరణానికి విచ్చలవిడిగా హాని కలిగించరు.ఇందువలన జీవ పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. చెట్లు పచ్చగా ఉండి సకాలంలో వర్షాలు పడతాయి.అప్పుడు ఆహారం కొరత ఉండదు.



వీటివలన అర్ధమయ్యేది ఏమిటంటేనండి ప్రపంచములో ఆనాడు కానీ, ఈనాడు కానీ ఇన్ని యుద్ధాలు, ఇంత గందరగోళం ,ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయంటే కేవలం దైవభీతి, పాపభీతి ఇవి లేకపోవటం ధర్మం, నైతిక విలువలు పాటించని కొంతమంది ప్రజలవల్లనే.



అందువలన పిల్లలకు మంచి విలువలతో కూడిన చదువు నేడు ఎంతో ముఖ్యం. చాలా సమస్యలకు అది పరిష్కారమని నా అభిప్రాయమండి..ఇలాంటి అబిప్రాయములు ఈ రోజుల్లో ఎవరిక్కావాలన్నది వేరే విషయం.... . . . . ..

Thursday, May 13, 2010

 

ఏమిటో ఒకోసారి న్యూస్ చూస్తుంటె చాలా బాధగా ఉంటుంది. ప్రపంచములో అసలు ఏం జరుగుతుందో అర్ధం కావటం లేదండి.మనకు ఏమి కావాలో మనకు అర్ధం కావటం లేదనిపిస్తోంది. సైన్స్ ను కొంతమంది మిస్ యూస్ చేసినట్లే కొంతమంది స్వార్ధపరులు దేవుని పేరును,కూడా తమ స్వార్దానికి వాడుకుంటున్నారు.


మద్య నకిలీ స్వాములు వీరి గురించి వింటుంటే చాలా భాధగా ఉందండి.ఇలాంటి వారి వలన మంచి స్వాములను కూడా జనం అనుమానంగా చూడాల్సి వస్తోంది.ఇది బాధ కలిగించే విషయం. భగవంతునికి అందరు తన బిడ్డలే గదా అని జాలి ఎక్కువ . అందుకే చాలా తప్పులు చేసినా ఇంకా మారుతారేమోనని వెయిట్ చేస్తాడు ఆయన

 

 కొంతమంది దేవుని ఎగతాళిగా మాట్లాడుతారు. దేవుడు తన గుడిని, నగలను రక్షించుకోలేడా అని.... నగలు అవి మన ద్రుష్టిలో విలువయినవి...ఆయన బంగారు,వజ్రాల గనులే స్రుష్టించిన ఆయన. ఆయనకు ఇవి ఒక లెక్కలోనివికాదు. .


మనుషులు ఎందుకు ఇలా స్వార్దంగ ఉంటున్నారో అర్దం కావట్లేదు. వీళ్ళందరూ ఇలా చెయ్యకుండా మంచిగా ఉంటే ఎంత బాగుంటుంది!అసలు పూర్తిగా వాళ్ళను అనలేము లెండి. .రకరకాల కారణాలు వీటికి అందులో కొన్నికొంతమందికి అత్యాశ ఎక్కువ అయిపోయింది మరి. అంతులేని ఆశలతో భగవంతుని ఇబ్బంది పెట్టేస్తున్నారు



శ్రీ మహావిష్ణువు జీవుల కోసం వరాహ అవతారం, కూర్మావతారం ఇలా ఎన్నో అవతారములు ధరించారు. ఆయన శ్రీ రాముల వారుగా , శ్రీ మహాలక్ష్మీ దేవి అమ్మవారు సీతా అమ్మవారుగా ఎన్నో బాధలు అనుభవించారు.

 

ఈ మధ్య కొంతమంది ప్రజలలో అధిక సంపాదన, అధిక విలాసాలు పట్ల క్రేజ్ బాగా పెరిగిపోయింది. కొందరు నైతిక విలువలు పాటించకుండా దైవ పూజలు చెయ్యటం జరుగుతోంది. ధర్మం లేని పూజలు ఫలించవు. ఫలించినా తాత్కాలికమే.


సమాజం మంచిగా మారాలంటే ఎవర్నో అని ఏమి లాభమండీ. సమాజమంటే మనమే కదా. ముందు కొంతమంది ప్రజల మనస్తత్వం మారాలి.యధా ప్రజా తధా రాజా అనేది నేటి మాటేమో మరి. ఎవరయినా బాధపడితే దయచేసి క్షమించండి.


. ఇక కొంతమంది భయంకరమయిన దయ్యాలు,భూతాలు,ఇలాంటివాటితో రచనలు, సినిమాలు, చేసి దేశం మీద వదులుతున్నారు. అవి ఎంత భయంకరంగా చూపిస్తారంటే , ఎంత గొప్ప ధీరువు అయనా సరే టప్పీమని భీరువుగా మారిపోతారు. ...

 

అది అంతటితో ఆగదు కదా ....... చూసినవన్నీ పదేపదే కలల్లోకి వచ్చి ఏమి చెయ్యాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏనుగు లాంటి పర్స్నలిటీస్ కూడా దగ్గరదగ్గర పీనుగులాగ మారిపోతారు. ఇక ఇలాంటి వాళ్ళను నకిలీ స్వాములు మోసం చేయటం తేలిక కదండి.

 

 అసలే ప్రపంచములో అందరూ సవాలక్ష కష్టాల్లో ఉన్నారు. ఇలాంటప్పుడు ఇలా భయపెట్టడం న్యాయమా! పూర్వం కూడా ఇలాంటి సినిమాలు వచ్చిన ఇంత భయంకరముగా తీయలేదు కదా . సమాజం పైన ఇంత ఎఫ్ఫెక్ట్ ఉండదు ..ఇలా తియకపోతే బాగుండు మనం ఏమి చెయ్యగలం .పైన భగవంతుడు ఉన్నాడు.


అసలు మన పెద్దలు ఆడవాళ్ళకు గొప్పగొప్ప పూజలు చేయనవసరం లేకుండా .....దేవుని పూజ చేయటానికి కావలసినవి భర్తకు సమకూర్చటం , ఇలా కొన్ని సపర్యలు, సంసారం , వీటిని సరిగ్గా చూసుకుంటే చాలు .... బోలెడు పుణ్యం వస్తుందని చెప్పారు.  

 

నోములు లాంటివి చుట్టు ప్రక్కల ఆడవాళ్ళతో
సరదాగా కలిసి మెలిసి ఉండటం , అలాగే పూజతో పాటు పుణ్యం,పురుషార్ధం వస్తాయని ఆచారములు పెట్టారు... .


..నా అభిప్రాయము ఏమిటంటే మన కష్టములు మనస్సులో భగవంతునితో చెప్పుకోవటం అన్నిటికన్నా తేలికకదా! అసలు భగవద్గీతలో ఇలా కూడా చెప్పారు... మనస్సులో భక్తి లేకుండా ఎక్కువ పూజలు చేసేవారికన్నా నిజమయిన ప్రేమ గల భక్తుడంటేనే ఆయనకు ఇష్టమని....

 

.ఏమైనా సమాజములో మోసాలను కష్టపడి వెలుగు లోకి తెస్తున్న అందరికి నా థాంక్స్ అండి. భగవంతుడు అందరికి సత్ బుద్ధిని ప్రసాదించాలని కోరు కుంటున్నాను ..