koodali

Monday, June 13, 2022

దైవమా మంచి ఎప్పుడూ మీ దయే. మీకు అనేక కృతజ్ఞతలు.

 

 దైన్యం లేని జీవితం...అనాయాసమరణం..మోక్షం..కావాలని అందరికీ ఉంటుంది.

అవిపొందాలంటే దైవభక్తి..ధర్మబద్ధజీవనంతో జీవించటానికి ప్రయత్నించటం జరగాలి.

జీవితంలో సరైన దారిలో జీవించే శక్తిని ఇవ్వమని దైవాన్ని ప్రార్దించాలి.
............
దైవమా.. మీరు శాశ్వత పరమానంద స్వరూపులు. అత్యంత శక్తిమంతులు.

జీవులు ధర్మబద్ధంగా జీవిస్తూ హాపీగా ఉండేలా దయచూడమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

దైవమా.. మీసృష్టి మీఇష్టం..ఏది ఎప్పుడు ఎలా  చేయాలో మీకు తెలుసు.
దైవమా మంచి ఎప్పుడూ మీదయే. మీకు అనేక కృతజ్ఞతలు. 

 

 

9 comments:

 1. సంసారలంపటాలు, జీవితంలో సుఖాలను అనుభవించటం గురించి మనలో చాలామందికి చులకనభావం ఉంటుంది.

  సంసారలంపటాలు లేకుండా అన్నీ త్యజించి, కేవలం మోక్షం కొరకు మాత్రమే ఆలోచిస్తూ ఆహారంలో రుచులను పట్టించుకోకుండా, బంధాలను పట్టించుకోకుండా, సుఖాన్ని, కష్టాన్ని ఒకే విధంగా భావిస్తూ ఉండేవారు ఎంతో గొప్పవారు. అలాంటి స్థితి పొందాలంటే అత్యంత కష్టం.

  గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా, స్వధర్మాన్ని ఆచరిస్తూ నిష్కామకర్మ యోగంతో జీవించే స్థితి రావాలన్నా ఎంతో కష్టం.

  అలాంటి స్థాయికి అందరూ చేరాలంటే సమయం పడుతుంది. ఎవరి శక్తి ప్రకారం వారు క్రమంగా ప్రయత్నిస్తారు. చతురాశ్రమధర్మం ప్రకారం క్రమంగా వార్ధక్యంలో ఆ వైరాగ్యస్థితి వచ్చినా మంచిదే.

  గృహస్థాశ్రమంలో ఉంటూ .. ఈ ప్రపంచంలోని ఆకర్షణలకు లోబడక ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించేవారు కూడా గొప్పవారే.

  ఇలాంటివారు జీవితంలో అధర్మానికి లోబడకుండా చేసే ప్రయత్నంలో ఎంతో కష్టాన్ని అనుభవించవలసి ఉంటుంది. మానసికంగా నలిగిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి.

  ఇలాంటివారు చక్కని ఇల్లు, చక్కని సంసారం..వంటివి ఉన్నా కూడా ధర్మబద్ధంగా జీవించే క్రమంలో కష్టాన్ని కూడా పొందుతారు. అందువల్ల, ఇలాంటి వారిని చూసి.. వారు అన్ని సుఖాల మధ్య హాయిగా ఉన్నారు, ఇలాంటివారు దైవం గురించి మాట్లాడటమేమిటి ..అనుకోకూడదు.

  కష్టాలతో ఉన్నవారు మాత్రమే దైవం గురించి మాట్లాడతారు అనుకోకూడదు..సుఖాలమధ్య ఉన్నవారు కూడా తమకు చక్కని జీవితాన్ని ఇచ్చిన దైవాన్ని తలచుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటారు.

  పాపాలు చేయటం తప్పు. అంతేకానీ, ధర్మబద్ధసుఖాలను అనుభవించటం తప్పుకాదు.

  జీవితంలో ధర్మబద్ధసుఖాలను అనుభవించవచ్చని పెద్దలు గ్రంధాల ద్వారా తెలియజేసారు.

  వేడిగాఉక్కగా ఉన్నప్పుడు ఫాన్ వేసుకోవటం, తియ్యని మామిడిపండును తింటూ ఆ రుచిని ఆస్వాదించటం, భార్యాభర్తలు సంసారజీవితాన్ని గడపటం..ఇవన్నీ తప్పుకాదు.

  అయితే, రుచిగా ఉంది కదా ..అని ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటే అజీర్తి చేస్తుంది. ఏదైనా ఎంతవరకో.. అంత వరకు అయితే మంచిది.

