మా ఇంటివద్ద పారిజాతం పువ్వుల చెట్టు ఉంది. పారిజాతం పువ్వులు బాగుంటాయని నేనే మొక్క తెచ్చి పెట్టాను.
ఇప్పుడు ఆ మొక్క పెద్దదయ్యి చక్కగా పువ్వులు పూస్తోంది. రాత్రి సమయంలో చక్కటి సువాసన కూడా వస్తుంది.
అయితే, ఆ సువాసనను పీల్చితే, ఉదయాన ఆ పువ్వులను దేవునికి సమర్పించవచ్చో? లేదో ? అని నాకు సందేహం కలిగింది.
అలాగని పీల్చకుండా ఉండటం కష్టం...ఇలా అతిగా ఆలోచించటం కూడా సరికాదేమోనని అనిపిస్తుంది.
**********
పారిజాతం పువ్వులను చెట్టునుంచి కోయకూడదంటారు. క్రింద రాలిపడిన పువ్వులనే ఏరి పూజలో సమర్పించాలట.
ఒక శుభ్రమైన వస్త్రాన్ని నేలమీద పరిచి వస్త్రం పైన రాలిపడిన పువ్వులను తీసుకోవచ్చట.
అలాగని, వస్త్రాన్ని పరిచి, పని ఉందని మనం లోపలికి వెళ్తే.. ఆ వస్త్రం పైనుంచి పిల్లి వంటివి నడిచి వెళ్తే దోషం కావచ్చు.
కాబట్టి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
పారిజాతం చెట్టు దేవాలయంలో తప్ప ఇంట్లో పెట్టకూడదని కొందరంటారు...
అయితే, ఇంట్లో కూడా పెంచుకుంటారు కొందరు.
*********
నేను మా ప్రహరీ బయట రోడ్డు ప్రక్క నాటాను. కొమ్మలు మా ఇంటివైపు కొన్ని, రోడ్డు వైపు కొన్ని పెరిగాయి. అందువల్ల, కొన్ని పువ్వులు రోడ్డుపైన పడుతున్నాయి.
రోడ్డుపై వస్త్రాన్ని పరవటం అంటే కుదరదు కదా! వాహనాల వల్ల, నడిచేవారి వల్ల పువ్వులు నలిగిపోతుంటాయి. ఇదంతా చూసినప్పుడు బాధగా ఉంటుంది. క్రింద పడ్డ పువ్వులను కొంతవరకు ఏరివేస్తున్నాను.
పారిజాతం దేవతా వృక్షం కాబట్టి, చుట్టుప్రక్కల విపరీతంగా పెరగకుండా కొమ్మలు కత్తిరించవచ్చో? లేదో ? అనిపించింది.
అయినా వేరే దారిలేక కొన్ని కొమ్మలను కత్తిరించాను.
కొమ్మలు పెద్దగా పెరిగిన తరువాత కొమ్మలను కొడితే చెట్టుకు ఎక్కువ బాధ కలగవచ్చు. అందువల్ల, చిగుర్లు వస్తున్నప్పుడే తుంపవచ్చు.
అయినా, కొన్నిసార్లు పెద్దయిన కొమ్మలను కత్తిరించటమూ తప్పకపోవచ్చు.
ఇవన్నీ ముందు తెలియలేదు.... ముందే ఆలోచన వచ్చి ఉంటే రోడ్డు ప్రక్క మొక్క నాటకుండా, ఆలోచించి నిర్ణయం తీసుకోవటం జరిగేది.
ఇంకో సమస్య ఏమిటంటే, పువ్వుల సీజన్ తరువాత కాయలు వచ్చి, విత్తనాలు నేలమీద పడి చిన్న మొక్కలు వస్తాయి. అలా వచ్చిన పారిజాతం మొక్కలను తీసివేస్తున్నాను.
ఆ చిన్న మొక్కలను పీకివేస్తున్నప్పుడు బాధగా అనిపిస్తుంది. దేవతామొక్కలను ఇలా పీకవచ్చో ? లేదో ? పీకివేస్తే పాపమేమో ? అని భయంగా కూడా ఉంటుంది. వేరే దారిలేక తీసివేస్తున్నాను.
వీలైనంతలో కాయలు కోసివేయటానికి ప్రయత్నిస్తున్నాను కానీ, అన్ని కాయలనూ కోయటం నావల్ల కాదు.
ఏమిటో, ఇలా.. అనేక విషయాలలో ఏం చేయాలో ? ఏం చేయకూడదో ? అని అయోమయంగా అనిపిస్తోంది.
*************
ఇలాంటప్పుడు ఏమనిపిస్తుందంటే, కొన్నిసార్లు ఎక్కువ విషయాలు తెలియకపోవటం వల్ల కూడా లాభాలుంటాయేమో? అనిపిస్తుంది.
తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేనంటారు.
కొన్నిసార్లు తెలియక చేసిన తప్పులకు దోషం అంతగా ఉండదట ? విషయం తెలిసినా పాటించకపోతే.. వచ్చే పాపం ఎక్కువట.
అలాంటప్పుడు, ఎక్కువ విషయపరిజ్ఞానం లేకపోవటం కూడా కొన్నిసార్లు మంచిదేనేమో ? అనిపిస్తున్నది.
విషయపరిజ్ఞానం ఉండటం మంచిదే. అయితే, పరిస్థితిని బట్టి విచక్షణతో ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం మంచిది.
పరిస్థితి అయోమయంగా ఉంటే దైవాన్ని ప్రార్ధించటం ఉత్తమం.
No comments:
Post a Comment