koodali

Monday, September 29, 2014

ఆది పరాశక్తి కధలు...రెండవ భాగము ..

ఓం....


మహిషాసుర మర్దిని అమ్మవారు ...............

ఒకప్పుడు మహిషాసురుడు రాక్షుసులకు చక్రవర్తి అయ్యాడు. అతడు దేవేంద్రుని జయించి స్వర్గాధిపత్యాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. దిక్పాలకులు, దేవతలు అందరూ అతని ఆజ్ఞకు వశులయ్యారు.
 

మహిషాసురుడు చేసే అన్యాయములు భరించలేక , దేవతలందరూ బ్రహ్మదేవునితో కలిసి శివకేశవులను దర్శించుకొని తమ బాధలు చెప్పుకొన్నారు. మహిషాసురుని దుర్మార్గాలు వివరించారు.


ఆ తరువాత వారందరి అంశాలతో ఒక మహాశక్తి ఆవిర్భవించింది. ఆ మహాశక్తి సర్వాలంకారములతో, సమస్త దివ్యాయుధములతో సాక్షాత్కరించింది. ఒక్కసారి మహాభయంకరముగా వికటాట్టహాసం చేసింది. ఆ తల్లిని దివ్యులంతా స్తుతించారు.


రాక్షసులకు ఆ భయంకరారావం గుండెల్ని బ్రద్దలు చేసేదిగా అనిపించింది. రాక్షసులు ఆయుధాలు ధరించి మహిషుని వెంట యుధ్ధానికి బయలుదేరారు. జగన్మాతను చూశాడు మహిషాసురుడు. ఇరుపక్షాలకు పోరు ప్రారంభమయింది.


చిక్షురుడు- తామ్రుడు- బిడాలుడు- అసిలోముడు మొదలైన రాక్షసులు నూతన వ్యూహ రచనలతో యుధ్ధం ప్రారంభించారు. ఎందరో రాక్షస వీరులు హతులయ్యారు.

జగన్మాత సింహవాహనాన్ని అధిరోహించింది. సింహగర్జనలతో, రాక్షసవీరుల అరుపులతో, రణరంగం భయంకరంగా ఉంది. సింహం రక్కసుల రక్తం త్రాగుతూ జూలు విదిలిస్తోంది. రాక్షసులు ప్రాణభీతితో అరుస్తూ ఉంటే, దేవతలు దేవి మీద పూలవాన కురిపిస్తున్నారు.

ఎందరో రాక్షసులు దేవి చేతిలో హతులయ్యారు.

ఈ దృశ్యం చూసి మండిపడ్డాడు మహిషాసురుడు. మహిష (దున్నపోతు ) రూపం ధరించాడు. కాలిగిట్టలతో నేల తట్టాడు. కొమ్ములతో పర్వతాలను బంతుల మాదిరిగా ఎగురగొట్టాడు. వాడి భయంకర రూపానికి ప్రకృతి కంపించింది.


మహిషుణ్ణి పాశంతో బంధించింది శ్రీదేవి. వాడు వెంటనే మహిష రూపం విడిచి రాక్షసాకారం
  ధరించాడు. భయంకరారావం గావించాడు. అంతలో దేవి ఒక్కసారిగా మహిషుడిని   క్రింద పడవేసి పాదంతో త్రొక్కి పెట్టి ,శూలంతో గుండెల్లో పొడిచి సంహరించింది.


మహిషాసురుని సంహారాన్ని కళ్ళారా చూసిన మిగిలిన రాక్షస సైన్యం హాహాకారాలు చేస్తూ పాతాళానికి పారిపోయారు. దేవతలు ఆనందించి మహాదేవిని స్తుతించారు.


అంబా! నీ శక్తితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమతమ విధుల్ని నిర్వహించగలుగుతున్నారు. నువ్వు కీర్తివి, మతివి, స్మృతివి, గతివి, ధృతివి, కరుణవు, భయవు, శ్రధ్ధవు, వసుధవు, నువ్వే. .కమల, విజయ, గిరిజ, రమ, ఉమ, జయ మొదలైన నామాలతో కీర్తికెక్కిన దానివి నువ్వే. నువ్వు తుష్టివి, పుష్టివి, బుధ్ధివి, విద్యా, క్షమా, కాంతి, మేధలు నువ్వే. నీ ధారణా శక్తి వలన నాగకూర్మాలు భూమిని మోస్తున్నాయి. నీ స్వాహా శక్తి వలన యజ్ఞ హవిస్సులు దేవతలకు లభిస్తున్నాయి. 


