koodali

Tuesday, July 31, 2018

కొన్ని విషయములు ...



 
  మరికొన్ని విషయములు....

ఎవరికైనా తల్లి అయినా తండ్రి అయినా సమానమే. ఇద్దరి ఆప్యాయతా పిల్లలకు అవసరం. నవమాసాలు మోసే పద్ధతి ప్రకృతిపరంగా తండ్రికి లేకున్నా, తండ్రులు కూడా పిల్లలను ప్రాణప్రదంగా చూసుకుంటారు.  

అమ్మ అంటే అంతులేని ప్రేమకు పర్యాయపదం అంటారు.. 
 
అయితే,  ఈ మధ్య కాలంలో కొందరు అమ్మలు.. తమ సొంత పిల్లల్ని అందులోనూ చంటిపిల్లల్ని హింసించటం, కొన్ని కేసుల్లో చంపటం కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రియునితో కలిసి పిల్లలను చంపిన తల్లి, తన మాట వినటంలేదని పిల్లల్ని చావగొట్టే తల్లులు....ఇలా వార్తలు ఉన్నాయి.


 కుటుంబంలో గొడవలు భరించలేక ఆత్మహత్య చేసుకుని మరణించే తల్లులు కూడా ఉన్నారు. ఇలాంటివారిలో చంటిపిల్లలు ఉండేవారూ ఉంటారు. చనిపోవాలనుకునే వారు తమ పిల్లల గురించి తప్పక ఆలోచించాలి. సమాజంలో బాధలు తట్టుకోలేక పెద్దవారికే చనిపోవాలని అనిపించినప్పుడు, పెద్దవారు ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు ఎలా బ్రతుకుతారో? పిల్లలు ఎన్ని బాధలు పడతారో? ఆలోచించాలి కదా..


ఎన్ని బాధలున్నా కూడా ధైర్యం తెచ్చుకుని జీవిస్తూ పిల్లల్ని పెంచుకోవాలి. అంతేకానీ, తమమానాన తాము పోతే పిల్లలు ఎలా బ్రతకాలి?

 పశుపక్ష్యాదులు మూగజీవులు. తమబాధల్ని ఎవరికీ చెప్పుకోలేవు. మనుషులకు కాలికి చిన్నదెబ్బ తగిలినా హాస్పిటల్ కు వెళ్లటం.. అందరూ పరామర్శించటం జరుగుతాయి. 


ఎవరైనా రోడ్దు పక్కన కుక్క కాలు విరగ్గొడితే అది కుంటుకుంటూ నడవటం తప్ప, దానిని హాస్పిటల్కు తీసుకెళ్లేవారు, పరామర్శించేవారు ఎందరుంటారు? వేసవిలో మనకు దాహం వేస్తే నీరు తెచ్చుకుని త్రాగుతాము. మరి మొక్కలు అలా నడిచి వెళ్లి నీటిని త్రాగలేవు కదా.. ఎవరైనా మనుషులు నీరు పోస్తే, వర్షం వస్తే వాటి దాహం తీరుతుంది.

 ఇన్ని కష్టాలు ఉన్నా కూడా పశుపక్ష్యాదులు జీవిస్తున్నాయి. మరి, మనుషులు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి?
..............

తల్లి తమ పిల్లలను చిన్నతనం నుంచి జాగ్రత్తగా పెంచుకుని చక్కటి పౌరులుగా తయారుచేస్తే సమాజం ఎంతో బాగుంటుంది.


అయితే, ఈ మధ్య కొందరు స్త్రీల ఆలోచనలో తేడా వచ్చింది. డబ్బు, విలాసజీవితం, కెరీర్.. అంటే వ్యామోహం ఎక్కువయ్యింది. పిల్లల్ని కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇలాంటి వారికి పుట్టడం ఆ పిల్లల దురదృష్టం. 


ఎవరికుటుంబాన్ని వారు చక్కదిద్దుకుంటే సమాజం అంతా బాగుంటుంది. అంతేకానీ, ఎవరి కుటుంబాన్ని వారు సరిగ్గా పట్టించుకునే సమయం లేనప్పుడు, సమాజాన్ని  ఎవరు మాత్రం ఏం బాగుచేస్తారు? 


  స్త్రీలు బయటకెళ్లి ఉద్యోగం చేయటం వల్ల అనేకసమస్యలు కూడా ఉన్నాయి. అమ్మాయిలు చాలామందికి చదువు, ఉద్యోగం తో సమయం సరిపోక..ఇంటిపనులు, కుటుంబాన్ని చూసుకోవటం, సర్దుబాట్లు, కుటుంబసభ్యులతో లౌక్యంగా ఉంటూ జీవించటం..వంటివి తెలియటం లేదు. మనదేశంలో కూడా విడాకులు, అనేక వివాహాలు..ఎక్కువవుతున్నాయి.


