koodali

Monday, July 31, 2017

ప్రకృతికి...

 
పాతకాలంలో పిల్లలు ఆరుబయట ఎన్నో ఆటలు ఆడుకునేవారు. 

గోళీల ఆట, కర్రబిళ్ళ, తొక్కుడుబిళ్ల ఆట, పరిగెత్తి పట్టుకునే ఆట..ఇలా ఎన్నో ఉండేవి. 

పిల్లలు అందరూ చక్కటి కధలు చెప్పుకునేవారు. వెన్నెల్లో ఆడుకునేవారు.

ఈ రోజుల్లో ఎక్కువకాలం  నాలుగుగోడల మధ్యే ఎక్కువ కాలం గడచిపోతోంది.

 కొద్దిగా విరామం దొరికితే వీడియో గేంస్, టీవీ చూడటం  వంటివి చేస్తున్నారు. 

వారాంతాన షాపింగ్ మాల్స్ వెళ్ళటం , సినిమాకు వెళ్ళటం వంటివి గొప్ప  కాలక్షేపంలా అయిపోయింది.

 అంతేకానీ ప్రకృతి మధ్య గడపటం తక్కువగా ఉంటోంది. 

ఈ రోజుల్లో వెన్నెల అంటే తెలియని వాళ్లు ఎందరో ఉన్నారు. 

అపార్ట్మెంట్స్ వచ్చాక ఆరుబయట గడపటమే తక్కువగా ఉంది. 

ఆరుబయట ఆకాశంలో నక్షత్రాలను చూడటం ..ఇవన్నీ గతకాలపు ముచ్చట్లు అయ్యాయి. 

ఆరుబయట గాలివల్ల కలిగే లాభాలు ఏసి గాలి వల్ల రావు. 

ప్రకృతిసిద్ధంగా లభించేవాటి వల్ల ఎన్నో లాభాలున్నాయి. 

ప్రకృతికి దూరం కావటం మంచిది కాదు. 

పాతకాలం వాళ్లలో చాలామందికి   తమ బాల్యం గురించి చెప్పుకోవటానికి ఎన్నో ముచ్చట్లు ఉండేవి. 


ఈ రోజుల్లో చదువు, ఉపాధి..


ఈ రోజుల్లో చదువు, ఉపాధి విషయాలలో పోటీ  చాలా కష్టంగా ఉంది. 

పాతకాలంలో అయితే, విద్య, ఉపాధి కోసం ఎక్కువ గాభరాపడవలసిన అవసరం అంతగా ఉండేది కాదు. 

ఇంటిపట్టున ఉండే విద్య నేర్చుకోవటం, ఉపాధి పొందటం వంటి అవకాశాలు ఉండేవి. 

 వ్యవసాయం, వ్యాపారం,  వైద్యం, చేతివృత్తులు...పనిముట్ల తయారి (చేతివృత్తులు..పనిముట్ల తయారి అంటే నేటి ఇంజనీరింగ్..) ఇలాంటి ఎన్నో విషయాలను పిల్లలు ఇంటిపట్టున ఉండి, పెద్దవాళ్ళ వద్ద నేర్చుకుని ఉపాధి పొందేవారు.

అప్పటి వాళ్ళకు ఇంత ఒత్తిడి ఉండేదికాదు.  అప్పటి వాళ్లకు హాస్టల్ జీవితాలు అంతగా ఉండేవి కాదు. 

వేదవిద్య కూడా ఇంటివద్దే నేర్చుకునేవారు. 

కొందరు బ్రాహ్మణులు, కొందరు రాజకుమారులు..మరి కొందరు మాత్రం గురుకులాలకు వెళ్లి విద్యను అభ్యసించటం జరిగేదనుకుంటా.

భవిష్యత్తు ఎలా ? ఏం చదవాలో? ఏం ఉద్యోగం చేయాలో ? ఉద్యోగం ఉప్పుడు ఊడగొడతారో ? అనే భయమూ, గందరగోళం.. అంతగా ఉండేది కాదు. 

