koodali

Monday, July 30, 2012

లోక రక్షణ కోసం.....


* శ్రీ  సాయిబాబా  జీవిత  చరిత్రము  గ్రంధము  లోని  కొన్ని  విషయములు.  (  షిరిడి  సాయి  ).

   ఖాపర్డే  కుర్రవాని  ప్లేగు  జాడ్యము

* బాబా  విచిత్ర  లీలలలో  నింకొకదానిని  వర్ణించెదను.  అమరావతి  నివాసియగు  దాదాసాహెబు ఖాపర్డే  భార్య  తన  చిన్న  కొడుకుతో  శిరిడిలో  మకాం  చేసెను.  కొడుకుకు  జ్వరము  వచ్చెను.  అది  ప్లేగు  జ్వరము  క్రింద  మారెను.  తల్లి  మిక్కిలి  భయపడెను. 

 

 శిరిడి  విడచి  అమరావతి  పోవలెననుకొని  సాయంకాలము  బాబా  బుట్టీవాడా  వద్దకు  వచ్చుచున్నప్పుడు  వారి  సెలవు  నడుగబోయెను.  వణుకుచున్న  గొంతుతో  తన  చిన్న  కొడుకు  ప్లేగుతో  పడియున్నాడని  బాబాకు  చెప్పెను. 

 

 బాబా  యామెతో  కారుణ్యముతో ,  నెమ్మదిగా  మాట్లాడదొడగెను.  ప్రస్తుతము  ఆకాశము  మేఘములచే   కప్పబడియున్నది  గాని  యవి  చెదరిపోయి  కొద్దిసేపట్లో  నాకాశమంతయు  మామూలు  రీతిగా   నగునని    బాబా  యోదార్చెను.  

 

అట్లనుచు తన  కఫనీని  పై కెత్తి  చంకలో  కోడిగ్రుడ్లంత  పెద్దవి  నాలుగు  ప్లేగు  పొక్కులను  అచటివారికి  చూపెను.  "  చూచితిరా  !  నా  భక్తుల  కొరకు  నే  నెట్లు  బాధపడెదనో  !  వారి  కష్టములన్నియు  నావిగనే   భావించెదను.  " 


 ఈ మహాద్భుతలీలను  జూచి  యోగీశ్వరులు  భక్తులకొర  కెట్లు   బాధ  లనుభవింతురో  జనులకు  విశ్వాసము  కుదిరెను. 


 యోగీశ్వరుల  మనస్సు  మైనము కన్న  మెత్తనిది,  వెన్నెలవలె  మృదువైనది.  వారు  భక్తులను  ప్రత్యుపకారము  కోరకయే   ప్రేమించెదరు.  భక్తులను   తమ  బంధువులవలె   జూచెదరు.

 
................ఇంకా,

* లోక  రక్షణ  కోసం    పరమశివుడు   హాలాహలమును  స్వీకరించారు.  అందుకు  పార్వతీదేవి  కూడా  అభ్యంతరం  చెప్పలేదు. 

 

* విష్ణుమూర్తి  కూడా  లోక  రక్షణ    కోసం  ఎన్నో  అవతారములను  ధరించి ,  రాక్షసులను  సంహరించారు..... అందుకోసం  వారు    జంతుజన్మలను  కూడా  ధరించవలసి  వచ్చింది.



* లోకరక్షణ  కోసం  వారు  అందరూ  అలా  చేసారు.

 
* తమ   పిల్లలు  కష్టాలు  పడకూడదని  ,  వారి  బదులు  తాము   కష్టాలను    అనుభవించటానికి  సిద్ధపడే  పెద్దవాళ్ళు  ఉంటారు కదా !

 

* అందుకే ,  వ్యక్తులు  తమ   సత్ప్రవర్తనతో  భగవంతుని  ,  గురువులను,  పెద్దలను   మెప్పించాలి.

..................................

 ఈ  బ్లాగ్ ను ఆదరించి  ,  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.
 

Friday, July 27, 2012

ఓం.....అత్యంత శక్తివంతమైన సిద్ధమంగళ స్తోత్రము .


ఓం.


శ్రీ  వరలక్ష్మీ  వ్రతం  సందర్భంగా శ్రీ  మహాలక్ష్మీదేవి శ్రీ  విష్ణుదేవులకు  నమస్కారములు.

శ్రీ  అనఘాదేవీ శ్రీ  దత్తాత్రేయస్వామి  వార్లకు  నమస్కారములు.

శ్రీపాదశ్రీవల్లభ  స్వామి  వారికి  నమస్కారములు.

    దిగంబర  !  దిగంబర !!  శ్రీ  పాదవల్లభ  దిగంబర !!!
               శ్రీ  పాదరాజం  శరణం  ప్రపద్యే .

     శ్రీపాద శ్రీ వల్లభస్వామివారి  దివ్య  సిద్ధమంగళ  స్తోత్రము  ఎంతో  శక్తివంతమైనది.  శ్రీపాద  శ్రీవల్లభ స్వామి  వారి  గురించిన  ఎన్నో  వివరములు   మరియు  ఎంతో  శక్తివంతమైన  సిద్ధమంగళ  స్తోత్రము .....


 ఈ  లింకులో  ఉన్నాయి....1.Sripada Charitamrutam - Sripada Sri Vallabha - 1 - Webs

Siddhamangala Stotram - Sripada Sri Vallabha - 1 - Webs


  ఇంకా  ,

                      2. Sripada Sri Vallabha Siddha Mangala Stotram.wmv - YouTube.

Sripada Sri Vallabha Siddha Mangala Stotram.wmv - YouTube



                      3.Dattatreya - Siddha Mangala Stotram.mp4 - YouTube .

Dattatreya - Siddha Mangala Stotram.mp4 - YouTube



ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  కృతజ్ఞతలండి.


Wednesday, July 25, 2012

కరెంట్ లేని సమయంలో ఫ్యాన్స్ శుభ్రం చెయ్యాలంటే , ముందు స్విచ్ తీసి .....


ఈ  రోజు  మధ్యాహ్నం  నేను  ఫ్యాన్లు  శుభ్రం  చెయ్యాలని  అనుకున్నాను.   అప్పుడు  కరెంట్  లేదు. 

 నిచ్చెన  వేసుకుని  పని  మొదలు  పెట్టబోతుండగా ,  ఫ్యాన్  స్విచ్  తీసి   ఉందేమో  చూడాలని  సడన్  గా   గుర్తు  వచ్చింది .  

చూస్తే  ఫ్యాన్  స్విచ్  వేసే  ఉంది.  అప్పుడు    స్విచ్  తీసి  ఫాన్  శుభ్రం  చేసాను. 

 ఒకవేళ  ఫ్యాన్  శుభ్రం  చేస్తుండగా  చటుక్కున  కరెంట్  వస్తే  ప్రమాదం  కదా  !

  మాది  చెక్కనిచ్చెన  కూడా  కాదు.  అల్యూమినియం  నిచ్చెన.

  కరెంట్  షాక్  సంగతి  ఎలా  ఉన్నా,   సడన్ గా  కరెంట్  వస్తే  ఆ  కంగారులో  క్రిందపడే  అవకాశం  కూడా  ఉంది.

స్విచ్  తియ్యాలని  సమయానికి  గుర్తు  రావటం  దైవం  యొక్క  దయయే.  

*  ఇలాంటి  సంఘటనలు  జరిగినప్పుడు    ఏమనిపిస్తుందంటే,  మన  చేతుల్లో  ఏమీ  లేదు.     అంతా  దైవం  దయ....అనిపిస్తుంది..

  నా  అనుభవం   మీకు  కూడా  చెప్పాలనిపించి  ఈ  టపా  రాసాను. 

 ఈ  రోజుల్లో  కరెంట్  తరచూ  పోతోంది.

 కరెంట్  ఎప్పుడు  పోతుందో  ?  ఎప్పుడు  చటుక్కున  తిరిగి  వస్తుందో  ?  ఒక్కోసారి  చెప్పలేం.  

అందుకని    ఇల్లు  బూజు   దులిపేటప్పుడు,  ఫ్యాన్స్  శుభ్రం  చేసేటప్పుడు   జాగ్రత్తగా  ఉండాలి.  

శుభ్రం  చేసే ముందు  లైట్స్,  ఫ్యాన్స్  స్విచ్ లు  తీసి  శుభ్రం  చేయాలి. 

పనికి సహాయంగా   పెట్టుకున్న  వాళ్ళు  శుభ్రం  చేస్తే ,  ముందు  జాగ్రత్తగా  స్విచ్  తియ్యమని  వాళ్ళకు  కూడా  చెప్పాలి.


Monday, July 23, 2012

కొబ్బరి చిప్పలకు పెట్టే కుంకుమ బొట్లు ....