ఎవరికైనా గొడవలు రావటానికి అంతులేని కోరికలు, డబ్బు గురించి అత్యాశ, ఆర్ధిక అవసరాలు, పెద్దవారివిషయాలు, పెద్దవారి అభిప్రాయాలు, పిల్లల పెంపకం, బంధువుల విషయాలు, కుటుంబసభ్యుల రోజువారి అలవాట్లు, భార్యాభర్త అక్రమసమంబంధాలు....వంటివాటి విషయంలో భార్యాభర్తకు గొడవలు వస్తాయి. 


కాలేజీలో, ఆఫీసులోవారితో ఇలాంటి విషయాలు అంతగా ఉండవు కాబట్టి గొడవలు అంతగా ఉండవు. ఆఫీసుల్లో కెరీర్ సంబంధించిన గొడవలు ఉండవచ్చు కానీ, ఆఫీసుల్లో తోటి ఉద్యోగస్తులు  అప్పుడప్పుడూ మారుతుంటారు, ఇంకా వారిని భరించలేకపోతే ఆ ఉద్యోగాన్ని వదిలేయవచ్చు. 


ఎన్ని ఆఫీసులు మారినా ఎక్కడయినా అలాంటివారు ఉంటారు. అందువల్ల, ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా కొంత సర్దుబాటు ఎవరికైనా అవసరమే.


 కాలేజీలో,హాస్టల్స్లో, ఆఫీసుల్లో.. తోటివారితో ఉండే పరిస్థితి వేరు..కుటుంబంలో పరిస్థితి వేరేగా ఉంటుంది. బయటవారితో గొడవలు వస్తే, వారితో దూరంగా ఉండవచ్చు. కుటుంబం అంటే జీవితాంతం నిలుపుకోవలసింది కాబట్టి, ఎన్నో విషయాల్లో చాకచక్యంగా సర్దుకోవాలి. బయటవారితో ఎక్కువ విషయాలతో సంబంధం ఉండదు కాబట్టి, గొడవలు తక్కువగా ఉంటాయి. బయట చాలామంది పైపైన మంచిగా ఉంటారు. చాలామంది ఇంట్లో వాళ్ళు పైపైన మంచిగా నటించరు కాబట్టి గొడవలు వస్తాయి. 


 స్త్రీలకు బయటకొస్తే ఎన్నో సమస్యలుంటాయి. లైంగికవేధింపులు కూడా ఉంటాయి. కొంతకాలం క్రిందట అమ్మాయిలకు, స్త్రీలకు వేరే స్కూల్స్, కాలేజీలు ఉండేవి. ఇప్పుడు కూడా అలా ఉంటే  లైంగికవేధింపుల సమస్యలు తగ్గుతాయి. స్త్రీలు కొందరు కలిసి చిన్న పరిశ్రమలు, చేతివృత్తులు వంటి సంస్థలు ఏర్పాటు చేసుకుంటే, రాత్రి వరకు బయట ఉండకుండా సాయంకాలమే ఇంటికెళ్లిపోయేటట్లు పనివేళలు పెట్టుకోవచ్చు. 


అయితే కొందరు స్త్రీలు ఏమంటున్నారంటే, ఆడవాళ్లే ఇంటిపని, పిల్లల్నిపెంచటం.. చేయాలా? మేమూ బయటకెళ్లి ఉద్యోగాలు చేస్తున్నాము కాబట్టి, మగవాళ్లు కూడా అన్నీ చేయాలంటూ వాదిస్తారు. స్త్రీలే పిల్లల్ని ఎందుకు కనాలని కూడా అంటారేమో? అలా భార్యాభర్తలు గొడవలు పడి విడాకుల వరకూ వెళ్తున్నారు. మళ్లీమళ్లీ పెళ్లిళ్లు చేసుకుంటారు. మధ్యలో పిల్లల పరిస్థితి అయోమయం అయిపోతుంది.. 


పాతకాలంలో కుటుంబం కొరకు సంపాదించటం భర్త పని అయితే, ఇంట్లో ఉండి ఇల్లుచక్కదిద్దుకోవటం, పిల్లల్ని పెంచటం ఎక్కువగా భార్య పనులుగా ఉండేవి. ఈ విధానంలో స్త్రీలకు పగలు కొంత విశ్రాంతి,  పురుషులకు సాయంకాలం ఇంటికొచ్చాక విశ్రాంతి ఉండేది. ఇంటి ఆహారం వల్ల కుటుంబసభ్యులందరికీ ఆరోగ్యం బాగుండేది.  ఈరోజుల్లో ఇద్దరూ బయటకెళ్లి పనిచేయటం వల్ల ఎవరికీ విశ్రాంతి లభించటం లేదు. ఈ రోజుల్లో హడావిడిగా ఏదో ఇంత నోట్లోవేసుకుని పరిగెడుతున్నారు. 


 స్త్రీలు ఉద్యోగాలు చేయటం వచ్చాక.. మాటలు కూడారాని చంటిపిల్లల్ని క్రెచ్లో వదిలి పనికి వెళ్ళటం జరుగుతోంది.. అక్కడ పిల్లల్ని సరిగ్గా చూస్తారో.. లేదో? తెలియదు. చంటిపిల్లలకు కనీసం మాటలు వచ్చే వరకయినా వారిని దగ్గరుండి పెంచుకోవాలి. ఈ రోజుల్లో  స్త్రీలు, పురుషులు అందరూ సంపాదిస్తున్నా కూడా డబ్బు చాలటం లేదంటున్నారు. ఎవరికీ ఏమీ చెప్పేటట్లు లేదు. ఎవరి కర్మ వారిది.దైవమే దిక్కు.


