koodali

Monday, August 30, 2010

ఈ విధముగా మనము రక్షించ బడే ఆవకాశం ఉంది.

 

ఈ బ్లాగులో వ్రాస్తున్న సంగతులను చదువుతున్న వారికి నా కృతజ్ఞతలండి.

ఇప్పుడు వ్రాస్తున్న సంఘటన ఒక యోగి ఆత్మ కధ గ్రంధములో చెప్పబడింది.

ఇది కేవలానంద గారు చెప్పిన ......... బాబాజీ జీవితంలో జరిగిన ఒక సంఘటన.


ఒకనాటి రాత్రి బాబాజీ శిష్యులు పవిత్రమయిన వైదిక క్రతువు ఒకటి చెయ్యడానికి, భగభగా పెద్ద మంట మండుతున్న హోమకుండం చుట్టూ కూర్చుని ఉన్నారు. ఉన్నట్టుండి గురువుగారు ,మండుతున్న కట్టె ఒకటి తీసుకొని, హోమకుండానికి పక్కనే ఉన్న ఒక శిష్యుడి భుజం మీద కొట్టారు.


స్వామీ, ఎంత క్రూరం ! అన్నారు ఆక్షేపణగా, అక్కడే ఉన్న లాహిరీ మహాశయులు.

అయితే ఇతను, తన పూర్వ కర్మ ఫలానుసారంగా నీ కళ్ళముందే కాలి బూడిద అయిపోతూంటే చూస్తూంటావా ?

ఈ మాటలతో బాబాజీ, శిష్యుడి వికృత భుజమ్మీద ఉపశమనదాయకమయిన తమ చెయ్యి వేశారు. ' ఈ రాత్రి నిన్ను బాధాకరమయిన మృత్యువు నుంచి తప్పించాను. నిప్పు సెగ వల్ల ఈ కొద్దిపాటి బాధతో కర్మనియమం నెరవేరింది ' అన్నారాయన.


ఇది చదివాక నాకు ఏమనిపించిందంటేనండి....మనము సత్ప్రవర్తనవల్ల, ప్రేమ భక్తి వల్ల గురువు మరియు భగవంతుని కృపను పొందగలిగితే, మన పూర్వ కర్మ ఫలానుసారంగా అనుభవించవలసి వచ్చే రాబోయే పెద్దబాధలనుండి వారు మనలను రక్షించే అవకాశం ఉంది అని..

 

Friday, August 27, 2010

నిన్నటి సాయి భక్తురాలి విషయంలో నా అభిప్రాయం..........

 

 

నిన్న టి.వి. లో ఒకామె సాయి తన కలలోకి వచ్చి ఆమె చనిపోతుందని చెప్పినట్లు చూపించారు కదండి. ఇలా కలలు వచ్చినప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది. ఇలాంటప్పుడు అన్నీ తెలిసిన పెద్దలు , మంచి సలహా ఇచ్చేవాళ్ళు దొరికితే అదృష్టమే. కానీ అలాకాక తెలిసితెలియనివారికి చెపితే వారు కంగారుపడి మనలను కంగారుపెడతారు. .బయటివాళ్ళ దగ్గర కంగారు పడితే మోసం చేసే అవకాశం కూడా ఉంది.


సాయిబాబా వారి జీవితచరిత్రంలోని ఒక సంఘటన ఇక్కడ చెప్పాలి. దాము అన్నా అన్న అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. కానీ అతనికి సంతానం లేరు. తన జాతకములో దుష్టగ్రహప్రభావము ఉండుటచే తనకు సంతానము లేదని అతను అనుకుంటాడు. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకము కలదు.


ఒకనాడు రాలే అను ఒక భక్తుడు గోవా నుంచి 200 మామిడి పండ్ల పార్సెల్ శ్యామా పేరున బాబాకు పంపెను. బాబా అందులో నాలుగు పండ్లు తీసి కుండలో పెట్టి ఈ నాలుగు దాము అన్నాకు, అవి యక్కడనే యుండవలెననెను.


మామిడిపండ్లు బాబాకు అందిన రెండు గంటలకు దాము అన్నా శిరిడీకి చేరి , బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను. అందరు మామిడి పండ్ల వైపు చూచుచున్నారు. కాని అవి దాము కొరకుంచినవి. కావున అవి దాము తిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను.


కానీ మహళ్సాపతి {బాబా ముఖ్య భక్తుడు } దాని నిట్లు సమర్ధించెను. చావనునది యహంకారమును గూర్చి. దానిని బాబా ముందు చంపుట యొక యాశీర్వాదము. బాబా దామూతో యిట్లనెను. నీవు తినవద్దు. నీ చిన్న భార్య కిమ్ము. ఈ యామ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను, నలుగురు కొమార్తెలను ప్రసాదించును.


దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను. జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను.

ఇందులో బాబా దామును చావవలెను అన్నా కూడా అర్ధము వేరే. నిన్న ఒకామె సంఘటనలో కూడా ఇలా చావటం అన్న మాట వచ్చింది. ఇలాంటప్పుడు భయపడక భగవంతుని నమ్మితే ఆయనే దారి చూపిస్తారు. భగవంతుడు దయామయుడు. 

 


కొన్ని సంగతులు ......మరియు నా కల....