పిల్లలు బయట ఎలా ఉంటున్నారో ? ఎలా తింటున్నారో ? ఆరోగ్యం ఎలా ఉందో ? మత్తు అలవాట్లు  బారిన పడకుండా ఎలా ఉంటున్నారో ? వంటి భయాలు అంతగా  ఉండేవి కాదు.
**************

 ఈ రోజుల్లో కూడా మనం కోరుకున్న చదువు చదవటానికి అవకాశం లభిస్తుందనే గ్యారంటీ లేదు.

 ఉదా..ఎవరైనా డాక్టర్ కావాలంటే చిన్నతనం నుంచి విపరీతంగా కష్టపడాలి. అయినా కూడా సీట్ వస్తుందో లేదో తెలియదు.

 పోటీ పరీక్షలలో చిన్నతనం నుంచి  హాస్టల్స్, ట్యూషన్స్ వల్ల ఎంత నలిగిపోయినా కొద్దిమంది మాత్రమే సీట్ పొందగలుగుతున్నారు.

ఉదా..కొన్ని వేలమందిలో 100 మంది సీట్ సంపాదిస్తున్నారు. మిగతా వారు దొరికిన దానితో సర్దుకుపోవలసిందే. 

  చాలామంది విషయంలో తమకిష్టమైన వృత్తిలో చేరాలన్నా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. 

కొద్దిమంది మాత్రమే తమకిష్టమైన వృత్తి చేపట్టగలుగుతున్నారు..

ఒక చదువు చదివి వేరే ఉద్యోగంలో చేరుతున్నారు కొందరు. 

 ఉదా..ఇంజనీరింగ్ చదివి బ్యాంకులో చేరుతున్నారు కొందరు. 

ఉదా..పీజీ చదివి ఉద్యోగం లభించక ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరుతున్నారు కొందరు.

ఉదా.. ఆ మధ్య ఒక చిన్న ఉద్యోగానికి 10 వ తరగతి ఉత్తీర్ణత అర్హత అయితే.. ఆ ఉద్యోగానికి వేలమంది అప్లయ్ చేసారట. అందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్లు కూడా ఉన్నారట. ఇదీ పరిస్థితి. 


Friday, July 21, 2017

మనుషులు జీవించటం కోసం...

 
ఈ రోజుల్లో చాలామంది పిల్లలు చదువు పేరుతో చాలా కష్టపడుతున్నారు. 

 మా  ఇరుగుపొరుగున  ఒక స్కూల్ టీచర్ చిన్నపిల్లలకు ట్యూషన్ చెబుతారు. 


సాయంత్రం ఆమె స్కూల్ నుండి  వచ్చీ రాగానే ట్యూషన్ పిల్లలు వచ్చేస్తారు. రాత్రి  ఇళ్లకు వెళ్తుంటారు. 

సెలవు రోజుల్లో కూడా ట్యూషన్ చెప్పమని కొందరు తల్లితండ్రులు ఆమెను అడుగుతున్నారట. 


ఒకసారి  ఒక పాప.. అమ్మానాన్న కారులో వచ్చి  చిన్నపాపను టీచర్ ఇంటి ముందు దిగబెట్టారు.


 ఆ పాప లోపలికి వెళ్లి వచ్చి టీచర్ ఇంకా రాలేదమ్మా..అంటుంటే ఆమే వస్తుందిలే , బయట కూర్చో... అని సమాధానం చెప్పి తల్లితండ్రి వెళ్ళి పోయారు.  


పిల్లలకు 90 శాతం మార్కులు  వచ్చినా కూడా  ఇంకా ఎక్కువ మార్కులు రాలేదంటూ  పిల్లలను కొట్టే తల్లితండ్రులూ ఉన్నారు. 


 పిల్లలకు చదువు అవసరమే కానీ, ఈ రోజుల్లో చాలామంది తల్లితండ్రులు పిల్లల చదువు విషయాన్ని గురించి  మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారనిపిస్తుంది.


  అయితే ఈ రోజుల్లో పోటీ ఎక్కువయ్యింది. కొన్ని సీట్ల కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారు. 

 ఈ రోజుల్లో  చదువులు లైఫ్ అండ్ డెథ్ సమస్యంగా మారినట్లుంది.


 పాతకాలంలో ఇంతలా చదువులు లేకపోయినా ఉన్నంతలో హాయిగా బ్రతికేవారు. 


