koodali

Monday, June 13, 2022

దైవమా మంచి ఎప్పుడూ మీ దయే. మీకు అనేక కృతజ్ఞతలు.

 

 దైన్యం లేని జీవితం...అనాయాసమరణం..మోక్షం..కావాలని అందరికీ ఉంటుంది. 

అవిపొందాలంటే దైవభక్తి..ధర్మబద్ధజీవనంతో జీవించటానికి ప్రయత్నించటం జరగాలి. 

జీవితంలో సరైన దారిలో జీవించే శక్తిని ఇవ్వమని దైవాన్ని ప్రార్దించాలి.

 ............ 

దైవమా.. మీరు శాశ్వత పరమానంద స్వరూపులు. అత్యంత శక్తిమంతులు. జీవులు ధర్మబద్ధంగా జీవిస్తూ హాపీగా ఉండేలా దయచూడమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను. 

దైవమా.. మీసృష్టి మీఇష్టం..ఏది ఎప్పుడు ఎలా చేయాలో మీకు తెలుసు. దైవమా మంచి ఎప్పుడూ మీదయే. మీకు అనేక కృతజ్ఞతలు.

దైవం దయ ఉంటే అన్నీ ఉంటాయి...

 

మనలో చాలామందికి దైవభక్తి ఉంటుంది.
అయితే, దైవం మాత్రమే శాశ్వతం..సంసారం అశాశ్వతం అని తెలిసికూడా..సంసారలంపటాలు..సుఖం అనిపించినప్పుడు సంతోషపడటం, కష్టం అనిపించినప్పుడు బాధపడటం చేస్తుంటాం. అలా చేయటం కూడా సామాన్య మానవులకు సహజమే.

ఎక్కడో అసామాన్యులకు తప్ప సాధారమానవులకు జీవితంలో సంసారలంపటం ఉండటం కూడా సహజమే.అలాగే జగన్నాటకం నడుస్తోంది.

మన మనస్సే అనుకుంటాం కానీ, దానిని మన అదుపులో పెట్టుకోవటం చాలా కష్టం. అలా మన మనస్సును మన అదుపులో ఉంచుకోగలిగితే ఎంతో బాగుంటుంది.


అది రానంతవరకూ బాధలు తప్పవు.మన మనస్సునే మనం అదుపులో ఉంచుకోలేనప్పుడు ప్రపంచంలో వేరేవాటిని ఏం చేయగలం?

 కనీసం కష్టాలలో అతిగా బాధపడకుండా సుఖాలలో అతిగా సంతోషపడకుండా మన ధర్మాన్ని చక్కగా  పాటిస్తూ ఫలితాన్ని దైవానికి వదిలి, తామరాకుమీద నీటిబొట్టులా జీవిస్తే బాగుంటుంది.

 అయితే, ఆ స్థితప్రజ్ఞత రావాలంటే ఎంతో కృషిచేయాలి. కనీసం వృద్ధాప్యంలో వచ్చినా మంచిదే. అంతా దైవం దయ.

ఇలా ఆలోచిన కొద్దీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎన్ని చెప్పుకున్నా చెప్పుకునేవి ఉంటూనే ఉంటాయి. అయితే, అతిగా చెప్పుకోవటం ఎందుకులెండి. ఏవో కొన్ని విషయాలను వ్రాయాలనిపించి ఇవన్నీ వ్రాసాను కానీ, నేను ఎక్కువగా బ్లాగ్ వ్రాయాలనుకోవటం లేదు.
.....

ఆలోచించే కొద్దీ ఒకదానితరువాత ఒకటి  కొత్త ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అవన్నీ వ్రాసినా మళ్ళీ  కొత్త ఆలోచనలు వచ్చి, అప్పుడు అలా కాకుండా ఇలా వ్రాస్తే బాగుండేది అని సరిదిద్దాలనిపిస్తుంది. ఇందతా ఒక మాయాప్రపంచం. అంతులేని కధ.

 ప్రపంచంలో విజ్ఞానానికి అంతులేదు. ఎంత తెలుసుకున్నా తెలుసుకునేవి ఉంటూనే ఉంటుంది. మనం సుఖంగా ఉండాలంటే  ఎంతవరకూ అవసరమో అంతవరకు తెలుసుకుంటే చాలు. అతి అనవసరం. ఎక్కువగా తెలుసుకోని వాళ్ళు కూడా తమకు అవసరమైనంత తెలుసుకుని, దైవంపై భారం వేసి హాయిగా ఉండవచ్చు.

 మనకు ఒక సామెత ఉంది. అన్నీ తెలిసిన ఒకరు అమావాస్య నాడు పోతే.. ఏమీ తెలియని ఒకరు ఏకాదశినాడు పోయారని.

 కంప్యూటర్లు, ఫోన్లు ఎక్కువగా వాడితే అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. విజ్ఞానం అయినా అంతే. ప్రపంచంలోని విషయాలన్నీ తెలుసుకుని ఏం చేస్తాం..ఏది ఎంతవరకో అంతవరకూ ఉంటే మంచిది.

 చిన్నపిల్లలు చూడండి వాళ్ళకేమీ తెలియదు హాయిగా ఉంటారు.పెద్దవారు చిన్నపిల్లల్లా ఉండక్కర్లేదు కానీ, ఎంతలో ఉండాలో అంతలో ఉంటే చక్కగా ఉంటుంది.

అందుకే వైరాగ్యంలో ఆనందం ఉంటుందని అంటారు.

అతిగా ఆలోచిస్తే బుర్ర వేడెక్కి అనారోగ్యాలు వచ్చే అవకాశముంది.అందుకే, మెదడుకు కూడా రెస్ట్ ఇవ్వాలని ఎక్కువ ఆలోచించకుండా కొంతసేపైనా ధ్యానం చేస్తే మంచిదని అంటున్నారు.

