koodali

Wednesday, August 4, 2010

అధర్మపరులైన తల్లిదండ్రులను వారి పిల్లలూ ఈ విధముగా అనుసరించాలి.....

ఓం.

మనం ఇంతకుముందు ఒకసారి సీతారాములు జీవితములో ఎన్నో కష్టములను అనుభవించినా, ధర్మమార్గమును అనుసరించటం వల్ల వారి పిల్లలు జీవితములో ఎలా చక్కగా ఉన్నారో, రావణుడు అధర్మముగా ప్రవర్తించటం వల్ల వారి పిల్లలు జీవితంలో ఎలా అర్ధంతరముగా రాలిపోయారో చెప్పుకున్నాము కదండి.



ఇక్కడ మరి పిల్లలు తల్లిదండ్రులను ఏవిధముగా అనుసరించాలి అనే సందేహం కలుగుతుంది. తల్లిదండ్రులు ధర్మబధ్ధులయితే సమస్యే లేదు. మరి అధర్మవర్తనులయితే ........ పిల్లలు ఏమి చెయ్యాలి?



నాకు ఏమనిపిస్తోందంటేనండి ... తల్లిదండ్రులను వారు అధర్మవర్తనులైనా సరే గౌరవించవలసిందే. మనల్ని కన్నవారు కాబట్టి..... కానీ వారు అధర్మవర్తనులు అయినప్పుడు , తల్లిదండ్రుల ఆజ్ఞలను అనుసరించే విషయంలో మాత్రం కొంచెం ఆలోచించాలి. . తల్లిదండ్రుల ఆజ్ఞలను అనుసరించవలసినదే ... ఎప్పుడు? వారు ఉత్తములు, సత్ప్రవర్తన కలిగినవారయినప్పుడు మాత్రమేనని నా అభిప్రాయము. ఇలా అంటున్నందుకు కొందరికి తప్పుగా అనిపించవచ్చు.



ఇప్పుడు చూడండి. రావణాసురుని ఏడుగురు పుత్రులు యుధ్ధంలో అర్ధంతరంగా చనిపోయారు. ఎందుకు? కేవలం తండ్రి యొక్క అత్యాశ, అధర్మప్రవర్తనవల్ల. .... వీరు తండ్రియొక్క అధర్మకార్యములను అనుసరించటం వల్ల. ..... వీరి వల్ల ఎంతోమంది బలహీనులు బాధలను అనుభవించారు.......


నాకేమనిపిస్తుందంటేనండి , ఇక్కడ ఎక్కువ బాధ్యత పెద్దలదేఉంటుంది. ఎందుకంటే కొందరు పిల్లలు పెద్దవాళ్ళకు ఎదురు చెప్పలేక వారిమాట పాటించటం జరుగుతుంది.


ఇక్కడ ఒక ఉదా: రావణుని కుమారుడైన ఇంద్రజిత్తు రామ,రావణ యుధ్ధం కొంతకాలం జరిగాక, గొప్ప అస్త్రముల వల్ల రామ,లక్ష్మణులకు అపకారం జరగకపోవటం చూసి , వారిశక్తిని గమనించి రావణుని వద్దకు వెళ్ళి ,రాక్షస వంశ రక్షణ కొరకు యుధ్ధమును ఆపివేయమని అడగటం జరిగిందట.. {ఇది నిజమో కాదో నాకు తెలియదు. ఒక దగ్గర చదివానండి.}అప్పుడు రావణుడు ఇంద్రజిత్తుపై ఆగ్రహించగా ఆయన ఇక తండ్రి కొరకు యుధ్ధమును చేస్తాడట. తరువాత కొంతకాలానికి లక్ష్మణుల వారి చేతిలో ఇంద్రజిత్తు చనిపోతారు.


ఇలా తమ అంతులేని అత్యాశకు పిల్లలను బలి చేసేవారు రోజుల్లో కూడా ఎంతోమంది కనిపిస్తున్నారు. అలాంటి వారికి పుట్టటం పిల్లలు చేసుకున్న పూర్వపాపఫలం అంతే మరి.


అలాగని తల్లిదండ్రులను ఎదిరించమని నేను చెప్పటం లేదు. తండ్రి మాట వినాలి కదా అని .... ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువును దూషించలేదు మరి. ఆయన తండ్రిని అనుసరించలేదు. అలాగని ఎదిరించలేదు. తండ్రికి శ్రీ హరి గొప్పతనమును చెప్పి మార్చటానికి ప్రయత్నించారు. తండ్రి వినలేదు. ఎన్నో విధాలుగా కుమారుని హింసించారు. ప్రహ్లాదుడు తాను నమ్మిన దైవాన్ని, ధర్మ సిధ్ధాంతాన్ని వదలలేదు. భగవంతుడు ఆయనను కాపాడుకున్నారు. తద్వారా లోకంలో దైవభక్తి యొక్క శక్తి, ధర్మం యొక్క మహిమ అందరికి తెలిసింది కదా...