* పూజలలో   కొబ్బరి  కాయ   కొట్టిన  తరువాత  రెండు  చిప్పలకు   కుంకుమ బొట్లను    పెట్టి    ఆ  కొబ్బరి  చిప్పలను  దేవునికి  నైవేద్యంగా  సమర్పిస్తారు  చాలామంది..   

 కొందరయితే   చాలా  ఎక్కువ  కుంకుమను  చిప్పలకు  పెడతారు. 

 ఈ  మధ్య ,  మాకు  తెలిసిన  వాళ్ళు ,  మాకు  కొబ్బరి  చిప్పను  ప్రసాదంగా  ఇచ్చారు.  దానికి   మూడు  చోట్ల  దట్టంగా  కుంకుమ  బొట్లు  పెట్టారు. 


 కొబ్బరి  చిప్పను   అలాగే   పచ్చడి  చెయ్యటానికి  లేదా     వంటలో  ఉపయోగిస్తే  ఆ  కుంకుమ  కూడా   ఆహారపదార్ధాల లో  పడుతుంది  కదా  ! 


 చిప్పను   కడిగి  ఉపయోగించినా  కుంకుమ  యొక్క  ఎర్ర  రంగు  అలాగే   ఉంటోంది.   


 పూర్వం  అయితే  కుంకుమను  ప్రకృతి సహజమైన  రంగులతో  తయారు  చేసేవారట.  


ఈ  రోజుల్లో  కొందరు  కుంకుమలో  రసాయనిక  రంగు  కూడా  కలుపుతున్నారట  .   


  కొబ్బరితో  పాటు  ఆ  రసాయనాల  రంగులు   కూడా   వంటలో   వేస్తే     ఆరోగ్యానికి  హానిని  కలిగిస్తాయి.  


  * అందువల్ల , కుంకుమ  బొట్లను    కొబ్బరి  చిప్పకు  లోపల  తెల్లని  భాగం  మీద   కాకుండా ,   కొబ్బరి  చిప్పకు  బయట    పెడితే  , వంటలలో  కొబ్బరిని  వాడేటప్పుడు  ఆ  కుంకుమ  ఆహారపదార్ధాలలో    కలవదు  కదా  !  అనిపించింది. 


  ఇది  చిన్న  విషయంగా  అనిపిస్తుంది  గానీ,  రసాయనాలు  కొద్దికొద్దిగా  శరీరంలో  ప్రవేశించినా  ఆరోగ్యానికి  ప్రమాదమే  కదా  !
....................

* ఒకసారి  దేవునికి  నైవేద్యంగా  సమర్పించిన  కొబ్బరి  చిప్పలను  మరల  దేవునికి  నైవేద్యంగా  సమర్పించే  వంటలలో  వాడరు. ..
 
* దేవునికి  నైవేద్యంగా  సమర్పించే  వంటలలో  మరల  కొత్త  కొబ్బరి  కాయలను  కొట్టి  ఆ  చిప్పలను  వాడతారు. 

 
* ఒకసారి    నైవేద్యం  చేసిన  కొబ్బరి  చిప్పలకు  ......నైవేద్యం  చేయని  కొబ్బరిచిప్పలకు  తేడా  తెలియటానికి .... కొబ్బరి  చిప్పలకు  కుంకుమ  బొట్లు  పెట్టటానికి  గల  కారణాలలో  ఒకటి  అని  నాకు  అనిపించింది.  

 
* అంటే,  కుంకుమ  బొట్లు  పెట్టిన  కొబ్బరి  చిప్పలు  నైవేద్యం  చేసినవిగానూ  ,  కుంకుమ  బొట్లు  పెట్టని  చిప్పలు  నైవేద్యం  చేయనివి  అని.


* అయితే ,గుర్తు  తెలియటానికి  కుంకుమ బొట్లను  చిప్పలకు  వెలుపల భాగాన  పెట్టవచ్చు.


Friday, July 20, 2012

ఓం. శ్రీ హరిహరహిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి జయంతి.....శ్రావణ విదియ నాడు .

ఓం. 

శ్రీ  అన్నవర  క్షేత్రం  గురించి    నేను  చదివిన   ఒక  పుస్తకంలోని ...కొన్ని  విషయాలు.

ఒకప్పుడు  నారదుడు   భూలోకానికి  రావటం  జరిగిందట. భూలోకంలో  ఎటు  చూచినా ... కరవు కాటకాలు,  ప్రజల  మధ్య  అన్యోన్య  కలహాలు,  దురాశలు  ఇవన్నీ  చూసి  కలత  చెందిన   నారదుడు  శ్రీమన్నారాయణుని   అనుగ్రహంతో  భూలోకాన్ని  ఉద్ధరించాలనే  సంకల్పంతో  అంతర్ముఖుడవుతాడు.


పరమభాగవతుడైన   నారదుని  ధ్యానకీర్తనలకు  సంతుష్టుడైన  దేవదేవుడు  ఆకాశపధంలో  సాక్షాత్కరించాడు.అమరమునికి  ప్రత్యక్షమైన  ఆ  దివ్యమంగళమూర్తి   విలక్షణమైనది.  


ఒక  క్షణం   నారాయణ  రూపాన్ని,  ఉత్తర  క్షణం  శివరూపాన్నీ,  మరుక్షణం  బ్రహ్మ  రూపాన్నీ   దర్శించిన  విలక్షణానందం  నారదుడికి  కలిగింది. అదిగో  వైకుంఠం  !   ఇదిగో  కైలాసం  !  అదే  సత్యలోకం  !  అనుకుంటూ  ఆనంద  పరవశుడయ్యాడు.


ఆ  దేవదేవుడు  ఆదరానుగ్రహాలతో  నారదుని  పరామర్శించాడు. 
ఆ  దేవుని  ఆదరానుగ్రహాలకు  ఉప్పొంగుతూ  నారదుడు   సవినయంగా  అంటున్నాడు....

పరంధామా  !  నీవు  సర్వజ్ఞుడవు.   ......................స్త్రీలకూ,  వృద్ధులకూ,  బాలబాలికలకూ  రక్షణ  అనేది  లేదు.  దేశక్షోభం  కలిగించే   క్షామం    తాండవిస్తోంది. 



 ఇది  ఇలా  ఉండగా,  మతభేదాలు,   శివుడే  అధికుడనీ ,  విష్ణువును  మించి  దేవుడు   లేడనీ  ..వాదించుకుంటూ  క్రమంగా  హింసాకృత్యాలకు  సంశయించకుండా    ప్రవర్తిస్తున్నారు.....

......  "  సర్వలోక సంరక్షకుడైన  భగవానుడు  ఒక్కడే   భుక్తిముక్తిదాయకుడు  అతడే  "  అనే  విశ్వాసం  ప్రజలకు  కలిగినప్పుడే  లోకానికి  కళ్యాణం ...  అస్తిక్యబుద్ధి  కలగనంత   కాలం  ఈ  దుర్భిక్షమూ ,  దుఃఖమూ , విరోధభావాలు  తొలగిపోవడం  సాధ్యం  కాదు. ....

.... కనుక  సర్వాత్ముడవైన  నీవు  త్రిమూర్త్యాత్మకంగా  హరి  హర  బ్రహ్మ  రూపంలో  అవతరించి  లోకకళ్యాణం  కలిగించాలి.   అని  నారదుడు  ప్రార్ధించగా .

దేవదేవుడు  ప్రసన్నవదనంతో  ....... అలాగే  అని  వాగ్దానం  చేసి  అంతర్హితుడవుతాడు. 

  భగవానుడగు  అన్నవరం  రత్నాద్రి  మీద స్వయం ప్రతి
ష్టితుడు   కావడానికి  సంకల్పించుకున్నాడు. 

శ్రీ  రాజా  ఇనుగంటి  వేంకటరామరాయిణిం  గారు  గొప్ప  దైవ  భక్తులు.

ఒకనాటి  రాత్రి   దేవదేవుడు   స్వప్నదర్శనం  ద్వారా తన  భక్తుడైన  ప్రభువుతో  .... లోకహితార్ధమై   తాను  రత్నగిరి  మీద  అవతరించటం  గురించిన  విషయాలను    తెలియజేస్తారు.


ప్రభువు  హర్షపులకాంకితుడై  కలలో  కనపడిన  సత్యదేవుని  శివసుందర  రూపాన్ని  అనుధ్యానం  చేసుకుంటూ  లేచి ,....... తన  అదృష్టానికి  మనసులో  ఆనందపడుతూ  ,  ఇష్ట  బంధుమితృలందరికీ  స్వప్న  వార్తను  చెబుతారు.


