ఓం.
శ్రీ భువనేశ్వరుడు శ్రీ భువనేశ్వరీ దేవి {శ్రీ మన్మహాదేవుడు శ్రీ మన్మహాదేవి}
కొలువున్న మణిద్వీపం , చింతామణి గృహం పరమాద్భుతముగా ఉంటాయట. దేవి కృపకు పాత్రులైన వారు మాత్రమే జన్మాంతమునందు ఆ మణిద్వీపవాసులవుతారట. అక్కడ కొందరు సాలోక్యముక్తి, కొందరు సామీప్యముక్తి, కొందరు సారూప్యముక్తి , కొందరు సాయుజ్యముక్తి పొందుతారని ఇలా ఎన్నో విశేషములు శ్రీ దేవీ భాగవతములో చెప్పబడ్డాయని పెద్దలు చెబుతున్నారు. { ఇక్కడ ముక్తి గురించిన వివరములు గొప్పగా ఉన్నాయి. }
జీవుల అంతిమ లక్ష్యం ముక్తిని సాధించటమే. అందుకు ధర్మబధ్ధముగా జీవించాలి. మరి ఏది ధర్మం ?ఏది అధర్మం ? అని మనము ప్రాచీన కధల ద్వారా తెలుసుకోవచ్చును.
ఇంకో విషయం ఒక యోగి ఆత్మ కధ గ్రంధములో ఎందరో గొప్ప వ్యక్తుల గురించిన వివరములు ఉన్నాయి. అందులో...
1...శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు....బాబాజీ వంటి పరమగురువులు ఎన్నో శతాబ్దములుగా జీవించి ఉన్నారట. ఆయన శంకరాచార్యుల వారికి క్రియా యోగం నేర్పించినారట. బాబాజీ భగవంతుడి సంకల్పం ప్రకారం ఈ లోకానికి ప్రత్యేక సేవావిధి నిర్వహిస్తున్నవారు. ఒక భౌతిక శరీరానికి గాని ఈ గ్రహానికి గాని పరిమితులయి ఉన్నవారుకాదు.
2. శ్రీశ్రీ లాహిరీ మహాశయులు...బాబాజీ వారి శిష్యులు. వాడుకలో లోపించి లేదా చిరకాలముగా అదృశ్యమై ఉన్న సర్వోన్నత క్రియాయోగవిద్యను బాబాజీ ద్వారా పొందినవారు. ఆ విధముగా ఆ విద్య మళ్ళీ వెలుగులోకి వచ్చింది. భగవద్గీత లో పదేపదే ప్రశంసిస్తూ వచ్చిన నిజమైన అగ్నికార్యం క్రియా యోగ మేనని పెద్దలు చెబుతున్నారు .
3. .శ్రీశ్రీయుక్తేశ్వర్ గిరిస్వామి గారు.వీరు లాహిరీ మహాశయుల శిష్యులు.
4. శ్రీశ్రీ యోగానంద గారు. శ్రీయుక్తేశ్వర్ గిరిస్వామి వారి శిష్యులు.
శ్రీ యుక్తేశ్వర్ గారు తన మరణానంతరము మరల తన స్వశరీరముతో యోగానంద గారికి కనిపించి, ఎన్నో మరణానంతర రహస్యములను తెలిపారు. గొప్ప భక్తులు మోక్షమును పొందటము, మరియు తక్కువ స్థాయి భక్తులు , ఇతర జీవులు, వారి వారి మరణము తరువాత పొందే ఎన్నో లోకముల గురించి, అక్కడి విశేషములు, జీవులు వారి అర్హతను బట్టి క్రమముగా మోక్షమును పొందటం ,ఈ వివరములను అధ్బుతముగా తెలిపారు.
ఇంకా యోగానంద గారితో ... అబ్బాయి, నేను దైవాజ్ఞ చేత పునరుథ్థానం చెందానని , ఇప్పుడు నువ్వు పూర్తిగా గ్రహించవచ్చు ... అని చెప్పి, ఎన్నో విషయములను తెలియచేశారు.
ఇంకా ఈ గ్రంధములో ఎన్నో సంగతులు చెప్పబడ్డాయి. ఆ దైవం,.... ఈ లోకం కష్టములలో ఉన్నప్పుడు , తమ భౌతిక కర్మను అనుభవిస్తుండే మానవులకు సహాయం చెయ్యటానికి, తనను చేరిన దివ్యాత్మలను తన ప్రతినిధులుగా, భూమి మీదకు పంపిస్తారట.
వారే అవతార పురుషులు, ప్రవక్తలు, మహాగురువులు ఇలాంటివారు. వీరు జీవుల కర్మక్షయం కావటానికి ,.... తద్వారా వారు మోక్షమును పొందుటకు సహాయమును అందిస్తారు.
మనము మోక్షమును పొంది పరమానందమును పొందాలని ఆ పరమాత్మ ఇలా ఎన్నో విధములుగా మనకు మార్గములను తెలియచేశారు.
ఇక మనము మన ప్రాచీన కధల విషయానికి వస్తే వాటిని మనము సరిగ్గా అర్ధం చేసుకోవాలి. ఈ కధలలో పాత్రలు, వారి పూర్వ జన్మకర్మఫలం..... ఇవన్నీ సమన్వయపరుచుకుంటూ చదివితేనే సరిగ్గా అర్ధమవుతాయి.
రుక్మిణీదేవి తల్లిదండ్రులు మొదట ఆమెను శ్రీకృష్ణుల వారికిచ్చి వివాహం చేయదలచారట.
ఆ తరువాత ఆమె సోదరుడు , తన స్నేహితుడయిన శిశుపాలునితో ఆమెకు వివాహం చేయటం కొరకు, తమ తల్లిదండ్రుల ను బలవంతముగా ఒప్పిస్తాడు. రుక్మి కంసుని స్నేహితుడు కూడా. ఇలా ఇన్ని కారణములున్నాయి. శిశుపాలుడు మంచిగుణం కలవాడు కూడా కాదు. ఇలాంటి పరిస్థితిలో
రుక్మిణీదేవి ఒక బ్రాహ్మణుని ద్వారా కృష్ణునికి సందేశం పంపటం, శ్రీకృష్ణుల వారు వచ్చి కొన్ని పరిణామముల అనంతరము
రుక్మిణీదేవి ని వివాహం చేసుకోవటం మనకు తెలిసిన కధయే. ఆఖరికి
రుక్మిణీదేవి వివాహం మొదట తన తల్లిదండ్రులు నిశ్చయించిన శ్రీకృష్ణునితోనే జరిగింది.
ఇలాగే పెద్దలు శకుంతలాదుష్యంతులు కధ ద్వారా వివాహం విషయములో పిల్లలు పెద్దలకు తెలియకుండా వ్యవహరిస్తే ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాలో కూడా తెలియచేశారు.
ఇలా ధర్మమునకు, అధర్మమునకు మధ్య చాలా సూక్ష్మ మైన విభజన రేఖ మాత్రమే ఉంటుంది. కాబట్టే పెద్దలు ఇన్ని రకరకాల కధలను తెలియచేశారు. ధర్మమును ఇలా తెలుసుకోవాలని, ఇంకా అర్ధం కాకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి.
లేక శ్రీ శారదా మాత చెప్పినట్లు జీవితములో సందేహము వచ్చినప్పుడు కన్నీళ్ళతో దైవాన్ని ప్రార్ధిస్తే ఆ దైవం తప్పక మార్గమును చూపిస్తారు. ..
భగవంతుని దయ.
No comments:
Post a Comment