ఈ రోజుల్లో రకరకాల వస్తువులు మార్కెట్లో కనిపిస్తున్నాయి.


 వ్యాపారులు వస్తువుల ధరలు భారీగా పెంచి లాభాలు దండుకుంటున్నారు.

 ఒకప్పటి విలాసాలు ..ఇప్పుడు నిత్యావసరాలుగా మారిపోయాయి. 


సౌకర్యవంతమైన వస్తువులు ఉంటేనే జీవితం బాగుంటుందనే భ్రమలో పడి జనం తమ జీవితాల్నే పణంగా పెడుతున్నారు.


 చిన్నతనం క్లాసురూముల్లో గడవటం,  ఉద్యోగం వచ్చిన తరువాత ఆఫీసుల్లోనూ.. జీవితాలు గడిచిపోతున్నాయి.


 ఇలాంటి పరిస్థితిలో ఇక పెద్దవయస్సు వచ్చాక హాస్పిటల్ చుట్టూ తిరగటంతోనే కాలం గడచిపోతుంది. 


పాతకాలంలో  ఇంతటి వస్తువుల మోజు లేదు. అప్పటి వారు  చదువుకుంటూ కూడా  ప్రకృతి మధ్య ఆడుకుంటూ చిన్నతనాన్ని ఎంజాయ్ చేసేవారు. 


పెద్దయ్యాక కూడా నాలుగు గోడల మధ్య యంత్రాలతో జీవితం ఉండేది కాదు. 


ఈ రోజుల్లో కొందరు పెద్దవాళ్ళు తమ పిల్లలకు విదేశాలకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా  పిల్లలకు సర్ది చెప్పి  అప్పు చేసి విదేశాలకు  పంపిస్తున్నారు. 


 ఆ అప్పు తీరటానికి పిల్లలు మళ్ళీ విపరీతంగా  కష్టపడి పనిచేయాలి. 


కొందరు పిల్లలే స్వదేశంలో ..పోటీ వల్ల అవకాశాలు రాక , విదేశాలకు వెళ్తున్నారు.


 ఏది ఏమైనా మొత్తానికి వ్యవస్థ  గందరగోళంగా తయారయ్యింది.


 మనుషులు జీవించటం కోసం ఎన్నో వస్తువులు.. వాటికోసం ఇంత ఆరాటం అవసరం లేదు.



Wednesday, July 19, 2017

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లి మొదలైన భవనాలకు డిజైన్లు...

  
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లి మొదలైన భవనాలకు డిజైన్లు సిద్ధం చేస్తున్నారంటూ ఈ మధ్య  వార్తలు వస్తున్నాయి. 

అసెంబ్లి భవనాలకు కోహినూర్ వజ్రం ఆకారంలో డిజైన్లు సిద్ధం చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

 కోహినూర్ వజ్రం గురించి రకరకాల కధనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వజ్రం మగవారి వద్ద ఉంటే వారికి నష్టం కలిగిస్తుందని, స్త్రీల వద్ద ఉంటే లాభం కలిగిస్తుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. 

స్త్రీల విషయంలో కూడా లాభమా? నష్టమా? అనేది చెప్పలేము.

 బ్రిటిష్ వారు కూడా క్రమంగా తమ ప్రపంచ ఆధిపత్యాన్ని కోల్పోయారు కదా! ఈ వజ్రం గురించి సరైన విషయాలు మనకు తెలియదు.

ఎందుకయినా మంచిది ..ఈ వజ్రం ఆకారం కాకుండా ఇంకో డిజైన్ మార్చటం మంచిదని  నాకు తెలిసినంతలో అనిపిస్తోంది.

 ఇప్పటికే డిజైన్ల మార్పులు చేర్పులతో చాలా సమయం గడిచింది. 


అయితే, కోహినూర్ వజ్రం ఆకారం అని కాకుండా ....ఒక వజ్రం ఆకారంలో కానీ, చతురస్రాకార డిజైన్లు కానీ, లేక మరేదైనా ఆకారంలో కానీ నిర్మాణం చేయవచ్చేమో..పెద్దవాళ్లు ఆలోచించటం  మంచిది.