తల్లీ ! నువ్వు అందరికీ భోగభాగ్యాలు ప్రసాదిస్తావు. వాగ్దేవతవై విద్యను అనుగ్రహిస్తావు. జనుల ఆర్తిని తొలగిస్తావు. నిన్ను నిరంతరం ధ్యానించేవారికి గర్భశోక రహితమైన మోక్షఫలాన్ని అందిస్తావు.


మాతా ! ఈ భువన చక్రాన్ని కారుణ్యవీక్షణంతో నడిపించే నీ నిజతత్వం వేదాలకే అర్ధం కాదు. మరి అన్యులకెలా బోధపడుతుంది .


మాతా ! మహోగ్రుడూ, భువన కంటకుడూ అయిన మహిషాసురుణ్ణి సంహరించి మమ్మల్ని అనుగ్రహించావు. మేము ధన్యులం. సర్వశరణ్యాలైన నీ పదపంకజాల మీద మాకు అచంచలమైన భక్తిని ప్రసాదించు. ఈ శరీరం (వృక్షం ) రెండు పక్షులకు ( జీవాత్మ, పరమాత్మ )ఆశ్రయం. వాటి సఖ్యం అవి భాజ్యం. వాటిమధ్య మూడోదానికి స్థానం లేదు. అటువంటప్పుడు జీవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు ? అలాగే మేము నిన్నెప్పుడూ సేవిస్తూనే ఉంటాము. మమ్మల్ని కరుణించి రక్షించు తల్లీ !


దేవతలు చేసిన స్తుతికి దేవి సంతోషించి మృదుమధుర వాక్కులతో- "దుస్సాధ్యమూ దుర్ఘటమూ అయిన కార్యం ఎప్పుడైనా సంభవించినప్పుడు నన్ను స్మరించండి. మీ ఆపదల్ని వెంటనే హరిస్తాను. " అని అభయమిచ్చి దేవి అంతర్ధానమయ్యింది.


Friday, September 26, 2014

ఆదిపరాశక్తి కధలు.

 

ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం మీద ఆదిశేషునిపై పవళించి యోగనిద్రలో ఉన్నారు. 


 అప్పుడు విష్ణుమూర్తి చెవులలోని గులివి నుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారిద్దరూ మహా బలవంతులు.

వారు శక్తిస్వరూపిణి అయిన పరాశక్తిని గురించి తపస్సు చేసి స్వేచ్చామరణమును వరముగా కోరుకొన్నారు.


 ఆ వరగర్వముతో రాక్షసులిద్దరూ బ్రహ్మ మీద దాడి చేశారు. బ్రహ్మదేవుడు విష్ణువు శరణుజొచ్చారు.

మధుకైటభులు విష్ణుదేవుని తమతో యుధ్ధము చేసి గెలవమన్నారు. వారు ఒకరితర్వాత ఒకరు అలసట తీర్చుకుంటూ విష్ణుమూర్తితో యుధ్ధము చేశారు. 


విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేకపోయింది. 

అప్పుడు మధుకైటభులు , "నీవు పరాక్రమశాలివే, అలసిపోయినట్లున్నావు. దాసోహమన్నచో నిన్ను విడిచిపెడతాం. కాదంటే నిన్ను సం హరించి తర్వాత ఈ బ్రహ్మదేవుని పని పడతాం " అన్నారు. 


 అప్పుడు విష్ణువు, నేను అలసిపోయాను. కొంత విశ్రాంతి తీసికొన్న పిమ్మట మళ్ళీ మీతో యుధ్ధం చేస్తాను " అన్నారు.

మళ్ళీ యుధ్ధం ప్రారంభమయ్యింది. విష్ణువు యోగమాయను నుతించాడు. యోగమాయ విష్ణువును అనుగ్రహించటం జరిగింది.


యుధ్ధసమయములో యోగమాయ గగనతలంలో రాక్షసులకు దర్శనమిచ్చి వారివైపు తన మాయా దృష్టిని ప్రసరించటం జరిగింది. 


ఆ చూపులకు మధుకైటభులు    తమనుతాము   మరచిపోయారు.

ఆ సమయములో విష్ణువు , "గతములో నేను ఎంతోమంది రాక్షసులను వధించాను. నాతో ఇంతకాలం యుధ్ధం చేసినవారు మీరు తప్ప మరొకరు లేరు. కనుక ఏదైనా వరము కోరుకొనుడు ఇస్తాను " అన్నారు. 