ఎక్కువగా తెలయని వాళ్ళు కూడా తమకు అవసరమైనంత తెలుసుకుని  దైవంపై భారం వేసి హాయిగా ఉండవచ్చు.
దైవం దయ ఉంటే అన్నీ ఉంటాయి.

 

కష్టాలు తీర్చమని దైవాన్ని ప్రార్దించటంలో తప్పులేదు. అయితే,

 

కష్టాలు తీర్చమని దైవాన్ని ప్రార్దించటంలో తప్పులేదు. అయితే, మనం కూడా పాపాలు చేయకుండా ఉండాలి. పాపాలు చేసి, ఎన్ని పూజలు చేసినా కష్టాలు తగ్గటం లేదు ఏమిటో అనుకుంటే ఎలా.. పూజలు చేసే వారిలో రకరకాల వాళ్ళుంటారు.

 

  మా బంధువు ఒకామె వయస్సులో ఉన్నప్పుడు చాలా నోములు, వ్రతాలు చేసిందట. వృద్ధాప్యంతో భర్త మరణిస్తే.. ఇన్ని పూజలు చేసినా ఇలా జరిగింది ఏమిటో అంటుంది ఆమె. వృద్ధాప్యం వచ్చిన తరువాత మరణం సహజం కదా. 

 

 కొందరు దైవభక్తి కలిగి.. స్వధర్మాచరణ చేస్తూ ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ..ఎక్కువగా పూజలు చేస్తుంటారు. 

 

 కొందరికి ఎక్కువసేపు పూజలు చేయటంపై ఆసక్తి లేకపోవచ్చు. దైవభక్తి కలిగి, స్వధర్మాచరణ చేస్తూ ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ.. ఎక్కువగా పూజలు చేయకపోయినా.. శక్తిమేరకు పూజలు చేస్తూ.. దైవస్మరణ చేస్తుంటారు. 

 

కొందరు పాపాలుచేస్తూనే కోరికలు తీరటం కొరకు పూజలు కూడా ఎక్కువగా చేస్తుంటారు. వీరికీ కొంత భక్తి ఉంటుంది. ఎంత భక్తి ఉన్నా దైవానికి ఇష్టం కాని విధంగా పాపాలు చేస్తూ అధర్మంగా జీవిస్తే ఎన్ని పూజలు చేసినా దైవానికి నచ్చదు.

 ఎవరు ఎటువంటివారో ఎవరికి ఎటువంటి ఫలితం లభిస్తుందో మనకు తెలియదు, అన్నీ దైవానికే తెలుస్తాయి. 

 ************* 

ఎవరి కర్మఫలితాన్ని వారే అనుభవించాలి. ఎవరైనా ఎప్పుడైనా పాపాలు చేస్తేనే వాటి ఫలితంగా కష్టాలు వస్తాయి. కష్టాలను భరించలేకపోతే ..గతంలోనో, గతజన్మలోనో ఏవో పాపాలు చేసి ఉంటామని పశ్చాత్తాపాన్ని చెంది, దైవాన్ని ప్రార్ధించుకోవచ్చు. ఇప్పుడు పాపాలు చేయటాన్ని మాని, పుణ్యకార్యాలను చేస్తూ ఉంటే గతపాపకర్మ పలుచన అయ్యి, కష్టాలు తగ్గే అవకాశముంది. 

 

అంతేకానీ, కష్టాలు పోవటానికంటూ తిరిగి జీవహింస వంటి పాపాలను చేయటమేమిటో? అని నాకు అనిపిస్తుంది. 

చెడ్దవాళ్లు మంచివారిని పీడించినప్పుడు కూడా కష్టాలు వస్తాయి. అప్పుడు కూడా శక్తి మేరకు వారిని ఎదుర్కుంటూ ..దైవాన్ని సాయం చేయమని ప్రార్ధించవచ్చు. 

 

పవిత్రంగా ఉండవలసిన ఈశాన్యంలో మురికిదుస్తులు, ఎంగిలి పాత్రలు వేసి కడగవచ్చా?

 

 ఇప్పుడు మీడియాలో ఎన్నో విషయాలను రకరకాలుగా  చెబుతున్నారు. అవన్నీ వింటే  ఏం చేస్తే ఏం తప్పో? అన్నట్లు అయోమయం కలుగుతోంది.

అయితే, ప్రతిదానికి మీరు ఇలా చేయకూడదు. అలా చేస్తే ఇక బతుకు అంతే..అన్నట్లు చెబుతుంటే భయంగా ఉంటుంది.

జీవితంలో  నియమనిబంధనలు, ఆచారవ్యవహారాలు  అవసరమే. అయితే, విపరీతధోరణి  పెరిగితే జీవితమే కష్టం.

 దైవపూజకు కూడా రకరకాల ఆచారాలు ఉంటే పూజకంటే ఈ ఆచారాలను పాటించామా లేదా అనే మనస్సు ఉంటుంది.

ఉదా..పండుగల రోజుల్లో ఎన్నో ఆచారవ్యవహారాలు  ఉంటాయి. ఆ కంగారులో అంతా హడావిడిగా ఉంటుంది. పండుగరోజుల్లో కన్నా  మామూలు రోజుల్లోనే చక్కగా పూజ చేసుకోవటానికి  వీలు కుదురుతుంది అనిపిస్తుంది.

పోనీ ఇన్ని విషయాలను పాటిస్తున్నవాళ్ళు అందరూ ధర్మబద్ధంగా జీవిస్తున్నారా? అంటే సరిగ్గా చెప్పలేం. అలా అందరూ ధర్మబద్ధంగా జీవిస్తే సమాజంలో ఇన్ని నేరాలు ఎందుకు జరుగుతున్నాయి.

.................
ప్రాచీనులు ఎన్నో చక్కటి ఆచారవ్యవహారాలను తెలియజేశారు. ప్రాచీనులు తెలియజేసిన విషయాలలోని అంతరార్ధాలను సరిగ్గా గ్రహించటం అవసరం.