Friday, July 27, 2018

గ్రహణసమయంలో వచ్చే ప్రభావం గురించి...









గురుపూర్ణిమ..




ఓం

 గురువులకు  వందనములు.




Wednesday, July 25, 2018

రామాయణము గురించి ...




ఆసక్తి ఉన్నవారు .. 

క్రింద విషయాలను  కాపీ,  పేస్ట్  మరియు క్లిక్  చేసి చూడగలరు.


The Secret of Ramayana - The Divine Life Society




The significance of Ramayana - Wisdom by Sri Sri Ravi Shankar


What is the philosphical significance of Ramayana? - Quora






Thursday, July 19, 2018

శ్రీ మద్రామాయణము..సుఖాంతము..


 ఓం..వందనములు. 

 సీతారాములకు వందనములు. 

 సువర్చలాదేవీఅంజనేయస్వామి వార్లకు వందనములు. 

.......................
  వాల్మీకిరామాయణంలో..  ఆంజనేయస్వామి లంకకు వెళ్లి సీతాదేవిని చూడటం, శ్రీ రాముడు రావణసంహారం చేసిన తరువాత సీతారాములు తిరిగి అయోధ్యకు రావటం .. శ్రీరామపట్టాభిషేకం..  కధ సుఖాంతం అయింది.

.....................
 
   గాయత్రీదేవి రామాయణం లో..   కొందరు అన్న మాటల వల్ల  సీతాదేవిని అడవులకు పంపే విషయం గురించి  శ్లోకాలు లేవు కానీ,

  వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి కవలలకు  జన్మనివ్వటం గురించి శ్లోకం 
ఉన్నదట..

........................

తులసీదాసు గారు రచించిన రామాయణంలో కుశలవులు జన్మించటం గురించి ఉంది కానీ,  సీతాదేవి  భూప్రవేశం  గురించి లేదట.

.................................

ఉత్తరకాండ  ప్రక్షిప్తం అని కొందరు భావిస్తున్నారు.
ఉత్తరకాండ ప్రక్షిప్తమో? కాదో ? కొన్ని భాగాలు ప్రక్షిప్తమో?..ఈ విషయాలు తెలియవు  కానీ..

ఈ విషయాలను గమనిస్తే.. బహుశా ఈ విధంగా కూడా జరిగిఉండవచ్చు కదా ...అనిపించింది.....
  ఇక్కడ రెండు అభిప్రాయాలను అనుకోవచ్చు..

 కొందరు అన్న మాటల వల్ల , శ్రీరాముడు సీతాదేవిని అడవులకు పంపడం కాకుండా, 

   గర్భిణి అయిన సీతాదేవి తనకు వనాలలో ఆశ్రమాలలో ఉన్న మహర్షుల దర్శనం చేసుకోవాలనే కోరిన కోరిక ప్రకారం సీతాదేవిని అడవులకు పంపి ఉండవచ్చు.

  వాల్మీకి మహర్షి   దశరధులవారి మిత్రులని తెలుస్తోంది. 

సీతాదేవి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆశ్రమంలోని స్త్రీలకోసం ఎన్నో బహుమతులను తీసుకెళ్ళటం జరిగిందట.

  స్త్రీలు మొదటి కాన్పుకు పుట్టింటికి వెళ్లినట్లు ,  సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలోనే ఉండి లవకుశులకు జన్మనిచ్చి ఉండవచ్చు.

 తరువాత,  సీతాదేవి కుశిలవులను  తీసుకుని శ్రీరాముని వద్దకు వచ్చి ఉండవచ్చని ..

 11వేల సంవత్సరాల రాజ్యపాలన తరువాత కుశలవులకు రాజ్యాలను ఏర్పరిచి సీతారాములు అవతారాలను చాలించారు...  అనేది ఒక సుఖాంతం.

.........................
 
 ఇక రెండో అభిప్రాయం ప్రకారం..ఇప్పుడు ఉత్తరకాండలో ఉన్నట్లు ..

 కొందరు వేసిన నిందల వల్ల సీతాదేవిని వనాలకు పంపటం   జరిగింది.  ..

 వాల్మీకి వారి ఆశ్రమంలో  కవలల  జననం తరువాత..

 కొంతకాలానికి వారిని వెంటబెట్టుకుని వాల్మీకి మహర్షి అయోధ్యకు రావటం..లవకుశుల రామాయణగానం..
తరువాత.. 

 వాల్మీకి మహర్షి   అంతటి మహిమాన్వితులు, గొప్ప తపస్సంపన్నులు .. సీతాదేవి  ఉత్తమురాలు, మహాపతివ్రత..   అని సభాసదులందరి ముందు ప్రకటించటం జరిగినప్పుడు..