పరవశులై, మదోన్మత్తులై యున్న ఆ దానవులు, "మేము యాచకులము కాదు. నీవే కోరుకో వరం, ఇస్తాము." అన్నారు.

అపుడు  శ్రీ మహావిష్ణువు, మీరిద్దరూ నా చేతిలో మరణించాలి: అన్నారు.


 వారు ఆశ్చర్యపోయారు. తెలివిగా మోసగింపబడ్డామని గ్రహించారు. లోకమంతా జలమయంగా ఉండడం చూసి , మమ్మల్ని నిర్జలప్రదేశంలో సం హరించు అన్నారు.

విష్ణువు రాక్షసుల్ని తన తొడలమీద నొక్కిపెట్టి సుదర్శన చక్రంతో వారి తలలు నరికారు. ఆ తలలనుండి మేధస్సు {మెదడు} బయటకు వచ్చి నీటి మీద తేలింది. మధుకైటభులిద్దరూ మరణించారు.


మేధస్సు ఆవరించిన జలభాగం మేదిని {భూమి } అయింది. అందుచేతనే మట్టి తినకూడదంటారు.


Tuesday, September 23, 2014

కొన్ని విషయములు...అవతారముల గురించి ..



శ్రీ  దేవీ  భాగవతము  గ్రంధములో  విష్ణువు  ధరించిన అవతారముల  గురించి  కొన్ని విషయములు...

ఏ  మన్వంతరములో  ఏ  కధ  జరిగింది  అనే  విషయముల  గురించి  వ్యాసుల  వారు  జనమేజయునకు  తెలియజేసిన  కొన్ని  విషయములు...

చాక్షుష  మన్వంతరములో  ధర్ముడిగా  అవతరించాడు.  నరనారాయణులు  ధర్ముడి  కుమారులు.

పంధొమ్మిదవ  త్రేతాయుగంలో  జమదగ్నిసుతుడై  పరశురాముడిగా  అవతరించి  క్షత్రియ  సంహారం  కావించాడు...ఇదే  యుగంలో  రఘువంశాన  దశరధాత్మజుడై  రాముడిగా  అవతరించాడు.

ఇరవై  యెనిమిదవ  ద్వాపరయుగంలో నరనారాయణులు అర్జునశ్రీకృష్ణులుగా  ఆవిర్భవించారు.

భూభారం  తగ్గించటం  కోసం  కృష్ణార్జునులు  అవతరించారు. కురుక్షేత్ర  మహాసంగ్రామంలో  భీషణయుద్ధం  చేశారు. 

ఇలా  ప్రతి  యుగంలోనూ  శ్రీహరి  ప్రకృతికి  అనురూపంగా అవతారాలు  ధరిస్తూనే  ఉన్నాడు.  

పంధొమ్మిదవ  త్రేతాయుగంలో ....  రఘువంశాన  దశరధాత్మజుడై  రాముడిగా  అవతరించాడు....  

 కృష్ణార్జునులు  ఆవిర్భవించినది ఇరవై  యెనిమిదవ  ద్వాపరయుగంలో...  

 ఈ   విషయాలను   గమనిస్తే... రామాయణ, మహా భారత ..కాలనిర్ణయం  గురించి  మనకు  అనేక  ఆలోచనలు  వస్తాయి.)  
............

శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణచరితామృతము  గ్రంధములో   ఎన్నో  విషయములు  ఉన్నాయి.
..........
ఒక  యోగి  ఆత్మ  కధ  గ్రంధములో   ఎన్నో  విషయములు  ఉన్నాయి. 


Wednesday, September 10, 2014

బస్సు ప్రయాణం గురించి కొన్ని విషయాలు..


నేను  కొంతకాలం  క్రిందట బస్సు ప్రయాణం  చేయవలసి  వచ్చింది. మా  ఊళ్ళోనే   సుమారు  6 కిలోమీటర్లు  వెళ్ళిరావటం. అందుకని  బస్ పాస్  తీసుకున్నాను. 
............................. 

బస్సు  ప్రయాణంలో  నేను గమనించిన విషయాలలో కొన్నింటిని  వ్రాస్తున్నాను. 


ఉదయం,  సాయంత్రం  రష్  బాగా  ఉన్నప్పుడు  బస్సులో  ప్రయాణించటం  ఎంతో  కష్టంగా  ఉంటుంది. అయితే,  స్కూల్  పిల్లలు,   కాలేజీకి  వెళ్ళే  అమ్మాయిలు ,  మహిళలు ఎక్కువగా బస్సులలో  ప్రయాణిస్తుంటారు.... ( కొందరు  షేర్  ఆటోలలో  కూడా  వెళ్తారు . ).  