సాయి ఇలా అనేవారట. హిందువుల దైవమగు శ్రీరాముడును, మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య యేమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలోవారు కలహమాడుట యెందులకు ? ఓ అజ్ఞానులారా ! చేతులు చేతులు కలిపి రెండు జాతులును కలిసిమెలిసి యుండుడు. బుధ్ధితో ప్రవర్తింపుడు. జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదము వల్లగాని, ఘర్షణ వల్ల గాని ప్రయోజనము లేదు. అందుచే వివాదమును విడువుడు. ఇతరులతో పోటీ పడకుడు. మీ యొక్క వృధ్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో నేదైన అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్ధము. ఎవరైనా మీకు కీడు చేసినచో ,ప్రత్యపకారము చేయకుడు. ఇతరులకొరకు మీరేమైనా చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు. అనేవారట.


నా చిన్నప్పుడు మా బంధువుల ఇంటి పక్కన పెద్ద ఖాళీ స్థలములో క్రిస్టియన్స్ సభలు జరిగేవి. పక్క ఇంటివారితో కలిసి నేను కూడా ఆ సభలకు ఒకటి, రెండు సార్లు వెళ్ళాను. మేము అమర్నాధ్ యాత్ర వెళ్ళినప్పుడు నేను అల్లాహ్ కు కూడా మనసులో నమస్కరించుకున్నాను.


ఒక సంఘటన చెప్పాలండి. ఒకసారి మేము షిర్డికి వెళ్ళే కొంతకాలం ముందు నాకు ఒక చెడ్డ కల వచ్చింది. ఆ కలలో షిర్డిలో నాకు పెద్ద ఆపద కలిగినట్లు కనిపించింది.


ఈ కల గురించి మా ఇంట్లో వాళ్ళకు చెప్పలేదు నేను. తరువాత మేము షిర్డి వెళ్ళాము. కానీ నాకు భయం ......... ఏమి జరుగుతుందో అని. మేము షిర్డి వీధిలో నడుస్తున్నాము. ఇంతలో ఆ జనం మధ్య నాకు ఎదురుగా ఒక సాధువు లాంటి వ్యక్టి కనిపించి చెయ్యెత్తి నన్ను ఆశీర్వదిస్తున్నట్లు కనిపించింది. నేను తేరుకునేలోపు ఆ వ్యక్తి మాయమయ్యారు.


ఆ సాయే అలా అభయమిచ్చి నా భయాన్ని పోగొట్టినట్లు అనిపించిందండి. ఆ తరువాత ఆ భగవంతుని దయవల్ల ఏ హానీ లేకుండా ఇంటికి తిరిగివచ్చాము.



Wednesday, August 25, 2010

అన్ని జీవులకు భగవంతుని యందు భక్తి ..................

 

ఒక యోగి ఆత్మ కధ లో ఒక దగ్గర ఇలా చెప్పబడింది. ......... దేవుడొక్కడే తప్పులేని సలహా ఇస్తాడు; ఆయన తప్ప మరెవ్వరు మొయ్యగలరు ఈ బ్రహ్మాండ భారాన్ని ? అని...


ఇక నిన్నటితో ఈ సంవత్సరపు అమర్ నాధ్ యాత్ర పూర్తి అయింది. ఈ అమర్‌నాధ్ గుహ పురాణకాలం కన్నా ఎప్పటినుండో ఉన్న గుహ అట. కానీ ఈ కాలంలో మరల కొత్తగా ఒక ముస్లిం సోదరుని వల్ల కనిపెట్టబడింది. నాకయితే ఏమనిపించిందంటే భగవంతుడు అందరికి ఒక్కటే అని, అన్ని మతములవారు గొడవలు లేకుండా సుఖంగా ఉండాలని దీని ద్వారా మనము తెలుసుకోవచ్చని అనిపించిందండి.


బుధ అమర్ నాధ్ యాత్రలో అక్కడి ముస్లిం సోదరులు కూడా సహకారాన్ని అందిస్తారట. బాబా అమర్ నాధ్ యాత్రకు మేము వెళ్ళినప్పుడు అక్కడి వారి సహకారాన్ని చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము.


బుధ్ధ అమర్నాధ్ టెంపుల్ పూంచ్ టౌన్ కు దగ్గరలో ఉంటుందట.. ఈ గుడి మేము చూడలేదు. మేము వెళ్ళిన అమర్ నాధ్ గుహ హిమాలయములలో కాశ్మీర్ కు దగ్గరగా ఉంటుంది. ఈ గుహలో శివలింగం మంచుతో ఏర్పడుతుంది. .. అమర్నాద్ యాత్ర అంటే ఇక్కడకు వెళ్లి మంచు లింగాన్ని దర్శించు కుంటాము.


నాకు అప్పుడప్పుడు మన గుళ్ళు, అక్కడి విశేషాలు కలలో వస్తాయి. అరుదుగా ఇతర మతములవారికి సంబంధించిన విశేషాలు కూడా కలలో వస్తాయి. చాలా మంది భక్తులు కూడా భగవంతుని గురించి తమ తమ అనుభవాలను తెలుపుతున్నారు కదా...


మనము మానవులే గొప్ప అనుకుంటాము కానీ జంతువులు, పక్షులు కూడా భక్తిని కలిగి ఉండటం చూస్తూనే ఉన్నాము. కొంత కాలం క్రితం ఒక వానరం ఒక అంజనేయస్వామి వారి విగ్రహం వద్ద కొన్ని రోజులు నిరాహారంగా ఉండి ఆ తరువాత మరణించటం విన్నాము కదా.


ఒక వరాహం ఒక గుడి చుట్టూ నీరసంతో పడిపోతూ కూడా , ప్రదక్షిణలు చేయటం మేము టి.వి. లో చూశాము. ఒక ఎలుక కూడా గుడిలో ప్రదక్షిణలు చేసింది. ఇంకా ఒక దర్గాలో ఒక పావురం కూడా భక్తులు ఆహారాన్ని అందించినా తినకుండా అలాగే నిలబడి ఉండటం మీడియాలో చూపించారు.