డిజైన్లను త్వరగా సెలెక్ట్ చేసి, కట్టడం కొంత సమయం పట్టినా.. పటిష్టంగా నిర్మిస్తే బాగుంటుంది.

. అందరి సలహాలు తీసుకోవాలి అనుకుంటూ ఉంటే రకరకాల అభిప్రాయల వల్ల పరిస్థితి మరింత గందరగోళంగా అనిపించవచ్చు. 

ఏం చేయాలో తెలియనప్పుడు దైవంపై భారం వేసి నిర్ణయం తీసుకుని ముందుకువెళ్ళటం మంచిది. 


Monday, July 17, 2017

శక్తి పీఠములు..మరి కొన్ని విషయములు...

 
 అష్టాదశ శక్తి పీఠములు గురించి చాలామందికి తెలుసు.  
 శక్తి పీఠములు మొత్తం ఎన్ని? అనే విషయాల గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నట్లున్నాయి.
 అష్టాదశ శక్తి పీఠములులో కూడా వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభిప్రాయాలున్నాయంటున్నారు. 

1.శాంకరి - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం[2] ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.

2.కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

3.శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

4.చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.

5.జోగులాంబ - ఆలంపూర్, తెలంగాణ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉంది.

6.భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.

7.మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

8.ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.

9.మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.

10.పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.

11.గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒడిషా - వైతరిణీ నది తీరాన ఉంది.

12.మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.

13.కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.

14.మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.

15.వైష్ణవి - జ్వాలాక్షేత్రం, [3] కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.

16.మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.

17.విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.

18.సరస్వతి - జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.

****************

*శాంకరి - శ్రీలంక..  17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ఇలా జరగటం అత్యంత బాధాకరమైన విషయం.

*శృంఖల -  - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ ...ఈ మందిరం  కూడా సరైన విధంగా నిర్వహణ లేక పోవటం అత్యంత బాధాకరమైన విషయం.
  
* సరస్వతి - జమ్ము, కాష్మీరు -సరస్వతి శక్తి పీఠం ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీరులో శిధిలావస్థలో ఉన్నట్లుగా కొందరు అంటున్నారు. 

ఒకప్పుడు కశ్మీరును శారదాదేశం అని పిలిచేవారట. అక్కడి సరస్వతీ దేవి దేవాలయం ఎంతో వైభవంగా ఉండేదట. ఎందరో పండితులు ఉండేవారట. 


అయితే, ఇప్పటి పరిస్థితి వేరు. అనేక కారణాల వల్ల ఆలయం శిధిలావస్థలో ఉండటం అత్యంత బాధాకరమైన విషయం. 
********************
* 51 శక్తిపీఠాలలో కొన్ని ప్రస్తుతం వేరే దేశాలలో ఉన్నట్లున్నాయి.
************************

వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉన్నచో దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

**************

కొన్ని దేవాలయాల గురించి ఆసక్తి ఉన్నవారు ..ఈ లింకుల వద్ద చూడగలరు.

శక్తిపీఠాలు - వికీపీడియా
Sharada Peeth

Unknown Facts About Shakti Peeth In Pakistan ||పాకిస్థాన్లో ముస్లింలు కూడాకొలిచే శక్తిపీఠం|| With CC

వికీపీడియా వారికీ మరియు  ఇతర లింక్స్ వారికీ ధన్యవాదములు. 


Friday, July 14, 2017

ఉగ్రవాదం , యుద్దోన్మాదం ..అనేవి ఏ ఒక్క దేశానికో పరిమితం కావు....

 
సమాజంలో సమస్యలకు ఎన్నో కారణాలున్నాయి. 

ఉగ్రవాదం వంటి సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కోవలసిందే. 

ఉగ్రవాద సమస్యకు మతం కారణం కాదు. సాటి మనుషులను హింసించమని  ఏ మతమూ చెప్పదు...

అంతేకాక ఒకే మతంలో కూడా శాఖా భేదాలతో ఒకరినినొకరు హింసించుకోవడాలు జరిగాయి.

ఉగ్రవాదం, యుద్దోన్మాదం ..అనేవి ఏ ఒక్క దేశానికో పరిమితం కావు. ఇవి ప్రపంచ సమస్యలు. 