కాలక్రమేణా కొన్ని ఆచారవ్యవహారాలు మార్పులు, చేర్పులకు  లోనయ్యాయి. ఈశాన్యం అంటే దైవస్థానం..పవిత్రంగా ఉండాలని అంటారు. ఈశాన్యాన నీరు ప్రవహిస్తే  కూదా మంచిదంటారు. నాకు తెలిసినంతలో ఈశాన్యాన బావి వంటివి ఉంటాయి.

చాలా ఇళ్ళలో ఈశాన్యాన నీరు పారాలని చెప్పి కొందరు అక్కడ పంపు ఏర్పాటుచేసి, అక్కడే మురికిదుస్తులను, తిన్న వంటపాత్రలను పడేసి కడుగుతుంటారు.

 పవిత్రంగా ఉండవలసిన ఈశాన్యంలో మురికిదుస్తులు, ఎంగిలి పాత్రలు వేసి కడగవచ్చా?

వేరే దిక్కుల వద్ద  పాత్రలు, దుస్తులు శుభ్రం చేసుకుని ఆ నీటిని తూర్పు లేక ఉత్తరం నుంచి వెళ్ళేలా ఏర్పాటు చేసుకోవచ్చు.

కొందరయితే ఈశాన్యాన నీరు పారాలని టాయ్లెట్ కూడా కట్టేస్తారు. ఏమిటో చిత్రవిచిత్రమైన వ్యవహారాలు.
.........
 గుమ్మాలకు పసుపు  వ్రాస్తే .. పసుపులోని యాంటిబయాటిక్  గుణం వల్ల, బయట నుంచి వచ్చి గడపకు తగిలిన దుమ్ము, ధూళిలోని విషపదార్ధాలను పసుపు కొంతయినా నిర్మూలిస్తుందని  అలా చెప్పి ఉంటారు.

అయితే,  ఈ రోజుల్లో పసుపు బదులు పసుపు రంగులను వేస్తున్నారు.ఇలా ఎన్నో ఆచార వ్యవహారాలు రూపు మార్చుకుని అమలు జరుగుతున్నాయి.
......

ఉత్తరదిక్కున  తలపెట్టి  పడుకోకూడదని పెద్దవాళ్ళు  తెలియజేసారు. అలా పడుకుంటే అయస్కాంత ప్రభావం  వల్ల  కొన్ని అనారోగ్యాలు వచ్చే  అవకాశముందని  తెలుస్తోంది. ఇలాంటి విషయాలను  పాటించటం  మంచిదే.
............
మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే బంధువులు, ఇరుగుపొరుగువారు వారికి తోచిన ఆచారవ్యవహారాలను రకరకాలుగా చెప్పి విసిగించేసారు, ఫంక్షన్ అయ్యేటప్పటికి బోలెడు డబ్బు ఖర్చు, నీరసం వచ్చి, ఎవరిని పిలవకుండా సింపుల్ గా చేసుకున్నా బాగుండేదని అనిపించింది.

అయితే, ప్రతి విషయానికి  అనేక  నియమాలు చెప్పి, ప్రతి పనికి ముందుకాళ్ళకు బంధం అన్నట్లు  పరిస్థితి ఉంటే జీవితంలో  చాలా కష్టం.

నేను ఎవరినీ విమర్శించటానికి ఇవన్నీ వ్రాయటం లేదు..ఇవన్నీ వినేవారిలో చాలామంది భయస్తులుంటారు. అమ్మో..ఇవన్నీ పాటించకపోతే ఏమవుతుందో..అని భయపడతారు.

పట్టించుకోనివారు ఎలాగూ పట్టించుకోరు. పట్టించుకునే కొందరు సున్నిత మనస్కులకు ఇవన్నీ ఆచరించలేక, ఆచరించకపోతే ఏమవుతుందో అనే భయంతో బ్రతుకుతుంటారు. ఈ ఆచారవ్యవహారాల అమలు గురించి కొన్నిసార్లు  ఇంట్లో గొడవలు కూడా జరుగుతాయి. ఒక ఇంట్లోని వారందరూ ఒకే మనస్తత్వం ఉన్నవారు ఉండరు కదా.
.....

 మూఢనమ్మకాల నుంచి దైవమే కాపాడాలి.
 
 

ఏం చేయాలో మనకు సరిగ్గా అర్ధం కానప్పుడు దైవాన్ని ప్రార్దించుకోవటం మంచిది....

ఈ రోజుల్లో మీడియా ద్వారా ఎందరో ఎన్నో చక్కటివిషయాలను తెలియజేస్తున్నారు. అయితే, అది చేయకూడదు, ఇది చేయకూడదు వంటి విషయాలను మరీ ఎక్కువగా చెప్పటం వల్ల అయోమయం పెరుగుతుంది. 

 

 మనకు ఆచారవ్యవహారాలు ఎక్కువ.క్యాలండర్ లో చూస్తే నెలలో సుమారు చాలా రోజులు ఏదో ఒక విశేషం అని ఉంటుంది. దైవసృష్టిలో కాలం అంతా పవిత్రమే. ఎప్పుడైనా దైవపూజ చేసుకోవచ్చు. మనకు జీవించటానికి అవసరమైన వాతావరణాన్ని, గాలినీ, నీటినీ, ఆహారాన్ని, మరెన్నింటినో..అందించిన దైవానికి మనం తప్పక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అదే పూజ కూడా అవుతుంది.

 

 పండుగ అంటే..తలస్నానం చేయటం, ఉపవాసం, బ్రహ్మచర్యం..వంటివి పాటిస్తారు. అలాగని రోజూ ఏదో ఒక పండుగ అని రోజూ ఉపవాసాలు అంటూ సరిగ్గా ఆహారం తీసుకోకపోవటం, రోజూ తలస్నానం చేసి తల సరిగ్గా తుడుచుకోకపోతే అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. రోజూ పండుగ అని వివాహం అయిన వారు రోజూ బ్రహ్మచర్యం పాటించాలంటే కష్టం. ముఖ్యమైన కొన్నిపండుగలను చూసుకుని అప్పుడు మాత్రం నియమాలను పాటించి.. మిగతా రోజులలో మామూలుగా పూజ చేసుకోవచ్చు. 