ఇలా ఎన్నో వింతలు జరుగుతున్నాయి. అంతా ఆ భగవంతుని దయ....

 

Monday, August 23, 2010

అందరికి భగవంతుడు ఒక్కడే ................

 
నాకు ఇలా వ్రాయాలనిపిస్తోందండి. ప్రపంచములో ఎన్ని మతములున్నా దైవము మాత్రము ఒకటే. ఉదా......ఇప్పుడు సూర్యుడు అందరికీ ఒక్కడే. కానీ రకరకాల పేర్లతో పిలుస్తాము కదా....చంద్రుడు అందరికీ ఒక్కడే. .. అలాగే దైవం కూడా అందరికీ ఒక్కడే.


ఒక యోగి ఆత్మ కధలో పెద్దలు అన్ని మతముల యొక్క గొప్పతనమును గురించి చెప్పటం జరిగింది. హిందు, క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, బౌధ్ధం , ఇలా అన్ని మతములు గొప్పవే. ఎందుకంటే అందరి దైవం ఒక్కటే కాబట్టి.


అన్ని మతములలోను ఎన్నో మహిమలు చూపినవారు ఉన్నారు. ప్రపంచములో దైవశక్తి యొక్క గొప్పదనము ఇలాంటి వాటి ద్వారా నిరూపించబడుతుంది. ఒక యోగి ఆత్మ కధలో ఎంతోమంది హిందూ యోగులు చూపిన మహిమల గురించి చెప్పబడింది.


గిరిబాల అనబడే ఒక సాధ్వి ఆహారం స్వీకరించక ఎన్నో సంవత్సరములు గడిపినారట. దాని గురించి ఆమెను అడిగినప్పుడు ఆమె ఏమంటారంటే ............ మానవుడు ఆత్మ అని నిరూపించటానికి , ఇంకా అతడు దివ్యమైన ప్రగతి సాధించటం ద్వారా , అన్నం వల్ల కాక భగవంతుని శాశ్వత కాంతి వల్ల బతకగలుగుతాడు అని నిరూపించటానికి ... అని చెప్పటం జరిగింది. .

 గిరిబాల వంటివారికి , అనేకపూర్వ జన్మల దైవాంకిత జీవనం ఉండి ఉంటుంది.

నాకు ఇంకా ఏమనిపించిందంటే మనం అందరం భగవంతుని పిలిచే పేర్లలో కూడా ఎంతో పోలిక ఉందని. ఉదా.....పరమ్+ఏశా = పరమేశా. ఏసా అన్న ధ్వని అనిపిస్తోంది కదండీ.


...జగద్+ఈశా == జగదీశా. ఇందులోని ఈశా అన్న పదాన్ని తిరగవేసి చదివితే శాయీ అని వస్తుంది. అంటే సాయీ, సాయీ....అలా ... వాల్మీకి మహర్షి మహర్షిగా మారకముందు రామ నామాన్ని మరా,మరా అని పలికినట్లు.


ఇంకా కృష్ణ, కృష్, క్రీస్తు ఇలా పోలిక ఉంది కదండీ. ఇక సాయి బాబా వారి కధలోని కొంతమంది హిందువుల పేర్లు నానా సాహెబ్ డేంగలే, బాపూ సాహెబ్ బుట్టీ, కాకా సాహెబ్ దీక్షిత్. కాకాసాహెబ్ దీక్షిత్ బ్రాహ్మణులు. ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి.

జగన్మాత దర్శనాన్ని పొందిన శ్రీ రామ కృష్ణ పరమహంస వారు ఇతర మతముల వారిని గౌరవించేవారట. రామకృష్ణ మఠంలో అన్ని మతములవారికి ప్రవేశముంటుంది.


నాకు ఏమనిపిస్తుందంటే అన్ని మతముల వారు ఎవరి పధ్ధతిలో వారు దైవాన్ని కొలుచుకుంటూ గొడవలు లేకుండా అందరూ మంచిగా ఉంటే బాగుంటుంది కదా అని.



Wednesday, August 18, 2010

ఈర్ష్య, అసూయ వల్ల చివరికి మిగిలేది....................


పాండవులు, కౌరవులు ............. పాండవులు ధర్మపరులు. దుర్యోధనుడు అసూయాపరుడు. ఎప్పుడూ పాండవులకు హాని చేయటానికే ప్రయత్నించేవాడు. తమకు న్యాయముగా లభించిన తమవాటా రాజ్యమును పాండవులు చక్కగా అభివృధ్ధి చేసుకున్నారు. దాని అభివృధ్ధిని చూసి దుర్యోధనుడు ఎప్పుడూ ఈర్ష్యపడేవాడు.


వనవాసం, అజ్ఞాతవాసం ముగిసిన తరువాత ధర్మం ప్రకారం వారి రాజ్యం వారికి ఇవ్వకపోగా ,పాండవులు అడిగిన అయిదు ఊళ్ళను కూడా వారికి ఇవ్వటానికి ఒప్పుకొనలేదు. సూదిమొన మోపినంత ప్రదేశాన్ని కూడా వారికి ఇవ్వనని అనటం వల్లనే పాండవులకు యుధ్ధం చేయక తప్పలేదు... చివరికి ఏమి జరిగిందో అందరికి తెలుసు.....


