koodali

Monday, June 13, 2022

జంతువులను చంపటం...

 

మాంసాహారాన్ని తినాలంటే..జంతువులను, పశుపక్ష్యాదులను చంపి తినాలి. చంపే సమయంలో అవి ఎంత భయాన్ని, బాధను అనుభవిస్తాయో. మనుషులను ఎవరైనా రాక్షసులు చంపి లొట్టలేసుకుంటూ తింటారంటే మనుషులు గజగజ వణికిపోతారు. మరి నోరులేని పశుపక్ష్యాదులకు భయం ఉంటుంది కదా. 

 

 జీవితంలో కష్టాలు, అనారోగ్యాలు వస్తేనే తట్టుకోలేక మనుషులు రక్షించమని అదేపనిగా దైవానికి పూజలు చేస్తుంటారు.రక్షించటం ఆలస్యమయితే దైవాన్ని నిందించేవారు కూడా ఉంటారు. రుచి కోసం జంతువులను చంపి తినటం పాపం. చనిపోతూ అవి అనుభవించిన బాధ వాటిని చంపిన వారిని పాపకర్మలా చుట్టుకుంటుంది. 


 ప్రాచీనకాలంలో రాజులు, సైనికులు వేటకు వెళ్ళేవారని తెలుస్తోంది. క్రూరమృగాలు ఊళ్ళలోకి వచ్చినప్పుడు వాటిని చంపటంలో తప్పులేదు. రాజ్యంపై దండయాత్ర చేసిన శత్రువులను చంపేటప్పుడు సున్నితమనస్తత్వం కాకుండా కొంత కఠినత్వం అవసరం. అలా కావటానికి కూడా జంతువులను వేటాడటం అవసరమని కొందరి అభిప్రాయం కావచ్చు. అలాగని ఎక్కువగా వేటాడటం అవసరం లేదు. 

.............

 మనదేశంలోనే శాకాహారులు ఎక్కువ, విదేశాల్లో అందరూ మాంసాహారం తింటారని మనలో చాలామందిమి భావిస్తాము. అయితే, అది తప్పు. విదేశాల్లో కూడా శాకాహారులుంటారు. ఈ రోజుల్లో విదేశాల్లో కూడా చాలామంది మాంసాహారం మానివేసి శాకాహారం వైపు మారుతున్నారట. మన దేశంలో, మన రాష్ట్రంలో చాలామంది నేచురోపతి వారు కొన్ని ఆహారపద్ధతులను పాటించటం ద్వారా వ్యాధులు వచ్చినవారికి నయం చేయటం, వ్యాధులు రాకుండా చేయటం గురించి చెబుతున్నారు. ఇలా ఆహారం ద్వారా వ్యాధులు తగ్గించుకోవటం అనేది గొప్ప విషయం. 

విదేశాల్లో కూడా కొందరు శాకాహారం మంచిదని, ఆహారం ద్వారా వ్యాధులు తగ్గించుకోవచ్చని చెబుతున్నారట. వీరిలో వైద్యులు కూడా ఉన్నారు. 

 ఉదా..Dr. Caldwell Esseltyns, Dr. Brook Goldner.. 

ఒక వైద్యురాలు తనకు వచ్చిన వ్యాధిని ఈ పద్ధతిలో తగ్గించుకోవటం జరిగిందట. వీరి గురించి తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ లో చూడవచ్చు. 

 

 

9 comments:

  1. ............

    వేట వల్ల కొన్నిసార్లు కష్టాలు వస్తాయి.

    దశరధమహారాజు, పాండురాజు..వేటకు వెళ్ళి శాపాలను పొందారని తెలుస్తుంది.

    ReplyDelete
  2. శాకాహారం మాత్రమే తినేవారు కొందరు.. మాంసాహారం తినేవారిని చూసి చీ మాంసాన్ని తినటమేమిటి యాక్..అని అంటారు. మాంసాహారాన్ని తినేవాళ్ళు కొందరు శాకాహారులను ఎగతాళిగా మాట్లాడుతారు. వీగన్లు మాంసాహారం తినరు. పాలు, పెరుగు, నేయి..వంటివి కూడా జంతువుల శరీరం నుంచి వచ్చేవే కాబట్టి తినరు.

     ఆశ్చర్యం ఏమిటంటే, మాంసాహారాన్ని యాక్..అనే శాకాహారులలో కూడా కొందరు వీగన్లను ఎగతాళి చేస్తున్నట్లు నాకు అనిపించింది.. పాలు, నేయి తినకపోతే ఎలా బ్రతుకుతారు అన్నట్లు అనిపించింది.


