koodali

Monday, June 13, 2022

జీవితంలో ఒక్కసారి వచ్చే సొంత సోదరుని వివాహంలో పాల్గొన....

 

 స్త్రీలు నెలసరి రోజుల్లో వ్రతాలు.. వంటివి చేయకూడదని అంటారు. ఆ సమయంలో అదేపనిగా తిరగకూడదని కూడా తెలియజేసారు.

నెలసరి సమయంలో గర్భసంచి సున్నితంగా ఉంటుంది, కష్టపడే పనులు చేస్తే తరువాత గర్భసంచి క్రిందకు జారటం వంటి  పూర్వీకులు సమస్యలు వస్తాయంటారు.

అందువల్ల ఆ సమయంలో స్త్రీలకు విశ్రాంతి ఇవ్వటం మంచిదని భావించి అలా నియమాన్ని ఏర్పరిచి ఉంటారు.

ఇప్పుడు చాలామంది స్త్రీలలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చేసరికే నడుం నొప్పులు కుర్చీలో తప్ప క్రింద కూర్చోలేని పరిస్థితి ఉంటోంది. కొందరిలో గర్భసంచి తీసే స్థాయిలో వ్యాధులు వస్తున్నాయి. ఇవన్నీ నెలసరి సమయంలో స్త్రీలు రెస్ట్ తీసుకోకపోవటం వల్ల జరుగుతున్నాయేమో?

 నెలసరి రోజుల్లో చిరాకుగా ఉంటుంది. పూజలు, వ్రతాలు, తీర్ధయాత్రలు.. వంటివి నెలసరిలో ఉన్నవారు ఆచరించకూడదనటం వరకూ  మంచిదే. అయితే, దగ్గరి బంధువుల యొక్క వివాహం వంటివి జరుగుతున్నప్పుడు  ఎన్నో సందేహాలు వస్తుంటాయి.

 పెళ్ళికుమార్తె వరకూ నెలసరి అడ్డంకి లేకుండా  ముహూర్తాలు పెడతారు. కానీ, వివాహం సమయానికి ఆమె యొక్క బంధువుల్లో స్త్రీలకు నెలసరి ఉంటే ఏం చెయ్యాలనేది పెద్ద సమస్య. కొందరేమో నెలసరిలో ఉన్న స్త్రీలు వివాహం వంటి ఫంక్షన్లకు  వెళ్ళకూడదని, వెళ్ళినా దూరంగా కూర్చోవాలని చెబుతారు.

  దగ్గరి బంధువులు కూడా.. నెలసరిలో ఉన్నవారు ఆ కార్యక్రమానికే రాకూడదంటే కష్టంగా ఉంటుంది ఎవరికైనా.

ఉదా..జీవితంలో ఒక్కసారి వచ్చే సొంత సోదరుని వివాహంలో  పాల్గొనకుండా ఉండాలంటే ఎవరికైనా ఎంతో బాధగా  ఉంటుంది.

మనకు వివాహం ఒక్కటే కాదుకదా..వివాహానికి ముందు లగ్నపత్రిక .. వివాహం తరువాత తద్దిపేరంటాలు .. వంటి ఎన్నో ఫంక్షన్స్ ఉంటాయి. ఇన్నిసార్లు నెలసరి రాకుండా టాబ్లెట్స్ వేసుకుంటే ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకని నెలసరి వాయిదా వేసే టాబ్లెట్స్ వాడకూడదు.

ఈ రోజుల్లో హార్మోన్ల సమస్యలు ఎక్కువవటం వల్ల చాలామంది మహిళలు నెల మధ్య కూడా నెలసరి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటప్పుడు  ఫంక్షన్స్కు వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుంది.  ఏం  చేయాలనే  విషయంలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెబుతుంటారు.
.............
నాకు ఏమనిపిస్తుందంటే,  జంతువులను చంపి ఆ శవాలను వండుకు తినటం పాపం కదా..మరి అలా తిన్నవారు  ఫంక్షన్స్ కు వెళ్ళవచ్చా? మాంసాన్ని తిని తలస్నానం చేసినంత మాత్రాన కడుపులో ఉన్నది పోతుందా?