 

సమాజం నడవాలంటే ఎన్నో వృత్తులు ఉండాలి. కొన్ని వృత్తుల వారికి ఎక్కువ సమయం పూజలో కూర్చోవటానికి సమయం కూడా ఉండదు. అందువల్ల, కొన్ని వృత్తుల వారు కొద్దిగా పూజ చేసినా చాలు ఎక్కువ ఫలితం వస్తుందని తెలియజేసారు. పనులు చేసుకుంటూనే కుదిరినంతలో దైవాన్ని స్మరించుకోవచ్చు. 

 

కలికాలంలో అనేక కారణాల వల్ల ఎక్కువ పూజలు చేసే శక్తి ప్రజలకు ఉండదు కాబట్టి, కలికాలంలో దైవనామస్మరణ చేసినా తరించవచ్చని పూర్వీకులు గ్రంధాల ద్వారా తెలియజేసారు.

 .............. 

ఆచారవ్యవహారాలు, నియమనిబంధనలు జీవితంలో అవసరమే. అయితే, వాటివల్ల సమాజం,సమాజంలోని వ్యక్తులు అభివృద్ధి చెందాలి.అందరిలో దైవభక్తి , ధర్మాచరణ పెరగాలి. అంతేకాని ప్రతిపనికి ముందరికాళ్ళకు బంధాలు వేసినట్లు ఈ పని ఇప్పుడు చేయకూడదు, ఇలా చేయకూడదు. .అంటూ ఎక్కువగా చెప్తే అవన్నీ పాటించాలంటే కష్టం. 

 

వైరాగ్యం అంటే అందరూ నిరాశానిస్పృహలతో అన్నీ వదిలి దేశాన్ని అత్యాశ ఉన్న వారికి అప్పగించటం కాదు.లోకకల్యాణం కొరకు ఎవరి స్వధర్మాన్ని వారు చక్కగా నిర్వర్తించాలి.సమాజంలో అందరూ బాగుంటే లోకకల్యాణం కూడా జరుగుతుంది. వైరాగ్యంతో కొండకోనల్లో తపస్సులు చేసేవారు కూడా తమతపశ్శక్తిని లోకకల్యాణం కోసం ఉపయోగించిన వారు ఉన్నారు. 

 

భగవద్గీతలో శ్రీకృష్ణులవారు అర్జునునితో.. నీ స్వధర్మాన్ని నీవు నిర్వర్తించాలని తెలియజేసారు. ఎవ్వరైనా నిష్కామకర్మయోగాన్ని అనుసరించి జీవితాన్ని గడిపితే దైవకృపను పొందవచ్చు.

  ........... 

పూర్వీకులు మనకు చక్కటి జీవనవిధానాన్ని అందించారు.చతురాశ్రమ వ్యవస్థను ఏర్పరిచారు. దైవభక్తి కలిగి, ధర్మ బద్ధంగా స్వధర్మాచరణ చేస్తూకూడా యోగిలా జీవించి దైవకృపను పొందవచ్చు. జనకమహారాజు వంటివారు అలా జీవించినవారే. 

 

ప్రాచీనులు సమాజఉన్నతికొరకు ఎంతో విజ్ఞానాన్ని అందజేసారు. ప్రజల శారీరిక, మానసిక ఉన్నతికొరకు ఎన్నో పద్ధతులను ఏర్పరిచారు. వాటికొరకు ఎన్నో ఆచారవ్యవహారాలను, నియమాలను తెలియజేసారు. ఎలా జీవిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో పురాణేతిహాసాలలోని పాత్రల ద్వారా తెలియజేసారు. 

 

అయితే, కొందరు వాటిని సరిగ్గా అర్ధం చేసుకోకుండా, వాటిలో కొన్నింటిని మూఢాచారాలుగా మార్చివేసారు. కాలక్రమేణా గ్రంధాలలో కొన్ని మార్పులు చేర్పులు {ప్రక్షిప్తాలు}జరిగాయంటున్నారు. కొందరు తెలిసీతెలియనివారు, కొందరు అసూయాపరులు కూడా ఇలా మార్పులుచేర్పులు చేసి ఉండవచ్చు. గ్రంధాలలో ఏమేమి ప్రక్షిప్తాలు జరిగాయో.. ఏదిప్రక్షిప్తమో? ఏది కాదో? తెలియటం లేదు. 

 

అందువల్ల మనం ప్రతి దానిని గుడ్డిగా ఆచరించటం కాకుండా.. పూర్వీకులు తెలియజేసిన విషయాలలోని అంతరార్ధాలను సరిగ్గా గ్రహించి పాటించవలసి ఉంటుంది.

  ............... 

దైవభక్తి కోసం పూజ చేయాలి. ఆచారవ్యవహారాలను పాటించటం కోసం పూజ కాదు. పూజ చేస్తూ భక్తిలో లీనమయినప్పుడు కొన్నిసార్లు పూజ చేసే పద్ధతి తప్పవచ్చు. అలాగని, పూజా విధానంలో తప్పులు వస్తే ఏమవుతుందో అనే భయంతో పూజాపద్ధతి అందే ఎక్కువ మనస్సు ఉంచి, దైవభక్తికి రెండవ ప్రాముఖ్యత ఇస్తే అది సరైన పూజ అనిపించుకోదు.

 

 ఒక భక్తుడు భక్తిలో లీనమయ్యి పండుకు బదులు తొక్కలను దైవానికి సమర్పించగా దైవం ఆ పూజను స్వీకరించారని గ్రంధాలద్వారా తెలుస్తుంది. 

...... 

ఏం చేయాలో మనకు సరిగ్గా అర్ధం కానప్పుడు దైవాన్ని ప్రార్దించుకోవటం మంచిది.