  లౌకికవిషయాలంటే చులకనభావం ఉన్నవారు కూడా.. తమ సంతానం వివాహం చేసుకుని, సంతానాన్ని పొంది భోగభాగ్యాలతో తులతూగాలని, క్రమంగా వైరాగ్యాన్ని పొంది పరమాత్మను చేరాలని ఆశిస్తారు.

  అంతేకానీ, తమ సంతానం చిన్నవయసులోనే అన్నీ వదిలేసి విరక్తులై ఉండాలని అనుకోరు.

  అందువల్ల, సంసారంలో ఉంటూ ధర్మబద్ధసుఖాలను అనుభవించటం గురించి చెడ్డగా భావించటం తగదు.
  ..................
  అందరూ ఎప్పుడు విలాసాలతో మునిగిఉండాలని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు.

  ఈ రోజుల్లో యువత కూడా ఆధ్యాత్మికవిషయాల పట్ల ఆసక్తులవటం ఎంతో మంచివిషయం.

  అయితే, దైవకృపను పొందాలంటే..సుఖాలకు దూరంగా ఉండాలి, కష్టాలే ఉందాలి...అన్నట్లు చెబితే ..ధర్మబద్ధమైన సుఖాలను అనుభవించటానికి కూడా..నేను తప్పుచేస్తున్నానేమో? అని యువత భయపడే పరిస్థితి వస్తుంది.

  భార్యాభర్తలు సంసారం చేయటం కూడా తప్పన్నట్లు కొందరు అంటారు.. అలాగని, భాగస్వామికి దూరంగా ఉంటే.. రోజూ పూజలంటూ దూరంగా ఉంటే ..ఇక వివాహం ఎందుకు చేసుకున్నట్లు? అని జీవితభాగస్వామి విసుగుపడితే ఆ కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశముంది.
  ..........

  అందరూ చిన్నవయసులోనే విరక్తులై పోతే సమాజం ఎలా సాగుతుంది?

  సమాజం అన్నింటా ఉన్నతంగా ఉండాలని పెద్దలు ఆకాంక్షించారు. అందుకొరకు ఎంతో విజ్ఞానాన్ని మనకు అందించారు. ఎన్నో విద్యలను కూడా అందించారు. అవన్నీ అందిపుచ్చుకుని సమాజాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి.

  సమాజం నడవాలంటే ఎన్నో కావాలి. అందరూ తమ వంతు కృషి చేస్తేనే సమాజం చక్కగా ఉంటుంది.

  మనుషులకు ఎన్నో అవసరాలు ఉంటాయి.ఆహారం, నివాసగృహాలు, రక్షణ, విద్య, వైద్యం, కుటుంబాలు, కుటుంబావసరాలకు వస్తుసామాగ్రి..ఇలా ఎన్నో ఉంటాయి.

  ఇవన్నీ సవ్యంగా సాగాలని భావించిన పెద్దలు మనకు చక్కటి వ్యవస్థను ఏర్పరిచారు. వాటి ప్రకారం నడచుకోవాలి.

  భారతదేశం భోగభాగ్యాలతో తులతూగాలి, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉండాలి. అన్ని విషయాలలోనూ ప్రపంచానికి తలమానికంగా ఉండాలి.

  దైవం భోగభాగ్యాలను, మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తారని గ్రంధాల ద్వారా తెలుస్తోంది.

  సమాజంలో అందరూ చతురాశ్రమ వ్యవస్థ ప్రకారం ..ధర్మబద్ధంగా జీవితంలో వంశాభివృద్ధి, భోగభాగ్యాలతో తులతూగి, క్రమంగా విరక్తులై.. పరమాత్మకు చేరువవ్వాలని ఆశిద్దాం.

  అంతా దైవం దయ.

  ReplyDelete
 2. అందరికి ఎక్కువపూజలు చేయటంపై ఆసక్తి లేకపోవచ్చు. ఎక్కువగా పూజలు చేయాలన్నా కొందరికి కుటుంబసభ్యుల సహకారం లేకపోవచ్చు.

  పెద్ద పాండిత్యం లేకపోయినా, పూజావిధానాలు తెలియకపోయినా దైవభక్తి ఉండటం ఎంతో అదృష్టం.

  చాలామంది తమ తల్లితండ్రులను, సంతానాన్ని ఎంతో ప్రేమిస్తారు. దైవాన్ని కూడా తల్లితండ్రులను, సంతానాన్ని ప్రేమించినట్లు ప్రేమించవచ్చు. అంతకన్నా ఎక్కువగా కూడా ప్రేమించవచ్చు.

  దైవస్మరణతో మనసంతా ఆనందంతో నిండిపోయే స్థితి వస్తే ఎంతో గొప్ప విషయం. అలాంటి స్థితి రావాలంటే ఎంతో పుణ్యం ఉండాలి.