బస్సులో  ఒకే  కండక్టర్  ఉంటారు.  ముందు  వైపు  నుంచి  స్త్రీలు,  వెనుక  వైపు  నుంచి  పురుషులు  బస్సు  ఎక్కి  దిగుతుంటారు.  ఇది  బాగానే  ఉంది.  అయితే  ఒకే  కండక్టర్  ఉండటం  వల్ల  ఆ  కండక్టరే  అందరికీ  టికెట్  ఇవ్వ వలసి  ఉంటుంది... . రష్  టైంలో  అయితే  ఇదంతా   చాలా  కష్టంగా  ఉంటుంది. 


 సిటీబస్సులలో  ఎక్కువగా  కాలేజీ  అమ్మాయిలు,  స్కూల్  పిల్లలు,  ఉద్యోగస్తులు  ప్రయాణిస్తుంటారు.  వీళ్ళలో  ఎక్కువమంది  పాస్  తీసుకుంటారు.  కండక్టర్   టికెట్  అని  అడిగితే వీళ్ళు  పాస్  అంటారు. కొన్నిసార్లు  పాస్  బయటికి  తీసి  చూపించే  అవకాశం  కూడా  ఉండదు. (  రష్  వల్ల.. ) 


 కండక్టర్   బస్ పాస్   చూపించమని    అడుగుతున్నా  కూడా   కొందరు  ప్రయాణికులు  సరిగ్గా    పట్టించుకోరు .  సేల్ఫోన్స్లో  మాట్లాడుతూ  పాస్  అని  ఊరుకుంటారు .  కండక్టర్   గట్టిగా   అడిగితే   అప్పుడు   జవాబిస్తారు  . 


రష్  సమయాలలో  ఎందరో  స్త్రీలు,  పురుషులు  బస్సులో  నిలబడి  ప్రయాణం  చేయవలసి  ఉంటుంది.  నిలబడి  ప్రయాణం  చేస్తున్న   ప్రయాణికుల   మధ్య   నుండీ  వెళ్తూ  టికెట్  ఇవ్వవలసి  రావటం  ,  కండక్టర్కూ  మరియూ  ప్రయాణీకులకు  కూడా  ఎంతో  ఇబ్బందిగా  ఉంటుంది. 


 ప్రతి ఒక్కరి  బస్సుపాసును  దగ్గరగా  చూడాలంటే  కండక్టర్ బస్సులో నిలబడి  ఉన్న  ఆడవాళ్ళ  మధ్యనుండి  రావలసి  ఉంటుంది . ముందుకు వచ్చే  దారిలేక  కొన్నిసార్లు  దూరం  నుంచే  చూస్తారు. ఇలా  దూరం  నుండి చూసినప్పుడు  ఆ  బస్ పాస్  యొక్క  డేట్  సరిగ్గా కనిపించక పోవచ్చు.   


ముందున్న  ఆడవాళ్ళకు  టికెట్  ఇచ్చేలోపే  వెనక మగవాళ్ళు  బస్  ఎక్కిదిగుతుంటారు .  వెనుక  వైపుకు  వెళ్ళి  ఇస్తుంటే  ముందు  ఆడవాళ్లు  బస్సు  ఎక్కిదిగుతుంటారు.  ఇదంతా  ఒక్క  కండక్టరే  చేయాలంటే  చాలా  కష్టం. 


 అందుకని  బస్సుకు  ముందు  వైపు  ఒక కండక్టర్నూ,  వెనుక  వైపు  ఒక  కండక్టర్నూ ..  ఏర్పాటు  చేసి  వారికి  ఒక  సీట్ కేటాయించితే  కండక్టర్లు  సీట్లలోనే  కూర్చుని    ప్రయాణికులకు  టికెట్  ఇవ్వగలరు. 


. ఈ  విధానం  వల్ల  కండక్టర్కూ,  ప్రయాణికులకూ  కూడా  బాగుంటుంది.  ఇద్దరు  కండక్టర్లను  నియమించటం  వల్ల  మరికొందరు  నిరుద్యోగులకు  ఉద్యోగాలు  లభిస్తాయి.

................................ 

ఒకసారి  ఏం  జరిగిందంటే, నేను  ప్రతి నెలా  డబ్బుకట్టి    బస్  పాసును  రెన్యల్   చేయించు కుంటాను . బస్సులో రష్  తక్కువగా ఉంది .  కండక్టర్  అందరికి   టికెట్స్  ఇస్తున్నారు.  