ఆ  విషయాన్ని విన్న ప్రజలు , సీతాదేవి  రాముని వద్ద  ఉండాలని ప్రజలు వేడుకోవలసి ఉంటుంది.   

 రాములవారికి సీతాదేవి గురించి ఎప్పుడూ సమస్య లేదు. కొందరు ప్రజలతో  సమస్య.

  వాల్మీకి వారి మాటలతో ప్రజలకు సందేహం  తీరాలి.

 ఇక, సీతాదేవి భూప్రవేశం సంఘటన ఉండదు. సీతారాములు తమ ఇంట్లో ఉంటారు.

  11వేల రామరాజ్యపాలన తరువాత రాజ్యాలను పిల్లలకు అప్పగించి సీతారాములు అవతారాలను చాలించటం..  అనేది ఇంకో సుఖాంతం.

 ఇక్కడ కధ మధ్యలో  సీత భూప్రవేశం అనేది ప్రక్షిప్తం కావచ్చని నేను భావించాను.

.................................

వాల్మీకిరామాయణంలో..   ఆంజనేయస్వామి లంకకు వెళ్లి సీతాదేవిని చూడటం, శ్రీ రాముడు రావణసంహారం చేసిన తరువాత సీతారాములు తిరిగి అయోధ్యకు రావటం .. శ్రీరామపట్టాభిషేకం..  కధ సుఖాంతం అయింది.

.............................
 ఉత్తరకాండ నిజమని కొందరు, ప్రక్షిప్తమని కొందరు అంటున్నారు. 

 వ్యాసులవారు 24 వేలు శ్లోకాలు వ్రాసారు.

  అయితే, ఎవరైనా మూలగ్రంధంలోని  శ్లోకాలలోని కొన్ని విషయాలలో కొన్ని మార్పులుచేర్పులు చేసి ఉండవచ్చు కదా?

వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణం పట్టాభిషేకంతో ముగిసిందని.. ఉత్తరరామాయణం ప్రక్షిప్తం అని.. కాదని.. కొన్ని భాగాలు ప్రక్షిప్తాలు కావచ్చని ..లోకంలో రకరకాల  అభిప్రాయాలున్నాయి.

  వివిధరకాల అభిప్రాయాలు  ఉండటానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. 

  లోకంలోని స్త్రీలు, పురుషులను గమనిస్తే, రకరకాల మనస్తత్వాలు కలవారు ఉంటారు.  వివిధరకాల సంఘటనలు కూడా ఉంటాయి.

ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని..భవిష్యత్తులో ప్రజలు తమ జీవితాలలో జరిగే సంఘటనల యొక్క పరిస్థితిని బట్టి  నిర్ణయం తీసుకోవటానికి ..వివిధరకాల అభిప్రాయాలు  వచ్చి ఉండవచ్చు.
.......................
 
 నాకు తెలిసిన విషయాలు తక్కువ.

 అసలు విషయం దైవానికి తెలియాలి.

 అంతా దైవం దయ.
.........................
 
 వ్రాసిన విషయాలలో  ఏమైనా పొరపాట్లు ఉంటే, అవి నేను చేసినవి గాను, ఒప్పులను భగవంతుని దయగాను పాఠకులు గ్రహించవలెనని నా మనవి.

 వ్రాసిన  విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయ చేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 


న్యాయానికి తరతమ భేదాలు ఉండవు...


 శ్రీ రాముల వారు అందరినీ గౌరవిస్తారు.

శబరి ఆప్యాయంగా ఇచ్చిన పండ్లను స్వీకరించారు . గుహుని తక్కువగా చూడలేదు. ఎంతో ఆప్యాయంగా చూశారు. 

జటాయువు యొక్క అంత్యక్రియలను నిర్వహించారు. అలాంటి రాములవారిని అపార్ధం చేసుకోవటం పొరపాటు.

ఇక రాముడు శంభూకుని సంహరించటం అంటే...నాకు ఏమనిపిస్తోందంటే..

కొందరు మంచి కోరికలతో, ఉద్దేశ్యాలతో తపస్సులు చేస్తారు.

 కొందరు మనసులో స్వార్ధపరమైన కోరికలతో, ఉద్దేశ్యాలతో తపస్సులు చేస్తూ పైకి మంచిగా కనిపిస్తారు.

ప్రహ్లాదుని వంటివారు రాక్షస జాతికి చెందినా  దైవ భక్తులై దైవానుగ్రహాన్ని పొందారు. .

కానీ కొందరు రాక్షసులు స్వర్గాన్ని , దేవతలను జయించాలని తపస్సులు చేసారు.

 తపస్సులు చేస్తున్నంత మాత్రాన అందరూ మంచివారే ఉంటారా ?

లోకాలను పీడించే వరాలను పొందటం కోసం రాక్షసులు కూడా తపస్సులు చేస్తారు . అంత మాత్రాన రాక్షసులు కూడా మంచివారు అయిపోతారా ?

శంభూకుడు స్వర్గాన్ని, దేవతలను జయించాలని తపస్సు చేస్తున్నాడట. ఇంకా ఏ స్వార్ధపు  కోరికలతో తపస్సు చేసాడో?

