koodali

Friday, December 15, 2023

ఈ ఆచారం ఎక్కడవరకు వెళ్ళిందంటే..

 

  పాతకాలంలో నెలసరి రోజుల్లో స్త్రీలు ఎన్నో నియమాలను పాటించేవారు.  ప్రాచీనులు కొన్ని నియమాలను చెప్పారు.. అయితే కొందరు వాటిని ఎక్కువ చేసి, మూఢత్వంగా తయారుచేసారు. ఇది ఎక్కడవరకు వెళ్ళిందంటే, కొన్ని ప్రాంతాలలో నెలసరిలో ఉన్న స్త్రీల కొరకు  బయట చిన్నగుడిసె వేసి మూడు రోజులూ అక్కడ కూర్చోవటమనే స్థాయికి కూడా వెళ్ళింది. మరికొందరి విషయంలో దూరంగా గుడిసెలో కూర్చోకపోయినా ఇంట్లోనే పక్కన కూర్చోబెట్టి, ఒక అసహ్యకరమైన వ్యక్తిని చూస్తున్నట్లు వారితో ప్రవర్తిస్తారు.


నేపాల్ లో చాలా ప్రాంతాలలో ఇలా దూరంగా గుడిసెలలో ఉంచే ఆచారం ఉందట. ఆలా ఉంచటం వల్ల పాములు, తేళ్లు కుట్టి కొందరు చనిపోయారట. కొందరు అనారోగ్యం పాలయ్యారట. కొన్ని అఘాయిత్యాలు కూడా జరిగాయని వ్రాసారు. ఇప్పుడు ప్రభుత్వం అలా గుడిసెలలో ఉండటాన్ని నిషేధించిందట. మనదేశంలో కూడా కొన్ని ప్రాంతాలలో నెలసరి స్త్రీలను వేరే గుడిసెలలో ఉంచటం అనే పద్ధతి ఉందట.


మహారాష్ట్రలో కొన్నిచోట్ల నెలసరిలో ఉన్న స్త్రీల కొరకు కొన్ని స్వచ్చంద సంస్థలు గుడిసెల బదులు సౌకర్యాలతో కూడిన ఇళ్ళను కట్టి అక్కడ ఉంచుతున్నారట. నెలసరి అని ఇలా ఇళ్ళకు దూరంగా ఉంచటం ఏంటో ఖర్మ. 

 

  ఇలా తల్లులు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు చంటి పిల్లలు తల్లికొరకు ఏడుస్తారు. పిల్లల్ని ఇరుగుపొరుగుదగ్గర  వదలకూడదు. ఏంటో ఇవన్నీ. ఆచారాలలో మూఢత్వం ప్రవేశించకూడదు. 


  నెలసరి సమయంలో గర్భసంచి సున్నితంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ పనిచెయ్యకుండా, కొంత రెస్ట్ ఉండటం, అనారోగ్యం లేకుండా కొన్ని నియమాలను పాటించటం.. వంటివి మంచిదే కానీ, ఆ పేరుతో అతి చేయటం సరైనది కాదు.  కొందరైతే, నెలసరి వచ్చిన వారిని చూసి అసహ్యంగా చూస్తూ దూరంగా తప్పుకోవటం, వారికి కంచంలో కొద్దిగా ఆహారాన్ని వేసి, దూరం నుంచి ప్లేటును నెట్టటం..వంటివి చేస్తుంటారు. ఇక పండుగలప్పుడు, వివాహాదిశుభకార్యాలప్పుడు  నెలసరి వస్తే , వచ్చిన వారిని తిట్టిపోస్తారు. అనేకమంది  నెలసరి రాకుండా మందులు వాడుతూ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు.


నెలసరి అంటే సంతానానికి సంబంధించిన విషయం. నెలసరి లేనిదే సంతానం లేదు. ఆ సమయంలో వారిని పక్కన కూర్చోబెట్టి,  కొంత రెస్ట్ ఇచ్చి, ఆరోగ్యకరమైన భోజనం వండి ఇచ్చి, మంచిగా చూసుకోవచ్చు. వారిపట్ల అగౌరవంగా ప్రవర్తించకూడ
దు.