 నేను  దర్జాగా    బస్ పాస్   చూపించాను.  అది  పరిశీలించితే    గడువు  దాటిపోయినా  నేను  రెన్యల్  చేయించని  విషయం  బైటపడింది.  ఆ  విషయం  కండక్టర్  చెబుతుంటే  అప్పుడు  నాకు  బస్  పాస్  రెన్యువల్  గురించి  గుర్తు  వచ్చింది. 

 కొంతలో  కొంత  అదృష్టం  ఏమిటంటే, ఆ  ముందటి  రోజుకే పాస్  గడువుతీరిందన్నట్లు   గుర్తు.  అప్పటికప్పుడు  టికెట్  తీసుకున్నాను  కానీ, అలా  జరిగినందుకు  నాకు  చాలా  బాధగా  ఉంటుంది. 

నేను  పాస్  రెన్యువల్  చేయించుకోవటం  మర్చిపోయాను.   కండక్టర్   బస్ పాస్  పరిశీలించకపోతే,  టికెట్  స్క్వాడ్  వాళ్ళు  వస్తే  కండక్టర్  ఉద్యోగానికే  ప్రమాదమట. టికెట్  లేకుండా  ప్రయాణిస్తున్నందుకు  ప్రయాణీకులకు కూడా శిక్ష  వేస్తారట. 

     నేను  బస్ పాస్  రెన్యువల్  చేయించుకోవటం  మర్చిపోయాననే  విషయం  నాకు  తెలుసు.  బస్సులో  వాళ్ళు  కానీ,  కండక్టర్  గానీ ఈ  విషయాన్ని  ఎంతవరకూ  నమ్ముతారో  చెప్పలేం  కదా ! 

............................ 

ఇంకొకసారి  నేను  ఒక  స్టాపులో  బస్సు  ఎక్కాను.  కండక్టర్  మగవారి  వైపు  టికెట్స్  ఇస్తున్నారు.  ఇంతలోనే  నేను  దిగే  స్టాప్  అల్లంతదూరంలో  కనిపించింది. టికెట్  తీసుకుందామంటే  కండక్టర్  మగవారికి టికెట్  తీసుకుంటూ  బిజీగా  ఉన్నాడు. 

నేనే  వెళ్ళి  టికెట్  తీసుకుందామంటే   మధ్యలో  చాలామంది  జనం నిలబడి  ఉన్నారు. ఇంతలో  నేను  దిగే  స్టాప్  వచ్చేస్తోంది.  టికెట్  లేకుండా  ప్రయాణం  చేయటం  నాకు  ఇష్టం  లేదు. ఇక   టికెట్ డబ్బు   డ్రైవర్కు ఇచ్చి  బస్సు  దిగుదామనుకుంటున్నంతలో  నా  అదృష్టవశాత్తు  కండక్టర్  వచ్చి  టికెట్  ఇచ్చారు.  డబ్బు  ఇచ్చి  బస్  దిగాను.
............................... 

 ఇవన్నీ  గమనిస్తే  నాకు  ఏమనిపించిందంటే, రకరకాల  కారణాల  వల్ల  ఆర్టీసీ  ఆదాయాన్ని  కోల్పోయే  అవకాశాలు  ఉన్నాయని  అనిపించింది. ప్రయాణీకులు   వెంటనే  టికెట్  తీసుకోకపోయినా,   బస్  పాసులను  క్రమంగా  రెన్యువల్  చేయించుకోకుండా  ప్రయాణించినా...   ఆర్టీసి  ఆదాయానికి  గండిపడే  అవకాశం  ఉంది.


 కొద్దిదూరంలోనే  సిటీబస్సుల  స్టాపులు  ఉంటాయి  కాబట్టి,    ఎక్కేవారూ  దిగేవారితో  ఒకే కండక్టర్  బస్సుకు  ఆ  మూల  నుంచి  ఈ  మూలకు  తిరుగుతూ  ప్రతిఒక్కరి  పాస్  పరిశీలించటం  చాలాసార్లు  కుదరదు.

అందువల్ల,  ఒక్కో  బస్సుకు  ముందు  ఒకరిని ,  వెనుక  ఒకరిని  కండక్టర్లను నియమిస్తే  ప్రతి  ఒక్క  ప్రయాణీకునికి  సరిగ్గా  టికెట్  ఇవ్వటం  కుదురుతుంది.  బస్సుపాస్లు  పరిశీలించటానికి  కూడా  కండక్టర్లకు  వెసులుబాటు  ఉంటుంది.  ఆర్టీసీకి  ఆదాయం  పోకుండా  ఉంటుంది. 

