నేను కొంతకాలం క్రిందట బస్సు ప్రయాణం చేయవలసి వచ్చింది. మా ఊళ్ళోనే సుమారు 6 కిలోమీటర్లు వెళ్ళిరావటం. అందుకని బస్ పాస్ తీసుకున్నాను.
.............................
బస్సు ప్రయాణంలో నేను గమనించిన విషయాలలో కొన్నింటిని వ్రాస్తున్నాను.
ఉదయం, సాయంత్రం రష్ బాగా ఉన్నప్పుడు బస్సులో ప్రయాణించటం ఎంతో కష్టంగా ఉంటుంది. అయితే, స్కూల్ పిల్లలు, కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు , మహిళలు ఎక్కువగా బస్సులలో ప్రయాణిస్తుంటారు.... ( కొందరు షేర్ ఆటోలలో కూడా వెళ్తారు . ).
బస్సులో ఒకే కండక్టర్ ఉంటారు. ముందు వైపు నుంచి స్త్రీలు, వెనుక వైపు నుంచి పురుషులు బస్సు ఎక్కి దిగుతుంటారు. ఇది బాగానే ఉంది. అయితే ఒకే కండక్టర్ ఉండటం వల్ల ఆ కండక్టరే అందరికీ టికెట్ ఇవ్వ వలసి ఉంటుంది... . రష్ టైంలో అయితే ఇదంతా చాలా కష్టంగా ఉంటుంది.
సిటీబస్సులలో ఎక్కువగా కాలేజీ అమ్మాయిలు, స్కూల్ పిల్లలు, ఉద్యోగస్తులు ప్రయాణిస్తుంటారు. వీళ్ళలో ఎక్కువమంది పాస్ తీసుకుంటారు. కండక్టర్ టికెట్ అని అడిగితే వీళ్ళు పాస్ అంటారు. కొన్నిసార్లు పాస్ బయటికి తీసి చూపించే అవకాశం కూడా ఉండదు. ( రష్ వల్ల.. )
కండక్టర్ బస్ పాస్ చూపించమని అడుగుతున్నా కూడా కొందరు ప్రయాణికులు సరిగ్గా పట్టించుకోరు . సేల్ఫోన్స్లో మాట్లాడుతూ పాస్ అని ఊరుకుంటారు . కండక్టర్ గట్టిగా అడిగితే అప్పుడు జవాబిస్తారు .
రష్ సమయాలలో ఎందరో స్త్రీలు, పురుషులు బస్సులో నిలబడి ప్రయాణం చేయవలసి ఉంటుంది. నిలబడి ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల మధ్య నుండీ వెళ్తూ టికెట్ ఇవ్వవలసి రావటం , కండక్టర్కూ మరియూ ప్రయాణీకులకు కూడా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది.
ప్రతి ఒక్కరి బస్సుపాసును దగ్గరగా చూడాలంటే కండక్టర్ బస్సులో నిలబడి ఉన్న ఆడవాళ్ళ మధ్యనుండి రావలసి ఉంటుంది . ముందుకు వచ్చే దారిలేక కొన్నిసార్లు దూరం నుంచే చూస్తారు. ఇలా దూరం నుండి చూసినప్పుడు ఆ బస్ పాస్ యొక్క డేట్ సరిగ్గా కనిపించక పోవచ్చు.
ముందున్న ఆడవాళ్ళకు టికెట్ ఇచ్చేలోపే వెనక మగవాళ్ళు బస్ ఎక్కిదిగుతుంటారు . వెనుక వైపుకు వెళ్ళి ఇస్తుంటే ముందు ఆడవాళ్లు బస్సు ఎక్కిదిగుతుంటారు. ఇదంతా ఒక్క కండక్టరే చేయాలంటే చాలా కష్టం.
అందుకని బస్సుకు ముందు వైపు ఒక కండక్టర్నూ, వెనుక వైపు ఒక కండక్టర్నూ .. ఏర్పాటు చేసి వారికి ఒక సీట్ కేటాయించితే కండక్టర్లు సీట్లలోనే కూర్చుని ప్రయాణికులకు టికెట్ ఇవ్వగలరు.
. ఈ విధానం వల్ల కండక్టర్కూ, ప్రయాణికులకూ కూడా బాగుంటుంది. ఇద్దరు కండక్టర్లను నియమించటం వల్ల మరికొందరు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి.
................................
ఒకసారి ఏం జరిగిందంటే, నేను ప్రతి నెలా డబ్బుకట్టి బస్ పాసును రెన్యల్ చేయించు కుంటాను . బస్సులో రష్ తక్కువగా ఉంది . కండక్టర్ అందరికి టికెట్స్ ఇస్తున్నారు.