 

ఈ మధ్యన మేము తెలిసిన వాళ్ళింటికి వెళ్ళాము..

 

 ఈ మధ్యన మేము తెలిసిన వాళ్ళింటికి వెళ్ళాము.వారి  ఇంటిముందు బోలెడు స్థలం ఉంది. అయితే, అంతా సిమెంట్ చేసి, ఎండకు ఫెళ్ళున ఎండపడి ఎడారిలా ఉంది.


ఇంత ఖాళీ స్థలం ఉంది.. మొక్కలు పెంచుకోవచ్చు కదా..అని అడిగితే, ఇంటామె ఏమన్నారంటే.. అయ్యో ఏం చెప్పమంటారు..ఈ మధ్య వరకూ ఎన్నో మొక్కలూ, చెట్లూ ఉండేవని, వాస్తు బాగోలేదు అని ఎవరో చెబితే వారి భర్త ఆ మొక్కలు, చెట్లు అన్నీ తీయించేసి సిమెంట్ చేయించేసారని చెప్పి చాలా బాధపడింది.



అయితే, కొందరు ఇంటిచుట్టూ చెట్లను పెంచితే రాలిన ఆకులను శుభ్రం చేసుకోవటం కష్టమని కూడా చెట్లను పెంచటం మానేసారు.

ఈమధ్యన ఎన్నో అంతస్తులతో ఎత్తుగా కడుతున్న అపార్ట్మెంట్స్ వల్ల కూడా చుట్టుప్రక్కల ఇళ్ళవారికి ఏ దిక్కునుంచి కుడా సూర్యరశ్మి ఇళ్ళలోకి రావట్లేదు.



 ప్రజలందరూ ఇంటిచుట్టూ కొన్నయినా చెట్లు పెంచేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అడవులు అంతరించిపోకుండా కూడా ప్రభుత్వాలు  చర్యలు తీసుకోవాలి.రహదారుల ప్రక్కన విస్తారంగా చెట్లను నాటి డ్రైనేజ్ నీరు శుద్దిచేసి వాటికి పోయవచ్చు.



రకరకాల కారణాలతో పర్యావరణాన్ని పాడుచేస్తే భూతాపం, ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయి. అప్పుడు నీరు ఎండిపోయి వృక్షసంపద ఎండిపోతుంది. తద్వారా మానవుల మనుగడ కూడా  అంతరించిపోయే పరిస్థితి వస్తుంది.



కొన్ని రకాల టెక్నాలజీ వల్లకూడా పర్యావరణానికి హాని కలుగుతోంది.పర్యావరణానికి హానికలగని విధంగా టెక్నాలజీని వాడుకోవాలి.



 ప్రపంచంలో జనాభా విపరీతంగా పెరగటం వల్లకూడా వారి అవసరాల కోసం వనరులను విపరీతంగా  వాడుతున్నారు. ప్రపంచ జనాభా తగ్గేవిధంగా ప్రభుత్వాలు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.


ఇప్పుడు చాలా ఎండలు మండిపోతున్నాయి. చాలామంది ఏసీలు వేసుకుని కూర్చుంటున్నారు.
ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగితే అనేక కష్టాలు వస్తాయంటున్నారు.

 భూమిపై  మానవులు లేకపోయినా వృక్షజాతులు, పశుపక్ష్యాదులు చక్కగా జీవించగలవు. కానీ, వృక్షజాతులు, పశుపక్ష్యాదులు  లేకపోతే మానవుల మనుగడే కష్టమవుతుంది. అందువల్ల పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి విధి.
 
 

ప్రతిదానిని మనం పైపైన చూసి ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోకూడదు...

 

జీవితంలో కష్టాలు తట్టుకోలేక కొందరు  దైవం కొరకు కఠినమైన తపస్సు చేస్తారు. దైవం ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటే కొందరు తమ సంసారంలో కష్టాలు తొలగాలని కోరుకుంటారు.

మరి కొందరు సంసారంతో విసుగుచెంది, తిరిగి సంసారం వద్దని..బంధనాశకమూ,మోక్షప్రదమూ  అయిన విశదజ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుకుంటారు.

వారు సంసారం నుంచి బయటపడాలని కోరుకున్న విషయం తెలియక అలాంటి వారిని చూసి కొందరు ఏమనుకుంటారంటే..అంత తపస్సు చేసినా అతనికి గొప్ప సంపదలు కలగలేదు కదా..ఇక తపస్సులు చేయటం దేనికి? అనుకుంటారు.

 ఎవరి మనస్సులో ఏముందో..ఎవరి గత కర్మలు ఎలాంటివో..ఎవరికి ఏ ఫలితాన్ని ఇవ్వాలో..దైవానికే తెలుస్తుంది.  
.................

గతంలో చేసిన పాపకర్మల నుండి తప్పించుకోవాలంటే ఇప్పుడు మంచిగా ఉంటూ గొప్ప పాపపరిహారాలు చేయవలసి ఉంటుంది.

అయితే, పాపాలు చేసిన వారు పశ్చాత్తాపపడినా కూడా వెంటనే పాపకర్మ అంతా తొలగిపోదు.

వారు చేసిన పాపాల వల్ల కష్టాలు అనుభవించిన వారి ఉసురు ఊరికే పోదు కదా..కొంతయినా కష్టం అనుభవించవలసి ఉంటుంది.

గతకర్మ బలంగా ఉన్నప్పుడు వాటిని తొలగించుకోవాలంటే పరిహారాలూ గట్టిగానే చేయవలసి ఉంటుంది..

 ఇహలోక విలాసాలకు ఆశపడకుండా మోక్షం కొరకు, లోకకల్యాణం కొరకు కూడా తమ తపశ్శక్తిని వినియోగించిన వారు ఎందరో ఉన్నారు.

 జీవుల గత జన్మల కర్మలను ఇహజన్మ కర్మలను బట్టి దైవం వారికి తగ్గ ఫలితాలను ఇస్తారు. ఏది ఎందుకు ఎలా జరుగుతుందో దైవానికే తెలుస్తుంది.