శ్రావణ  విదియ  నాడు  సత్యదేవుని  స్వయం  ప్రకాశం  అభివ్యక్తమయ్యే  రోజు. పాడ్యమి  నాటి  రాత్రి  జాగరణం   చేసి,  ప్రభువుతో  సహా  భక్తులందరూ మర్నాడు   ఉషఃకాలంలో  నిర్మలమైన  పంపా  నదిలో  స్నానం  చేశారు. 

 పూజాదికం  నిర్వర్తించుకుని .  భక్తబృందంతో  మంగళవాద్య  పురస్సరంగా  బయలుదేరి   ముందుగా  గ్రామదేవత  "నేరేళ్ళమ్మ  కోవెల "  దగ్గరకు  వెళ్ళి  ప్రదక్షిణ  ప్రణమాలు  చేసుకున్నారు. 


 ఆ  చిన్న  కోవెలకు  ఎదురుగా  చిట్టడవిలో  ఆవరించి  ఉన్న  మెట్ట  ఒకటి  గోచరించింది.  ఆ  గిరికి  పరమభక్తిగా  నమస్కరించి  భక్తులు   దైవనామ  సంకీర్తన  చేసుకుంటూ  కొండ  ఎక్కి  అన్వేషణ  చేస్తున్నారు.,  

అలా  వెదకుతూ  ఉండగా    ఒక "కుంకుడు  చెట్టు  "  మొదట  దేవదేవుని  స్వరూపావిర్భావం  కల్పవృక్ష  లాభంగా  గోచరించింది.  


ప్రభువు  ఆనంద  భాష్పధారలతో  సత్యదేవుని  విగ్రహ  శ్రీ  చరణాలు  తడుపుతూ  సాష్టాంగ   ప్రణతులు  చేశారు. భక్తులందరూ   దివ్యదర్శన  లాభంతో  "  పేదలకు  పెన్నిధి  దొరికింది  "   అంటూ  కొండంత   ఆనందంతో  స్వామి  వారికి  మోకరిల్లారు.


ఆయా  భక్తులను  నిమిత్తమాత్రులుగా  చేసికొని  సత్యనారాయణస్వామి  వారు " రత్నాచలం"  మీద   స్వయం  ప్రతిష్టితులైనారు.  సర్వాత్మకుడైన  స్వామి  రత్నగిరి  మీద  దివ్యసౌధంలో   అనంతలక్ష్మిసత్యవతిదేవితో  గృహస్థాశ్రమ  స్వీకారం  చేసారు.



శ్రీ   స్వామి  వారి  దేవస్థానం   కనుపండువు  చేసే   రెండు  అంతస్థులుగా  ఉంటుంది.  క్రింది  భాగంలో  యంత్ర  ప్రతిష్ఠ  జరిగింది.  స్వామి  వారి  దివ్య  మంగళమూర్తిని  మేడమీద  చూడగలుగుతాము.ఈ  రెండింటికి     నడుమ  పానవట్టం  వంటి  నిర్మాణం.  అందు  త్రిపీఠముల  మీద  బీజాక్షర  సంపుటి  యంత్రం   బిందు  స్థానమున  ఏక శిలా  స్థంభం  ,  పై  భాగమున " శ్రీ  సత్యనారాయణ  స్వామి  వారి  చెంత  అమ్మవారు  అనంత  లక్ష్మీ   సత్యవతీదేవి.  వేరొక  వైపు  శివలింగం.దిగువ  భాగంలో  గణనాధుడు...ఆదిత్యుడు,,, అంబిక  మహేశ్వరుడు   నాల్గువైపులా   ప్రతిష్టితులు. .   ఈ  విధంగా  విష్ణు  పంచాయతనం  గర్భాలయంలో  గోచరిస్తుంది."


యంత్రమునకు  స్వామి  వారి  మూర్తికి   త్రికాలార్చనలు   జరుగుతూ  ఉండటమే   కాక,  స్పటిక  శ్రీ  చక్రార్చనము,  సాలగ్రామార్చనము  నిత్యమూ  చేయబడతాయి.


శ్రీ  స్వామి  వారి  పేరుతో  సృష్టి  స్థితి  లయ  కారకులైన  ముగ్గురు  మూర్తుల  ఏకాకృతి  ఈ  రత్నగిరి  మీద  వెలసినదని  తెలిసిన  పెద్దలు  అభివర్ణిస్తారు.

 

ఆదిలోని  వృత్తాకారమైన   శిల  బ్రహ్మ  స్వరూపమనీ,  నడుమనున్న  లింగాకార  స్థంబం  శివస్వరూపమనీ,  ఊర్ధ్వమందలి  విగ్రహం   నారాయణ  స్వరూపమనీ,  ఈ  విధంగా  హరి హర హిరణ్యగర్భాత్మక   ప్రతిష్ఠ  అపూర్వమైనదని  భక్తులు  గ్రహిస్తారు.

శ్రీ  సత్యనారాయణ   స్వామి  వారి  ఆలయంలో  ప్రవేశించగానే   , బహుజన్మసంచితమైన  పాప ప్రతిబంధకం  తొలగి,  సత్యలోక  ప్రవేశానుభవ  స్పురణ  కలుగుతుంది.

ఉత్తర  క్షణంలో  , గౌరీశంకరులు  కొలువుతీర్చి   ఉన్న  కైలాస   మానసాహ్లాదం  కలిగిస్తుంది.

వెంటనే  కన్నుల  వైకుంఠం  : శ్రీ  వీరవేంకటసత్యనారాయణస్వామివారి   దివ్యమంగళ  దర్శనలాభం.  స్థితిమూర్తియైన  స్వామి  అర్చాకృతిని  దర్శించుకుంటూ,  చేతులు  జోడించి  భక్తులు  ఇలా  కీర్తిస్తున్నారు.

"  మూలతో  బ్రహ్మరూపాయ
మధ్యత  శ్శివరూపిణే
అగ్రతో  విష్ణురూపాయ
త్రైక్య  రూపాయ  తేనమః  "

సత్యదేవవ్రతకల్పం  స్కాందపురాణం  రేవాఖండంలో  అయుదు  అధ్యాయములుగా  ఉన్నది.

ఈ  సత్యవ్రత  విధానము  నారదునకు  విష్ణువుచే  బోధింపబడినది.

కల్పోక్త  విధానంతో  యీ  వ్రతం  చేసి  ,  అభీష్ట  సిద్ధులు  పొందిన  వారి  గాధలు  ఎన్నో  యీ  రేవా  ఖండంలో  వినిపిస్తాయి. 

 కాశీలోని  ఒక  నిరుపేద  బ్రాహ్మణుడు  " సత్యవ్రతం  "  ఆచరించి  సర్వభాగ్యసంపన్నుడౌతాడు.

కట్టెలమ్ముకుని  బ్రతికే  ఒక  దరిద్రుడు  యధాశక్తి,  భక్తితో  యీ  వ్రతము  చేసి  పాపవినిర్ముక్తుడై  వైకుంఠధామం  చేరుకుంటాడు.



సాధువనే  ఒక  వైశ్యుడు  సత్యవ్రతం  చేసి, మహాపద్సముద్రంలో   నుండి  బయటపడి  ఐశ్వర్యవంతుడవుతాడు.



తుంగధ్వజుడనే  రాజు  వేటకు  వెళ్ళి  అడవిలో  గోపాలకులిచ్చిన  సత్యనారాయణ  ప్రసాదం  తిరస్కరించి  రాజ్యభ్రష్టుడై   ,  బుద్ధి  వచ్చి  మరల  ప్రసాదస్వీకారం  చేసి  రాజ్యం  సంపాదించుకుంటాడు.



ఇంకా,  దుష్టబుద్ధి  కధ,  కౌముది  కధ...సత్యనారాయణ  వ్రత  ప్రభావాన్ని   వేనోళ్ళ  కీర్తిస్తున్నవి.


......................


ఈ  విషయములు  మధునాపంతుల  సత్యనారాయణ  గారు  రచించిన  పుస్తకములో  చదివి  రాసానండి.. శ్రీ  అన్నవర  క్షేత్రము.  (  స్థల  పురాణము.  ) శ్రీ  వీరవేంకటసత్యనారాయణ స్వామివారి  ఆవిర్భావ  చరిత్ర.  రచన;మధునాపంతుల  సత్యనారాయణ  శాస్త్రి.
ప్రోత్సాహకులు;దాసరి  కృష్ణమూర్తి.   


అందరికి   కృతజ్ఞతలు.

నేను వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉన్నచో    దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.




Wednesday, July 18, 2012

శ్రీ దత్తాత్రేయ స్వామి వారు .... 24 ..గురువులు..... .వరుణయాగాలు... వానలు.