     మనుషుల్లో గర్భధారణా, ప్రసవానంతరం సందర్భాలలో వారిని చాలా జాగ్రత్తగా చూస్తారు. బాలెంత ఎక్కువ పనులు చేయకుండా సున్నితంగా ఉండాలంటారు. గర్భధారణ ఎంతో కష్టమైన విషయం. స్త్రీలకు పునర్జన్మ వంటిది.

    జంతువులలో అయినా గర్భం ధరించటం, శిశుజననం తరువాతే పాలు వస్తాయి.

    మరి పశువులకైనా గర్భధారణ, ప్రసవం వంటివి కష్టమైన విషయాలే కదా. వాటి బాధలు చెప్పుకోవటానికి వాటికి మాటలు రావు కాబట్టి చెప్పుకోలేవు. కోడి గ్రుడ్డు పెట్టేటప్పుడు నొప్పి ఉంటుందట. అందువల్ల, కోడి ముడ్డినొప్పి కోడికి ఎరుక.. వంటి సామెతలు కూడా ఉన్నాయి.
    ..........

    పాతకాలంలో తక్కువ జనాభా ఉండేవారు. పొలంపనుల కొరకు ఒక్కో కుటుంబం వద్ద పదులసంఖ్యలో పశువులు ఉండేవి. పశువులకు మేత విస్తారంగా లభించేది. పశువుల వద్ద దూడలు త్రాగగా ఇంకా పాలు మిగిలి ఉండి, ఆ పాలను మనుషులు పిండి వాడేవారు కావచ్చు.

     పాతకాలంలో పశువులు ఇప్పటిలా ఇన్నిసార్లు గర్భం ధరించటం జరిగేది కాదట. కోళ్ళు ఇన్ని గుడ్లు పెట్టేవి కాదట. వాటి సంఖ్య పరిమితంగా ఉండేదట.

    పాతకాలంలో భారతదేశంలో .. సంవత్సరానికి కొన్నిసార్లు మాత్రమే అంటే.. ఇంటికి ముఖ్యమైన బంధువులు వచ్చినప్పుడో, సంక్రాంతి తరువాత కనుము వంటి సమయాల్లో మాంసాహారం తినేవారు. ఇప్పుడు మాంసాహారం తినటం బాగా ఎక్కువయింది.
     
     ఇప్పుడు పెరిగిన మనుషులు, రుచి కొరకు పశుపక్ష్యాదులకు ఎక్కువసార్లు సంతానం కలిగేలా మందులను, ఇంజక్షన్లు ఇచ్చి గర్భధారణ ఎక్కువసార్లు వచ్చేలా చేస్తున్నారు. తద్వారా వచ్చే పాలు , పెరుగు, నేయి..వంటివి ఎక్కువగా తింటున్నారు.

     పాతకాలంలో ఒక్కోఇంటిలో పదుల సంఖ్యలో పశువులు ఉన్నప్పుడు దూడలు త్రాగగా మిగిలిన పాలను వాడుకునేవారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు.

    పాలవిరుగుడు(పన్నీర్), చీజ్..అంటూ అనేక రుచికరమైన వంటల కొరకు పశువులకు అనేకసార్లు బలవంతంగా గర్భధారణ చేయిస్తున్నారు. ఇందంతా హింస కాదా? అందుకే వీగన్లు ఇలాంటివి తినరు.

     కొందరికి పాలు, పాల ఉత్పత్తులు వంటివి పడవు. వారికి దగ్గు, జలుబు వంటివి కూడా వస్తాయి. అందువల్ల వెగన్ గా మారుతారు.
    కొందరు పశుపక్ష్యాదులను హింసించటం ఇష్టం లేక వెగన్లుగా మారుతున్నారు. ఇలా రకరకాల కారణాల వల్ల వెగన్లుగా మారుతున్నారు.
     
    పాల ఉత్పత్తులను తినకపోయినా ఎంతో ఆరోగ్యంగా, ధృఢంగా ఎలా ఉండవచ్చో ఎందరో ఉదాహరణలతో సహా చెబుతున్నా కూడా కొందరు వీగన్లను ఎగతాళి చేస్తున్నట్లు నాకు అనిపించింది.