 అందుకే, ప్రతిదానిని  మనం పైపైన చూసి ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోకూడదు.
 
 *******
లోకంలో యుద్ధాలు వంటి..ఎన్నో బాధాకరమైన విషయాలు జరిగాయి. అలాంటప్పుడు ఎంతో బాధకలుగుతుంది. అలా ఎందుకు జరిగాయో? అనిపిస్తుంది.
 
సామాన్య మనుషులకే అంత దయ ఉన్నప్పుడు.. సమస్త జీవులను సృష్టించిన దయామయులైన దైవానికి మరెంతో దయ ఉంటుంది.  సృష్టిలో అన్ని విషయాలు ..దైవానికి తెలుసు.
 

జంతువులను చంపటం...

 

మాంసాహారాన్ని తినాలంటే..జంతువులను, పశుపక్ష్యాదులను చంపి తినాలి. చంపే సమయంలో అవి ఎంత భయాన్ని, బాధను అనుభవిస్తాయో. మనుషులను ఎవరైనా రాక్షసులు చంపి లొట్టలేసుకుంటూ తింటారంటే మనుషులు గజగజ వణికిపోతారు. మరి నోరులేని పశుపక్ష్యాదులకు భయం ఉంటుంది కదా. 

 

 జీవితంలో కష్టాలు, అనారోగ్యాలు వస్తేనే తట్టుకోలేక మనుషులు రక్షించమని అదేపనిగా దైవానికి పూజలు చేస్తుంటారు.రక్షించటం ఆలస్యమయితే దైవాన్ని నిందించేవారు కూడా ఉంటారు. రుచి కోసం జంతువులను చంపి తినటం పాపం. చనిపోతూ అవి అనుభవించిన బాధ వాటిని చంపిన వారిని పాపకర్మలా చుట్టుకుంటుంది. 


 ప్రాచీనకాలంలో రాజులు, సైనికులు వేటకు వెళ్ళేవారని తెలుస్తోంది. క్రూరమృగాలు ఊళ్ళలోకి వచ్చినప్పుడు వాటిని చంపటంలో తప్పులేదు. రాజ్యంపై దండయాత్ర చేసిన శత్రువులను చంపేటప్పుడు సున్నితమనస్తత్వం కాకుండా కొంత కఠినత్వం అవసరం. అలా కావటానికి కూడా జంతువులను వేటాడటం అవసరమని కొందరి అభిప్రాయం కావచ్చు. అలాగని ఎక్కువగా వేటాడటం అవసరం లేదు. 

.............

 మనదేశంలోనే శాకాహారులు ఎక్కువ, విదేశాల్లో అందరూ మాంసాహారం తింటారని మనలో చాలామందిమి భావిస్తాము. అయితే, అది తప్పు. విదేశాల్లో కూడా శాకాహారులుంటారు. ఈ రోజుల్లో విదేశాల్లో కూడా చాలామంది మాంసాహారం మానివేసి శాకాహారం వైపు మారుతున్నారట. మన దేశంలో, మన రాష్ట్రంలో చాలామంది నేచురోపతి వారు కొన్ని ఆహారపద్ధతులను పాటించటం ద్వారా వ్యాధులు వచ్చినవారికి నయం చేయటం, వ్యాధులు రాకుండా చేయటం గురించి చెబుతున్నారు. ఇలా ఆహారం ద్వారా వ్యాధులు తగ్గించుకోవటం అనేది గొప్ప విషయం. 

విదేశాల్లో కూడా కొందరు శాకాహారం మంచిదని, ఆహారం ద్వారా వ్యాధులు తగ్గించుకోవచ్చని చెబుతున్నారట. వీరిలో వైద్యులు కూడా ఉన్నారు. 

 ఉదా..Dr. Caldwell Esseltyns, Dr. Brook Goldner.. 

ఒక వైద్యురాలు తనకు వచ్చిన వ్యాధిని ఈ పద్ధతిలో తగ్గించుకోవటం జరిగిందట. వీరి గురించి తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ లో చూడవచ్చు. 

 

 

ఈమధ్య కాలంలో వెగన్ గా...

 


 
 

ఈమధ్య కాలంలో వెగన్ గా మారేవారి సంఖ్య సంఖ్య పెరుగుతోంది. వీరు మాంసాహారం తినరు. పాలు, నేయి వంటివి కూడా తినరు.

 మాంసాహారం గురించి జంతువులను, పశుపక్ష్యాదులను పెద్దసంఖ్యలో పెంచటం వల్ల పర్యావరణం పాడవుతోందని, జీవహింస జరుగకూడదని, మాంసాహారం వల్ల ఎన్నో వ్యాధులు వస్తున్నాయని, కొందరికి పాలు ఎలర్జీ ఉండటం వల్ల..ఇలా అనేకకారణాలతో వెగన్ గా మారుతున్నారు.
 

 

పాతకాలంలో ఆవులు కొన్నిసార్లు మాత్రమే గర్భాన్ని ధరించేవట. ఈ రోజుల్లో జనాలు పాలకోసం ఆవులు, గేదెలకు మందులు ఇచ్చి ఎక్కువసార్లు గర్భంధరించేలా చేస్తున్నారట. అన్నిసార్లు గర్భం ధరించటం వల్ల అవి నీరసపడతాయట. మనుషులు కూడా ఎక్కువసార్లు గర్భాన్ని ధరించలేరుకదా.. మూగజంతువుల పట్ల అలా జీవహింస చేయకూడదు. కొందరు దూడలను చంపి పాలు పిండుతారు, కొందరయితే దూడలకు సరిగ్గా పాలు త్రాగించకుండా పాలను పిండుతారు. ఇలా చేయటం దారుణం.