మరి, దేవతలు ఊరుకోరు కదా! 

అత్యాశ చెడ్దకోరికలతో తపస్సు చేయటం వల్ల  రాముల వారు శంభూకుని   వధించి ఉంటారు.

( శంభూక వధ ప్రక్షిప్తం అంటున్నారు కొందరు. . శంభూక వధ గురించి, వర్ణవ్యవస్థ గురించి .. గత టపాలలో వ్రాయటం జరిగింది. చర్చలు కూడా జరిగాయి. తిరిగి అవన్నీ చర్చించాలని నాకు లేదు. దయచేసి ఎవరూ కామెంట్స్ వ్రాయవద్దని మనవి. )

 శూద్ర స్త్రీ అయిన శబరి అందించిన ఎంగిలిపండ్లను స్వీకరించిన రామునికి శూద్రులనే భేదభావం ఉండదు.

రాముడు శూద్రులను చంపే వ్యక్తే అయితే,  శబరి తపస్సు చేసినప్పుడు చంపలేదు కదా ! శబరి కూడా శూద్ర స్త్రీయే.

(తపస్సు అంటే  ఒంటికాలుమీద  నిలబడి తపస్సు చేయటం మాత్రమే కాదు, ఏ పనినైనా  ఏకాగ్రత గా చేస్తే అది తపస్సే ..

శబరి ఎన్నో ఏళ్లు రామునికై ఎదురుచూసింది అలా భక్తితో ఎదురుచూడటం కూడా తపస్సే. )
*********
సనాతనధర్మం అంటరానితనాన్ని ప్రోత్సహించలేదు. సమాజంలోని కొందరు స్వార్ధపరులవల్ల అంటరానితనం వచ్చి ఉంటుంది.  

మతంగ ముని తండ్రి  దళితులని చదివాను. అయినా కూడా మతంగమునికి గొప్ప మునిగా పేరొచ్చింది.
 
ఈ క్రింది విషయాలను  గమనించగలరు.

* There is no caste-system in Vedas
agniveer.com

* Sabari's selfless service | Amruthakathalu#5 | Story of Sabari in Ramayana | Telugu stories - YouTube



............

 రావణుడు కూడా గొప్పవంశస్తుడే. శివభక్తుడు కూడా. అయితే, స్త్రీల పట్ల ఎన్నో అకృత్యాలు కూడా చేసాడు.

శివాంశసంభూతుడైన ఆంజనేయస్వామి వారు , రామునికి సీతాదేవిని అప్పగించమని  రావణునితో చెప్పినా అతడు  వినలేదు.  శ్రీరాముని చేతిలో హతమయ్యాడు.

ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, 

వాళ్ళు ఏ వంశస్తులు అని కాకుండా, ఎంత గొప్పవారైనా సరే, చెడ్డ పనులు  చేస్తే శిక్షించబడతారు,  అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారు అని ... తెలుసుకోవాలి.

*******************
సీతారాముల వారసుల గురించి భారతంలో వివరాలు ఉన్నాయట. వారు  కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నారనితెలుస్తోంది.

 రాముని వారసులు కౌరవుల పక్షాన పాల్గొనటం గురించి  కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ రాముల వారసులు ( నాకు తెలిసినంతలో 28 తరాల తరువాత వారు..)కౌరవుల పక్షంలో నిలవటం వెనుక వారి కారణాలు వారికి ఉండవచ్చు.

గొప్పవారైన భీష్ముల వారు కూడా కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నారు కదా! భీష్ముల వారు  కౌరవుల పక్షాన ఉండటానికి  వారి  కారణాలు వారికి ఉన్నాయి.

 భీష్ముల వారు  ప్రజలను  కాపాడటానికి కట్టుబడి ఉండటం వల్ల… ...పాండవులంటే ఇష్టం ఉన్నా కూడా, కౌరవుల పక్షాన ఉండవలసివచ్చింది.

శ్రీ కృష్ణుని బంధువులు మునిపట్ల వేళాకోళంగా ప్రవర్తించటం..  శాపం కారణంగా నశించారు. అప్పుడు శ్రీకృష్ణులవారు బంధువులను ఆదుకోలేదు.

  బంధువులయినంత మాత్రాన, వారు తప్పులు చేసినా సహించటం ఉండదు.

********
 శ్రీ రాముని వంశస్థులలో హరిశ్చంద్రుని తండ్రి అయిన  త్రిశంకువు  కూడా కొన్ని పొరపాట్లు చేయటం వల్ల కొంతకాలం శిక్షను అనుభవించారు.

ఇంద్రుడంతటి వారే కొన్ని పొరపాట్లు చేసి అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవించటం ... అనే విషయం కూడా  గ్రంధాలద్వారా తెలుస్తుంది.

ఎంత గొప్ప వారైనా సరే  ,  పొరపాట్లు చేస్తే అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారని గ్రంధాల ద్వారా తెలుస్తుంది.


అహల్యాదేవికధ ..మరియు ..కొన్ని విషయాలు.. ..