  ఇహపరాలలో  ఉద్ధరించబడాలంటే  మానవులు  ఏ  విధంగా  ప్రవర్తించాలో,  ఏ  విధంగా  ప్రవర్తించకూడదో  అనే  విషయాలను  అనాది  కాలం నుంచీ    ఎందరో     తెలియజేస్తున్నారు.
 

 మన  చుట్టూ  ఉన్న  ప్రకృతి   నుంచే  మనము   ఎన్నో  పాఠాలను  నేర్చుకోవచ్చునంటారు   పెద్దలు.   శ్రీ  దత్తాత్రేయ  స్వామి  వారు    24..  గురువుల  గురించి    చెప్పటం  జరిగింది. 


  ఆ  విషయాలు  ఈ  లింక్  లో  చూడవచ్చు.....

24 GURUS (TEACHERS) OF SRI DATTATREYA SWAMI!

 
  జీవితంలో  ఎలాంటి  పరిస్థితిలో  ఎలా    ప్రవర్తిస్తే  ఎలాంటి  ఫలితాలు  ఉంటాయి  ..... అన్న  వాటి   గురించి  అనేక  విషయాలను  పురాణేతిహాసాల  ద్వారా   కూడా   పెద్దలు  తెలియజేసారు. 

 

 ఎంతో  జాగ్రత్తగా   చక్కగా   జీవించటం  ద్వారా   , సమాజంలో  చక్కటి  గౌరవాన్ని  పొందే  వ్యక్తిని  ఉదాహరణగా  చూపించి ,  అలా  జీవించటం  నేర్చుకొమ్మని  పెద్దలు  పిల్లలకు  చెప్పటం   ఎక్కువగా  జరుగుతుంటుంది. 

 

ఇంకా,    వ్యక్తులు   పొరపాట్లు  చేసి   జీవితంలో  కష్టాలను  అనుభవించిన  సంఘటనల  ద్వారా  కూడా  ఇతరులు    పాఠాలు  నేర్చుకోవచ్చు. 

 

 ఇతరులలోని  మంచి  లక్షణాలను  చూసి  మనం  మంచిగా  ఉండటాన్ని  నేర్చుకోవచ్చు.


  ఇతరులు  పొరపాట్లు  చేసి,  కష్టాలు   అనుభవించినప్పుడు  ,  అటువంటి  పొరపాట్లను  మనం  చేయకుండా  జాగ్రత్తగా  ఉండాలని   నేర్చుకోవచ్చు.. 
 

ఇలాంటి  ఎన్నో  సంఘటనలను   పురాణేతిహాసాల  ద్వారా  కూడా   పెద్దలు  మనకు   అందించారు.

  ................................
 
ఈ   విషయం   వేరే  విషయం.

 ఈ  రోజు  ఈనాడు  పేపరులో  ......రాష్ట్రంలో  కురుస్తున్న  వర్షాల   గురించి  ఒక  ఫోటో  వేసి  క్రింద     వ్యాఖ్య  రాసారు.



  ఆ  వ్యాఖ్యలో   కొంత  భాగం..........వర్షాలు  కురవడం  ప్రస్తుత   సీజన్లో   సాధారణమే   అయినా  ...  ఎలాంటి  అల్పపీడనం,  వాయుగుండం,  ఉపరితల   ఆవర్తనం  వంటివేవీ  లేకుండానే  విస్తారంగా  వర్షాలు  కురుస్తుండడం   వాతావరణ  నిపుణులనూ  ఆశ్చర్యానికి  గురి  చేస్తోంది.  అని  రాసారు.
 

  నిజమే ,  ఈ  మధ్య  వరకూ  రాష్ట్రంలో  వానలు   లేవు.  అందువల్ల   ఈ  మధ్య   చాలామంది   వరుణయాగాలను  కూడా   నిర్వహించటం    జరిగింది.  

 

  కొంతకాలం  క్రిందట  చెన్నైలో    వర్షాలు  లేక  వరుణయాగం   నిర్వహించినప్పుడు  కూడా  కొద్ది    రోజుల్లోనే  వర్షాలు  పడ్డాయి. 


 
 ఎవరి  నమ్మకాలు   వారివి.   ఇదంతా  నమ్మటం  నమ్మకపోవటం  విషయంలో   ఎవరి  అభిప్రాయాలు  వాళ్ళవి.  ఎలాగైతేనేం    దైవం  దయ  వల్ల  వానలు  కురుస్తున్నాయి....




Monday, July 16, 2012

శ్రీ షిరిడి సాయిబాబా కధలు...


  శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము.

 బాపు  సాహెబు  బుట్టీ  

ఒకానొకప్పుడు  బాపు  సాహెబు  బుట్టీ  జిగట  విరేచనములతోను   వమనములతోను  బాధపడుచుండెను. అతని  అలమారు  నిండ  మంచి  మందులుండెను.  కాని    యేమియు  గుణమివ్వలేదు.  విరేచనముల  వల్లను, వమనముల  వల్లను బాపు  సాహెబు  బాగా  నీరసించెను. అందుచే   బాబా  దర్శనమునకై   మసీదుకు  పోలేకుండెను.  బాబా  వానిని  రమ్మని  కబురు  చేసెను.  వానిని  తనముందు  కూర్చుండబెట్టుకొని  యిట్లనెను.  ' జాగ్రత్త  !  నీవు  విరేచనము  చేయకూడదు. '  అనుచు  బాబా  తన  చూపుడు  వ్రేలాడించెను.  '  వమనము  కూడ  ఆగవలెను  '  అనెను.  బాబా  మాటల  సత్తువను  గనుడు.  వెంటనే  ఆ  రెండు  వ్యాధులు  పారిపోయెను.  బుట్టీ  జబ్బు  కుదిరెను.

 

ఇంకొకప్పుడు  అతడు  కలరాచే  బాధపడెను. తీవ్రమైన  దప్పితో  బాధపడుచుండెను.   డాక్టరు  పిళ్ళే  యన్ని  యౌషధములను  ప్రయత్నించెను. కాని  రోగము  కుదురలేదు. అప్పుడు  బాపు  సాహెబు  బాబా  వద్దకు  వెళ్ళి  ఏ  యౌషధము  పుచ్చుకొనినచో తన  దాహము  పోయి   జబ్బు   కుదురునని  సలహా  అడిగెను.  బాదాము పప్పు,  పిస్తా,  అక్రోటు,  నానబెట్టి  పాలు  చక్కెరలో   ఉడికించి  యిచ్చినచో  రోగము  కుదురునని  బాబా  చెప్పెను.  ఇది  జబ్బును  మరింత  హెచ్చించునని  యే  డాక్టరయినను  చెప్పును.  కాని  బాపు  సాహెబు  బాబా  యాజ్ఞను  శిరసావహించెను. పాలతో  తయారుచేసి  దానిని  సేవించెను. వింతగా   రోగము  వెంటనే  కుదిరెను.  

 

కాకామహాజని

కాకామహాజని  యను  నింకొక  భక్తుడు  గలడు.  అతడు   నీళ్ళ  విరేచనములతో  బాధపడుచుండెను.  బాబా  సేవ  కాటంకము  లేకుండునట్లు  ఒక  చెంబునిండ  నీళ్ళు  పోసి  మసీదులో  నొక  మూలకు  పెట్టుకొనెను.  అవసరము  వచ్చినప్పుడెల్ల  పోవుచుండెను.  బాబా  సర్వజ్ఞుడగుటచే  కాకా  బాబాతో  నేమి  చెప్పకే , బాబాయే  త్వరలో  బాగుచేయునని  నమ్మెను.  మసీదు  ముందర  రాళ్ళు  తాపనచేయుటకు  బాబా  సమ్మతించెను;  కావున  పని  ప్రారంభమయ్యెను.  వెంటనే  బాబా  కోపోద్దీపితుడై  బిగ్గరగా  నరచెను.  అందరు  పరుగెత్తి  పారిపోయిరి.  కాకా  కూడ  పరుగిడ  మొదలిడెను.    కాని  బాబా  అతనిని  పట్టుకొని  యచ్చట  కూర్చుండ  బెట్టెను.  ఈ  సందడిలో  నెవరో  వేరుసెనగ   పప్పుతో  చిన్న  సంచిని  అచ్చట  విడిచి  పారిపోయిరి.  బాబా  యొక  పిడికెడు  శనగపప్పు  తీసి ,  చేతులతో  నలిపి  ,  పొట్టును  ఊదివైచి  శుభ్రమైన  పప్పును  కాకాకిచ్చి  తినుమనెను.  తిట్టుట  శుభ్రపరచుట   తినుట  యొకేసారి  జరుగుచుండెను.  బాబా  కూడ  కొంత  పప్పును  తినెను.  సంచి  ఉత్తది  కాగానే  నీళ్ళు  తీసుకొని రమ్మని  బాబా  కాకాను  ఆజ్ఞాపించెను.  కాకా  కుండతో  నీళ్ళు  తెచ్చెను.  బాబా    కొన్ని  నీళ్ళు  త్రాగి   , కాకాను  కూడ  త్రాగుమనెను.  అప్పుడు  బాబా  యిట్లనెను.  '  నీ  నీళ్ళ  విరేచనములు  ఆగిపోయినవి.  ఇప్పుడు  నీవు  రాళ్ళు  తాపన జేయు  పనిని  చూచుకొనవచ్చును.  "  అంతలో   పారిపోయినవారందరును  వచ్చిరి.  పని   ప్రారంభించిరి.  విరేచనములు  ఆగిపోవుటచే  కాకాకూడ  వారితో  కలిసెను.  నీళ్ళవిరేచనములకు  వేరుశనగపప్పు  ఔషధమా  ?  వైద్యశాస్త్ర  ప్రకారము   వేరుశనగపప్పు  విరేచనములను  హెచ్చించును  గాని  తగ్గించలేదు.  ఇందు  నిజమైన  యౌషధము  బాబా  యొక్క   వాక్కు.  