  అన్ని విజ్ఞానాలకు, అన్ని ఆనందాలకు మూలమైన దైవాన్ని పట్టుకుంటే ఇంకా లోటేముంటుంది.

  ReplyDelete
 3. ప్రతి లౌకికసుఖం వెనుక దుఃఖస్పర్శ ఉంటుంది.

  దుఃఖస్పర్శలేని ఆనందాన్ని పొందాలంటే మాత్రం దైవాన్ని ఆశ్రయించినప్పుడే సాధ్యం.

  అందుకే ఎవ్వరూ దైవాన్ని మర్చిపోకూడదు.
  ....
  లౌకికసుఖాలకు కష్టాలు వెన్నంటే ఉంటాయి.

  ఉదా..ఆహారం రుచిగా ఉందని ఎక్కువగా తింటే అజీర్ణం బాధ ఉంటుంది. అలాగని నిరాశ చెందనక్కరలేదు.

  ఆహారాన్ని అతిగా కాకుండా, తగుమాత్రం తీసుకుంటే అజీర్ణం రాదు.

  జీవితం అశాశ్వతం, లౌకిక సుఖాలు అశాశ్వతం.. అని నిరాశ చెందనక్కరలేదు. దైవం అనేక సుందరదృశ్యాలను సృష్టించారు. వాటిని చూసి ఆనందించవచ్చు.

  సుందరమైన ప్రకృతి దృశ్యాలు, అందమైన పువ్వులు, పరిమళభరితమైన అందమైన పువ్వులు, ఆహ్లాదకరమైన పిల్లగాలులు..ఇలా ఎన్నో ఉన్నాయి.

  వీనులవిందైన భక్తి గీతాలను సంగీతాన్ని పాటలను ..కూడా వినవచ్చు.

  జీవితంలో ధర్మబద్ధమైన సుఖాలను అనుభవించవచ్చు. అత్యాశలు లేకుండా కోరికలు తగ్గించుకుని, ధర్మమార్గంలో జీవిస్తూ, దైవాన్ని స్మరించుకుంటూ సంతోషంగా ఉండవచ్చు.

  **********
  జీవులకు దైవంతోటి బంధమే ఎప్పటికీ శాశ్వతం.

  అలాగని..తల్లితండ్రులు, జీవితభాగస్వామి, సంతానం పట్ల ఉదాశీనంగా ఉంటూ ఈ బంధాలు ఎంతకాలం ? శాశ్వతం కాదు కదా..అంటూ వైరాగ్యంతో మాట్లాడితే వాళ్ళు అయోమయంలో పడిపోతారు.

  గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కుటుంబసభ్యులతో మనస్ఫూర్తిగా ఆప్యాయతతో ఉండాలి. తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి.

  ధర్మబద్ధమైన సుఖాలను చక్కగా అనుభవించవచ్చు. అయితే, అవి శాశ్వతం కాదన్న ఎరుకను కలిగి వాటిపట్ల అత్యాశ లేకుండా అప్రమత్తతతో ఉండాలి.

  కొందరు ఇహలోక బంధాలు శాశ్వతంలా భావించి ఎన్నో పాపాలు చేసి, తరతరాలకు ఆస్తిని పోగేస్తారు. ఏదైనా కష్టం వచ్చిపడితే అప్పుడు ఏడుస్తారు.

  జీవితంలో కష్టాలు రావడానికి పాపాలు చేయటమే కారణం. పాపాలుచేసి ఆ పాపఫలితంగా కష్టాలు వచ్చినప్పుడు లబోదిబోమంటే ఎవరుమాత్రం ఏం చేస్తారు?

  మన మనస్సును మనం నిగ్రహించుకోగలిగితే పాపాలే చేయము. పాపాలు చేయకపోతే కష్టాలే రావు. మనస్సును నిగ్రహించుకోగలిగితే అంతా ఆనందమే.

  మనస్సును నిగ్రహించుకోవటం అత్యంత కష్టమే. కానీ, మనం ఆనందంగా ఉండాలంటే నిగ్రహించుకోవటం తప్పదు. శక్తి చాలకుంటే శక్తిని అనుగ్రహించమని దైవాన్ని ప్రార్ధించుకోవాలి.

  ReplyDelete
 4. జీవితంలో ఒక గొప్ప ఉద్యోగం సంపాదించాలన్నా కష్టపడి చదవాలి. అలాంటప్పుడు జీవితంలో అత్యుత్తమైన మోక్షసాధనకు కష్టం లేకుండా ఎలా ఉంటుంది.