అహల్య, గౌతమమహర్షి  కధలో..ఇంద్రుడు గౌతముని రూపాన్ని ధరించి  రావటం..తరువాత జరిగిన సంఘటనల ద్వారా గౌతముడు  అహల్యకు,  ఇంద్రునికి శాపం ఇవ్వటం జరిగింది.

అహల్యాదేవి  తాను చేయని తప్పుకు కొంతకాలం శాపాన్ని అనుభవించి,  తిరిగి గౌతముని వద్దకు చేరుకుంది.

అహల్యాదేవి  శ్రీరాముని పాదధూళి తాకి  తిరిగి పూర్వస్థితికి రావడం అనే విషయం తెలిసిందే.

 ఈ కధ గురించిన వివరాలు శ్రీపాదశ్రీవల్లభసంపూర్ణచరితామృతము గ్రంధంలో ఉన్నాయి.

****************
పురాణేతిహాసాల ద్వారా  ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాలు తెలుస్తాయి.
***********

సమాజంలో పేరున్నవాళ్ళు (సెలెబ్రిటీలు ) ఏం చేస్తే అలా చేయాలని చాలామంది ప్రజలు తహతహలాడుతారు.

అందుకే ఆధునిక కాలంలో .. సబ్బులు, దుస్తులు ..వంటి ఉత్పత్తుల అమ్మకాల పెరుగుదల కోసం కంపెనీలు సెలెబ్రిటీలను వాడుకుంటారు.

సెలెబ్రిటీల జీవితాల్లో సంఘటనల గురించి కూడా ప్రజలు ఆసక్తిగా గమనిస్తారు. 

వాళ్లు ఎలా ప్రవర్తించారు? అని ఆసక్తిగా గమనిస్తారు.

**************
రామాయణంలో కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి..  అని కొందరంటున్నారు. అందువల్ల , నిజంగా సీతాదేవిని అడవులకు పంపేయటం జరిగిందా ? లేదా? అనేది  తెలియదు.

నిజంగా అలా జరిగి ఉంటే, రాముడు రాజు కాబట్టి, ప్రజల భయాలు, అనుమానాల వల్ల..  వేరేదారి లేక  , సీతారాములు అలా చేయటం జరిగి ఉంటుంది.

అయితే, ప్రజలు ఏదో అన్నారు కదా.. అని, శ్రీ రాముడు సీతాదేవితో..నువ్వు అడవులకు వెళ్ళిపో..ఇకమీదట  నీకూ నాకూ ఏం సంబంధం లేదు .. అనలేదు.

రాములవారు రాజ్యపాలన చేస్తూ కూడా తాను  కూడా ఋషి వలె జీవించారు.

స్వర్ణసీతను చేయించటం, పుత్రులైన కుశలవులను రాజ్యానికి  వారసులుగా చేయటం .. వంటి  చర్యల  ద్వారా సీతాదేవే తన భార్యని లోకానికి తెలియజేసారు.


**********
సీతారాములు.. గౌతముడుఅహల్య.. వీరి రెండు విషయాలను  పోల్చటం లేదు. రెండూ  పూర్తిగా వేరువేరు విషయాలు.

 అయితే, ఎవరైనా స్త్రీ తన ప్రమేయం లేకుండా పరపురుషుని  వల్ల నిందలు మోయవలసి వస్తే ఆమె తన భర్తను విడిచి వెళ్లవలసిందేనా?  అనే సందేహాలు కలుగుతాయి.

పురాణేతిహాసాలు స్త్రీలకు అన్యాయం చేయాలని చెప్పలేదు. 

 అహల్యాదేవి వృత్తాంతం ద్వారా...  భార్యాభర్త  తిరిగి కలుసుకోవటం..అనే విషయం గురించి తెలుసుకోవచ్చు.

అయితే, అందరూ అలాగే చేయాలనే రూల్ ఏమీ ఉండదు. ఎవరి పరిస్థితి వారిది. 

వారి సమస్య, స్థితి, పరిస్థితిని ..బట్టి పరిష్కారాలను ఎంచుకోవలసి ఉంటుంది.

 అంతేకానీ యధాతధంగా సెలిబ్రిటీలను అనుసరించనక్కరలేదు.

ఒకవేళ, ఎవరి అన్నిపరిస్థితులు.. యధాతధంగా  సెలెబ్రిటీకి కలిగిన  అన్ని పరిస్థితులులానే  ఉంటే , అప్పుడు వారు యధాతధంగా వారిలా చేయవచ్చు. 

పరిష్కారం లభించనప్పుడు  సరైన దారి చూపించమని  దైవాన్ని వేడుకోవాలి.  

******************
పరాయివాళ్ళతో తిరుగుతూ జీవితభాగస్వామిని మోసగించే వాళ్ళకు శిక్షపడటంలో తప్పులేదు.

   అయితే కొందరు మంచి  నడవడిక కలవారు,  ఇతరుల వల్ల కిడ్నాప్ కాబడి తరువాత రక్షించబడి, వారు చేయని తప్పుకు బాధలు పడుతున్నప్పుడు బాధగా ఉంటుంది.