పైన వ్రాసిన దానితో సంబంధం లేని టాపిక్ అయినా ఇంకో విషయం కూడా వ్రాయాలనిపిస్తోందండి. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఆధునికత మరియు సంపాదన మోజులో విలువలను పట్టించుకోవటంలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. వీరు భావిభారత పౌరులైన ............ వారి పిల్లలకు ఏ విధంగా విలువలను నేర్పుతారు ? అప్పుడు సమాజం ఏమవ్వాలి ?


మనం తప్పులను చేస్తాం, కానీ తప్పు తెలుసుకుని మంచిగా మారితే భగవంతుడు తప్పక క్షమిస్తారు. నేను చిన్నప్పుడు దేవుడు లేరని చెప్పే మా టీచర్ మాటలు విని ఆ దైవం యొక్క చిత్రాన్ని కాలితో త్రొక్కటం జరిగింది. ఆ తరువాత తప్పు తెలుసుకున్నాను, ఇవన్నీ ఇంతకు ముందు ఒక వ్యాసంలో వ్రాసాను లెండి.

అంత తప్పు చేసిన నన్నే ఆ దైవం క్షమించారు.

ఎవరైనా సరే మంచిగా మారితే ఆ దైవం తప్పక క్షమిస్తారు. .


ఇది సవరించుకోవలెను.......

 

ఇంతకు ముందు ఒక వ్యాసంలో నేను నరకాసురుని వధ తరువాత శ్రీకృష్ణుల వారు 16 వేల మంది రాజకుమార్తెలను వారి రక్షణకొరకు వివాహం చేసుకున్నారే కానీ వారితో కలిసి జీవించలేదు అని వ్రాసానండి. అయితే శ్రీకృష్ణుల వారికి వారి 16 వేలమంది భార్యలకు సంతానం కలిగారట. పొరబాటుగా వ్రాసినందుకు అందరూ దయచేసి క్షమించాలండి..


ఇక మన ప్రాచీన గ్రంధములలో చాలా విజ్ఞానం కూడా ఉందండి. ఉదా...ఈ రోజుల్లో స్టెం సెల్స్ అనబడే మూలకణముల వల్ల చాలా ప్రయోజనములున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.


ఈ కణములను శరీరమునుండి మరియు అప్పుడే పుట్టిన శిశువు బొడ్డు తాడు నుండి సేకరిస్తారట. ఈ కణములవల్ల నుంచి క్రొత్త శరీరకణములను సృష్టించవచ్చట. ఇవన్నీ వింటుంటే నాకు వీటి గురించి మన పెద్దలకు ముందే తెలుసుననిపిస్తోంది.


విష్ణుమూర్తి బొడ్డునుండి ఏర్పడిన పద్మ నాళం పద్మము, అందులో కూర్చుని ఉన్న బ్రహ్మదేవుడు ఈయన సృష్టిని చేస్తారుకదా.. ఇవన్నీ ఆలోచిస్తే ఈనాటి మూలకణములతో పోలిక ఉందనిపిస్తోంది.. .


అలాగే ఇంకో ఆచారం గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. కొంతమంది పెద్దలు బిడ్డ పుట్టిన తరువాత బొడ్డుత్రాడును భద్రపరిచి ,దానిని రాగిరేకులో పెట్టి తాయెత్తులా బిడ్డకు కట్టేవారు, ఇలా చేయటం వల్ల బిడ్డకు మంచిది అని చెప్పేవారు.


అంటే మనము ఈనాడు మూలకణములను స్టెంస్టెల్స్ ను దాచే బాంక్ లో భద్రపరిచి అవసరమైనప్పుడు వాడుకుంటున్నట్లు .... అప్పటివారు రాగిరేకులో భధ్రపరిచే ఆచారం పెట్టారేమో అని నాకు అనిపించిందండి. మనం ఇవన్నీ గ్రహించక చాదస్తపు ఆచారాలు అనుకుంటాము. ఏమైనా ఇది నా ఊహ మాత్రమే.. .

ఇంకో విషయమండి నైతిక విలువలతో కూడిన శాస్త్ర విజ్ఞానం వల్ల మాత్రమే మంచి జరుగుతుంది. లేకపోతే అంతా వినాశనమే.

వ్రాసిన వాటిలో తప్పులు ఉన్నచో భగవంతుడు దయచేసి క్షమించవలెనని నా ప్రార్ధన. . 

 

Monday, August 16, 2010

వ్యాసుల వారు వ్రాసిన రామాయణం గురించి నాకు ఇలా తెలిసింది........

 

ఇంతకుముందు వ్యాసంలో ఒక పొరపాటు జరిగిపోయిందండి. అందులో వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణం ............... అనటానికి బదులు వ్యాసులవారు వ్రాసిన రామాయణం ............ అని వ్రాసి పోస్ట్ చేసేసాను .


తరువాత మళ్ళీ పోస్ట్ చూస్తే నాకు ఒకటే కంగారు. ఇంత తప్పు ఎలా జరిగింది ? అని ..... రచయిత పేరు కూడా సరిగ్గా తెలియకుండా తోచినట్లు రాసిపారేస్తున్నారని ఎవరైనా అనుకుంటారని ...........అప్పుడు తప్పు సరిచేసాను.


తరువాత చేసేదేమీ లేక ..... అదే కంగారులో వ్యాస రామాయణం అని ఎక్కడయినా ఉంటుందేమోనని ఆశగా నెట్లో చూసానండి. ఆశ్చర్యంగా వ్యాసులవారు వ్రాసిన రామాయణం గురించి నిజంగానే ఉంది. దీని పేరు ఆధ్యాత్మ రామాయణం అట. { స్పెల్లింగ్ సరిగ్గానే రాసానో లేదో తెలియటం లేదు . } ఇంతకు ముందు పేరు విన్నాను కానీ ,వ్యాసులవారు వ్రాసారని తెలియదండి. శివుడు పార్వతుల గురించి కూడా ఇందులో చెప్పబడింది.


ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. బ్లాగ్ చదువుతూ నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ఎంతో కృతజ్ఞతలండి. మీరందరూ నాకన్నా చాలా విషయాలు తెలిసినవారు.. అందుకని ఏమైనా తప్పులు వచ్చినప్పుడు , మీకు ఇబ్బంది లేకపోతే, దయచేసి తెలిపితే, తప్పులు సరిజేసుకుంటానండి.


ఒకోసారి నాకు ఏమనిపిస్తుందంటే నేను వ్రాస్తున్న వాటిలో మీకు నచ్చని విషయాలు కూడా ఉండొచ్చు. అప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటుందికదా అని నాకు అనిపిస్తుంది. అందుకు అందరికీ సారీ నండి.


ఇక వాలి, సుగ్రీవుల కధ లో వారిద్దరూ మొదట చాలా అన్యోన్యంగానే ఉండేవారట. ఒకసారి వాలి యుధ్ధములో మరణించారని సుగ్రీవులవారు పొరపడిన సందర్భములో రాజ్యక్షేమం కొరకు ఆయన రాజ్యపాలన స్వీకరించవలసి వచ్చింది కదా....


తరువాత వాలి తిరిగివచ్చి సుగ్రీవుని అపార్ధం చేసుకోవటం , తరువాత చాలా సంఘటనల అనంతరం వాలి వధింపబడటం వరకు విషయం వెళ్ళింది. అసలు వాలి రావణుని కంటే ఎక్కువ బలవంతుడట.


ఇంకోవిషయం రాములవారు వాలి కోరిక ప్రకారం వాలి కుమారుడైన అంగదుని యువరాజుగా చేయటంగురించి మాట ఇచ్చారు. నాకేమనిపించిందంటే రాములవారు వాలి యొక్క కుమారునికి న్యాయం చేసారని.


ఎలాగంటే వాలి వధానంతరం సుగ్రీవులవారు రాజు అయ్యారు కదా......సుగ్రీవుని తరువాత సుగ్రీవుని సంతానం కాకుండా వాలి యొక్క కుమారుడైన అంగదులవారికి రాజ్యం లభించింది. విధంగా సుగ్రీవునికి, వాలి యొక్క కుమారునికి కూడా న్యాయం జరిగినట్లయిందని నాకు అనిపించింది.



ప్రాచీన కధల ద్వారా ధర్మమునకు, అధర్మమునకు సంబంధించిన సూక్ష్మమయిన విషయములను తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. సత్యవాక్యం యొక్క గొప్పదనం చెప్పిన పెద్దలే .....మన సత్యవాక్యం ఒక జీవికి అన్యాయముగా ప్రాణహాని కలిగించేదయితే ,అది అధర్మమే అవుతుందని కూడా తెలియజేసారు.


నాబోటి వాళ్ళకు ధర్మసూక్ష్మములు అంతగా అర్ధం కావు. అందుకే సర్వాంతర్యామి అయిన భగవంతుడి తోడు మనకెంతో అవసరం. ఆయనను శరణుకోరటం కూడా కష్టమే కానీ ... ప్రయత్నించాలి.


అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని పెద్దలు చెప్పినట్లు, దైవం కృపకు మనం పాత్రులమయితే ఇక లోటేముంటుంది .... భగవంతునికి నా ధన్యవాదములు.


Friday, August 13, 2010

చిన్నతనం లోనే వారి విజ్ఞత .......

 

జీవులు ఎటువంటి బాధలు లేని పరమానందమును పొందాలంటే మోక్షము ద్వారా మాత్రమే అది సాధ్యము. ఆ పరమాత్మలో లీనమవ్వటమే మోక్షము. దైవమును, ధర్మమును నమ్ముకున్న వారికే ఇవన్నీ సాధ్యం.


మన ప్రాచీన కధలలో ఎన్నో విధములుగా ధర్మం గురించి చెప్పబడింది. దశరధులవారిని కైకేయి దేవి వరములు అడుగుతారు కదా....భరతునికి పట్టాభిషేకము, రామునికి 14 సంవత్సరములు వనవాసం ఇలా......


ఈ వరముల వల్ల దశరధులవారికి సంకట పరిస్థితి ................ ఒకవైపు రాముని వనవాసం. మరొకవైపు మాట తప్పవలసిన పరిస్థితి ..... ఎటు చూసినా ఏదీ తట్టుకోలేని ఇబ్బందికర పరిస్థితి.


ఇలాంటి పరిస్థితిలో , తన తండ్రి మాట నిలబెట్టుట కొరకు రాములవారు వనములకు వెళ్ళారు . సీతా దేవి రాములవారిని అనుసరించారు . ఇక లక్ష్మణులవారు తాను వనవాసం చేయవలసిన అవసరం లేకున్నా, తానుకూడా రాములవారిని అనుసరించి వారి కష్టకాలములో సహాయముగా ఉన్నారు.


కొంతమంది తండ్రి ఆజ్ఞ ప్రకారం రాములవారు వనములకు వెళ్ళారని అంటారు. వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణ మహాకావ్యం నేను చదవలేదండీ . కానీ దశరధులవారు, రాములవారిని వనవాసమునకు వెళ్ళమని స్వయముగా ఆదేశించలేదేమో అని నాకు అనిపించిందండి. అందుకే పైవిధముగా వ్రాశానండి...... రాములవారి వనవాసం , పుత్రవియోగం భరించలేకనే కదా దశరధులవారు మరణించారు...