.................................. 

ఇక  ఇంకో  విషయం  ఏమిటంటే ,  బస్సులలో  ఎడమవైపు  మొదటి  సీట్  వికలాంగులకు  కేటాయిస్తారు.  అయితే  ఎడమవైపు  సీట్  బస్  తలుపుకు  దగ్గరగా  ఉంటుంది.  బస్సు  కుదుపు  వచ్చినప్పుడు  వికలాంగులు  పట్టుతప్పి  ముందుకు  పడే  ప్రమాదం  ఉంది. అందుకని  వికలాంగులకు బస్సుకు  కుడిప్రక్కన ,అంటే   డ్రైవరుకు  వెనక  ఉండే  సీటును కేటాయిస్తే  సురక్షితంగా  ఉంటుంది. 

 ఒకసారి  బస్సు  కుదుపుకు  వికలాంగుల  సీట్లో  కూర్చున్న  వ్యక్తి  క్రింద పడటం జరిగింది. అతను  బస్సు  తలుపు  నుండి  క్రిందకు  పడే  ప్రమాదం  కొద్దిలో  తప్పింది.  ఇంకొకసారి  ఒక  చిన్నపాపను  ఎత్తుకుని తల్లి  ఆ  సీట్లో  కూర్చుంటే  కుదుపు  వస్తే  పాప  చేతిలోనుంచి  జారే  ప్రమాదముంది  కాబట్టి, వెనక్కు  వెళ్ళి  కూర్చోమని  చెప్పాను నేను .

ఎడమవైపున  ఉండే మొదటి  సీటు  కండక్టరుకు  కేటాయించి , సీటుకు  ముందు  చిన్న  సేఫ్టీ  రాడ్  ఏర్పాటు  చేస్తే  కండక్టర్కు  సురక్షితంగా  ఉంటుంది.. ( బస్సు  తలుపు  నుంచి  జరిగే  రాకపోకలకు  అడ్డులేని విధంగా  సేఫ్టీ  రాడ్  ఏర్పాటు  చేస్తే  బాగుంటుంది.)
....................... 

ఇవండి  నేను  గమనించిన  విషయాలలోని  కొన్ని  సంగతులు.(  బస్సు  ప్రయాణం  అలవాటు  లేనివారికి  ఈ  విషయాలు  సరిగ్గా  అర్ధం  కావేమో ?  )


Monday, September 8, 2014

అమ్మ, అన్న క్యాంటీన్లు..


ఈ క్యాంటీన్ల  గురించి  వినే  ఉంటారు.  తమిళనాడులో  అమలవుతున్న  అమ్మ  క్యాంటీన్లలో  అతితక్కువ  ధరకే  భోజనాన్ని  అందిస్తున్నారట. 

ఇంకా  నిత్యావసర  వస్తువులనూ  అందిస్తున్నారట. మిగతా  విషయాలు  ఎలా  ఉన్నా  ఇది  మంచి  పద్ధతే  అనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం  కూడా  అన్న  క్యాంటీన్లను  ప్రారంభించాలనుకోవటం  ఎంతో మంచి  విషయం.

రేషన్  కార్డుల  ద్వారా  నిత్యావసర  వస్తువులను  అందించటమూ  మంచిదే. అయితే, వంట  చేయాలంటే గ్యాస్  వంటివి ఎన్నో కావాలి.  

వంటచేసుకోవాలంటే  కుదరని వారికి  ఇలాంటి  క్యాంటీన్లు  ఎంతో  ప్రయోజనకరం.  

మనిషికి  ఆహారం  ముఖ్యం.  ఆకలితో  అల్లాడే  ప్రజలున్న  సమాజంలో  ఎంత  టెక్నాలజీ  ఉన్నా ఏం  లాభం ?  

అందరికీ  ఆహారాన్ని  అందించగలిగిన  రోజున  దేశంలో  ఎన్నో  సమస్యలు  పరిష్కారమవుతాయి.

...................
ఇక్కడ  ఒక విషయాన్ని  చెప్పుకోవాలి. 

