koodali

Monday, June 13, 2022

కష్టాలు తీర్చమని దైవాన్ని ప్రార్దించటంలో తప్పులేదు. అయితే,

 

కష్టాలు తీర్చమని దైవాన్ని ప్రార్దించటంలో తప్పులేదు. అయితే, మనం కూడా పాపాలు చేయకుండా ఉండాలి. పాపాలు చేసి, ఎన్ని పూజలు చేసినా కష్టాలు తగ్గటం లేదు ఏమిటో అనుకుంటే ఎలా.. పూజలు చేసే వారిలో రకరకాల వాళ్ళుంటారు.

 

  మా బంధువు ఒకామె వయస్సులో ఉన్నప్పుడు చాలా నోములు, వ్రతాలు చేసిందట. వృద్ధాప్యంతో భర్త మరణిస్తే.. ఇన్ని పూజలు చేసినా ఇలా జరిగింది ఏమిటో అంటుంది ఆమె. వృద్ధాప్యం వచ్చిన తరువాత మరణం సహజం కదా. 

 

 కొందరు దైవభక్తి కలిగి.. స్వధర్మాచరణ చేస్తూ ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ..ఎక్కువగా పూజలు చేస్తుంటారు. 

 

 కొందరికి ఎక్కువసేపు పూజలు చేయటంపై ఆసక్తి లేకపోవచ్చు. దైవభక్తి కలిగి, స్వధర్మాచరణ చేస్తూ ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ.. ఎక్కువగా పూజలు చేయకపోయినా.. శక్తిమేరకు పూజలు చేస్తూ.. దైవస్మరణ చేస్తుంటారు. 

 

కొందరు పాపాలుచేస్తూనే కోరికలు తీరటం కొరకు పూజలు కూడా ఎక్కువగా చేస్తుంటారు. వీరికీ కొంత భక్తి ఉంటుంది. ఎంత భక్తి ఉన్నా దైవానికి ఇష్టం కాని విధంగా పాపాలు చేస్తూ అధర్మంగా జీవిస్తే ఎన్ని పూజలు చేసినా దైవానికి నచ్చదు.

 ఎవరు ఎటువంటివారో ఎవరికి ఎటువంటి ఫలితం లభిస్తుందో మనకు తెలియదు, అన్నీ దైవానికే తెలుస్తాయి. 

 ************* 

ఎవరి కర్మఫలితాన్ని వారే అనుభవించాలి. ఎవరైనా ఎప్పుడైనా పాపాలు చేస్తేనే వాటి ఫలితంగా కష్టాలు వస్తాయి. కష్టాలను భరించలేకపోతే ..గతంలోనో, గతజన్మలోనో ఏవో పాపాలు చేసి ఉంటామని పశ్చాత్తాపాన్ని చెంది, దైవాన్ని ప్రార్ధించుకోవచ్చు. ఇప్పుడు పాపాలు చేయటాన్ని మాని, పుణ్యకార్యాలను చేస్తూ ఉంటే గతపాపకర్మ పలుచన అయ్యి, కష్టాలు తగ్గే అవకాశముంది. 

 

అంతేకానీ, కష్టాలు పోవటానికంటూ తిరిగి జీవహింస వంటి పాపాలను చేయటమేమిటో? అని నాకు అనిపిస్తుంది. 

చెడ్దవాళ్లు మంచివారిని పీడించినప్పుడు కూడా కష్టాలు వస్తాయి. అప్పుడు కూడా శక్తి మేరకు వారిని ఎదుర్కుంటూ ..దైవాన్ని సాయం చేయమని ప్రార్ధించవచ్చు. 

 

4 comments:

  1. Monday, October 2, 2017
    మొక్కులు తీర్చగలమో ? లేదో? ..మరికొన్ని విషయాలు..
    కొందరు కష్టాలలో ఉన్నప్పుడు దేవునికి ఎన్నో మొక్కులు మొక్కుకుంటారు.

    ఉదా..కష్టాలు తీరితే, ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను ..అని మొక్కుకుంటారు.

    అయితే, ఆ మొక్కులు తీర్చటం కొన్నిసార్లు సులభంగా సాధ్యం కాకపోవచ్చు.

    గభాలున ఎన్నో అనుకోవటం .. ఆ తరువాత ఆలోచించటం కన్నా.. ముందే ఆలోచించుకోవటం మంచిది.


    ఎన్ని కష్టాలు వచ్చినా, క్లిష్టమైన మొక్కులు మొక్కుకోవటం కన్నా.. దైవప్రార్ధన చేసుకోవటం మంచిది.