ఇక భరతులవారు రాజ్య పాలనకు ఆశపడలేదు. రాములవారి వనవాసం ముగిసేవరకు వారి పాదుకలను పూజిస్తూ , తాను రాములవారి ప్రతినిధిగా రాజ్యమును చూసుకున్నారు. ఇక శత్రుఘ్నులవారు కూడా సోదరులవలెనే తానూ ధర్మమార్గములో నడిచారుగానీ అత్యాశకు పోలేదు.


ఇలా సోదరులందరూ తమ త్యాగములతో జీవితములో కొన్ని కష్టములను అనుభవించినా , అనంతరము చరిత్రలో ధర్మమూర్తులుగా నిలిచారు.


సామాన్యముగా లోకములో ఇలాంటి సందర్భములలో రాజులయిన అన్నదమ్ముల మధ్య వారసత్వ యుధ్ధములు, కుటుంబములో కలహములు, దేశములో అనిశ్చితి, ప్రజలకు బాధలు ఇలా ఉంటాయి.

కానీ ఈ అన్నదమ్ములు చిన్నవయసులోనే ఎంతో విజ్ఞతతో ప్రవర్తించారు.


ఇలాంటి విజ్ఞులు తాము ధర్మబధ్ధముగా ప్రవర్తిస్తేనే ప్రజలు మరియు తమతరువాతి తరములవారు కూడా ధర్మముగా ప్రవర్తిస్తారని భావించి తాము కష్టములను అనుభవిస్తారు...అలా గొప్పవారిగా చరిత్రలో నిలిచిఉంటారు.

 

Wednesday, August 11, 2010

ఆ నాటి కధలు...... ఇప్పుడు........


శకుంతలా దుష్యంతుల కధలను వింటే ప్రాచీన కధలలో మనస్తత్వ శాస్త్రం గురించి ఎంత చక్కగా చెప్పబడిందో కదాఅనిపిస్తుంది.
ఇక రోజుల్లో కధలను పోలిన కధలను మనం చాలా వింటూనే ఉన్నాం. ఈనాటి యువత ఇలాంటికధలనుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది.


చాలామందికి ఒక అపోహ ఉంది. ఎదుటి వారిని అర్ధం చేసుకుని వివాహంచేసుకుంటే పెళ్ళి తరువాత ఇద్దరి మధ్య గొడవలు రావని. పెద్దవాళ్ళు కూడా ఎన్నో విధాలుగా కాబోయే వధూవరులగుణగణములు, ప్రవర్తన, ఇంకా వారి తల్లిదండ్రులు కుటుంబవిషయములు ఇవన్నీ బాగా ఆలోచించే పెళ్ళి చేస్తారుగదా..


.ఇక ప్రేమపెళ్ళిళ్ళు చేసుకునే అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు అర్ధం చేసుకోవటమన్నది. ఎలా సాధ్యమో నాకు తెలియదు.
ఎవరైనా తమ అసలు మనస్తత్వం బయటపడనిస్తారా కొద్దికాల పరిచయంలో ?

అసలు ఒక మనిషితనకుతాను అర్ధం కావటానికే చాలాకాలం పడుతుంది. నేను అంటే ఏమిటో తెలుసుకొమ్మని శ్రీరమణమహర్షులుచెప్పినట్లు ... అసలు ఒక మనిషి తనకుతాను అర్ధం కావటానికే చాలాకాలం పడుతుంది. .ఇక ఎదుటివారిని అర్ధంచేసుకోవటం ఎలాగో ఏమిటో.


మనము జీవితములో చాలాసార్లు నేను అదివరకు అలాకాకుండా ఇలా చేసి ఉంటేబాగుండేది అని అనుకుంటాము కదా... అందుకనే పెళ్ళి విషయములో ఎంతో ఆలోచించాలి. మన ప్రయత్నం మనంచెయ్యాలి.
తరువాత మన తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది కదా.....


ఇంకా మనం చిన్నప్పుడు సర్కస్ ను , అందులోని ....... గొప్పఫీట్స్ చేసే వాళ్ళను , జనం చప్పట్లను చూసి అది అధ్బుత ప్రపంచమని, అందులోపనిచేసేవాళ్ళు అదృష్టవంతులని ..... ఇలా అనుకోవటం జరుగుతుంది. వాళ్ళకీ కష్టాలు ఉంటాయని .... ఎవరైనా చెబితే మనంఎంతమాత్రం ఒప్పుకోని తెలిసీతెలియని వయస్సది. ఇదే విషయం పెద్దయ్యాక తలచుకుంటే నవ్వొస్తుంది కదా.... ఇలాగేజీవితములో ఎదిగేకొద్దీ భావాలు మారుతుంటాయి...... అందుకే యువతీయువకులు పెద్దలను ఎదిరించి పెళ్ళిచేసుకోవాలనుకునే ముందు చాలా ఆలోచించాలి.


కొంతమంది ప్రేమించి పెళ్ళి చేసుకున్న వాళ్ళు కూడా గొడవపడినప్పుడు , ఈవిడను చేసుకోకపోతే నాకు బోలెడు కట్నం వచ్చేది అని భర్త, ఈయనను చేసుకోకపోతే తనకు ఇంకాపెద్ద ఉద్యోగి తో తల్లిదండ్రులు పెళ్ళి చేసేవారని భార్య తిట్టుకునే సంఘటనలు కూడా వింటున్నాము. .


