koodali

Monday, June 13, 2022

ఏం చేయాలో మనకు సరిగ్గా అర్ధం కానప్పుడు దైవాన్ని ప్రార్దించుకోవటం మంచిది....

ఈ రోజుల్లో మీడియా ద్వారా ఎందరో ఎన్నో చక్కటివిషయాలను తెలియజేస్తున్నారు. అయితే, అది చేయకూడదు, ఇది చేయకూడదు వంటి విషయాలను మరీ ఎక్కువగా చెప్పటం వల్ల అయోమయం పెరుగుతుంది. 

 

 మనకు ఆచారవ్యవహారాలు ఎక్కువ.క్యాలండర్ లో చూస్తే నెలలో సుమారు చాలా రోజులు ఏదో ఒక విశేషం అని ఉంటుంది. దైవసృష్టిలో కాలం అంతా పవిత్రమే. ఎప్పుడైనా దైవపూజ చేసుకోవచ్చు. మనకు జీవించటానికి అవసరమైన వాతావరణాన్ని, గాలినీ, నీటినీ, ఆహారాన్ని, మరెన్నింటినో..అందించిన దైవానికి మనం తప్పక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అదే పూజ కూడా అవుతుంది.

 

 పండుగ అంటే..తలస్నానం చేయటం, ఉపవాసం, బ్రహ్మచర్యం..వంటివి పాటిస్తారు. అలాగని రోజూ ఏదో ఒక పండుగ అని రోజూ ఉపవాసాలు అంటూ సరిగ్గా ఆహారం తీసుకోకపోవటం, రోజూ తలస్నానం చేసి తల సరిగ్గా తుడుచుకోకపోతే అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. రోజూ పండుగ అని వివాహం అయిన వారు రోజూ బ్రహ్మచర్యం పాటించాలంటే కష్టం. ముఖ్యమైన కొన్నిపండుగలను చూసుకుని అప్పుడు మాత్రం నియమాలను పాటించి.. మిగతా రోజులలో మామూలుగా పూజ చేసుకోవచ్చు. 

 

సమాజం నడవాలంటే ఎన్నో వృత్తులు ఉండాలి. కొన్ని వృత్తుల వారికి ఎక్కువ సమయం పూజలో కూర్చోవటానికి సమయం కూడా ఉండదు. అందువల్ల, కొన్ని వృత్తుల వారు కొద్దిగా పూజ చేసినా చాలు ఎక్కువ ఫలితం వస్తుందని తెలియజేసారు. పనులు చేసుకుంటూనే కుదిరినంతలో దైవాన్ని స్మరించుకోవచ్చు. 

 

కలికాలంలో అనేక కారణాల వల్ల ఎక్కువ పూజలు చేసే శక్తి ప్రజలకు ఉండదు కాబట్టి, కలికాలంలో దైవనామస్మరణ చేసినా తరించవచ్చని పూర్వీకులు గ్రంధాల ద్వారా తెలియజేసారు.

 .............. 

ఆచారవ్యవహారాలు, నియమనిబంధనలు జీవితంలో అవసరమే. అయితే, వాటివల్ల సమాజం,సమాజంలోని వ్యక్తులు అభివృద్ధి చెందాలి.అందరిలో దైవభక్తి , ధర్మాచరణ పెరగాలి. అంతేకాని ప్రతిపనికి ముందరికాళ్ళకు బంధాలు వేసినట్లు ఈ పని ఇప్పుడు చేయకూడదు, ఇలా చేయకూడదు. .అంటూ ఎక్కువగా చెప్తే అవన్నీ పాటించాలంటే కష్టం. 

 

వైరాగ్యం అంటే అందరూ నిరాశానిస్పృహలతో అన్నీ వదిలి దేశాన్ని అత్యాశ ఉన్న వారికి అప్పగించటం కాదు.లోకకల్యాణం కొరకు ఎవరి స్వధర్మాన్ని వారు చక్కగా నిర్వర్తించాలి.సమాజంలో అందరూ బాగుంటే లోకకల్యాణం కూడా జరుగుతుంది. వైరాగ్యంతో కొండకోనల్లో తపస్సులు చేసేవారు కూడా తమతపశ్శక్తిని లోకకల్యాణం కోసం ఉపయోగించిన వారు ఉన్నారు. 

 

భగవద్గీతలో శ్రీకృష్ణులవారు అర్జునునితో.. నీ స్వధర్మాన్ని నీవు నిర్వర్తించాలని తెలియజేసారు. ఎవ్వరైనా నిష్కామకర్మయోగాన్ని అనుసరించి జీవితాన్ని గడిపితే దైవకృపను పొందవచ్చు.

  ........... 

పూర్వీకులు మనకు చక్కటి జీవనవిధానాన్ని అందించారు.చతురాశ్రమ వ్యవస్థను ఏర్పరిచారు. దైవభక్తి కలిగి, ధర్మ బద్ధంగా స్వధర్మాచరణ చేస్తూకూడా యోగిలా జీవించి దైవకృపను పొందవచ్చు. జనకమహారాజు వంటివారు అలా జీవించినవారే. 