    ఇంకా, సమాజానికి తనకు చేతనైనంత మంచిపనులు చేయవచ్చు.

    *********************

    అనుకోని సంఘటనలు అప్పుడప్పుడు కొన్ని జరుగుతుంటాయి.

    ఉదా..దేవాలయానికి వెళ్తూ దారిలో పువ్వులు, పండ్లు కొందామనుకుని, దేవాలయం వద్ద కొనవచ్చులే.. అని దేవాలయం వద్దకు వెళ్లిన తరువాత చూస్తే అక్కడ మనం కొనాలనుకున్న పువ్వులు, పండ్లు ఉండకపోవచ్చు.


    అప్పుడు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి కొనలేకపోవచ్చు. ఇలాంటప్పుడు సంశయంగా ఉంటే కొంత సొమ్మును హుండీలో సమర్పించవచ్చు లేక క్షమించమని దైవాన్ని ప్రార్ధించవచ్చు.


    ఉదా.. ఎప్పట్నించో చేయాలనుకున్న పూజ చేయాలనుకుని , అన్నీ సిద్ధం చేసుకుని పూజ తరువాత..హమ్మయ్య.. ఇప్పటికి పూజ పూర్తిచేయగలిగాం.. అనుకున్నప్పుడు,

    తరువాత తెలుస్తుంది. దూరపు బంధువు మరణించిన విషయం, అదే సమయంలో పూజ చేసామని.


    అలాంటప్పుడు పూజ చేయటం జరిగిందని తెలిసినప్పుడు సంశయం అనిపిస్తుంది.

    ఇంతకీ పూజ చేసిన ఫలితం లభిస్తుందా ? లేదా ? తిరిగి పూజ చేయాలా ? వంటి అనేక సందేహాలు కలగవచ్చు. తిరిగి అలా పూజ చేయాలంటే కష్టం కావచ్చు.

    కొందరేమంటారంటే , మళ్లీ పూజ చేయాలంటారు.

    కొందరేమో అవసరం లేదు , బంధువుల మరణం గురించి మీకు తెలియక పూజ చేశారు కాబట్టి, తిరిగి పూజ చేయనవసరం లేదంటారు. ఎన్నో సందేహాలుంటాయి.


    కొన్ని సంవత్సరాల క్రిందట నాకు ఇలాంటి సంఘటన అనుభవంలోకి వచ్చింది. ఇలాంటివి గమనిస్తే ఏమనిపిస్తుందంటే,


    కొన్నిసార్లు మనం చేయగలిగింది ఏమీ ఉండదు. ఇంతే శక్తి ఉంది, క్షమించమని దైవాన్ని ప్రార్ధించుకోవాలి అంతే.

    మనం చేయాలనుకున్న పని చేయగలమో ? లేదో? తెలియదు. అందువల్ల, కుదిరితే..చేస్తాను..అనుకోవటం మంచిది.


    ప్రతిపనికీ ముందు అలా అనుకోవటం కష్టం కాబట్టి..ఒకేసారి అనేసుకోవచ్చు. జీవితంలో ఏ పనైనా.. కుదిరితే చేస్తాను.. అనుకోవచ్చేమో .. అనిపిస్తోంది.

    ReplyDelete
  2. కొందరు తెల్లవార్తూనే ఒక సంచి పట్టుకుని
    ఇతరుల మొక్కనుండి పువ్వులను సేకరించి దేవునికి అలంకరించటం చేస్తుంటారు.

    ఇలా ఇతరుల చెట్ల యొక్క పువ్వులను కోసి దైవానికి అలంకరించటం కన్నా, సొంతసొమ్మువెచ్చించి నాలుగు పుష్పాలు కొని దైవానికి సమర్పించటం మంచిది.

    కొందరికి తమ చెట్లనిండా పువ్వులు ఉంటే చూసుకోవాలని ఉంటుంది. ఎవరి మొక్కలు వారిష్టం.వారింట్లో పూచిన పుష్పాలలో కొన్నింటిని పూజలో సమర్పించి, మిగతావాటిని మొక్కలకు అలానే ఉంచేస్తారు.

    అయితే, ఎవరో వచ్చి తాము పెంచుకున్న పువ్వులన్నీ కోసేసి మొక్కంతా ఒక్క పువ్వులేకుండా బోడిగా చేసి వెళ్తుంటే ఎంతో బాధగా ఉంటుంది.

    ReplyDelete