మాకు తెలిసిన ఒకామెకు తన కొడుకు విదేశాలకు వెళ్లాలని ఎంతో కోరిక. అయితే, ఆ అబ్బాయికి విదేశాలకు వెళ్లటం అసలే ఇష్టం లేదు.
ఆ తల్లి నాతో ఏమన్నదంటే, పక్కింటి వాళ్ల అమ్మాయి విదేశాలకు వెళ్లి చదువుకుని, ఉద్యోగంలో చేరి తల్లితండ్రికి బోలెడు డబ్బు పంపిస్తుందట.
ఆ డబ్బుతోనే ఇక్కడ వాళ్లు పెద్ద బిల్డింగ్ కట్టారనీ, ఇంకా బోలెడు నగలు కొన్నారని చెప్పింది. ఆ అమ్మాయి తల్లి వేసుకు తిరిగే నగలన్నీ కూతురు విదేశాల నుంచి పంపిన సొమ్ముతో కొన్నవేనట. ఇవన్నీ చెప్పి, తన కొడుకు వెళ్ళటం లేదంటూ చెప్పి వాపోయింది.
నేను ఏమన్నానంటే, ఇప్పుడు విదేశాల్లో కూడా అంత తేలిగ్గా ఉద్యోగాలు దొరకటం లేదు, అయినా అక్కడ వస్తువులు ధరలు ఎక్కువగా ఉంటాయి.
ఇండియాలో రేట్లు తక్కువ. విదేశాలలో నెలకు మూడు లక్షలు ఆదాయం వచ్చినా, ఇండియాలో నెలకు ఒక లక్ష ఆదాయం వచ్చినా ఒకటే. అని చెప్పాను.
విదేశాలలో కొందరు పిల్లలు పడుతున్న కష్టాల గురించి కూడా వార్తలు వచ్చాయి ..
విదేశాల్లో ఈ మధ్య పరిస్థితి అంత బాగోలేదు కదా! అని చెప్పినా ఆమె అవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఎంతసేపూ..విదేశాలకు వెళ్తే బోలెడు డబ్బు సంపాదించవచ్చు కదా! అంటుంది.
మొత్తానికి ఏం చెప్పారో కానీ, ఆమె కొడుకు విదేశాలకు వెళ్ళటానికి ఒప్పుకున్నాడట.
వెళ్ళటానికి ముందు విదేశీ భాష నేర్చుకుంటే అవకాశాలు బాగుంటాయంటూ, ఈ సంవత్సరమే ఇంజనీరింగ్ పూర్తయిన అబ్బాయిని విదేశీభాష నేర్చుకోవటం కొరకు వేరే ఊర్లో చేర్పించారు.
విదేశాల్లో చదవాలంటే బోలెడు డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్దపడాలి. ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయి ఇంకో సంవత్సరం చదవాలంటే మరింత డబ్బు ఖర్చవుతుంది.
తరువాత ఉద్యోగం వస్తే ఫరవాలేదు. ఉద్యోగం రాకుంటే, బోలెడు డబ్బు వృధా అయిందంటూ సూటిపోటి మాటలు అంటే పిల్లలు తట్టుకోలేరు.
అందువల్ల పిల్లలను విదేశాలకు పంపాలనుకునేవారు ముందే అన్నివిషయాలను అర్ధం చేసుకోవాలి. అంతేకాని, ఇరుగుపొరుగుతో పోల్చి పిల్లలపై ఒత్తిడి తేవటం సరైనది కాదు.
***********
అయితే కొందరు పిల్లలేమో పెద్దవాళ్లు వెళ్ళమనకపోయినా , విదేశాలకు వెళ్ళటం మాకూ ఇష్టం లేదు కానీ , ఇక్కడ పెద్దగా అవకాశాలు లేవు కాబట్టి , కొంతకాలం విదేశాలకు వెళ్ళి వస్తాం. అని అంటారు.అది వేరే విషయం.
***************
ఈ రోజుల్లో ఎంత చదివినా ఉద్యోగాలు లభించటం కష్టంగా ఉంది.
అయితే, ఉద్యోగం లేక ఇంటి పట్టున ఉండే పిల్లల పట్ల కొందరు తల్లితండ్రులు తమకు తెలియకుండానే పిల్లలు బాధపడేలా మాట్లాడతారు.