 

ప్రాచీనులు సమాజఉన్నతికొరకు ఎంతో విజ్ఞానాన్ని అందజేసారు. ప్రజల శారీరిక, మానసిక ఉన్నతికొరకు ఎన్నో పద్ధతులను ఏర్పరిచారు. వాటికొరకు ఎన్నో ఆచారవ్యవహారాలను, నియమాలను తెలియజేసారు. ఎలా జీవిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో పురాణేతిహాసాలలోని పాత్రల ద్వారా తెలియజేసారు. 

 

అయితే, కొందరు వాటిని సరిగ్గా అర్ధం చేసుకోకుండా, వాటిలో కొన్నింటిని మూఢాచారాలుగా మార్చివేసారు. కాలక్రమేణా గ్రంధాలలో కొన్ని మార్పులు చేర్పులు {ప్రక్షిప్తాలు}జరిగాయంటున్నారు. కొందరు తెలిసీతెలియనివారు, కొందరు అసూయాపరులు కూడా ఇలా మార్పులుచేర్పులు చేసి ఉండవచ్చు. గ్రంధాలలో ఏమేమి ప్రక్షిప్తాలు జరిగాయో.. ఏదిప్రక్షిప్తమో? ఏది కాదో? తెలియటం లేదు. 

 

అందువల్ల మనం ప్రతి దానిని గుడ్డిగా ఆచరించటం కాకుండా.. పూర్వీకులు తెలియజేసిన విషయాలలోని అంతరార్ధాలను సరిగ్గా గ్రహించి పాటించవలసి ఉంటుంది.

  ............... 

దైవభక్తి కోసం పూజ చేయాలి. ఆచారవ్యవహారాలను పాటించటం కోసం పూజ కాదు. పూజ చేస్తూ భక్తిలో లీనమయినప్పుడు కొన్నిసార్లు పూజ చేసే పద్ధతి తప్పవచ్చు. అలాగని, పూజా విధానంలో తప్పులు వస్తే ఏమవుతుందో అనే భయంతో పూజాపద్ధతి అందే ఎక్కువ మనస్సు ఉంచి, దైవభక్తికి రెండవ ప్రాముఖ్యత ఇస్తే అది సరైన పూజ అనిపించుకోదు.

 

 ఒక భక్తుడు భక్తిలో లీనమయ్యి పండుకు బదులు తొక్కలను దైవానికి సమర్పించగా దైవం ఆ పూజను స్వీకరించారని గ్రంధాలద్వారా తెలుస్తుంది. 

...... 

ఏం చేయాలో మనకు సరిగ్గా అర్ధం కానప్పుడు దైవాన్ని ప్రార్దించుకోవటం మంచిది.

 

1 comment:

  1. మనుషులకు రకరకాల సమస్యలు వచ్చినప్పుడు ధర్మబద్ధమైన ప్రవర్తన.. దైవాన్ని ప్రార్ధించటం.. ధ్యానం..వంటి విధానాల ద్వారా ఆ సమస్యల నుండి బయటపడవచ్చు.

    గతపాపకర్మల వల్ల కష్టాలు వస్తాయి. పాపకర్మ మిక్కుటంగా ఉన్నప్పుడు .. చేసిన పాపాలకు పశ్చాత్తాపాన్ని పొంది, పుణ్యకర్మలు ఆచరించటం, ధ్యానం వంటివి కూడా ఎక్కువగా చేయాలి. ఎక్కువ ధ్యానం చేయలేనప్పుడు కొంత పాపకర్మఫలితాన్ని అనుభవించటం ద్వారా, కొంత ధ్యానం చేయటం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

    కొందరు తమకు కష్టాలు వచ్చినప్పుడు మహనీయుల సహాయం కొరకు వారి దగ్గరకు వెళ్తారు. అలా సహాయం కోరటంలో తప్పులేదు కానీ, తమ కష్టాలు తీరటానికి తాము కూడా శక్తివంచన లేకుండా కృషిచేయాలి. అంతేకానీ, ఇతరుల తపశ్శక్తిని వాడుకుని తాము లబ్ధి పొందాలనుకోకూడదు.

    ఎవరైనా ఏదైనా ఆశించేముందు తాము వాటిని పొందే అర్హతను సంపాదించుకుంటే బాగుంటుంది.

    ప్రస్తుత ప్రపంచంలో మనుషులు అనేక మంది చాలా పాపాలు చేస్తున్నారు. వాటి ఫలితంగా ప్రపంచంలో అనేక ఉపద్రవాలు సంభవిస్తున్నాయి.

    అయితే, కొందరు మహనీయులు గొప్ప తపస్సు చేసి ఆ శక్తి లో కొంతభాగాన్ని ప్రపంచశాంతి కొరకు వెచ్చించటం వంటి చర్యల వల్ల కూడా ప్రపంచానికి మంచి జరుగుతోంది.

    ప్రపంచ శాంతి కొరకు ఎందరో మహనీయులు ఎన్నో త్యాగాలు చేసి కష్టాలను అనుభవించారు. అలా సమాజం కొరకు కొందరు మాత్రమే కష్టపడటం కాకుండా, సమాజంలో ఎవరివంతు వారు మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తే ప్రపంచంలో శాంతి ఉంటుంది.

    ప్రపంచంలో తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఏది ఎందుకు జరుగుతుందో కొన్ని విషయాలలో అర్ధం కాదు. దైవానికే అన్నీ తెలుస్తాయి.

    ReplyDelete