 

        ఇంకొక  మూడు  వ్యాధులు

 
(1) మాధవరావు  దేశపాండే  మూలవ్యాధిచే  బాధపడెను.  సోనాముఖి  కషాయమును   బాబా  వానికిచ్చెను.  ఇది  వానికి  గుణమిచ్చెను.  రెండు  సంవత్సరముల  పిమ్మట  జబ్బు  తిరుగదోడెను.  మాధవరావు   ఇదే  కషాయమును  బాబా  యాజ్ఞ లేకుండ  పుచ్చుకొనెను.  కాని  వ్యాధి  అధికమాయెను.  తిరిగి  బాబా  యాశీర్వాదముతో  నయమయ్యెను.


 
(2)  కాకామహాజని  యన్న  గంగాధరపంతు   అనేక  సంవత్సరములు  కడుపు  నొప్పితో  బాధపడెను.  బాబా  కీర్తి  విని  శిరిడికి  వచ్చెను.  కడుపు  నొప్పి  బాగుచేయుమని   బాబాను  వేడెను.  బాబా  వాని  కడుపును  ముట్టుకొని  భగవంతుడే   బాగుచేయగలడనెను.  అప్పటి నుంచి  కడుపు  నొప్పి  తగ్గెను.  వాని  వ్యాధి   పూర్తిగా  నయమయ్యెను.

 

(3) ఒకప్పుడు  నానాసాహెబు  చాందోర్కరు   కడుపు  నొప్పితో  మిగుల  బాధపడెను.  ఒకనాడు  పగలంతయు  రాత్రియంతయు  చికాకుపడెను.  డాక్టర్లు  ఇంజెక్షనులు   ఇచ్చిరి.  కాని,  యవి  ఫలించలేదు.  అప్పుడతడు  బాబా  వద్దకు  వచ్చెను.  బాబా  ఆశీర్వదించెను.  దీనివల్లనే  అతని  జబ్బు  పూర్తిగా  తొలగిపోయెను.  

 

ఈ  కధలన్నియు  నిరూపించునదేమన : అన్ని  వ్యాధులు  బాగగుట  కసలైన  ఔషధము  బాబాయొక్క   వాక్కు :  ఆశీర్వాదము  మాత్రమే. కాని  ఔషధములు  కావు. 



Friday, July 13, 2012

శ్రీ శనిదేవుని మహిమలు......రెండవ భాగము.


ఓం.

....శ్రీ  శనేశ్వరులు  నికృష్ఠు ,  వికృత  రూపుడు కాడు.  తపోగ్నిచే  దహించబడిన  స్వర్ణ  కాంతి  కాయుడు  సర్వాంతర్యామి,  సర్వ  సాక్షీభూతుడు. పరిపూర్ణ  అహింసామూర్తి...

 

..."  తన  కర్మ  శేష  ఫలితముగా  అయితేనేమి,  కుకర్మల  కారణముగా  నైతేనేమి   మానవుడు  రోగి  లేక  భోగి  అవుతున్నాడు   మానవుల  కుకర్మల  ఫలితమే  రోగము.  రోగము  నుండి  విముక్తి  పొందాలంటే  వైద్యున్ని  ఆశ్రయించాలి.  రోగమూలము  నిర్ధారణ  చేసి  వైద్యము  చేసి  రోగి  నుండి  రోగాన్ని  పారద్రోలడమే  వైద్యుని  కర్తవ్యము.  కాని  రోగితో  గాని  రోగముతో  గాని  వైద్యునికి  ఎలాంటి  సంబంధము  లేదు.  ఈ  విధంగానే  బహుబంధాలు  ,  బహుబాధలు  మానవ  జనిత  కర్మ  ఫలములే.  కాని  శని  కృతము  కాదు. గ్రహదేవుడు  బాధిస్తాడా  ?  వేధిస్తాడా ?  ఎంతటి  అజ్ఞాన  భావన.  వీటినుండి  ముక్తి  పొందాలంటే  గ్రహదేవుని  పాదాల కడ   సమర్పణ  భావముతో  ప్రార్ధించడం  ఉత్తమం...."

.(  ఈ  విషయములు  శ్రీ  శనేశ్వర  దేవతా  మహాత్యము    గ్రంధము  లోనివి.  )

....ఈ  గ్రంధ  కర్త  శ్రీ  మహాజన్ స్వామి రావు  గారు.  వీరు  షిరిడి  సాయిబాబా  గారి  భక్తులు  కూడానట. ఈ  గ్రంధము   శింగణాపూర్  శ్రీ  శనేశ్వరాలయము  పబ్లిక్  ట్రస్ట్  వారి  సౌజన్యముతో  ముద్రితమైనదట.  ఈ  గ్రంధములో    శనిదేవుని  గురించిన    మహిమలు  ఉన్నాయి. 

 
...............................

  కొందరు  ఏమనుకుంటారంటే,  శనిదేవుడు  ప్రజలను  శిక్షిస్తారు  అంటారు.  అలా  అనుకోవటం  తప్పు.  నాకు  ఏమనిపిస్తుందంటే,
 

  శనిదేవుడు  న్యాయ  పరిరక్షకుడు.  కాబట్టి  ,  ఎవరైనా  పాపాలు  చేస్తే  వారికి  తగ్గ  శిక్షను  విధించి,   తద్వారా  వారిని  మంచి  మార్గానికి  తీసుకు  వస్తారు. 


 లోకంలో    శిక్షలంటూ  లేకపోతే  ప్రజలలో  పాపభీతి  తగ్గిపోతుంది  కదా  ! న్యాయస్థానాలలో  జడ్జీలు  కూడా  శిక్షలను  విధిస్తారు .
.............................


శ్రీ  శనిదేవుడు  శ్రీ  క్షేత్ర  శింగణాపూర్  లో   వెలిసారు.
మేము  ఒకసారి  షిరిడి  వెళ్ళినప్పుడు  శ్రీ  శని  శింగణాపూర్  కూడా  వెళ్ళి  వచ్చాము...  .

 ఈ ఊరిలోని అంగళ్ళకు తాళములు వేయరట.

ఇక్కడ దొంగతనములు జరగవు.
................


శింగణాపూర్  సందర్శించే  భక్తులకు  కొన్ని  ముఖ్య  సూచనలలో  కొన్ని  .....


భక్తులు  తమ  వెంట  మద్యమాంసాదులు  తీసుకెళ్ళుట  దైవాపరాధము  అని  చెప్పబడింది....

ఇక్కడ  కుల,  మత  , వర్ణ  ,వర్గ  వ్యత్యాసాలు  పాటించతగదని పెద్దలు  తెలియజేసారు. 

పవిత్ర  ప్రసాదమును  మూఢభావాలతో  తిరస్కరించడము  దైవాపరాధమని  పెద్దలు  తెలియజేసారు.
............
 
  ఎన్నో  ప్రత్యేకతలున్న  క్షేత్రము  శ్రీ  శని  శింగణాపూర్....

 
ఈ  రోజుల్లో  కూడా  ఇలాంటి  ఊరు  ఉన్నదని  ఎందరో  ఆస్తికులు,  నాస్తికులు  కూడా ఈ  ఊరును  దర్శిస్తుంటారట..

..............
 
వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను...


Wednesday, July 11, 2012

.శ్రీ శనిదేవుని మహిమలు..

ఓం...

 MAHIMA SHANI DEV KI PART 1 - YouTube......లో  శనిదేవుని  మహిమలు  ఉన్నాయి. ఇంకా  చాలా  మహిమలు ఉన్నాయి.