 ఇంటివద్ద ఆవులు, గేదెలు ఉండి, వాటికి సహజంగా గర్భధారణ జరిగి, దూడ త్రాగగా మిగిలిన పాలను మనుషులు వాడుకోవచ్చు. అంతేకానీ, మూగజీవుల పట్ల అన్యాయంగా ప్రవర్తించటం సరైనది కాదు..........


 అంబలి త్రాగితే B12 లోపం అస్సలు ఉండదు..B12 కొరకు మాంసాహారం తినక్కరలేదని,  మాంసాహారం వల్ల వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశముందని   ఎందరో చెబుతున్నారు. మొక్కల నుంచి B12 తీసి టాబ్లెట్స్ రూపంలో కూడా అమ్ముతున్నారు.  వాటిని కూడా వాడుకోవచ్చు,

కొందరు ఏమంటారంటే, B12 అనేది లేకపోతే వ్యాధులు వస్తాయని..  పాలు, నెయ్యి వంటివి, మాంసాహారాన్ని తింటేనే  B12 లభిస్తుందని అంటున్నారు.

 పాలు, పెరుగు, నెయ్యి, మాంసాహారం తింటే B12 లోపం ఉండదు అన్నప్పుడు..అవి తినేవారికి ఎవ్వరికీ ఈ  B12 లోపం ఉండకూడదు కదా..

మరి.. పాలు, నేయి, మాంసాహారుల్లో కూడా ఎంతోమందికి B12 లోపం ఉంటోంది కదా...

తలతిరగటం వంటి  లక్షణాలు ..అనేక వ్యాధులలో  ఉంటాయి.ఇలాంటి లక్షణాలు తగ్గాలంటే..వ్యాధి ఏమిటో గుర్తించి ..దానికి తగ్గ చికిత్స తీసుకోవాలి.వాడుకోవాలి.

త్రిఫల, త్రికటు, శంఖుపుష్పి, పునర్నవ, అశ్వగంధ..వంటి ఎన్నో మూలికలున్నాయి. వాటిని వైద్యుల సలహాతో వాడుకోవాలి.

మనదేశంలో ఎన్నో తరాల నుంచి మాంసాహారాన్ని తిననివారు కూడా ఆరోగ్యంగా జీవించారు.

 రోజూ ఉదయానే లేచి సూర్యనమస్కారాలను లేత ఎండలో చేయటం.. ఉదయంగానీ సాయంకాలం కానీ అర్ధగంటయినా ఎండ శరీరానికి తగలాలి.

కనీసం 15 నిమిషాలన్నా ధ్యానం చేయాలి. మీకు ఇష్టమైన దేవుని నామాలను వింటూ కూడా ఉండవచ్చు. అయితే, ధ్యానం, ప్రాణాయామం..వంటివి శిక్షకుల వద్ద అభ్యసించి చేస్తే మంచిది.

 ధ్యానం ద్వారా అనేక ఆలోచనల నుంచి కొంతసేపైనా మనస్సుకు విశ్రాంతిని ఇవ్వవచ్చు.

కనీసం అర్ధగంట నడవాలి...

తేలికగా అరిగే పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి..

జీవితం అంటే టెన్షన్లు తప్పకుండా ఉంటాయి, మన చుట్టూ టెన్షన్ పరిస్థితులు ఉన్నప్పుడు టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది.

 కానీ, మనం ఆరోగ్యంగా ఉండాలంటే టెన్షన్ ఎక్కువ ఉండకుండా తామరాకుమీద నీటిబొట్టులా జీవించటాన్ని తప్పక నేర్చుకోవాలి.

 జీవితంలో మన చేతనైనంత మనం చేసి,  దైవంపై భారం వేయాలి.నిష్కామకర్మ యోగంతో జీవించటాన్ని అభ్యసించాలి.

శక్తి చాలనప్పుడు ..సరైనవిధంగా జీవించే శక్తిని ప్రసాదించమని దైవాన్ని శరణువేడుకోవాలి.

అంతా  దైవం దయ.
 *****
దయచేసి మరిన్ని వివరాల కొరకు క్రింద కామెంట్స్ వద్ద చూడగలరు.
 
 
 

జీవితంలో ఒక్కసారి వచ్చే సొంత సోదరుని వివాహంలో పాల్గొన....

 

 స్త్రీలు నెలసరి రోజుల్లో వ్రతాలు.. వంటివి చేయకూడదని అంటారు. ఆ సమయంలో అదేపనిగా తిరగకూడదని కూడా తెలియజేసారు.

నెలసరి సమయంలో గర్భసంచి సున్నితంగా ఉంటుంది, కష్టపడే పనులు చేస్తే తరువాత గర్భసంచి క్రిందకు జారటం వంటి  పూర్వీకులు సమస్యలు వస్తాయంటారు.

అందువల్ల ఆ సమయంలో స్త్రీలకు విశ్రాంతి ఇవ్వటం మంచిదని భావించి అలా నియమాన్ని ఏర్పరిచి ఉంటారు.

ఇప్పుడు చాలామంది స్త్రీలలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చేసరికే నడుం నొప్పులు కుర్చీలో తప్ప క్రింద కూర్చోలేని పరిస్థితి ఉంటోంది. కొందరిలో గర్భసంచి తీసే స్థాయిలో వ్యాధులు వస్తున్నాయి. ఇవన్నీ నెలసరి సమయంలో స్త్రీలు రెస్ట్ తీసుకోకపోవటం వల్ల జరుగుతున్నాయేమో?

 నెలసరి రోజుల్లో చిరాకుగా ఉంటుంది. పూజలు, వ్రతాలు, తీర్ధయాత్రలు.. వంటివి నెలసరిలో ఉన్నవారు ఆచరించకూడదనటం వరకూ  మంచిదే. అయితే, దగ్గరి బంధువుల యొక్క వివాహం వంటివి జరుగుతున్నప్పుడు  ఎన్నో సందేహాలు వస్తుంటాయి.