కొంతమందిప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను వదిలేసి కొత్త పెళ్ళి చేసుకునే వాళ్ళు ఎంతోమంది కనిపిస్తున్నారు. అలాంటప్పుడు అమ్మాయి పరిస్థితి ఏమిటి ? తల్లిదండ్రులు ఎలాగూ ఆదుకుంటారు అది వేరే విషయం. బాధలన్నీ ఎందుకు అనిపెద్దలు నిశ్చయించిన పెళ్ళి చేసుకుంటే జీవితంలో కష్టం వచ్చినప్పుడు పెద్దలు కల్పించుకుని ఎలాగోలా పిల్లల జీవితాన్నిసరిదిద్దే ప్రయత్నాన్ని చేస్తారు.



ఈనాడు సినిమాల్లో కూడా ప్రేమించి పెళ్ళి చేసుకోవటమే అందరి జీవితధ్యేయం అన్నట్లు ,ఇక ప్రపంచములో చేయటానికి వేరే పనేమీ లేదన్నట్లు చూపిస్తున్నారు. ప్రేమ ఫలించకపోతే ఆత్మహత్యలు.


ఒకసారిప్రేమమైకం పక్కన పెట్టి చూస్తే, ప్రపంచంలో తల్లిదండ్రి లేక అనాధలైన చిన్నచిన్న పిల్లలు రోడ్ల ప్రక్కన చెత్తకుండీల్లోని ఎంగిలి ఆకులలోనివి తినటం కూడా మనం చూడవచ్చు. ఆత్మహత్యలు చేసుకునే ముందు ఆలోచించాల్సింది ..... చిన్నపిల్లలుపడుతున్న కష్టం ముందు తమ ప్రేమ విలువ ఎంతని ?


సినిమాల్లో పెళ్ళి తరువాత శుభం కార్డ్ వేసేసి వారు చేతులుదులుపుకుంటారు. కానీ బయట అలా కాదు కదా...... అసలు కధ అక్కడినుండే ప్రారంభమవుతుంది .ఎలా చేసుకున్న పెళ్ళయినాజీవనవిధానం ఒకలాగే ఉంటుంది కదా.....పిల్లలు, బాధ్యతలు, కష్టాలు, సుఖాలు ఇలా.....

ప్రేమ పెళ్ళిళ్ళ గురించి నాకుప్రత్యేకమయిన అభిప్రాయమేదీ లేదు.
అది వారివారి అప్పటి పరిస్థితులను బట్టి వారి విచక్షణను ఉపయోగించిఎవరికివారే ఆలోచించుకోవాలి.

అయితే నేను అనుకోవటం...... యువత కొంచెంసేపు ఆకర్షణను పక్కన పెట్టి , తమ భవిష్యత్తును గురించి సీరియస్ గా ఆలోచించాలి. అప్పుడే నిర్ణయించుకోవాలి . ఎందుకంటే తాము పెళ్ళి చేసుకోబోయే వ్యక్తిని బట్టి తన జీవితమేకాదు.....తమతల్లిదండ్రుల జీవితము, తమకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని గ్రహించాలి. ఇది నా జీవితంనా ఇష్టం అనుకోవటానికి లేదు. మనం ఈ కధలద్వారా ఎన్నో సంగతులు తెలుసుకోవచ్చు.

భగవంతుని దయవల్ల అందరూ బాగుండాలి..



Monday, August 9, 2010

భగవంతుని దయ అపారమయినది .....

 

ఓం
శ్రీ భువనేశ్వరుడు
శ్రీ భువనేశ్వరీ దేవి {శ్రీ మన్మహాదేవుడు శ్రీ మన్మహాదేవి}
కొలువున్న మణిద్వీపం , చింతామణి గృహం పరమాద్భుతముగా ఉంటాయట. దేవి కృపకు పాత్రులైన వారు మాత్రమే జన్మాంతమునందు ఆ మణిద్వీపవాసులవుతారట. అక్కడ కొందరు సాలోక్యముక్తి, కొందరు సామీప్యముక్తి, కొందరు సారూప్యముక్తి , కొందరు సాయుజ్యముక్తి పొందుతారని ఇలా ఎన్నో విశేషములు శ్రీ దేవీ భాగవతములో చెప్పబడ్డాయని పెద్దలు చెబుతున్నారు. { ఇక్కడ ముక్తి గురించిన వివరములు గొప్పగా ఉన్నాయి. }


జీవుల అంతిమ లక్ష్యం ముక్తిని సాధించటమే. అందుకు ధర్మబధ్ధముగా జీవించాలి. మరి ఏది ధర్మం ?ఏది అధర్మం ? అని మనము ప్రాచీన కధల ద్వారా తెలుసుకోవచ్చును.

ఇంకో విషయం ఒక యోగి ఆత్మ కధ గ్రంధములో ఎందరో గొప్ప వ్యక్తుల గురించిన వివరములు ఉన్నాయి. అందులో...


1...శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు
....బాబాజీ వంటి పరమగురువులు ఎన్నో శతాబ్దములుగా జీవించి ఉన్నారట. ఆయన శంకరాచార్యుల వారికి క్రియా యోగం నేర్పించినారట. బాబాజీ భగవంతుడి సంకల్పం ప్రకారం ఈ లోకానికి ప్రత్యేక సేవావిధి నిర్వహిస్తున్నవారు. ఒక భౌతిక శరీరానికి గాని ఈ గ్రహానికి గాని పరిమితులయి ఉన్నవారుకాదు.