 ఇలాంటప్పుడు కొన్ని సందేహాలొస్తాయి.

ఇతరులు చేసిన అన్యాయం వల్ల తప్పుచేయని వారి పరిస్థితి ఏమిటి ? అనిపిస్తుంది.

 పురాణేతిహాసాల  కధల ద్వారా... ఎన్నో సందేహాలకు సమాధానాలు లభిస్తాయి.

***************
తల్లితండ్రి పిల్లలకు కొన్ని విషయాలను చెప్పడానికి మొహమాటపడతారు.

ఉదా..కుంతీదేవి వివాహానికి ముందే సంతానాన్ని పొంది ఆ విషయాన్ని అందరితో చెప్పలేక , శిశువును వదిలేసి జీవితాంతం కుమిలిపోయింది.


కుంతీదేవి కధ ద్వారా ... వివాహానికి ముందే తెలిసీతెలియని తనం వల్ల వివాహానికి ముందే సంతానాన్ని పొందితే జీవితాంతం బాధతో కుమిలిపోయే పరిస్థితి ఉండవచ్చని తెలుస్తుంది.

శకుంతల కధ ద్వారా....  తల్లితండ్రికి తెలియకుండా వివాహం చేసుకుంటే వచ్చే కష్టాల గురించి తెలుస్తుంది.

పురాణేతిహాసాల  కధల ద్వారా  విషయాలను తెలుసుకుని,  జీవితంలో ముందుగానే  జాగ్రత్తగా ప్రవర్తించాలి. 

ఒకవేళ  ఏమైనా  సమస్యలు వస్తే,  ఎవరి సమస్య,  స్థితి, పరిస్థితి, శక్తి ని ..బట్టి పరిష్కరించుకోవాల్సి  ఉంటుంది. 

పరిష్కారం  తోచనప్పుడు  సరైన దారి చూపించమని  దైవాన్ని వేడుకోవాలి. 



సీతారాములు ఏం చేసిఉంటే అందరు ప్రజలు మెచ్చుకునేవారు? రామాయణం..కొన్ని విషయాలు..


  రామాయణంలో సీతాదేవి అగ్ని పరీక్ష, అడవులకు పంపటం..విషయాలలో ఎందరో ఎన్నో అభిప్రాయాలను చెబుతుంటారు.

సీతాపహరణం విషయంలో..

సీతాపహరణం తరువాత రాములవారు ఎన్నో కష్టాలు పడి సీతాదేవిని రక్షించుకున్నారు.

(ఈ ఆధునిక కాలంలో అయినా ఎందరు మగవాళ్లు తమ భార్య కోసం అంత రిస్క్ తీసుకుంటారు?  కొందరు మగవాళ్లు తిరిగి ఇంకొక వివాహం చేసేసుకుంటారు.)

 లోకం పోకడ తెలిసిన రాముల వారు అగ్నిపరీక్ష ద్వారా ప్రజల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నించారు.

 అగ్నిపరీక్ష జరిగినా కూడా కొందరు ప్రజలు నిందలు వేసారు. ఇక, అగ్నిపరీక్ష జరగకుంటే ఇంకెన్ని చిత్రమైన మాటలు అనేవారో?

 రావణ సంహారం తరువాత  సీతారాములు అయోధ్యకు వచ్చి సంసారం చేస్తుంటే,  కొందరు ప్రజలు అన్న మాటల వల్ల సీతాదేవిని వనాలకు పంపవలసి వచ్చింది.

సీతాదేవిని అడవులకు పంపిన తరువాత ప్రజలు  సీతాదేవిని తిరిగి తీసుకురమ్మని శ్రీరాముని అడగాలి. ప్రజలు అలా అడిగారా ?

ప్రజల భయాలు, అనుమానాల వల్ల సీతారాములు అలా చేయటం జరిగి ఉంటుంది.

కొందరు ప్రజలు ఏమన్నారంటే, పరాయి పురుషుని వద్ద ఉండి వచ్చిన భార్యను ఏలుకోవటం వల్ల, రాజు  ఎలా  చేస్తే ప్రజలు కూడా అలా చేయాలేమో ?

భవిష్యత్తులో తమ భార్యలు కూడా పరాయి పురుషుల వద్ద ఉండి వస్తే తామూ తమ భార్యలను ఏలుకోవలసిందేనా?  అన్నారట.

(మరిరాముడు జీవితంలో ఎన్నో ధర్మాలు పాటించారు ఏకపత్నీవ్రతుడు గా కూడా ఉన్నారు మరిప్రజలందరూ అంత ధర్మంగా ఉంటారా?)

ఈ ప్రజల వ్యవహారాన్ని గమనిస్తే,  వారికి సీతాదేవి గురించి సందేహాలకన్నా, భవిష్యత్తులో తమ భార్యల విషయంలో ఏమైనా సమస్య వస్తే తాము ఏం చేయాలో? అనే బాధ ఎక్కువగా  కనిపిస్తుంది.