 సమాజంలో  డబ్బున్న  వాళ్ళలో  కొందరు  మరీ  పిసినారివాళ్ళుంటారు.    ఇలాంటి  వాళ్ళు,  తక్కువ ధరకు  ఆహారం  లభిస్తుందంటే - ఇక  ఇంట్లో  వండుకోవటం  మానేసి  అన్నా  క్యాంటీన్లలోనే  భోంచేస్తారేమో ? 

  డబ్బున్న  వాళ్ళు  కూడా  ఇలా  చేస్తే , పేదవారికి  ఆహారం  సరిపోదు.  ఇలాంటి  క్యాంటీన్లను  ప్రారంభించిన   అసలు  ఉద్దేశ్యం  సరిగ్గా  నెరవేరదు. 

 ఎప్పుడో తప్పనిసరి  పరిస్థితిలో  తప్ప  డబ్బున్నవాళ్ళు  ఇలాంటి  క్యాంటీన్లను  ఉపయోగించకుండా  ఉంటేనే మంచిది.  పీనాసితనాన్ని  తగ్గించుకుంటే  పేదవారి  కడుపు నింపిన వారవుతారు.



Friday, September 5, 2014

శ్రీ దేవీ భాగవతము గ్రంధములోని కొన్ని విషయములు..

ఓం
............................

సజ్జనులకు  ఎప్పుడూ  ఎక్కడైనా  సత్యయుగమే. అసజ్జనులకు  ఎప్పుడూ  కలియుగమే.  మధ్యములకు - మధ్యయుగం.

.................

హర్షమూ, శోకమూ, నిద్ర,  మెలకువ, అలసత  మొదలైన భావాలూ అవస్థలూ సకలప్రాణికోటికీ (దేహధారులందరికీ)సమానం.

దేవతలను  అమరులు ( మరణం  లేనివారు ) -నిర్జరులు (ముసలితనం  లేని వారు ) -  అంటూ  కీర్తించటం ఏదో  మాటవరసకే  తప్ప  పరమార్ధతః ఇది  సత్యం  కాదు.ఉత్పత్తి  స్థితి  వినాశాలూ  దేవతలందరికీ  ఉన్నాయి.  ఇది  సత్యం .  మరింక  అమరులు  ఏమిటి, నిర్జరులేమిటి ? 

పుడుతున్నారు,  దుఃఖాలు  అనుభవిస్తున్నారు, అటుపైని గిడుతున్నారు. వీరిని  దేవ -దేవతా  శబ్దాలతో వ్యవహరించటం  కూడా  సమంజసం  కాదు.( దేవ్యంతి క్రీడంతి సుఖేషు ఇతి దేవతాః =  సుఖాలలో  తేలియాడేవారు )దుఃఖాలలో ఎలా  క్రీడించగలుగుతున్నారు  మరి?  క్షణంలో  ఉత్పత్తినాశాలు  కనిపిస్తున్నాయి  కదా !


 ఆయుర్దాయం  తీరగానే  జలచర  కీటక  మశకాదుల్లాగా  అంతరిస్తున్నారు. అంచేత  వీరిని  అమరులు ( అమరాః ) అనడానికి  వీలులేదు. "మరా" అనవలసిందే. కాకపోతే  ఆయుర్దాయంలో  ఉండే  హెచ్చుతగ్గులను  బట్టి దేవతలనీ  మానవులనీ  భేదాలు  ఏర్పడుతున్నాయి. 

................
సురాసురులందరూ  మాయకు  లొంగినవారే. మాయాధీనులే.  స్వతంత్రురాలు  ఒక్క  మాయాదేవి  మాత్రమే. అందుకని సర్వాత్మనా ఆ  జగదీశ్వరిని  సమర్చించాలి. ఈ  ముల్లోకాలలోనూ  అంతకుమించిన  శక్తి  లేదు. ఆ పరాశక్తి  పదాలను అర్చించడం స్మరించడం - జన్మకు  సాఫల్యం.

భార్యాసమేతులై  త్రిమూర్తులు  ఎప్పుడూ ఈ సచ్చిదానందరూపిణిని  సేవిస్తూ  ఉంటారు.

.............

అకారం  బ్రహ్మస్వరూపం.  ఉకారం  హరిస్వరూపం.  మకారం  రుద్రస్వరూపం.  మహేశ్వరి  అర్ధమాత్ర...

.జగన్మాత  అర్ధమాత్రగా  అనుచ్చార్యగా  ఉన్నప్పటికీ  సర్వోత్కృష్టురాలు.
...................

వ్యాసుల వారు జనమేజయునితో..