ఈ సమస్యలకు కారణాలు అనేకం.  ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే ప్రతి దేశం తనను తాను అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకోవాలి. 

నైతికవిలువలు పెరగాలి . అవినీతి, ఆర్ధిక అసమానలు తగ్గాలి, నిరక్షరాస్యత..వంటివి పోవాలి. 

దేశంలో ప్రజల మధ్య ఐకమత్యత పెరగాలి.. ఇలాంటి విజయాలు  సాధించినప్పుడు దేశం బలమైన శక్తిగా ఎదుగుతుంది. 

దేశానికి హాని చేయటంలో పరాయి వాళ్ళతో పాటు కొందరు స్వదేశీయులూ కూడా కారణం అవుతున్నారు. 

కొందరు స్వదేశీయులు సొంత లాభం కోసం విదేశాలకు సంపదను తరలించటం కూడా దేశ ఆర్ధికవ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇలాంటి వారినందరినీ శిక్షించాలి.

దేశంలోని అంతర్గత సమస్యలపై విజయాన్ని సాధించినప్పుడు బయటనుంచి వచ్చే సమస్యలను ఎదుర్కోవటం పెద్ద సమస్య కాదు. 

అయితే,  కొన్ని క్లిష్టమైన పరిస్థితులలో  మాత్రం  కాలక్రమేణా  సమాధానం  లభిస్తుంది.
************
మనుషుల్లోని ..అసూయాద్వేషాలు , అహంకారం, అత్యాశ, అధికార దాహం, అభద్రతాభావం, ఆధిపత్య ధోరణి, ఆడంబరత్వం, పోటీతత్వం, తానే గొప్పగా ఉండాలనుకోవటం, ఇతరుల ఉన్నతిని భరించలేనితనం, సోమరితనం.....ఇలాంటి లక్షణాల వల్ల ప్రపంచంలో ఎన్నో సమస్యలు వస్తాయి.

 (అయితే, కొన్ని సందర్భాలలో ఇతరులను సరిగ్గా అర్ధం చేసుకోకపోవటం వల్ల కూడా సమస్యలు వస్తాయి.)

*************
చిత్రమేమిటంటే, కుటుంబంలో సమస్యలకు, ఇరుగుపొరుగు సమస్యలకు, దేశాల మధ్య సమస్యలకు ఎన్నో పోలికలుంటాయి.
అందువల్లే సమాజంలో ఎన్నో హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి. 

**************
  ప్రతికూల లక్షణాలున్న కొద్దిమంది వ్యక్తుల వల్ల వారితో పాటూ సమాజానికి  కూడా  ఎంతో హాని జరుగుతుంది.

 అందువల్ల,  పెద్దలు చెప్పిన సామ,  దాన, భేద,  దండోపాయాలతో చెడును నిర్మూలించాలి.

అయితే, ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు చెడును పూర్తిగా నిర్మూలించటం  సాధ్యపడకపోవచ్చు.. 

అలాంటప్పుడు  దైవంపై భారం వేసి మన ప్రయత్నాలను  చేయటం వల్ల చక్కటి ఫలితం లభిస్తుంది.


Wednesday, July 12, 2017

శ్రీ అమర్ నాధ్ యాత్ర..కొన్ని విషయములు..


భక్తులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదుల జరిపిన దాడిలో కొందరు భక్తులు మృతి చెందటం ఎంతో బాధాకరమైన విషయం. 

అప్పుడు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పేరు ..షేక్ సలీం గపూర్ భాయ్..అని తెలుస్తోంది.


ఆయన తన ప్రాణాలకు తెగించి చాకచక్యంగా వ్యవహరించటం వల్ల మిగతా వారి ప్రాణాలు రక్షించబడ్డాయంటున్నారు. 

మతం ఏదైతేనేమి ..మానవత్వం ముఖ్యం.. అని గపూర్ భాయ్ నిరూపించారు. 

మతం వల్ల గొడవలు జరగవు. ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా మనుషులలో చాలామంది మంచివారే. 

అయితే, కొందరు స్వార్ధపరుల వల్లే గొడవలు వస్తాయి, ఎందరికో కష్టాలు వస్తున్నాయి.