 ఎన్నో పాపాలు చేస్తూ ఇతరులను కష్టాలను పెడుతున్నవారు కూడా  చక్కగా పూజలు, వ్రతాలు చేసేస్తున్నారు. ఇలాంటివారి సంగతేమిటి? అని సండేహాలు వస్తుంటాయి.
.............


 దైవభక్తి కలిగి, ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ  ఉండేవారు దైవకృపను పొందగలరు. అంతేకానీ, పాపాలు చేస్తూ ఉండేవారు ఎన్ని ఆచారాలను పాటించినా దైవకృపను పొందటం కష్టం.

 

 





2 comments:

  1. వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్దిస్తున్నాను.

    ReplyDelete
  2. ఈ మధ్యన కొందరు ఏం చేస్తున్నారంటే ..అమ్మాయి వివాహం సందర్భంగా మంచిముహూర్తం అని, నెలసరితో సంబంధం లేకుండా ముహూర్తం నిశ్చయం చేసుకుంటారు. ఇక, నెలసరి రాకుండా టాబ్లెట్స్ వాడుతుంటారు.ఈ టాబ్లెట్స్ కొన్నిరోజులు వాడినా ఏమీ కాదని చెప్పి ఎక్కువ రోజులు వాడుతున్నారు.

    టాబ్లెట్స్ వాడుతూ వివాహానికి ముందూ వెనుక పూజలు, మ్రొక్కుబడులు అని దేవాలయాలకు వెళ్ళటం..ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. వివాహం అంటే ఎంతో టెన్షన్ ఉంటుంది.అందువల్ల కొందరిలో నెలసరి టైం కాకపోయినా నెలసరి వచ్చే అవకాశముంది.

    బంధుమిత్రులను పిలిచి అట్టహాసంగా వివాహకార్యక్రమాలు జరుగుతుంటే నెలసరి వస్తే ఏం చేయాలో..ఎలా చెప్పాలో తెలియక అమ్మాయిలు భయపడే పరిస్థితి కూడా ఉంటుంది.

    టాబ్లెట్స్ వాడేసమయంలో కొందరిలో కొద్దిగా బ్లీడింగ్ కనిపించి ఆగిపోవచ్చు.అప్పుడు దానిని నెలసరి క్రింద అనుకోవాలా? లేదా? అనేది కూడా సందేహమే. ఇలాంటప్పుడు చెబితే అత్తింటివారు, పుట్టింటివారు ఏమనుకుంటారోనని భయం కూడా ఉంటుంది. ఇలా జరిగితే చెప్పేయటమే మంచిది.

    నెలసరిలో ఉన్నప్పుడు సత్యనారాయణ వ్రతం వంటివి చేయటం, దేవాలయాలకు వెళ్ళటం మంచిది కాదు.

    నెలసరి సమయంలో తీర్ధయాత్రలు చేయాలన్నా , పూజ కొరకు ఎక్కువసేపు కూర్చోవాలన్నా ఇబ్బందిగా కూడా ఉంటుంది.

    పెద్దవాళ్ళు కూడా అన్ని కార్యక్రమాలు వెంటవెంటనే అయిపోవాలని చెప్పి, .. బోలెడు కార్యక్రమాలు ఏర్పాటుచేయటం కన్నా, కొన్నింటిని పూర్తిచేసి, వీలుకుదిరినప్పుడు మిగతావి ఏర్పాటుచేసుకోవాలి.

    అంతేకానీ, టాబ్లెట్స్ ఎక్కువరోజులు వాడకూడదు.ఈ టాబ్లెట్స్ వాడేటప్పుడు మర్చిపోకూడా సరిగ్గా వేసుకోవాలి. వేసుకోకుంటే నెలసరి వచ్చే అవకాశముంది. ఫంక్షన్స్ హడావిడిలో కొందరు టాబ్లెట్ వేసుకోవటం మర్చిపోతుంటారు.

    ఈ రోజుల్లో కాలేజీలో ఫంక్షన్ అని, ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్ అని, ఇంకా ఎన్నో కారణాల కొరకు..చాలామంది ఆడవాళ్ళు నెలసరి వాయిదావేసే టాబ్లెట్స్ వాడుతున్నారు.

    ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్లు నెలసరి సమస్యలు, గర్భసంచి సమస్యలతో బాధపడుతున్నారు.ఆరోగ్యం దెబ్బతింటే వచ్చే కష్టాలు చాలా బాధాకరం. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.

    ReplyDelete