     పాల ఉత్పత్తులతో చేసిన వంటల రుచిని వదలలేక..అవి వదలగలిగిన వీగన్లను కించపరిచేలా మాట్లాడటం తప్పు.

     శాకాహారులు కూడా వీగన్లను ఎగతాళి చేయటం ఆశ్చర్యకరమైన విషయం. శాకాహారులు మాంసాహారాన్ని తినటం తప్పని, నిషిద్ధమని భావిస్తున్నట్లే.. వీగన్లు జంతువులనుంచి లభించే పన్నీర్ వంటివి కూడా నిషిద్ధంగా భావిస్తారు.



    ReplyDelete
  3. అనారోగ్యం రావటానికి ఎన్నో కారణాలుంటాయి. అందరూ కొన్ని నియమాలను పాటిస్తూ పద్ధతిగా జీవిస్తే అనారోగ్యం రాకుండా చాలావరకూ తగ్గించుకోవచ్చు.

    అయితే, ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇప్పుడు చేస్తున్న వాతావరణకాలుష్యం వంటి వాటి వల్ల కూడా అనారోగ్యాలు వచ్చే అవకాశాలున్నాయి.

    ఇక, ఈ జన్మలోనే కాకుండా గత జన్మలో చేసిన పాపాల వల్ల కూడా అనారోగ్యాలు వచ్చే అవకాశాలున్నాయి.
    ......
     మనం రుచి కోసం ..కాఫీలు, టీలు, పాలవిరుగుడు(పన్నీరు),చీజ్, పాలకోవాలు, పాలతో చేసిన ఇతర స్వీట్స్..వంటివి తినటం తగ్గించుకుంటే మనకు మరియు పశువులకు కూడా కొంతమేలు జరుగుతుంది.
    ..........
    మనుషులకు అనారోగ్యం కలిగినప్పుడు వైద్యం కొరకు ..ఆవునెయ్యిని, ఆవుమూత్రాన్ని సేకరించి మందులుగా వాడే విధానాలు కూడా ఉన్నాయి.

    తల్లిపాలు లభించని చంటిపిల్లలకు ఆవుపాలు, వైద్యం కొరకు ఆవునేయి..వంటి కొన్ని సందర్భాలలో పాలు, నెయ్యి..వంటివి అవసరానికి తగినంతలో వాడుకోవచ్చు. ఈ అవసరాల కొరకు కొద్ది మొత్తంలో పాలు సరిపోతాయి.

     ఎవరైనా పాలు, పాల ఉత్పత్తులను.. తినటాన్ని మానకూడదనుకుంటే , వాటిని తినటం కొంత తగ్గించినా పశువులకు కొంత భారం తగ్గుతుంది.

    ReplyDelete
    Replies
    1.  అనారోగ్యం కలిగినప్పుడు.. మంత్రతంత్రాలు, యోగా ధ్యానం.. వంటివి చేయటం ద్వారా కూడా అనారోగ్యం నుంచి బైటపడవచ్చునని ప్రాచీనులు తెలియజేసారు.

      Delete
  4. ముఖ్యంగా పశువులు, కోళ్ళు..వంటివి బాగా పెరిగి, వాటినుంచి ఎక్కువ పాలు, మాంసం పొందడానికి ఈ రోజుల్లో వాటికి చాలా మందులు, హార్మోన్ ఇంజక్షన్లు వంటివి ఇస్తున్నారు. ఇంకా, కొందరు పాలను కల్తీ చేసి కూడా అమ్ముతున్నారు.
    ఇవన్నీ త్రాగి, తిన్న వారికి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.

    కొన్నిసార్లు పాలల్లో కొద్దిగా చీము, రక్తపుచారికలు వంటివి కనిపిస్తాయి. పశువులకు ఏమైనా వ్యాధులు వస్తే పాలల్లో అలా రక్తపు చారికలు వస్తాయని ఒక దగ్గర చదివాను.

    అనేక కారణాల వల్ల ఇప్పుడు ప్రజలకు అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. గత 50 సంవత్సరాల క్రితం ..కాన్సర్, కిడ్నీ జబ్బులు, ధైరాయిడ్ వంటివి ఇప్పుడున్నంతగా లేవు.
    అందువల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.

    ReplyDelete

  5.  గత యుగములలో మనుషులు 125 ఏండ్ల కన్నా ఎక్కువ కాలం చక్కగా జీవించేవారని గ్రంధాల ద్వారా తెలుస్తుంది. మరి, ఆ యుగాలలో పశుపక్ష్యాదులు కూడా ఇప్పటికన్నా ఎక్కువ బలంగా ఉండేవికావచ్చు.