2. శ్రీశ్రీ లాహిరీ మహాశయులు.
..బాబాజీ వారి శిష్యులు. వాడుకలో లోపించి లేదా చిరకాలముగా అదృశ్యమై ఉన్న సర్వోన్నత క్రియాయోగవిద్యను బాబాజీ ద్వారా పొందినవారు. ఆ విధముగా ఆ విద్య మళ్ళీ వెలుగులోకి వచ్చింది. భగవద్గీత లో పదేపదే ప్రశంసిస్తూ వచ్చిన నిజమైన అగ్నికార్యం క్రియా యోగ మేనని పెద్దలు చెబుతున్నారు .


3. .శ్రీశ్రీయుక్తేశ్వర్ గిరిస్వామి గారు
.వీరు లాహిరీ మహాశయుల శిష్యులు.
 

4. శ్రీశ్రీ యోగానంద గారు.  శ్రీయుక్తేశ్వర్ గిరిస్వామి వారి శిష్యులు.


శ్రీ యుక్తేశ్వర్ గారు తన మరణానంతరము మరల తన స్వశరీరముతో యోగానంద గారికి కనిపించి, ఎన్నో మరణానంతర రహస్యములను తెలిపారు. గొప్ప భక్తులు మోక్షమును పొందటము, మరియు తక్కువ స్థాయి భక్తులు , ఇతర జీవులు, వారి వారి మరణము తరువాత పొందే ఎన్నో లోకముల గురించి, అక్కడి విశేషములు, జీవులు వారి అర్హతను బట్టి క్రమముగా మోక్షమును పొందటం ,ఈ వివరములను అధ్బుతముగా తెలిపారు.


ఇంకా యోగానంద గారితో ... అబ్బాయి, నేను దైవాజ్ఞ చేత పునరుథ్థానం చెందానని , ఇప్పుడు నువ్వు పూర్తిగా గ్రహించవచ్చు ... అని చెప్పి, ఎన్నో విషయములను తెలియచేశారు.


ఇంకా ఈ గ్రంధములో ఎన్నో సంగతులు చెప్పబడ్డాయి. ఆ దైవం,.... ఈ లోకం కష్టములలో ఉన్నప్పుడు , తమ భౌతిక కర్మను అనుభవిస్తుండే మానవులకు సహాయం చెయ్యటానికి, తనను చేరిన దివ్యాత్మలను తన ప్రతినిధులుగా, భూమి మీదకు పంపిస్తారట.


వారే అవతార పురుషులు, ప్రవక్తలు, మహాగురువులు ఇలాంటివారు. వీరు జీవుల కర్మక్షయం కావటానికి ,.... తద్వారా వారు మోక్షమును పొందుటకు సహాయమును అందిస్తారు.


మనము మోక్షమును పొంది పరమానందమును పొందాలని ఆ పరమాత్మ ఇలా ఎన్నో విధములుగా మనకు మార్గములను తెలియచేశారు.


ఇక మనము మన ప్రాచీన కధల విషయానికి వస్తే వాటిని మనము సరిగ్గా అర్ధం చేసుకోవాలి. ఈ కధలలో పాత్రలు, వారి పూర్వ జన్మకర్మఫలం..... ఇవన్నీ సమన్వయపరుచుకుంటూ చదివితేనే సరిగ్గా అర్ధమవుతాయి.



రుక్మిణీదేవి తల్లిదండ్రులు మొదట ఆమెను శ్రీకృష్ణుల వారికిచ్చి వివాహం చేయదలచారట.
 

ఆ తరువాత ఆమె సోదరుడు , తన స్నేహితుడయిన శిశుపాలునితో ఆమెకు వివాహం చేయటం కొరకు, తమ తల్లిదండ్రుల ను బలవంతముగా ఒప్పిస్తాడు. రుక్మి కంసుని స్నేహితుడు కూడా. ఇలా ఇన్ని కారణములున్నాయి. శిశుపాలుడు మంచిగుణం కలవాడు కూడా కాదు. ఇలాంటి పరిస్థితిలో
రుక్మిణీదేవి
ఒక బ్రాహ్మణుని ద్వారా కృష్ణునికి సందేశం పంపటం, శ్రీకృష్ణుల వారు వచ్చి కొన్ని పరిణామముల అనంతరము
రుక్మిణీదేవి
ని వివాహం చేసుకోవటం మనకు తెలిసిన కధయే. ఆఖరికి
రుక్మిణీదేవి
వివాహం మొదట తన తల్లిదండ్రులు నిశ్చయించిన శ్రీకృష్ణునితోనే జరిగింది.


ఇలాగే పెద్దలు శకుంతలాదుష్యంతులు కధ ద్వారా వివాహం విషయములో పిల్లలు పెద్దలకు తెలియకుండా వ్యవహరిస్తే ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాలో కూడా తెలియచేశారు.


ఇలా ధర్మమునకు, అధర్మమునకు మధ్య చాలా సూక్ష్మ మైన విభజన రేఖ మాత్రమే ఉంటుంది. కాబట్టే పెద్దలు ఇన్ని రకరకాల కధలను తెలియచేశారు. ధర్మమును ఇలా తెలుసుకోవాలని, ఇంకా అర్ధం కాకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి.

లేక శ్రీ శారదా మాత చెప్పినట్లు జీవితములో సందేహము వచ్చినప్పుడు కన్నీళ్ళతో దైవాన్ని ప్రార్ధిస్తే దైవం తప్పక మార్గమును చూపిస్తారు. ..

  భగవంతుని దయ.