(సీతాదేవి మహాపతివ్రత. అయితే, స్త్రీలలో అనేకరకాల మనస్తత్వాల వాళ్ళుంటారు. వివాహేతరసంబంధాలు ఉంటే తప్పేంటి ? అని ప్రశ్నించే వాళ్ళను కూడా ఈ రోజుల్లో చూస్తున్నాంకదా ! )

అయితే, ప్రజలు ఏదో అన్నారు కదా.. అని శ్రీ రాముడు సీతాదేవితో ..ఇకమీదట  నీకూ నాకూ ఏం సంబంధం లేదు ..నువ్వు అడవులకు వెళ్ళిపో.. అనలేదు.

  సీతాదేవి  అడవులకు వెళ్ళి ఆశ్రమంలో ఉంటే రాముడు రాజ్యాన్ని పాలిస్తూ కూడా తిరిగి వివాహం చేసుకోకుండా  దర్భలపై శయనించటం వంటి నియమాలతో రుషుల వలె జీవించారు.

అశ్వమేధయాగ సందర్భంగా తిరిగి వివాహం చేసుకొమ్మని కొందరు సలహానిచ్చినా కూడా ,
రాములవారు యాగనిర్వహణలో స్వర్ణసీతను ప్రక్కన ఉంచుకుని యాగ నిర్వహణచేయటం ద్వారా సీతాదేవే తన భార్య .. అని లోకానికి తెలియజేసారు. 

తమ పుత్రులైన కుశ లవులకు  రాజ్యాలను అప్పగించారు.

సీతాదేవిని అడవులకు పంపటంలో కూడా ఆమె ఖర్మకు  ఆమెను వదిలేయటం కాకుండా,  దశరధుల వారికి మిత్రులైన వాల్మీకి మహర్షి ఆశ్రమ సమీపంలో దిగవిడిచి వచ్చారట.

సీతాదేవి వనాలకు వెళ్ళేటప్పుడు అక్కడి స్త్రీల కోసం సీతాదేవి ఎన్నో బహుమతులను తీసుకెళ్ళటం జరిగిందట.

( గర్భిణి అయిన సీతాదేవిని ఏదైనా కోరుకోమంటే తనకు ఆశ్రమాలలో ఉండే ఋషులను దర్శించాలని ఉందని అన్నదట.)

 సీతారాములే ఇబ్బందులు అనుభవించారు గానీ, వారు ప్రజలను ఇబ్బంది పెట్టలేదు.


తన భార్యను తాను ఏలుకోలేని పరిస్థితి  శ్రీ రామునిది .. తన ఇంటికి   తాను వెళ్ళలేని పరిస్థితి  సీతాదేవిది.

ఎన్నో విషయాలు, ఎందరో చేసిన చర్యల వల్ల సీతారాములు ఇద్దరూ బాధను అనుభవించారు.

రాముడు సీతను ఏలుకోవటం తప్పని అంటారు కొందరు..

రాముడు సీతను అడవులలోని  ఆశ్రమానికి పంపటం తప్పంటారు కొందరు.

సీతారాములు ఏం చేసినా తప్పేనా? సీతారాములు ఏం చేసిఉంటే అందరు ప్రజలు మెచ్చుకునేవారు?

Saturday, July 14, 2018

ఓం...



 శ్రీ జగన్నాధ రధయాత్ర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి.


Friday, July 13, 2018

థాయ్ లాండ్ లో జరిగిన అద్భుతం..



థాయ్ లాండ్ గుహలో చిక్కుకున్నవారు సురక్షితంగా రావటం ఎంతో అద్భుతమైన విషయం.  


చీకట్లో, ఆహారం లభించని స్థితిలో, 

ఎవరైనా రక్షిస్తారనే ఆశ అంతగా లేని పరిస్థితిలో,  ఆ పిల్లలు అంత ధైర్యంగా ఉండటం ఎంతో గొప్ప విషయం.

వాళ్ల కోచ్ ధ్యానం నేర్పించటం వల్ల ,  పిల్లలు ధ్యానం తో శక్తిని  పొందారని అంటున్నారు. 

సహాయకబృందంలో ఒక వ్యక్తి మరణించటం బాధాకరం.

 ఆ సంఘటన తరువాత,  గుహలో  ఎక్కువ ఆక్సిజన్ సిలిండర్లు అమర్చారట. 


పిల్లలను రక్షించడానికి వెళ్లిన సహాయక బృందంలోని ఒక వ్యక్తి ఆక్సిజన్ అందక మృతి చెందినప్పుడు... 

అలాంటి పరిస్థితిని  ఆ పిల్లలు ఎలా తట్టుకున్నారో ఆశ్చర్యంగా ఉంది. 

మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చేసిన ప్రార్ధనలు ఫలించాయి.

 ప్రపంచంలో ఎన్నో దేశాలనుంచి వచ్చి సహాయాన్ని అందించినవారు గొప్పవారు. 

వాన పెరగకపోవటం కూడా  కలిసివచ్చింది. 

టెక్నాలజీ చాలా సహాయపడింది. 

మొత్తానికి ఒక అద్భుతం జరిగింది.