 ఈ శనిదేవుని   మహిమలు  చాలా  భాగాలుగా  (  ధారావాహికగా )    imagin  T.V.  లో  వచ్చాయి.

  ఈ శనిదేవుని  మహిమలు  చాలా  బాగుంటాయి.  

  శనిదేవుడంటే  కొందరికి  భయం  ఉంటుంది.  

కానీ,   శనిదేవుని  మహిమలు  గురించి  తెలుసుకుంటే   శనిదేవుడు  ఎంత  కరుణామయుడో  తెలుస్తుంది.

 ఈ  మహిమలలో  పురాణేతిహాసాలలోని  కధలు  కూడా  ఉన్నాయి.

 (అయితే , నేను  అన్ని  భాగాలు  చూడలేదండి.  హిందీలో  కన్నా  తెలుగులో    వచ్చినప్పుడు  ఎక్కువగా  చూసాను.   ( " మా "  టీవీలో  " శ్రీ  శనిదేవుని మహిమలు   "  ధారావాహికగా   వచ్చినప్పుడు.  )

 శ్రీ జ్యేష్ఠాపత్నిసమేతుడుశ్రీ శనిదేవుడు....అని పెద్దలు తెలియజేసారు.. ..
( అయితే, ఇంకొక దగ్గర ..శనిదేవుని పత్ని పేరు మరోలా ఉన్నది.)


పత్నీసమేత శనిదేవునికి వందనములు.

  న్యాయపరిరక్షకుడు శ్రీ శనిదేవుడు.
వీరు  శింగణాపూర్ లో  స్వయంభువుగా  వెలిసారు.



Sunday, July 8, 2012

కొన్ని ఆచార వ్యవహారాలు.. కొన్ని మార్పులుచేర్పులు.....


 *   ఈ  బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  వారందరికి  అనేక  నమస్కారాలండి.  
........................

 * భగవంతుని  దయ  వల్ల ....  మహర్షుల  దయ  వల్ల    పురాణేతిహాసాలు  లోకానికి  అందాయి. 
 
* తరువాత  కాలంలో   కూడా  కొందరు  భక్తులు    భగవంతుని  దయ  వల్ల   దివ్యదృష్టిని  పొంది,   తాము  కూడా  ఆ  కధలను  మరల  వ్రాయటం  జరిగింది. 
 ............... .

ఈ   విషయాలను  అలా  ఉంచితే, 

* మార్పులుచేర్పులు........విషయం  లోకి  వస్తే.

*  నేను  ఒక  దగ్గర  చదివిన  దాన్ని  బట్టి   ఇలా  తెలుస్తోంది....


". ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన   కొన్ని  ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది. "...అని.
 
*  అంటే, 
 కొందరు........  పురాణేతిహాసాలలో    తమకు  తోచినట్లు  మార్పులుచేర్పులు    చేసి  వ్రాసారని    అభిప్రాయం.
 
*  వీటిని  ప్రక్షిప్తాలు    అంటారనుకుంటున్నాను. 


* ఈ  ప్రక్షిప్తాలు  రాసేవారిలో  భక్తులూ  ఉండవచ్చు.   భక్తులు  కాని  వాళ్ళూ    ఉండవచ్చు.


*  ఈ  ప్రక్షిప్తాలలో  కొన్ని  చాలా  చక్కగా  ఉండి  ఆహ్లాదాన్ని  కలిగిస్తాయి. కొన్ని  ప్రక్షిప్తాలు  అయోమయాన్ని,  ఆందోళనను  కలిగిస్తాయి.  


 * ఇంకా, ఏమనిపిస్తుందంటే,   కొన్ని  గ్రంధాలలోని   కొన్ని   విషయాలలో  కొన్ని  మార్పులుచేర్పులు   జరిగాయేమో ?  అనే  సందేహం  వస్తున్నది. . అయితే,   అలాంటి  మార్పులు  జరగవచ్చు. జరగకపోనూవచ్చు. 

 
* అదలా  ఉంచితే,  పూర్వం  సమాజంలో  ఉన్న   కొన్ని   దురాచారాలు   గురించి  గ్రంధాలలో  ఉన్నదట.     అలా  దురాచారాలు  ఉన్నట్లు  గ్రంధాలలో  ఎవరైనా  కల్పించి రాసి  ఉండవచ్చు..



 .... లేదా, నిజంగానే  సమాజంలో  కొన్ని  దురాచారాలు   ఉండి  ఉండవచ్చు. ఏది  నిజమో  ? ఏది  కాదో ?  భగవంతునికే  తెలియాలి.

  * నా  అభిప్రాయం  ఏమిటంటే , అప్పటి   సమాజంలో  దురాచారాలు  ఉన్నా  కూడా   అవి   ప్రారంభమవటానికి  కారణం   ప్రజలే  కానీ ,  పెద్దలు  కాదు  అని.  

 
 * సనాతనకాలంలో  పెద్దలు   చెప్పిన  విషయాలను  సరిగ్గా  అర్ధం  చేసుకోలేని  తరువాతి  తరాల  ప్రజలు  కొందరు   సమాజంలో  కొన్ని   దురాచారాలు  ఏర్పడటానికి  కారణం  అయి  ఉండవచ్చు.

 
* ఇంకా ,  ప్రజల  ఆశలు,  కోరికలు,  పరిస్థితుల  ప్రాబల్యం  ,  ఇలా  రకరకాల  కారణాల  వల్ల  కూడా   దురాచారాలు    ఏర్పడి  ఉండవచ్చు. 


 
* పాతకాలంలోని  ఆచారాలు  ఎన్నింటినో ,  ఇప్పుడు  మనం    మనకు  తోచినట్లు  మార్చేస్తున్నాం  కదా  !

 
* అలాగే    సనాతనకాలం  నాటి  ఆచారాలు  కూడా  తరువాతి  తరాలకు  చెందిన  ప్రజల   వల్ల  రూపుమారి  ఉండవచ్చు.   

 
*   అప్పుడు  కానీ,  ఇప్పుడు  కానీ  సమాజంలో  దురాచారాలు  పెరగటానికి    కారణం   కొందరు    ప్రజలే  కానీ,   సనాతనకాలానికి   చెందిన  పెద్దలు  ఎంత  మాత్రం   కారణం  కాదు  అని  చెప్పాలన్నదే  నా  తాపత్రయం.


 
*  సనాతనమైన  వేదాలను ఒకప్పుడు   సోమకాసురుడనే  వాడు  అపహరించితే  విష్ణుమూర్తి  ఆ  అసురుణ్ణి  సంహరించి,  వేదాలను  తెచ్చి  లోకానికి  అందించారట. 

 
* ఇప్పుడు  మనం  చదువుతున్న  గ్రంధాలలో   ఏ  విషయం  ప్రక్షిప్తమో ?  ఏది  కాదో ?  భగవంతునికే  తెలియాలి.

 
ఈ  విషయాలతో  పోస్టును  ఎప్పటి  నుంచో  రాయాలనుకుంటున్నాను. 


రేపు  వేయవలసిన  టపా  ఈ  రోజే  వేస్తున్నానండి. 

* వ్రాసిన  విషయాలలో  పొరపాట్లు  ఉంటే  దైవం  దయచేసి  క్షమించాలని  కోరుకుంటున్నాను.



Friday, July 6, 2012

కొన్ని విషయాలు....భోగి మంటల్లో పాత టైర్లు ,



పెద్దలు  లోకహితం  కోసం  ఎన్నో  చక్కటి  ఆచారాలను  చెప్పారు.  అయితే,  మనం  మనకు  తోచినట్లు  చేస్తున్నాము.   

పూర్వం  పెద్దలు ,  పసుపును  గడపలకు  పూయమని  చెబితే  ......ఇప్పుడు  మనము  పసుపుకు   బదులుగా  పసుపు  రంగును  గడపలకు  వేస్తున్నాము.
 

గడప  వల్ల  ,     బయట నుంచి  వచ్చే  దుమ్ము     ఎక్కువగా   ఇంట్లోకి  రాకుండా   గడప  వద్దే  ఆగిపోయే  అవకాశం  ఉంది. (  అప్పట్లో  గడపలు  కొంచెం ఎత్తుగా  ఉండేవి.. )
పురుగుపుట్ర  వంటివి  కూడా  ఇంట్లోకి   త్వరగా రాలేవు..


  గడపకు  పూసిన  పసుపు లోని   ఆంటి  బయొటిక్ గుణము వల్ల    ఆ దుమ్ము లోని    చెడు క్రిములు    చనిపోతాయి.  