ఇంకా ఉద్యోగం రాలేదు, తిని ఇంట్లో ఖాళీగా కూర్చోకుంటే ఏదైనా పనికోసం గట్టిగా ప్రయత్నించవచ్చు కదా! అంటారు.
ఇలా అనటం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారని కొందరు తల్లితండ్రి సమర్ధించుకుంటారు. అసలే ఉద్యోగాలు లేక పిల్లలు బాధపడుతుంటే తల్లితండ్రి కూడా అలా ప్రవర్తిస్తే పిల్లలకు ఏం దిక్కు ?
****** ********
ఈ రోజుల్లో కొందరు పొత్తిళ్ళలో ఉన్న పిల్లలు కూడా ఒత్తిళ్ళ మధ్య పెరుగుతున్నారంటే అతిశయోక్తి లేదు.
ఉదా..ఈ రోజుల్లో చాలామంది పసిపిల్లలు, తల్లి వద్ద పెరగవలసిన సమయంలో బాటిల్ పాలు త్రాగుతూ ఎక్కువ సమయం బేబీ కేర్ సెంటర్లలో పెరుగుతున్నారు.
మాకు తెలిసిన ఒక అమ్మాయి డెలివరి తరువాత నెలలోపే కెరీర్ ముఖ్యం.. అంటూ పసిపాపను పెద్దవాళ్ళ వద్ద వదిలి విదేశాలకు వెళ్ళి జాబ్లో చేరిపోయింది.
ఆ పెద్దవాళ్లు ఇంటి పనిలో సహాయం కొరకు కొందరు సహాయకులను నియమించుకున్నారు.సహాయకులు రానిరోజున ఇబ్బంది ఉంటుంది.
*************
ఒకవేళ పెద్దవాళ్ళు అనారోగ్య పరిస్థితిలో ఉంటే పిల్లల్ని బేబీ కేర్ సెంటర్లలో పెంచుతారు కాబోలు. ఏంటో పాపం ఈ రోజుల్లో చాలామంది పిల్లల పరిస్థితి ఇలాగైపోయింది.
*************
పెద్దవాళ్ళను పిల్లలు సరిగ్గా చూడాలంటూ చట్టాలున్నాయి. మరి, చిన్నపిల్లలను పెద్దవాళ్ళు దగ్గరుండి సరిగ్గా చూసుకోవాలంటూ చట్టాలు లేవా?
పెద్దవాళ్ళు తమ హక్కుల గురించి మాట్లాడతారు.
బాల్యంలో తల్లితండ్రి ఆలనాపాలనాతో పెరిగే హక్కు పిల్లలకూ ఉంటుంది కదా!
తల్లితండ్రి.. కెరీర్ కు, సంపాదనకు మొదటి ప్రాధాన్యత, పిల్లల పెంపకానికి రెండో ప్రాధాన్యత ఇవ్వటం కాకుండా.. పిల్లల పెంపకానికి చక్కటి ప్రాధాన్యతనివ్వాలి.
పిల్లలు అందరూ చక్కగా హాయిగా ఉండాలి.
****************
పాతకాలంలో చంటి పిల్లలు యూరిన్ వెళ్ళినప్పుడు క్రిందపడినా, పెద్దవాళ్ళు వెంటనే తుడిచి దుస్తులను మార్చేవారు. అప్పట్లో తల్లులు ఉద్యోగాలకు వెళ్ళకుండా ఇంటిపట్టున ఉండి పిల్లలను చూసుకునేవారు.. ఈ రోజుల్లో ఎక్కువమంది పిల్లలను బేబీ కేర్ సెంటర్లలో వేస్తున్నారు. ఇంట్లో ఉన్నవారు కూడా తుడిచే శ్రమ ఎందుకని పిల్లలకు డయాపర్లను వేస్తున్నారు. ఈ డయాపర్లు పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంటాయి.
పెద్దవాళ్లు డయాపర్లు వేసుకుని ఉండగలరా? స్త్రీలు నెలసరిలో నాలుగురోజులు వేసుకోవటానికే కష్టపడతారు. పిల్లలకైనా కష్టమే.. పిల్లలు తమ ఇబ్బందులను చెప్పుకోలేరు, చెప్పినా పట్టించుకునే వారు ఎందరు? ఎప్పుడూ డయాపర్లు వేసి ఉంచటం వల్ల కొన్నిసార్లు రాష్ వచ్చి దురద ఉన్నా గోక్కోవటానికి కూడా ఉండదు. ఏమిటో? ఇవన్నీ...దైవమే దిక్కు.