    ఈ రోజుల్లో నెలసరి సమయంలో  స్త్రీలు కాలేజీలకు, ఉద్యోగాలకు, పనులకు వెళ్తున్నారు కదా..మరి అంటుముట్టు ఎలా పాటిస్తారు?


  నెలసరిలో స్త్రీలనుండి నెగటివ్ఎనెర్జీ వస్తుందని కొందరు అంటున్నారు. పాపాలు చేసేవారినుండి, మద్యమాంసాలు తీసుకున్నవారి నుండి కూడా నెగటివ్ ఎనెర్జీ వస్తుంది. 

అందుకే, పాపాలు చేసేవారికి దూరంగా ఉండాలంటారు. ...దుష్టులకు దూరంగా ఉండటం కుదరనప్పుడు, మంచివారు దైవస్మరణ చేసుకోవాలి.

పాపాలు చేసేవారినుండి వచ్చే నెగటివ్ ఎనెర్జీతో పోల్చుకుంటే, ప్రకృతిసహజమైన నెలసరి వల్ల వచ్చే నెగటివ్ ఎనెర్జీ ఫరవాలేదు.

ఆచార వ్యవహారాలను మంచిగా పాటించాలి. మూఢత్వంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఒక లింక్..

Story Of A Young Bride | Gaokor- A Period House

 *****************

 మరి కొన్ని విషయాలు...
 
నెలసరి నియమాలను పాటిస్తే మంచిది. అయితే, ఈరోజుల్లో నెలసరినియమాలు నూటికినూరుశాతం పాటించాలంటే అందరికీ కుదరకపోవచ్చు. సూపర్ బజారుకో, బట్టలషాపుకో వెళితే ఆడవాళ్ళు ఉంటారు. రైలు ఎక్కితే ఆడవాళ్ళుంటారు. అంతమందిలో నెలసరిలో వారూ ఉంటారు. అలాగని ఇంటికొచ్చి అదేపనిగా తలస్నానాలు చేస్తే,  అనారోగ్యం వచ్చే అవకాశముంది. అందువల్ల కొద్దిగా పసుపునీళ్లు చిలకరించుకోవచ్చు..


ఆచారవ్యవహారాలను పద్ధతిగా పాటించాలి. అయితే, కొందరు మూఢనమ్మకాలతో పాటిస్తారు. మూఢనమ్మకాల వారికి చెప్పేదేమిటంటే, నెలసరి ఇంట్లో కలిపేసుకుంటే దోషమని భయపడి, మూఢత్వంగా  చేయవద్దు. ..దీనికి సంబంధించిన ఒక  లింక్ పోస్టులో ఉంది. ఆ సినిమాలోలా మూఢత్వంగా ఎవ్వరూ చేయవద్దు. 


పాతకాలంలో కొందరు.. నెలసరి స్త్రీలంటే గౌరవం లేకుండా, వారు బాధపడేలా మాట్లాడేవారట. ఇలా ప్రవర్తించటం సరైనది కాదు.

*******
 పాపాలు చేసేవారి నుండి కూడా నెగటివ్ ఎనెర్జీ వస్తుందని ఇంతకుముందు వ్రాసాను. దానిగురించి మరికొన్ని విషయాలు..

ఎక్కువ మంచిపనులు చేసేవారికి పాజిటివ్ ఎనెర్జీ ఉంటుంది. ఎక్కువపాపాలు చేసేవారికి నెగటివ్ ఎనెర్జీ ఉంటుంది.. ఇవి ఒకరినుంచి ఇంకొకరికి తగిలే అవకాశాలు కూడా ఉంటాయి.

 

 ఇంకో విషయం ఏమిటంటే.. అన్ని వస్తువులకు, మనుషులకు ఆరా అని ఉంటుందట. ఆరాను కొందరు ఫోటోలు కూడా తీసారు.  మనుషుల ప్రవర్తన బట్టి ఆరా ఉంటుందంటారు. మనుషులు  ధ్యానం చేసేటప్పుడు దగ్గరగా కూర్చోకుండా కొంతదూరంలో కూర్చోవాలట. ఒకరి ఆరా ఇంకొకరిని ప్రభావితం చేయకూడదంటే,  కొంతదూరం పాటించాలట. ఆరా  గురించి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి.  

*జీవితంలో దైవభక్తిని కలిగి సత్ప్రవర్తనతో జీవించడానికి ప్రయత్నించాలి.