(    పసుపుకు  గల  ఆంటిబయోటిక్   లక్షణాన్ని  సైంటిస్ట్స్   కనుగొన్నారు  కదా  !  అయితే  పంటలకు  విపరీతంగా  వాడే  గాఢమైన  పురుగు  మందులు  వంటి  వాటి  వల్ల  పసుపు  లోని  సహజమైన   చక్కటి  ఆంటిబయాటిక్  శక్తి  కూడా   తగ్గే  ప్రమాదం  ఉంది.    )

 

మనకు  ఇవన్నీ అర్ధము కావని ,  గుమ్మానికి పసుపు రాస్తే   సౌభాగ్యం  అని    పెద్దవాళ్ళు   చెప్పారు. ( ఇంట్లో  వాళ్ళు  ఆరోగ్యంగా  ఉంటే  సౌభాగ్యమే  కదా  !  ) 



 అయితే,  ఇప్పుడు  మనము   ఏం  చేస్తున్నామంటే,   గడపలకు , (  ఉంటే  )  గుమ్మానికి  పసుపు రంగు పెయింట్   వేసేసి.....పెద్దవారు   చెప్పిన  దానివల్ల   ఏమి ఉపయోగము.......   పెద్దలదంతా   చాదస్తము  అనుకుంటున్నాము. 
.....................

ఇంతకుముందు రోజుల్లో  అయితే , సంక్రాంతి  పండుగ  వస్తే  తప్పనిసరిగా  ఇంటికి  సున్నం  వేయించుకునేవారు.  అలా  సంవత్సరానికి  ఒకసారి  సున్నం  వేయించటం  వల్ల  ఇల్లు  శుభ్రంగా  ఉండేది. 


 ఇప్పుడు , కొత్తరకం  రంగులు  వచ్చాక    సంవత్సరానికి  ఒకసారి  రంగులు  వేయించుకోవటం  లేదు.  

 
ఇంతకుముందు రోజుల్లో  అయితే ,  భోగి  పండుగ  రోజున  పిడకలతో  పాటూ,   ఇంట్లో  ఉన్న  పాత  చెక్క  సామాను  కూడా  భోగి  మంటల్లో  వేసేసేవారు.  అలా  పాతసామాను  వదిలిపోయేది. 


 ఇప్పుడు , భోగి  మంటల్లో  పాత టైర్లు , ప్లాస్టిక్    సామాను  వంటివి  కూడా  వేస్తున్నారు. 


 ఆ   టైర్ల  వాసన  భరించలేక   ,   ఇలా  పాతటైర్ల  వంటివి    మంటల్లో  వెయ్యటమే  కాబోలు  భోగి  మంటలంటే ......   పెద్దలు  ఇలాంటి  ఆచారాలను  ఎందుకు  పెట్టారో  ! .....అని  ఇప్పటి  పిల్లలు  అనుకునే  ప్రమాదముంది. 

 ( ఈ  ఆచారం  మొదలైన  పాత   కాలంలో  టైర్లు , ప్లాస్టిక్  వస్తువులు  లేవు  కదా  !  )
 
ఇలా  అప్పటికీ  ఇప్పటికీ  ఆచారవ్యవహారాలను  మనకు  తోచినట్లుగా  మార్చేసుకుంటున్నాము.

 
ఈ  విషయాలలో   కొన్నింటిని   పాత  టపాలలో  రాసాను  కానీ  మళ్ళీ  రాసానండి
.


Wednesday, July 4, 2012

గోవు ...గృహప్రవేశం.

 
గోవు   సకల   దేవతాస్వరూపం   కాబట్టి,   నూతన  గృహప్రవేశ   సమయంలో     ఆవును    తీసుకు  వచ్చి     గృహప్రవేశం   చేయిస్తే  మంచిదంటారు. .


 పాతకాలంలో   అపార్ట్మెంట్స్  లేవు  కదా  !  అప్పుడు    
గోవు   గృహప్రవేశానికి    ఏమీ  ఇబ్బంది  ఉండేది  కాదు. 


 అయితే  ఈ  రోజుల్లో  అపార్ట్మెంట్స్  పుణ్యమాని  ఎన్నో  అంతస్తుల  ఎత్తున  ఇళ్ళు  ఉంటున్నాయి  . 


అయినా  మనవాళ్ళు  ఊరుకోరు  .....  .  కొందరు   ఆవును  పైవరకు       తీసుకెళ్ళి    మరీ   గృహప్రవేశం  చేయిస్తున్నారు.  


ఇవన్నీ  చూసే  ఈ  కాలం  పిల్లలు  పూర్వులు  ఇలాంటి  ఆచారాలను  ఎందుకు  పెట్టారో  !  అనుకునే  అవకాశం  ఉంది.     పూర్వీకులు  ఈ  ఆచారం  పెట్టినప్పుడు   ఇలాంటి  అపార్ట్  మెంట్స్   లేవు  కదా  !


మా   చిన్నతనంలో  మేము  ఒక  గృహం   కొన్నాము.  .  గృహప్రవేశానికి  తెల్లవారు  ఝామున  ముహూర్తం  కుదిరింది. 


గృహప్రవేశానికి   మేము  తెల్లవారు  ఝామున  వెళ్ళగా  ఇంటి  ఆవరణలో    ఒక  ఆవు  దూడకు    జన్మ  ఇచ్చింది.  ఆ  ఆవు  ఎవరిదో  మాకు  తెలియదు.  రోడ్డు  మీద  కొన్ని  ఆవులు  తిరుగుతుంటాయి  కదా  ! ఎవరి  ఆవో  మరి. 



అలా ఆ   ఆవు  దాని  కదే  రావటం,     దూడ  పుట్టడం  ...  చాలా  శుభ సూచకమ్   అన్నారు.  అలా    జరగటం  మాకు  కూడా  చాలా  ఆశ్చర్యాన్ని  ,  ఆనందాన్ని  కలిగించింది.  


  నూతన గృహప్రవేశ  సమయంలో  ఆవు  యొక్క  ప్రవేశం   మంచిది ...   అని 
పెద్దలు   చెప్పిన  మాట  నిజమే  కానీ ,  


 మారిన  కాలమాన   పరిస్థితుల్లో   ఎంతో  ఎత్తైన  అపార్ట్మెంట్స్  ను     బలవంతానా (  మెట్ల మీద   )   ఎక్కించి   ఆవుదూడలను  ఇబ్బంది  పెట్టటం   అనేది   ఎంతవరకూ  భావ్యమో   ఎవరికి   వాళ్ళు  ఆలోచించుకోవాలి.  

  ఇలా   పెద్దలు  చెప్పిన  ఎన్నో   ఆచారాలు     రూపు  మారి  పోతున్నాయి  కొందరు  ప్రజల    విపరీత  ధోరణి  వల్ల......




Monday, July 2, 2012

హరిశ్చంద్రుడి పుత్ర వ్యామోహం.



హరిశ్చంద్రునికి  చాలాకాలం  సంతానం  కలుగలేదు.  అప్పుడు  ఆయన  తమ  కులగురువైన  వసిష్ఠుల  వారి    వద్దకు  వెళ్ళి  సలహా  చెప్పమని  ప్రార్ధించగా ,   వరుణుని  ఉపాసించమని  చెప్పగా ,  హరిశ్చంద్రుడు  వరుణుని  కొరకు  తపస్సు  చేయటం  జరుగుతుంది.

అప్పుడు   వరుణుడు  ప్రత్యక్షమయి   హరిశ్చంద్రునికి  కుమారుని  ప్రసాదిస్తానని  , అయితే  తరువాత    ఆ  కుమారుని  బలి  ఇచ్చి  వరుణయజ్ఞం   చేయాలని  షరతు  పెడతాడు  వరుణుడు.  

.... పుత్రుణ్ణి  అనుగ్రహించు. ముందు  మా  వంధ్యత్వం  తొలగిపోతే  చాలు. ...అని  వరుణుడు  పెట్టిన  షరతుకు  హరిశ్చంద్రుడు   ఒప్పుకుంటాడు. 

  కుమారుడు  పుట్టిన  కొంతకాలానికి   వరుణుడు   మారువేషంలో  వచ్చి  వెనకటి   విషయాన్ని  గుర్తుచేస్తారు.  అప్పుడు  హరిశ్చంద్రుడు   పుత్రుని  మీద  ప్రేమతో  ఏదో  కారణం  చెప్పి  అప్పటికి  వాయిదా  వేస్తాడు. 

   వరుణుడు  రావటం...  హరిశ్చంద్రుడు  వాయిదా  అడగటం .... ఇలా  కొన్నిసార్లు  జరుగుతుంది.    ఇంతలో  రోహితుడు   పెద్దవాడు  అవుతాడు. 