..............................
పగలంతా ఆఫీస్ పని చేసాక, స్త్రీలకైనా, పురుషులకైనా ఇంటిపనిచేయాలంటే నీరసంగానే ఉంటుంది. అందువల్ల చాలామంది బయట ఫుడ్ తెప్పించుకుంటున్నారు. బయటఆహారం ఎప్పుడూ తింటే ఆరోగ్యం ఏమవుతుందో తెలియదు.
ఇంటిపని చేయటం గురించి భార్యా భర్త గొడవపడుతుంటారు. ఇద్దరూ కలసి చేయాలనుకుంటారు కానీ, ఆచరణలో చాలాసార్లు అందరికి సాధ్యం కాదు.
పాతకాలంలో
పురుషులకు బయటకెళ్ళి సంపాదించే పని, స్త్రీలు ఇంటిపని చేసుకునేవారు.
స్త్రీలు పగలు కొంత విశ్రాంతి తీసుకునేవారు. అత్త,కోడళ్లు గొడవలు..మొదలైన
కారణాలతో ఆ వ్యవస్థ పోయింది. ఆ వ్యవస్థ మళ్లీ రావాలని నేను కోరుకోవటం లేదు
కాని, ఉద్యోగం చేసే స్త్రీలకు, పనిగంటలు తక్కువగా ఉండే ఉద్యోగాలు, కొందరు
స్త్రీలు కలసి చిన్న వ్యాపారం చేసుకుంటూ తమకు అనువైన పనిగంటలు
ఏర్పరుచుకోవటం, చంటి పిల్లల్ని తమ వద్దే ఉంచుకునేలా ఉంటే బాగుంటుంది.
కొందరు
తల్లులు ఉద్యోగాలు చేయకుండా ఇంట్లోనే ఉన్నాకూడా, బద్ధకంతో వంటసరిగ్గా
చేయరు. బయటే ఎక్కువగా ఆహారం తెప్పించుకుంటారు. ఎక్కువసమయాన్ని ఫోన్లలో
కబుర్లు చెప్పటం, సీరియల్స్ చూడటం చేస్తుంటారు. కబుర్లు చెప్పుకోవటం,
సీరియల్స్ చూడటం తప్పుకాదుకాని, ఇంటిపని, పిల్లలపని చక్కగా చూసుకోవాలి
కదా..
...............................
ఈ రోజుల్లో కొందరు తల్లితండ్రి కూడా పిల్లల్ని కొడుతున్న సంఘటనలు విన్నాము.మనుషులు ఎందుకు ఇలా చేస్తున్నారో?
పిల్లల్ని
క్రెచ్లలో ఉంచి తల్లులు పనులకు వెళ్తున్నారు. మాటలురాని చంటిపిల్లల్ని
అక్కడ బాగా చూస్తున్నారో ? లేదో? కొన్ని క్రెచ్లలో చంటిపిల్లల్ని
బాధపెట్టిన కేసుల గురించి విన్నాక ఎంతో బాధనిపించింది. ఏమీ తెలియని చంటి
పిల్లల్ని అలా వేరే వారి దగ్గర వదలటం కన్నా, తల్లి దగ్గరుండి పెంచటం
సరైనది.
మాటలురాని,
తమబాధలు చెప్పలేని చంటిపిల్లలను దగ్గరుండి చూసుకోవటం తల్లి బాధ్యత. అది
వదిలేసి పిల్లల్ని ఎక్కడో పెంచటం అన్యాయం. కొందరు పెద్దవాళ్లు
చంటిపిల్లల్ని కొడుతున్నట్లు వార్తలు వచ్చాయి. పిల్లల్ని పెంచే ఓపిక
లేనప్పుడు, పెద్దవాళ్లకు కెరీర్, డబ్బే ముఖ్యం అనుకున్నప్పుడు.. దయచేసి
పిల్లల్ని పుట్టించవద్దు.
......................... కొందరు ఏమంటున్నారంటే, పిల్లల్ని తల్లే చూడాలా? ఇంట్లో
అందరి బాధ్యత అంటున్నారు. భార్యాభర్త ఉద్యోగాలకు వెళ్తే తాతబామ్మ ఉంటే
వాళ్లు చూడాలని వాళ్ళ ఉద్దేశం కాబోలు.