     కలియుగంలో వాతావరణ కాలుష్యం.. గాలి, నీరు, వంటివి కూడా కాలుష్యం జరగటం, పదార్ధాలు కల్తీ ..వంటివి జరుగుతాయి. మనుషులలో ఎక్కువమందికి మానసికంగా,శారీరికంగా బలం తక్కువగా ఉండటం జరుగుతుంది.

    యజ్ఞయాగాదులు మంచి ఫలితాలను ఇవ్వాలంటే, ఎన్నో నియమాలు ఉంటాయి. యజ్ఞనిర్వహణకు ధర్మబద్ధమైన ధనం వినియోగించాలి. స్వచ్ఛమైన ద్రవ్యాలను వాడవలసి ఉంటుంది. ఇంకా ఎన్నో నియమాలు ఉంటాయి.

    యజ్ఞాలలో వాడే ద్రవ్యాలు కల్తీ వంటివి లేకుండా ఉండాలి. యజ్ఞయాగాదులలో ఆవునేతిని కూడా వాడుతారు. ఈ రోజుల్లో ఆవుపాలు వంటివి కూడా కల్తీ జరిగే పరిస్థితి ఉంది. అందువల్ల యజ్ఞయాగాదులలో వాడే ఆవుపాలు వంటివి కల్తీలేనివి వాడేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

    కలికాలంలో ఎక్కువమంది మనుషులు స్వార్ధపూరితులై ఉంటారు. సరిగ్గా నియమాలను పాటించాలంటే వారికి కష్టంగా ఉంటుంది.

    కలియుగంలో దైవనామమును పట్టుకుని కూడా తరించవచ్చని సులభోపాయమును తెలియజేసారు.
    .........
    మానసికయజ్ఞాన్ని గురించి కూడా ప్రాచీనులు తెలియజేసారు.
    ....
    వ్రాసినవిషయాలలో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించమని ప్రార్ధిస్తున్నాను.

    ReplyDelete
  6. పాతకాలంలో ప్రతి ఇంటిలో ఎక్కువగా పాడిపశువులను పెంచేవారు. అప్పట్లో మనుషుల జనాభా ఇప్పటిలా కాకుండా తక్కువగా ఉండేవారు.

    ఒక్కో ఇంట్లో సుమారు 20 ఆవులను పెంచితే, పాడిఆవులు పది ఉన్నా కూడా రోజుకు ఒక్కో ఆవు 20 లీటర్ల పాలు ఇస్తే, దూడలు చక్కగా త్రాగిన తరువాత కూడా.. అన్ని ఆవుల పాలు కలిపితే ఆ కుటుంబానికి ఎక్కువగా ఉంటాయి.. ఆ విధంగా కూడా అప్పటివారికి పాలు, నెయ్యి ఆహారంలో ఎక్కువగా వాడటం అలవాటయి ఉంటుంది.

    ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిన జనాభాకు పశువుల పాలు సరిపోవట్లేదు.

    ప్రసాదాలకొరకు ఆవుపాలు, నేయి వాడవచ్చు. అయితే, ప్రసాదాన్ని ప్రసాదంగా తగుమాత్రంగా స్వీకరించాలని కూడా అంటారు కదా.

    ప్రత్యేకంగా ప్రసాదం తయారుచేసి దైవానికి నివేదించి ప్రసాదంగా మనం స్వీకరించవచ్చు. మనం ప్రతిరోజు భుజించే ఆహారాన్ని దైవానికి నివేదించి ప్రసాదంగా తినవచ్చు.

    ప్రసాదం తయారీ, వైద్యం .. వంటి కొన్ని సందర్భాలలో పాలు, నెయ్యి..వంటివి పద్ధతిగా వాడుకోవచ్చు.

    రోగాలు తగ్గటానికి దైవనామస్మరణ, ధ్యానం చేయటం, మంత్రాలను జపించటం, ఇతరులకు సాయం చేయటం..వంటివాటి ద్వారా కూడా రోగాలబారి నుండి బయటపడవచ్చని ప్రాచీనులు తెలియజేసారు.