 వరుణుడు  రావటం,  తన  తండ్రి  వరుణుని  బ్రతిమలాడటం   ఇదంతా  గమనించిన  రోహితుడు  మిత్రుల  ద్వారా  విషయాన్ని  తెలుసుకుని  భయంతో  ఇల్లు  విడిచి  వెళ్ళిపోతాడు.  

మరల    వరుణుడు  వచ్చి   రోహితుడు  ఇల్లు  విడిచి  వెళ్ళిపోయిన  విషయం  విని  ,  మాట  తప్పినందుకు    హరిశ్చంద్రునికి  జలోదరం  వ్యాధి  రావాలని    శపించి  వెళ్ళిపోతాడు. 

 అడవుల్లో  ఉంటున్న  రోహితుడు   తాను  ఇల్లు  విడిచి  వచ్చినందుకు  సిగ్గుపడి   మరల  ఇంటికి  వెళ్ళబోతుండగా  ఇంద్రుడు  మారువేషంలో  వచ్చి  వెళ్ళవద్దని  చెబుతాడు. . 

 ఇక్కడ  రాజ్యంలో  వ్యాధితో  బాధపడుతున్న  హరిశ్చంద్రుడు  మంత్రుల  సలహాతో   శునశ్శేపుడు  అనే  బ్రాహ్మణ  కుమారుని  బలిపశువుగా  చేసి  యాగం  నిర్వహించటానికి  ప్రయత్నాలు  జరుగుతుంటాయి. 

 ఈ  శునశ్శేపుడు  అజీగర్తుడనే   బీదబ్రాహ్మణుని  కుమారుడు.  డబ్బు  కోసం  ఆ  తండ్రి   తన కుమారుని  హరిశ్చంద్రునికి  అమ్మేస్తాడు. 


  యాగం  మొదలయ్యి  బలి  ఇచ్చే  సమయం  సమీపిస్తుంది.

ఇంతలో  విశ్వామిత్రుడు  వచ్చి ,  భయంతో  రోదిస్తున్న  ఆ  బాలుణ్ణి  చూసి,  హరిశ్చంద్రునితో ..... ఆ  బాలుణ్ణి  విడిచిపెట్టమని ,  ప్రజలను   రక్షించవలసిన  రాజే  ఇలా  చేయటం  పాపమనీ,    హరిశ్చంద్రుని  వ్యాధి  తగ్గే  ఉపాయం  తాను  చెబుతానని,  హరిశ్చంద్రుని  తండ్రికి  చంఢాలత్వాన్ని  తొలగించి  సశరీరంగా  స్వర్గానికి  పంపించిన  విషయం  గుర్తు  చేసి,   ఈ  బాలుణ్ణి  విడిచి  పెట్టమని  అడుగుతారు.
 

అప్పుడు  హరిశ్చంద్రుడు , విశ్వామిత్రునితో .... నాకు  ఈ  జలోదరం  బాధ  తొలగటం  ముఖ్యం.  అటుపైనే  మిగతా  పాపాలూ  పుణ్యాలూనూ .... నన్ను  అర్ధం  చేసుకో.  ఈ  బాలుణ్ణి  విడిచి  పెట్టమని  నిర్బంధించకు. ...... మరింక  ఏదైనా  వరం  కోరుకో  చెల్లిస్తాను.  అంటాడు.

 
హరిశ్చంద్రుని  సమాధానానికి  విశ్వామిత్రునికి  కోపం  వచ్చినా  నిగ్రహించుకుంటాడు.  

 
విశ్వామిత్రుడు    రోదిస్తున్న  ఆ  బాలుని  వద్దకు  వెళ్ళి, నాయనా  ! వరుణమంత్రం  ఉపదేశిస్తాను,  జపించు . నీకు  శుభం  కలుగుతుంది.  అని  వరుణమంత్రాన్ని   ఉపదేశిస్తాడు. 



  ఆ  బాలుడు  ఎంతో  ఆర్తిగా  వరుణమంత్రం  జపించగా  వరుణుడు  ప్రసన్నుడై  ప్రత్యక్షమవుతాడు.  బాలుణ్ణి  అనుగ్రహించి  వరాలనిస్తాడు. 

 
వరుణుడు  హరిశ్చంద్రునితో,  మహారాజా  ! ఈ  శునశ్శేపుడు  నన్ను  స్తుతించాడు.  కనక  విడిచి  పెట్టు.  యజ్ఞం  సంపూర్ణమైనట్టే. నీ  వ్యాధి  క్షణంలో  తొలగిపోతుంది.  అని  అనుగ్రహిస్తాడు.


 
తరువాత  హరిశ్చంద్రుని  కుమారుడు  తిరిగి  ఇంటికి  వస్తాడు. 

 
ఒకనాడు  వశిష్టుడు  హరిశ్చంద్రుని  గొప్పదనాన్ని  పొగుడుతుంటే  అక్కడే  ఉన్న  విశ్వామిత్రుడు .... నేనెరగని  మహారాజా  మీ  హరిశ్చంద్రుడు !  వట్టికపటి.అబద్ధాల కోరు.  వరమిచ్చిన  వరుణుడినే  వంచించబోయాడు...అంటూ  మాట్లాడతాడు.



  వశిష్టునికీ  విశ్వామిత్రునికి  వాదం  పెరిగి  విశ్వామిత్రుడు  హరిశ్చంద్రుని  అసత్యవాదిగా  నిరూపిస్తానని    అంటారు. 

ఆ  తరువాత  జరిగిన  విషయాలు  మనకు  తెలిసినవే.  విశ్వామిత్రుడు  మారువేషంలో  వచ్చి  హరిశ్చంద్రుని  రాజ్యాన్ని   దానంగా  తీసుకోవటం, దక్షిణగా   ఇవ్వవలసిన  బంగారం  కోసం  హరిశ్చంద్రుడు భార్యా  కుమారుడు  అమ్ముడుపోవటం  తరువాత  రోహితుడి  మరణం,    చివరికి  హరిశ్చంద్రుడు  భార్యతో  సహా   ప్రాణత్యాగం  చేసుకోబోతుండగా  వారి  సత్యసంధతకు  మెచ్చి  దేవతలు  రోహితుణ్ణి  బ్రతికించి  ,  వారికి   ఎన్నో  వరాలను  అనుగ్రహించటం  జరుగుతుంది.


*******************
 మొదట   పుత్రవ్యామోహంతో  హరిశ్చంద్రుడు  వరుణునికి   ఇచ్చిన  మాటను   నిలబెట్టుకోలేదు.  అందుకే  అసత్యవాది  అని    విశ్వామిత్రుడు    అనటం  జరిగింది.


 కానీ,  తరువాత  మరల  పరీక్ష  వచ్చినప్పుడు  భార్యను, కుమారుని  కూడా  దాసీలుగా  చేసి  తాము  ఎన్నో  కష్టాలను  భరిస్తూ    కూడా  ఎంతో  మానసిక  స్థైర్యంతో  తమ    సత్యసంధతను  ప్రపంచానికి  నిరూపించాడు.  



  ప్రజలకు  ఆదర్శంగా  తాను  తన  సత్యసంధతను  నిరూపించుకున్నాడు.    అసత్యవాది  అన్న  విశ్వామిత్రుని  చేతనే  సత్యవాది  అని    అనిపించుకున్నాడు.   సత్యహరిశ్చంద్రుడుగా  చరిత్రలో  నిలిచిపోయాడు. 


********************
 
పుట్టబోయే  శిశువుని   బలిపశువుగా  ఇమ్మన్నప్పుడు  హరిశ్చంద్రుడు ,  అలా  చేయటం  తన  వల్ల  కాదని  వరుణుని  ప్రాధేయపడితే  వరుణుడు  ఒప్పుకునేవాడేమో  ! కానీ  పుత్రుడు  పుడతాడన్న  ఆనందంలో  బలి  గురించి  పెద్దగా  ఆలోచించకుండా  ఒప్పేసుకున్నాడు.  కుమారుడు  పుట్టిన  తరువాత  పుత్రవ్యామోహం  వల్ల  (  సహజమే  కదా  ! )  బలి  ఇవ్వలేకపోయాడు. 

.......................................

 లోకంలో  చాలామంది  కష్టాలు  వచ్చినప్పుడు  తమ  శక్తికి  మించిన  మొక్కులు  మొక్కేస్తుంటారు. కోరికలు  తీరిన   తరువాత  మ్రొక్కు  చెల్లించటం  వాయిదా  వేస్తుంటారు.  తద్వారా  కష్టాలు  వస్తుంటాయి.  దానికన్నా  మనకు  శక్తికి  మించిన  మ్రొక్కులు  అనుకోకుండా  ఉంటేనే  మంచిది.