ఇలా తల్లిదండ్రులు అధర్మపరులైనప్పుడు, పిల్లలు రావణుని సంతానంలా కాకుండా , ప్రహ్లాదుని మార్గమును అనుసరించటంవల్ల వారు రక్షించబడతారని ..... కధల ద్వారా మనము నేర్చుకోవచ్చని నాకు అనిపించిందండి.



అంతేకాక మన పెద్దలు చెప్పేవన్నీ అర్ధవంతముగా, హేతుబధ్ధంగా చెబుతారు. ఉదా: సత్యవాక్యమునే పలుకవలెను .... అని చెప్పినా ప్రాణహాని, మానావమానం ఇలాంటి సందర్భములలో సత్యమును యుక్తియుక్తముగా ఉపయోగించాలని మినహాయింపు ఇచ్చారు కదా...


అలాగే తల్లిదండ్రుల ఆజ్ఞను అనుసరించవలసినదే కానీ.... తల్లిదండ్రులు అధర్మపరులైనప్పుడు కూడా వారిని అనుసరించమని పెద్దల అభిప్రాయమని నాకనిపించటంలేదండి.

ఉదా: తండ్రి ఒక అవినీతిపరుడు, హంతకుడయి పిల్లలు కూడా పనులే చేస్తూ పోతే లోకం ఏమయిపోతుంది ? పెద్దలు ఏమి చెప్పినా వారి ఉద్దేశం ధర్మమును రక్షించటమే .... .దాని ప్రకారమే వారి మాటలు ఉంటాయి.. 

 

8 comments:

  1. ఇంద్రజిత్తు, ప్రహ్లాదుడు మధ్య కాంట్రాస్ట్(విభిన్న తత్వాలు) కధ ద్వారా బాగా చెప్పారు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    ReplyDelete
  2. అవును విచక్షణాజ్ఞానంఅవసరం

    ReplyDelete
  3. ఇంద్రజిత్తు ఉదాహరణ నేనూ విన్నాను..
    బాగా రాసారు..

    ReplyDelete
  4. థాంక్స్ సార్. మీ బ్లాగ్ లో పక్షులతో కృష్ణుని బొమ్మ చాలా బాగుంది అండి. ఇంకా కవిత్వం కూడా చాలా బాగుందండి. చిన్నప్పుడు మా తాతగారి ఊరిలో పొలాలు, చెరువు, రాములవారి గుడి ఎంత చక్కటి ప్రకృతి అది. అలాంటివి వదిలి కృత్రిమ గాలి మద్య బ్రతుకుతూ, ఆ పచ్చదనం విలువ ఇప్పటి వాళ్ళకి తెలియటం లేదులెండి. .

    ReplyDelete
  5. నేనే మీకు థాంక్స్ చెప్పాలి సార్. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మీ బ్లాగ్ నేను ఇంతవరకూ చూడలేదండి. ఎందుకో ఈ రోజే గమనించానండి. ఒకోసారి ఇలా విచిత్రంగా జరుగుతాయండి. మీ బ్లాగ్ లో మీ దంపతుల కారప్పూస తయారీ కబుర్లు ఇంకా అన్ని పోస్ట్ లు చాలా బాగున్నాయండి.

    ReplyDelete
  6. థాంక్స్ సార్ .మీరు దైవం గురించి ఎన్నెన్నో సంగతులు వ్రాస్తున్నారు. నాకు తెలిసిన సంగతులు చాలా తక్కువ అండి. మీ బ్లాగ్ లో ఒకసారి ప్రచురించారు కదండి, ఒక గుడిలో ప్రత్యక్షమైన పెద్ద పడగలు కలిగిన నాగేంద్రస్వామి {నిజమైన బ్రతికిఉన్న నాగుపాము} గురించిన ఫోటో, మరియు ఆ ఆర్టికల్ చాలా గొప్పగా ఉందండి. ఇలాంటి దైవ మహిమలను గురించి చదివినా మంచి జరుగుతుంది..

    ReplyDelete
  7. థాంక్స్ అండి. నాకు వీలయినన్ని ఎక్కువ బ్లాగ్ లు చదవాలని ఉంటుంది కానీ, కామెంట్స్ రాయటం అంటే కొంచెం కంగారు అండి. ఇప్పుడు చూడండి రిప్లై రాయటానికి ఎంత టైం తీసూన్నానో....మీ బ్లాగ్ లో సైన్స్ గురించిన సంగతులు వెరైటీగా బాగా రాశారండి..

    ReplyDelete