    మనం రుచి కోసం ..కాఫీలు, టీలు, పాలవిరుగుడు(పన్నీరు), పాలకోవాలు, పాలతో చేసిన ఇతర స్వీట్స్..వంటివి తినటం తగ్గించుకుంటే ప్రసాదాలు, వైద్యం వంటి అవసరాల కొరకు పాలు సరిపోతాయి.

    ఈ రోజుల్లో పాలవ్యాపారస్తులు కొందరు, దూడలను పాలు సరిగ్గా త్రాగనివ్వకపోవటం, దూడలను చంపి తల్లివద్ద నుంచి పాలు పిండటం వంటివి చేస్తున్నారనే వార్తలు కూడా వింటున్నాము.

    మూగజీవాలను బాధించటం వంటి పనులు దైవానికి నచ్చవు.

    ఈ మధ్య కొందరు వీగన్లు గా మారుతున్నారు. అది వారి ఇష్టం. వారేమీ పశువులను హింసించటంలేదు, పశువుల క్షేమం కోరి వాటికి మంచే చేస్తున్నారు.

    సాటి పశుపక్ష్యాదుల పట్ల కరుణను కలిగిఉండాలనే వీగనిజం నాకు నచ్చింది. నేను పూర్తిగా వీగన్ కాదు.అయితే పశువులను అతిగా పిండటం ఇష్టం లేక పాలు, నేయి తక్కువగా వాడటానికి ప్రయత్నిస్తున్నాను.

    పశుపక్ష్యాదులను చంపి తిని, అదేమీ తప్పుకాదని చాలామంది అంటారు. మనుషులను రాక్షసులు ఎవరైనా చంపి తినాలనుకుంటే ..ఆ ఊహకు కూడా మనుషులు భయపడతారు.

    జంతువులు మనుషులను ఎదుర్కోలేవు కాబట్టి, వాటిని మనుషులు కష్టపెడుతున్నారు. మూగజీవులైన పశుపక్ష్యాదుల పట్ల న్యాయంగా ఉండాలి. అవి మనకు హాని చేస్తే తప్ప, వాటికి మనం హాని చేయకూడదు.

    ఈ ప్రపంచం కాకుండా ఇంకా ఎన్నో లోకాలుంటాయట. అక్కడ ఎలా ఉంటుందో కానీ, ఇక్కడ మాత్రం మంచి..చెడు రెండూ ఉన్నాయి. చెడు తగ్గటానికి సాధ్యమయినంతగా ప్రయత్నించాలి.

    దైవభక్తి కలిగిఉండటం, సాటి జీవులపట్ల దయతో ఉండటం, న్యాయంగా జీవించటం, అంతులేని కోరికలను అదుపులో ఉంచుకోవటం..వంటి లక్షణాలు దైవానికి నచ్చుతాయి.ఇలా ప్రవర్తించటానికి సాధ్యమైనంతలో ప్రయత్నించాలి. మంచిగా జీవించటానికి శక్తిని ప్రసాదించమని దైవాన్ని ప్రార్ధించాలి.

    ReplyDelete
  7. తేనెలో చనిపోయిన తేనెటీగలు ఉంటాయేమోనని వెగన్ వంటి కొందరు తేనెను కూడా తినరు. తేనెను పట్టునుండి పిండేటప్పుడు కొన్ని చిన్న తేనెటీగలు పట్టులో ఉన్నవి కూడా పిండబడి చనిపోయే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మొక్కల మీద కూడా రసాయనిక పురుగుమందులు జల్లుతున్నారు. అలాంటి పువ్వులనుంచి వచ్చే తేనె కూడా అంత మంచిదికాదు.
    అయితే కొందరు ఇవన్నీ పెద్దగా పట్టించుకోకుండా తేనెను తింటారు, వైద్యంగా వాడతారు. ఎవరిష్టం వారిది.

    ReplyDelete
  8. B12 అనే విటమిన్ గురించి రకరకాలుగా చెబుతున్నారు.

    కొందరు ఎంతో ఎక్కువగా మాంసాహారం తిన్నా కూడా వారికి B12 లోపం ఉంటుంది. ఇలా జరగటానికి అనేక కారణాలు ఉంటాయట.

    కొన్ని కారణాలు ఏమిటంటే..అనారోగ్యం ఉన్నప్పుడు గానీ, సిగరెట్, మద్యం వంటి అలవాట్లున్న వారిలో గానీ ఎంత ఎక్కువగా మాంసాహారం, పాలు, నేయి..వంటివి తిన్నా కూడా B12 లోపం వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.. ఇలాంటప్పుడు B12 మాత్రలు కానీ, ఇంజక్షన్ గానీ తీసుకోవాలంటున్నారు.