తాతబామ్మ చూడాలి కాని, పాతకాలంలో
పిల్లలు త్వరగా వివాహాలు చేసుకునే రోజుల్లో బామ్మలకు 45 అలా వయస్సు ఉండేది.
ఈ రోజుల్లో పిల్లల ఆలస్య వివాహాల వల్ల పెద్దవాళ్లకు 60 ఏళ్లు వస్తోంది.
పెద్దవాళ్ళు
కొంతవరకు ఇంటిపని చేయటం, పిల్లల్ని ఆడించటం చేస్తారు కాని, మొత్తం
ఇంటిపని, చిన్న పిల్లల పని చేయాలంటే కష్టమే. ఇంటిపని, పిల్లల్ని
చూసుకోవటానికి ఎవరినైనా పనిలో పెట్టుకుంటే పెద్దవాళ్ళకు సులభంగా ఉంటుంది.
కొందరు
చిన్నపిల్లల్ని పెంచటానికి ఆయాను పెడతారు. వాళ్లు పిల్లల్ని ఎలా చూస్తారో
చెప్పలేం.
పెద్దవాళ్లు ఉంటే ఆయా కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తారు. అలాగని నేను
ఆయాలను తప్పుగా అనటం లేదు. పిల్లల్ని మంచిగా చూసుకునే ఆయాలు ఎందరో ఉంటారు.
అయితే, ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటారో తెలియటం లేదు కదా.
పెద్దవాళ్లు పిల్లలను ఒక్కరే
చూసుకోలేనప్పుడు కూడా, ఆయా ఉంటే సహాయంగా ఉంటుంది. ............
మాటలురాని,
తమబాధలు చెప్పలేని చంటిపిల్లలను దగ్గరుండి చూసుకోవటం తల్లి బాధ్యత. అది
వదిలేసి పిల్లల్ని ఎక్కడో పెంచటం అన్యాయం. కొందరు పెద్దవాళ్లు
చంటిపిల్లల్ని కొడుతున్నట్లు వార్తలు వచ్చాయి. పిల్లల్ని పెంచే ఓపిక
లేనప్పుడు, పెద్దవాళ్లకు కెరీర్, డబ్బే ముఖ్యం అనుకున్నప్పుడు.. దయచేసి
పిల్లల్ని పుట్టించవద్దు.
...............................
ధరలు విపరీతంగా పెరగటం వల్ల డబ్బు సరిపోక ఉద్యోగాలు
చేస్తున్నామని కొందరు స్త్రీలు చెబుతారు. ధరలు విపరీతంగా పెరగకుండా
ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.జనాలకు కోరికలు బాగా పెరిగితే కూడా, ఎంత
డబ్బున్నా చాలదు.
అయితే, కొందరు స్త్రీలకు భర్త చనిపోవటమో, వదిలేయటమో, భర్త ఉన్నా అతను ఇంటిని సరిగ్గా పట్టించుకోకుండా తిరగటమో చేస్తుంటారు..అలాంటి స్త్రీలు కుటుంబాన్ని పోషించటానికి ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో..చేయవలసి వస్తుంది....
అందరి పరిస్థితి అలా ఉండదు, చాలామంది స్త్రీలు ఉద్యోగాలు చేసి ఆదాయం పొంది, పెద్ద ఎత్తున వస్తువులు, దుస్తులు, ఆభరణాలు కొంటారు....అవన్నీ చూసి మిగతావారు కూడా అలా కొనటానికి పోటీ పడతారు.
..........................
మగవాళ్లు ఎందరో ఉద్యోగాలు లభించక నిరుద్యోగులుగా
ఉన్నారు. స్త్రీలు ఉద్యోగాలు చేయకపోయినా ఫరవాలేదు కానీ, పిల్లల్ని
మంచిపౌరులుగా తయారుచేసి సమాజానికి అందించగలిగితే సమాజానికి చాలా మేలు
చేసినవారవుతారు.
నైతిక విలువలున్న మంచిపౌరులున్న సమాజంలో ధరలు
విపరీతంగా పెంచరు. ఇతరులకు అన్యాయం చేయరు. అశ్లీల సినిమాలు, చిత్రాలు,
సీరియల్స్ తీయరు. మద్యం, మత్తుమందులు ఉండవు. నేరాలుఘోరాలు ఉండవు. సమాజం
బాగుండాలంటే నైతికవిలువలున్న పౌరులు ఉండాలి.