  మంచి ఉద్యోగం కొరకు చదివేటప్పుడు మంచి ఆహారం తీసుకోవాలి. చదివే కష్టం నుంచి సేదతీరటానికి కొంత వినోదం కూడా అవసరమే.

  అయితే, ఆఖరి పరీక్షలు సమీపించినప్పుడు వినోదకార్యక్రమాలు బాగా తగ్గించుకుని బాగా కష్టపడి చదువుతారు.

  అయితే, మంచి మార్కులు రావాలని పిల్లల్ని అతిగా కష్టపెడితే పిల్లలకు చదువంటేనే విరక్తి కలిగే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల, వారి శక్తిని బట్టి ఒక పద్ధతి ప్రకారం చదివించాలి.

  మోక్షం కొరకు ప్రయత్నం అయినా ఎవరి శక్తిని బట్టి వారు ప్రయత్నిస్తారు.
  .................

  ఈ జన్మలోని బంధుత్వాలు ఈ జన్మ వరకే కదా..మన జన్మజన్మల శాశ్వత బంధువు దైవమే. మన జీవితలక్ష్యం మోక్షమే.

  అయితే, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు గృహస్థ ధర్మాన్ని కూడా సక్రమంగా నిర్వర్తించాలి కదా..

  కుటుంబవ్యవస్థ బాగుండాలి. సమాజం బాగుండాలి. వ్యక్తులు, కుటుంబాలు, దేశాలు, ప్రపంచం..అన్నీ బాగుండాలి.

  అలాగని సంసారలంపటాలతోనే మునిగిపోకూడదు, ఏది ఎంతవరకూ అవసరమో అంతవరకే ..అని తెలుసుకుని అధర్మం లేకుండా సంసారబాధ్యతలు నిర్వహించటానికి ప్రయత్నిస్తూ మన చరమ లక్ష్యమైన మోక్షానికి దారులు ఏర్పరుచుకోవాలి.

  ఏం చేయాలో అర్ధం కానప్పుడు, శక్తి చాలటం లేదనిపించినప్పుడు సరైన మార్గంలో జీవించే శక్తిని ప్రసాదించమని దైవాన్ని ప్రార్ధించుకోవాలి.
  .........
  బాల్యం..గృహస్థాశ్రమం..వానప్రస్థాశ్రమం..సన్యాసాశ్రమం....అనే చతురాశ్రమవ్యవస్థను ఏర్పరిచారు పెద్దలు. ఆ క్రమంలో క్రమంగా వైరాగ్యాన్ని పొంది మోక్షాన్ని పొందే అవకాశం ఉంది.

  (సన్యాసాశ్రమం అంటే ఈరోజుల్లో అందరూ అడవులకు వెళ్ళకపోయినా ఎవరిఇంట్లో వారు ఉంటూనే మోక్షస్థితికి ప్రయత్నించవచ్చు అని కూడా పెద్దలు తెలియజేసారు.)

  మోక్షం(ముక్తి) ఎన్నో విధాలుగా ఉంటుందని తెలుస్తోంది.

  జీవన్ముక్తులు కూడా ఉంటారని అంటారు.

  కొందరు దైవంవద్ద ..సాలోక్యం(సాలోక్య ముక్తి) పొందితే, కొందరు సామీప్యాన్నీ, కొందరు సారూప్యాన్నీ, కొందరు సాన్నిధ్యాన్ని పొందుతారని గ్రంధాలద్వారా తెలుస్తోంది.

  కొందరు త్వరగా మోక్ష స్థితికి చేరుతారు. కొందరు ఆలస్యంగా చేరవచ్చు.

  జన్మపరంపరలతో విసిగిపోయిన జీవులు దుఃఖస్పర్శలేని మోక్షం కొరకు ఎప్పటికయినా ఆరాటపడటము జరుగుతుంది.

  ఆ ప్రయత్నాలలో సఫలీకృతులైన జీవులు మోక్షాన్ని
  పొందుతారు.

  అంతా దైవం దయ.

  ReplyDelete
 5. జగన్నాటకంలో మన పాత్రలను దైవం మెచ్చేటట్లు చక్కగా నిర్వర్తించి, మన స్వస్థానమయిన దైవసన్నిధికి చేరి పరమానందాన్ని పొందవచ్చు.

  ReplyDelete
 6. సృష్టిలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. అన్ని విషయాలూ దైవానికి తెలుస్తాయి.

  ReplyDelete
  Replies
  1. దైన్యం లేని జీవితము, అనాయాస మరణము, మోక్షాన్ని .. ప్రసాదించు దైవమా.. అని ప్రార్ధించుకోవచ్చు.

   Delete