 పెళ్ళికుమార్తె వరకూ నెలసరి అడ్డంకి లేకుండా  ముహూర్తాలు పెడతారు. కానీ, వివాహం సమయానికి ఆమె యొక్క బంధువుల్లో స్త్రీలకు నెలసరి ఉంటే ఏం చెయ్యాలనేది పెద్ద సమస్య. కొందరేమో నెలసరిలో ఉన్న స్త్రీలు వివాహం వంటి ఫంక్షన్లకు  వెళ్ళకూడదని, వెళ్ళినా దూరంగా కూర్చోవాలని చెబుతారు.

  దగ్గరి బంధువులు కూడా.. నెలసరిలో ఉన్నవారు ఆ కార్యక్రమానికే రాకూడదంటే కష్టంగా ఉంటుంది ఎవరికైనా.

ఉదా..జీవితంలో ఒక్కసారి వచ్చే సొంత సోదరుని వివాహంలో  పాల్గొనకుండా ఉండాలంటే ఎవరికైనా ఎంతో బాధగా  ఉంటుంది.

మనకు వివాహం ఒక్కటే కాదుకదా..వివాహానికి ముందు లగ్నపత్రిక .. వివాహం తరువాత తద్దిపేరంటాలు .. వంటి ఎన్నో ఫంక్షన్స్ ఉంటాయి. ఇన్నిసార్లు నెలసరి రాకుండా టాబ్లెట్స్ వేసుకుంటే ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకని నెలసరి వాయిదా వేసే టాబ్లెట్స్ వాడకూడదు.

ఈ రోజుల్లో హార్మోన్ల సమస్యలు ఎక్కువవటం వల్ల చాలామంది మహిళలు నెల మధ్య కూడా నెలసరి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటప్పుడు  ఫంక్షన్స్కు వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుంది.  ఏం  చేయాలనే  విషయంలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెబుతుంటారు.
.............
నాకు ఏమనిపిస్తుందంటే,  జంతువులను చంపి ఆ శవాలను వండుకు తినటం పాపం కదా..మరి అలా తిన్నవారు  ఫంక్షన్స్ కు వెళ్ళవచ్చా? మాంసాన్ని తిని తలస్నానం చేసినంత మాత్రాన కడుపులో ఉన్నది పోతుందా?

 ఎన్నో పాపాలు చేస్తూ ఇతరులను కష్టాలను పెడుతున్నవారు కూడా  చక్కగా పూజలు, వ్రతాలు చేసేస్తున్నారు. ఇలాంటివారి సంగతేమిటి? అని సండేహాలు వస్తుంటాయి.
.............


 దైవభక్తి కలిగి, ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ  ఉండేవారు దైవకృపను పొందగలరు. అంతేకానీ, పాపాలు చేస్తూ ఉండేవారు ఎన్ని ఆచారాలను పాటించినా దైవకృపను పొందటం కష్టం.

 

 





అవసరమైన వాటిని అవలంబిస్తూ ..

 

 సంవత్సరానికి కొన్ని దుస్తులు కొనుక్కుంటే చాలు.ఉదా స్త్రీలైతే ఫంక్షన్స్కు వేసుకోవటానికి 5వేలు చొప్పున రెండు చీరలు..బయటకు వెళ్ళటానికి, తెలిసినవారింటికి వెళ్ళటానికి 2వేల చొప్పున నాలుగు చీరలు..రోజువారి ధరించటానికి 500 లేక 1వేయి రూపాయలలో అయిదు చీరలు కొనుక్కుంటే సంవత్సరానికి సుమారు 25 వేలలో అయిపోతుంది. ఎవరి స్తొమతను బట్టి వారు డబ్బు  కొంచెం ఎక్కువ తక్కువ  చేసుకోవచ్చు.


అంతేకానీ , అదేపనిగా దుస్తులు కొననవసరం లేదు.ఇంకా క్రితం సంవత్సరం కొన్నవి ఎలానూ ఉంటాయి కదా..సామాన్లు కూడా చూసినవన్నీ కొనకుండా బాగా అవసరమైనవి మాత్రమే కొనుక్కుంటే ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది. ఇల్లు సర్దే పనీ తగ్గుతుంది.



కోరికలు , ఆలోచనలు..తగ్గించుకుంటే జీవితంలో కష్టాలు తక్కువగా ఉంటాయి. జనాభా పెరుగుతూ ఉండటం వల్ల ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ప్రకృతి వనరులు వాడకం ఎక్కువచేయవలసి వస్తుంది. పెరిగే జనాభా ఆహార అవసరాలకోసం వనరులు ఎన్నో అవసరమవుతాయి. కుటుంబానికి ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకోవాలి.



ఏదైనా అతి ఎక్కువయితే కష్టమే. ఆచారవ్యవహారాలు కూడా ఎక్కువగా పెరిగిపోకూడదు తగ్గించుకోవాలి.అవసరమైన వాటిని అవలంబిస్తూ  మూఢాచారాలను వదిలేయాలి. 


 కొన్ని  ప్రా చీనులు చెప్పినవి కావు. మధ్య కాలంలో గ్రంధాలలో చేర్చబడిఉంటాయని నా అభిప్రాయం. జాతి అభివృద్ధికి అడ్డంకిగా మారిన ఇలాంటి వాటిని వదిలేయాలి.

ప్రాచీనులు ఎన్నో చక్కటి విషయాలను  విజ్ఞానాన్ని ఆచారవ్యవహారాలను మనకు గ్రంధాల ద్వారా తెలియజేసారు. వాటిని పాటించాలి.

ప్రపంచంలో ఏదైనా అతి ఎక్కువయితే మంచిది కాదు.  దైవభక్తి ఒక్కటి మాత్రం ఎంత  పెరిగినా లాభమే తప్ప నష్టం లేదు.  పూజలలో కూడా కొన్ని మూఢాచారాలను కొందరు చెబుతారు. 
 
అలాంటి మూఢాచారాలను వదిలి, సదాచారాలను పాటించాలి. దైవభక్తి, ధర్మాచరణతో దైవకృపను పొందాలి.