శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము.
బాపు సాహెబు బుట్టీ
ఒకానొకప్పుడు బాపు సాహెబు బుట్టీ జిగట విరేచనములతోను వమనములతోను బాధపడుచుండెను. అతని అలమారు నిండ మంచి మందులుండెను. కాని యేమియు గుణమివ్వలేదు. విరేచనముల వల్లను, వమనముల వల్లను బాపు సాహెబు బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు పోలేకుండెను. బాబా వానిని రమ్మని కబురు చేసెను. వానిని తనముందు కూర్చుండబెట్టుకొని యిట్లనెను. ' జాగ్రత్త ! నీవు విరేచనము చేయకూడదు. ' అనుచు బాబా తన చూపుడు వ్రేలాడించెను. ' వమనము కూడ ఆగవలెను ' అనెను. బాబా మాటల సత్తువను గనుడు. వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయెను. బుట్టీ జబ్బు కుదిరెను.
ఇంకొకప్పుడు అతడు కలరాచే బాధపడెను. తీవ్రమైన దప్పితో బాధపడుచుండెను. డాక్టరు పిళ్ళే యన్ని యౌషధములను ప్రయత్నించెను. కాని రోగము కుదురలేదు. అప్పుడు బాపు సాహెబు బాబా వద్దకు వెళ్ళి ఏ యౌషధము పుచ్చుకొనినచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగెను. బాదాము పప్పు, పిస్తా, అక్రోటు, నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి యిచ్చినచో రోగము కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని యే డాక్టరయినను చెప్పును. కాని బాపు సాహెబు బాబా యాజ్ఞను శిరసావహించెను. పాలతో తయారుచేసి దానిని సేవించెను. వింతగా రోగము వెంటనే కుదిరెను.
కాకామహాజని
కాకామహాజని యను నింకొక భక్తుడు గలడు. అతడు నీళ్ళ విరేచనములతో బాధపడుచుండెను. బాబా సేవ కాటంకము లేకుండునట్లు ఒక చెంబునిండ నీళ్ళు పోసి మసీదులో నొక మూలకు పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడెల్ల పోవుచుండెను. బాబా సర్వజ్ఞుడగుటచే కాకా బాబాతో నేమి చెప్పకే , బాబాయే త్వరలో బాగుచేయునని నమ్మెను. మసీదు ముందర రాళ్ళు తాపనచేయుటకు బాబా సమ్మతించెను; కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా నరచెను. అందరు పరుగెత్తి పారిపోయిరి. కాకా కూడ పరుగిడ మొదలిడెను. కాని బాబా అతనిని పట్టుకొని యచ్చట కూర్చుండ బెట్టెను. ఈ సందడిలో నెవరో వేరుసెనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా యొక పిడికెడు శనగపప్పు తీసి , చేతులతో నలిపి , పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను. తిట్టుట శుభ్రపరచుట తినుట యొకేసారి జరుగుచుండెను. బాబా కూడ కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్ళు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్ళు తెచ్చెను. బాబా కొన్ని నీళ్ళు త్రాగి , కాకాను కూడ త్రాగుమనెను. అప్పుడు బాబా యిట్లనెను. ' నీ నీళ్ళ విరేచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపన జేయు పనిని చూచుకొనవచ్చును. " అంతలో పారిపోయినవారందరును వచ్చిరి. పని ప్రారంభించిరి. విరేచనములు ఆగిపోవుటచే కాకాకూడ వారితో కలిసెను. నీళ్ళవిరేచనములకు వేరుశనగపప్పు ఔషధమా ? వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగపప్పు విరేచనములను హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందు నిజమైన యౌషధము బాబా యొక్క వాక్కు.
ఇంకొక మూడు వ్యాధులు
(1) మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. రెండు సంవత్సరముల పిమ్మట జబ్బు తిరుగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా యాజ్ఞ లేకుండ పుచ్చుకొనెను. కాని వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా యాశీర్వాదముతో నయమయ్యెను.
(2) కాకామహాజని యన్న గంగాధరపంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని శిరిడికి వచ్చెను. కడుపు నొప్పి బాగుచేయుమని బాబాను వేడెను. బాబా వాని కడుపును ముట్టుకొని భగవంతుడే బాగుచేయగలడనెను. అప్పటి నుంచి కడుపు నొప్పి తగ్గెను. వాని వ్యాధి పూర్తిగా నయమయ్యెను.
(3) ఒకప్పుడు నానాసాహెబు చాందోర్కరు కడుపు నొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు పగలంతయు రాత్రియంతయు చికాకుపడెను. డాక్టర్లు ఇంజెక్షనులు ఇచ్చిరి. కాని, యవి ఫలించలేదు. అప్పుడతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. దీనివల్లనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను.
ఈ కధలన్నియు నిరూపించునదేమన : అన్ని వ్యాధులు బాగగుట కసలైన ఔషధము బాబాయొక్క వాక్కు : ఆశీర్వాదము మాత్రమే. కాని ఔషధములు కావు.
బాబా లీలలు చక్కగా చెప్పారు అండీ..
ReplyDeleteఆయన వాక్కు, ఊదినే అన్ని వ్యాధులకు మందు..
ఓం సాయిరాం....
ధ్యాంక్యూ...
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteనిజమేనండి.
ఆయన వాక్కు, ఊదినే అన్ని వ్యాధులకు మందు..
ఓం సాయిరాం....
ఓం సాయి రాం
ReplyDeleteమంచి పోస్ట్ అందించారు అండీ..
ఆయన లీలలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే ఏమో
"సాయి అంటే ఓయీ అని ఆయనే కదిలి వస్తారట".
మా బామ్మ ఎపుడూ అంటూ ఉంటుంది.
ఓం సాయి రాం..
Deleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
నిజమేనండి.
మీ బామ్మగారు చెప్పినట్లు... "సాయి అంటే ఓయీ అని ఆయనే కదిలి వస్తారట".
శ్రీ సాయిని తలచుకుంటే కాని పని లేదు !! ఎల్ల వేళలా సాయి మనకు తోడూ, నీడ !! జై సాయిరాం !!
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteనిజమేనండి.
శ్రీ సాయిని తలచుకుంటే కాని పని లేదు !! ఎల్ల వేళలా సాయి మనకు తోడూ, నీడ !! జై సాయిరాం !!