జనమేజయా ! నువ్వు  తెలుసుకోవలసిన  రహస్యం  ఏమిటంటే-  ఈ  భువనత్రయ  సృష్టి  ఉందే  ఇది  అహంకారం  నుంచే  ఆవిర్భవించింది. కారణగుణాలు  కార్యంలో  ఉండితీరతాయి. కనక  సృష్టిలో  ఏ  ప్రాణీ  అహంకారవర్జితంగా  ఉండదు. ఉండజాలదు. త్రిమూర్తులే  గుణత్రయస్వరూపులు.  ఇక  మానవమాత్రుల  సంగతి  చెప్పాలా  ? కేవల  సత్వగుణ  సంపన్నుడు  యావత్సృష్టిలోనూ  దుర్లభుడు. అంతటా  గుణత్రయ  సంయోగ స్థితియే  కనబడుతుంది. కాకపోతే  ఒక్కొక్కప్పుడు  ఒక్కొక్క  గుణానిది  పైచేయి  అవుతూ  ఉంటుంది. 


నిర్గుణుడూ  నిర్లేపుడూ  కేవలం  పరమాత్మ  ఒక్కడే. అతడు  అవ్యయుడు,  అలక్ష్యుడు,  అప్రమేయుడు,  సనాతనుడు.  అలాగే  ఆదిపరాశక్తి  కూడా  కేవల  నిర్గుణ. దుర్ జ్ఞేయ,  బ్రహ్మ సంస్థిత,  సర్వభూత  వ్యవస్థిత. ఈ  పరమాత్మపరాశక్తులది  అవిభాజ్యమైన  నిత్య  సంయోగం. వీరు  అభిన్నులు.  ఇది  తెలుసుకుంటే  సర్వదోషాలూ  పటాపంచలవుతాయి. ఈ  జ్ఞానంతోనే  మోక్షమని  ఘోషిస్తోంది వేదాంత డిండిమం . ఇది  తెలుసుకున్నవాడు  త్రిగుణాత్మక  సంసారం  నుంచి  విముక్తుడైనట్టే.

.........................

వైష్ణవులు  ధ్యానించే,  ఉపాసించే  దేవదేవుణ్ణి  గురించి  కూడా  శ్రీ  దేవీ  భాగవతము  గ్రంధములో  వివరములున్నవి.
.................

 ఈ మాయ నుంచి  బయటపడాలి  అంటే  ఆ  మహామాయను ఆరాధించడమొక్కటే  తరణోపాయం.. అని  పెద్దలు  తెలియజేసారు.

వ్రాసిన  విషయాలలో  ఏమైనా  అచ్చుతప్పుల  వంటివి .. ఉన్నట్లయితే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



Wednesday, September 3, 2014

కొన్ని విషయాలు.... (ETERNALLY TALENTED INDIA - 108 FACTS.


ఇప్పటి  వాళ్ళలో  కొందరు  ఏమనుకుంటారంటే ,  ప్రాచీనులకు ఏమీ  తెలియదని  అనుకుంటారు. 

  ప్రాచీనులు  లోకానికి  ఎంతో  అద్భుతమైన   విజ్ఞానాన్ని  అందించారు . 

ఈ  విషయాల  గురించి  నేను   పాత  టపాలలో  వ్రాసాను.

ఒక పోస్ట్  ద్వారా ...*భారతీయ ప్రతిభా  విశేషాలు  108  నిజాలు..

(*ETERNALLY  TALENTED  INDIA  -  108 FACTS...)..అనే  పుస్తకం  గురించి   తెలియజేసాను. 

 ఈ  పుస్తకాన్ని నా భర్తకు వారి స్నేహితులు బహూకరించారు. అలా  నేను  చదవటం  జరిగింది.

 ( ఈ పుస్తకాన్ని , వివేకానంద లైఫ్ స్కిల్స్ అకాడమీ...

 హైదరాబాద్ వారు సమర్పించారు. )

 ఆ  వివరాల   గురించి   ఈ లింక్  ద్వారా  చూడగలరు. 



................................ 

ఇక  ఆధునిక  విజ్ఞానం  గురించి చూస్తే...   కొన్ని  విషయాలలో  ఆధునిక  విజ్ఞానానికి  సైడ్  ఎఫెక్ట్స్  ఎక్కు వ.  

ఈ విషయాల గురించి కొన్ని  అభిప్రాయాలను  పాత  టపాలలో వ్రాసాను . 

ఆసక్తి ఉన్న వారు   ఈ  లింక్  ల  ద్వారా  చూడగలరు.



మూడు విధాలైన టెక్నాలజీ................