ఉగ్రవాదుల దాడి జరిగినా కూడా భయపడకుండా యాత్రను కొనసాగిస్తున్న అందరూ ఎంతో గొప్పవారు. 

భక్తులు, భద్రతాదళాలు, యాత్రికులను గుహ వద్దకు చేరటానికి సహాయపడే స్థానికులైన ముస్లింలూ, యాత్రికులకు భోజనాది సౌకర్యాలను కల్పిస్తున్న అనేకమంది, మొత్తానికి ఈ యాత్రకు అవసరమైన సహాయసహకారాలను అందించటంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరూ గొప్పవారే.  

***************

 కొన్ని సంవత్సరాల క్రితం మా కుటుంబీకులం.. బాబా అమర్‌నాధ్ ,మాతా వైష్ణవీ దేవి యాత్రకు వెళ్ళి వచ్చాము.అక్కడ ఎంతో అద్భుతంగా ఉంది.

 భగవంతుని దయవలన మావంటి సామాన్యులకు కూడా ఇంత అదృష్టము దక్కింది.

అక్కడ ఒక ఆర్మీ అతను మా తెలుగు మాటలువిని, మీరు తెలుగు వాళ్ళా..  అని ఆప్యాయంగా అడిగారు. 

ఏ రాష్ట్రం వాళ్ళయినా సరే, భద్రతాదళాలు  శ్రమకోర్చి పనిచేస్తున్నందువల్ల  మనలాంటి వాళ్ళం  చక్కగా ఉన్నాము.

అక్కడ ముస్లిం సోదరుల సహాయము కూడా మేము మరిచిపోలేము. వారు మాకు చక్కగా సహాయం చేసారు.

మతమేదయినా,  భగవంతుడనే మహాశక్తిని అందరు ఆరాధించొచ్చు. 

మతములు ఎన్ని ఉన్నా కూడా, అందరికి దైవశక్తి  ఒక్కరే. ప్రతి మనిషికి ఒక్కొక్క దైవం అని ఉండరు కదా.  

 కారణాలు  ఏమైనా, ఎందరో హిందువులకు లభించని  శ్రీరామలక్ష్మణుల దర్శనం.. ఒక మహమ్మదీయ రాజుకు లభించిందని భక్త రామదాసు కధ ద్వారా తెలుస్తుంది. 

అయ్యప్పస్వామికి వావర్ అనే పేరున్న ముస్లిం మిత్రుడు ఉన్నట్లు, వారి యొక్క గుడి కూడా శబరిమల వద్ద ఉందంటారు.

 ఏసుప్రభువుకు , హిమాలయములలోని మహావతార్ బాబాజీకు స్నేహం ఉందని కొన్నిపుస్తకముల ద్వారా తెలుస్తుంది.

 షిర్డి సాయిబాబా వివిధ మతముల వారి మధ్య సయోధ్య గురించి తెలియజేసారు.

పెద్దవాళ్ళు ఇలాచెప్తుంటే మనం ఎందుకు కొట్టుకోవాలి ? 

అన్ని మతముల వాళ్ళు  ఇతర మతముల వాళ్ళతో గొడవలు పడకుండా చక్కగా ఉంటే బాగుంటుంది. 

ఆశ్చర్యమేమిటంటే, ఒకే మతములో వాళ్ళు కూడా గొడవలు పడతారు.

 ఈ ప్రపంచములో అంతా  ఒకే మతము  ఉండటము అనేది  ప్రస్తుతానికి  జరగని  పని.

 మతము  అనేది అసలు  లేకుండా పోవటము అనేది  ఎప్పటికీ  జరగనిపని.

అందువల్ల,  అందరము చక్కగా  ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకోవటం  ఒకటే మార్గము. 


Sunday, July 9, 2017

గురుపూర్ణిమ..



ఓం

 గురువులకు  వందనములు.


Wednesday, July 5, 2017

చెత్తబుట్టల్లో, పెంటకుప్పల్లో దైవచిత్రాలు పడిఉన్నప్పుడు....

కొందరు దేవుని చిత్రాలను గిఫ్టులుగా ఇస్తుంటారు. వాటిని శుభ్రం చేయకపోతే వాటిపైన దుమ్ము చేరుతుంది.