    B12 కొరకు మాంసాహారం, కల్తీ పాలు వంటివి తిని కొత్త జబ్బులు తెచ్చుకునే కన్నా B12 మాత్రలు వేసుకోవచ్చు.. అని కొందరి అభిప్రాయం.

    కొందరు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, B12 కొరకు టాబ్లెట్స్ అక్కరలేదు .. అంబలి వంటివి తీసుకున్నా కూడా అనారోగ్యాలు తగ్గి B12 చక్కగా లభిస్తుందని చెబుతున్నారు.

    కొందరిలో B12 ఎక్కువగా కూడా ఉంటుందట.
    B12 అయినా ఇంకా ఏ విధమైన విటమిన్లు అయినా కూడా ..ఎక్కువయినా ప్రమాదమే, తక్కువయినా ప్రమాదమేనట.

    విటమిన్ టాబ్లెట్స్, ఇంజక్షన్ల వల్ల కొన్ని సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కూడా ఉంటాయని కొందరు అంటున్నారు. అందువల్ల విటమిన్ టాబ్లెట్స్ వాడటం కన్నా ఆహారం ద్వారానే విటమిన్లు పొందటం మంచిది.

    అయితే, కొన్నికారణాల వల్ల కొందరిలో ఆహారంద్వారా తీసుకున్నా కూడా B12 విటమిన్ వంటబట్టని పరిస్థితి ఉంటుందంటున్నారు.
    ********
    పాతకాలంలో భూమినుండి లభించిన మంచినీటిని సహజంగా శుద్ధి చేసుకుని వాడేవారు. ఇప్పుడు రకరకాల రసాయనాలతో శుద్ధిచేసిన నీటిని త్రాగటం వల్ల కూడా పొట్టలో తయారయ్యే మంచి బాక్టీరియా కూడా తయారవ్వని పరిస్థితి ఏర్పడుతుంది.

    ఇంకా, వాతావరణంలో పొల్యూషన్, రసాయన మందులు జల్లిన పంటలు తినటం వల్ల, సిగరెట్లు, మందుత్రాగటం, ఫ్రిజ్లో ఎక్కువకాలం నిల్వ ఉన్న ఆహారాలు తినటం, టెన్షన్లు...ఇలా అనేక కారణాల వల్ల శరీరం సహజధర్మాన్ని కోల్పోవటం..అనారోగ్యాలు కలగటం జరుగుతాయి.
    ******
    ఈరోజుల్లో సెల్ఫోన్లు, కంప్యూటర్ ..వంటివి వాడటం వల్ల కూడా నరాలబలహీనత, తలతిరగటం, వంటివి వస్తున్నాయి. అవన్నీ B12 లక్షణాలుగా కొందరు అనుకోవచ్చు. టెస్టులు కూడా ఒక్కోసారి తప్పులు రావచ్చు.
    *********
    ఆరోగ్యంగా ఉండాలంటే, B12 సరిగ్గా ఉండాలంటే, కొన్ని పద్ధతులను చక్కగా పాటించాలి. అనారోగ్యం తగ్గటానికి మందులు వాడుకోవాలి. పొట్ట, లివర్, పెద్దప్రేవులు ఆరోగ్యంగా ఉండటానికి ఆయుర్వేద మందులు కూడా వాడుకోవచ్చు. సూర్యరశ్మి తగిలితే ఎంతో ఆరోగ్యకరం. రోజులో కొంతసేపయినా సూర్యరశ్మిలో ఉండటం, వ్యాయాయమం చేయటం, ధ్యానం, ప్రాణాయామం చేయటం..చేయాలి. ఇంకా రసాయనిక మందులు జల్లని ఆహారాన్ని తినాలి. వాతావరణకాలుష్యాన్ని తగ్గించేలా జీవనవిధానం మార్చుకోవాలి. అనారోగ్యం తగ్గించుకుంటే శరీరం B12 పొందే విధంగా తయారవుతుంది.

    B12 కొరకు మాంసాహారం, పాలు, నెయ్యి వంటివి తినకపోయినా ఏం కాదు. అంబలి.. వంటి ఆహారాన్ని తీసుకుంటే కూడా చక్కగా B12 లభిస్తుంది.

    మనుషుల జీవనపద్ధతులు సరిగ్గా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది.

    ReplyDelete