మరి కొందరు ఇంట్లోని దేవుని పటాలు దేవాలయాలలో ఒకమూల పెట్టేసి వస్తుంటారు. వాటిని ఏం చేయాలని ? దేవాలయాల నిర్వాహకులు సతమతమవుతారు  .

ప్రజలు  బోలెడు పటాలను కొనకుండా తగుమాత్రం పటాలను కొనుక్కుంటే సరిపోతుంది. 

మరి కొందరు భక్తులు, దేవాలయాల వద్ద దేవుని చిత్రాలను, పుస్తకాలను ఉచితంగా పంచిపెడుతుంటారు. 

అవన్నీ తీసుకుంటే ఇంట్లో పుస్తకాలు, పటాలు బోలెడు అయి అల్మారా నిండిపోతుంది. తీసుకోకుంటే దేవునికి కోపం వస్తుందేమోనని  భయపడతారు కొందరు. 

కొన్నిసార్లు సామూహిక వ్రతాలు నిర్వహించినప్పుడు నిర్వాహకులు భక్తులకు దేవునిపటాలను ఉచితంగా ఇస్తారు.

 అయితే అప్పటికే ఇంట్లో అలాంటి పటం ఉన్నా కూడా,  మళ్లీ ఇంకోటి తీసుకెళ్తే పటాలు ఎక్కువవుతాయి.

********************

ఈ మధ్య ఎక్కడపడితే అక్కడ దేవుని చిత్రాలను ముద్రిస్తున్నారు. 

ఉదా..స్వీటుబాక్సులపైన, విజిటింగ్ కార్డులపైన ఒకటనేమిటి చిన్నచిన్న హారతి పాకెట్లపైన ముద్రించటం వల్ల వాటిని ఎక్కడ పడవేయాలో అర్ధంకావట్లేదు. 

స్వీట్ ప్యాకెట్ అయిపోయిన తరువాత బయట చెత్తబుట్టలో పడేద్దామంటే పాకెట్ పైన దేవుని చిత్రం ఉంటుంది.

దైవచిత్రాలను బయటపడేయాలంటే సంశయంగా ఉంటుంది.

 అయితే, ఏం చేయలేం కాబట్టి, దైవచిత్రాలను బయటపడేసినందువల్ల పాపం వస్తే, ఆ పాపం ఆ చిత్రాలను ఎక్కడపడితే అక్కడ ముద్రించిన వాళ్ళకే రావాలి, అనుకుని బయట వేస్తాను.

 దేవాలయాలలో కూడా టికెట్లు ముద్రించేటప్పుడు దైవచిత్రాన్ని ముద్రిస్తారు. 

ఉదా..విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తే భక్తుల ఫోటో కోసం ఇచ్చే కార్డు పైన అమ్మవారి చిత్రం ఉంటోంది. 

చాలామంది వాటిని అక్కడే పడేయటం వల్ల నేలపైన అమ్మవారి చిత్రం ఉన్న కార్డులు  పడేసి  ఉంటాయి. 

ఇక తెలుగు న్యూస్ పేపర్లలో బోలెడు  దైవచిత్రాలను వేస్తారు. 

ఇంగ్లీష్ పేపర్లలో దైవ చిత్రాలు వేయరు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువగా ఉంటాయనుకుంటా..  


యంత్రాలు వచ్చిన తరువాత  దైవ చిత్రాలను శ్రమలేకుండా అదేపనిగా ముద్రించి పడేస్తున్నారు, వీధుల్లో కాళ్ల క్రింద వాటిని తొక్కుతూ వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది.

చెత్తబుట్టల్లో, పెంటకుప్పల్లో దైవచిత్రాలు పడిఉన్నప్పుడు చూస్తే.. ఇది మహాపాపం అనిపిస్తుంది, 

ఇలాంటి చర్యల వల్ల పుణ్యం సంగతి అలాఉంచి పాపం వచ్చే అవకాశం ఉంటుంది కదా! 

భారతదేశం అనేక కష్టాలు పడటంలో ఇలాంటి చర్యలూ కారణమే కావచ్చుననిపిస్తుంది. 

 దైవానికి నచ్చేవిధంగా ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి .


 అంతేకానీ, విపరీతంగా దైవచిత్రాలను ముద్రించి పడేయటం  వల్ల దైవానుగ్రహం కలుగుతుందని అనిపించటం లేదు. 



Monday, July 3, 2017

గిఫ్ట్ తెచ్చి బయట చెత్తలో పడేసాను...

ఈ మధ్యకాలంలో కొత్తకొత్త వస్తువులు గుట్టలుగా తయారుచేసి వదుల్తున్నారు. ఇవన్నీ చూసి జనం చాలామంది పిచ్చిగా కొనటం జరుగుతోంది.

ఆ వస్తువులను చూస్తే అన్నీ మనకు పనికి వచ్చేలానే అనిపిస్తాయి.

 ఏ ఒక్కటి లేకపోయినా జీవితం వ్యర్ధం అన్నట్లు అనిపిస్తుంది.ఇక కొనేసి పెట్టేస్తాం. 

వస్తువులను కొనిపారేయటం అనేది కూడా వ్యసనమే.

మా ఇంట్లో వస్తువులు కుప్పలుతెప్పలుగా పడున్నాయి. అవన్నీ సర్దలేక కొంతకాలం నుంచీ ఎంతో ముఖ్యమయితే తప్ప వస్తువులు కొనటం లేదు. షాపింగ్ వెళ్లినా చూసి వచ్చేస్తున్నాను. 

 వీటికి తోడు ఏదైనా ఫంక్షనుకు వెళ్తే అక్కడ గిఫ్ట్ పేరుతో మళ్ళీ కొత్తవస్తువులను ఇస్తారు. వాటిని తీసుకోకపోతే ఒక బాధ. తీసుకుంటే ఒక బాధ.

గిఫ్ట్ వద్దంటే అక్కడి వాళ్ళు వింతమనిషిని చూసినట్లు చూస్తారు.

ఈ మధ్య మా బంధువు ఇంట్లో ఫంక్షన్ అయితే వెళ్ళాము.వాళ్లు గిఫ్ట్ ఇచ్చారు. అక్కడ వాళ్ళను ఏమీ అనలేక ఇంటికి  తెచ్చి మాకు తెలిసిన ఆమెకు ఇచ్చేసాను. 

 ఇంకోసారి  బంధువుల ఫంక్షనుకు వెళ్తే  ఇంకో వస్తువు ఇచ్చారు. ఈ సారి బాగా విసుగొచ్చింది. గిఫ్ట్ తెచ్చి బయట చెత్తలో పడేసాను.

 మా బంధువుల ఆమె ఒకరు ఫంక్షన్స్కు వెళ్ళి తెచ్చే గిఫ్టులను వాళ్ళ పనమ్మాయికి ఇచ్చేస్తుందట. 

కొంత పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళే సామాను ఎక్కడ పెట్టుకోవాలో తెలియక సతమతమవుతుంటే చిన్న చిన్న ఇళ్లు ఉండే వాళ్లు ఎక్కడ పెట్టుకుంటారు?

పాతరోజుల్లో ఫంక్షనుకు వెళ్తే ఇన్ని ఆర్భాటాలు ఉండేవికాదు. ఈ రోజుల్లో గిఫ్టుల గోల ఎక్కువయ్యింది. 

గిఫ్ట్ ఇవ్వకపోతే ఉండలేం అనుకుంటే...సామాన్లు కాకుండా ఫ్రెష్ పండ్లు కానీ లేక డ్రైఫ్రూట్స్ పాకెట్ కానీ ఇస్తే బాగుంటుంది. పండ్లు తినేస్తారు. పొల్యూషన్ ఉండదు. 

వస్తువులు విపరీతంగా వాడటం అంటే పర్యావరణాన్ని కలుషితం చేయటం, ఖనిజ సంపదకు హానిచేయటం.. అని అర్ధం. 

 ఖనిజసంపద ఎంతో విలువైనది. మనుషులు సృష్టించలేనిది ఖనిజసంపద.

డబ్బు ఉందికదా అని వస్తువులను విపరీతంగా వాడే హక్కు ఎవరికీ లేదు.

వస్తువులను తగినంత మాత్రమే వాడదాం, మనల్నీ, రాబోయే తరాలనూ కాపాడుకుందాము.