నేను దర్జాగా బస్ పాస్ చూపించాను. అది పరిశీలించితే గడువు దాటిపోయినా నేను రెన్యల్ చేయించని విషయం బైటపడింది. ఆ విషయం కండక్టర్ చెబుతుంటే అప్పుడు నాకు బస్ పాస్ రెన్యువల్ గురించి గుర్తు వచ్చింది.
కొంతలో కొంత అదృష్టం ఏమిటంటే, ఆ ముందటి రోజుకే పాస్ గడువుతీరిందన్నట్లు గుర్తు. అప్పటికప్పుడు టికెట్ తీసుకున్నాను కానీ, అలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంటుంది.
నేను పాస్ రెన్యువల్ చేయించుకోవటం మర్చిపోయాను. కండక్టర్ బస్ పాస్ పరిశీలించకపోతే, టికెట్ స్క్వాడ్ వాళ్ళు వస్తే కండక్టర్ ఉద్యోగానికే ప్రమాదమట. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నందుకు ప్రయాణీకులకు కూడా శిక్ష వేస్తారట.
నేను బస్ పాస్ రెన్యువల్ చేయించుకోవటం మర్చిపోయాననే విషయం నాకు తెలుసు. బస్సులో వాళ్ళు కానీ, కండక్టర్ గానీ ఈ విషయాన్ని ఎంతవరకూ నమ్ముతారో చెప్పలేం కదా !
............................
ఇంకొకసారి నేను ఒక స్టాపులో బస్సు ఎక్కాను. కండక్టర్ మగవారి వైపు టికెట్స్ ఇస్తున్నారు. ఇంతలోనే నేను దిగే స్టాప్ అల్లంతదూరంలో కనిపించింది. టికెట్ తీసుకుందామంటే కండక్టర్ మగవారికి టికెట్ తీసుకుంటూ బిజీగా ఉన్నాడు.
నేనే వెళ్ళి టికెట్ తీసుకుందామంటే మధ్యలో చాలామంది జనం నిలబడి ఉన్నారు. ఇంతలో నేను దిగే స్టాప్ వచ్చేస్తోంది. టికెట్ లేకుండా ప్రయాణం చేయటం నాకు ఇష్టం లేదు. ఇక టికెట్ డబ్బు డ్రైవర్కు ఇచ్చి బస్సు దిగుదామనుకుంటున్నంతలో నా అదృష్టవశాత్తు కండక్టర్ వచ్చి టికెట్ ఇచ్చారు. డబ్బు ఇచ్చి బస్ దిగాను.
...............................
ఇవన్నీ గమనిస్తే నాకు ఏమనిపించిందంటే, రకరకాల కారణాల వల్ల ఆర్టీసీ ఆదాయాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయని అనిపించింది. ప్రయాణీకులు వెంటనే టికెట్ తీసుకోకపోయినా, బస్ పాసులను క్రమంగా రెన్యువల్ చేయించుకోకుండా ప్రయాణించినా... ఆర్టీసి ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది.
కొద్దిదూరంలోనే సిటీబస్సుల స్టాపులు ఉంటాయి కాబట్టి, ఎక్కేవారూ దిగేవారితో ఒకే కండక్టర్ బస్సుకు ఆ మూల నుంచి ఈ మూలకు తిరుగుతూ ప్రతిఒక్కరి పాస్ పరిశీలించటం చాలాసార్లు కుదరదు.
అందువల్ల, ఒక్కో బస్సుకు ముందు ఒకరిని , వెనుక ఒకరిని కండక్టర్లను నియమిస్తే ప్రతి ఒక్క ప్రయాణీకునికి సరిగ్గా టికెట్ ఇవ్వటం కుదురుతుంది. బస్సుపాస్లు పరిశీలించటానికి కూడా కండక్టర్లకు వెసులుబాటు ఉంటుంది. ఆర్టీసీకి ఆదాయం పోకుండా ఉంటుంది.
..................................
ఇక ఇంకో విషయం ఏమిటంటే , బస్సులలో ఎడమవైపు మొదటి సీట్ వికలాంగులకు కేటాయిస్తారు. అయితే ఎడమవైపు సీట్ బస్ తలుపుకు దగ్గరగా ఉంటుంది. బస్సు కుదుపు వచ్చినప్పుడు వికలాంగులు పట్టుతప్పి ముందుకు పడే ప్రమాదం ఉంది. అందుకని వికలాంగులకు బస్సుకు కుడిప్రక్కన ,అంటే డ్రైవరుకు వెనక ఉండే సీటును కేటాయిస్తే సురక్షితంగా ఉంటుంది.
ఒకసారి బస్సు కుదుపుకు వికలాంగుల సీట్లో కూర్చున్న వ్యక్తి క్రింద పడటం జరిగింది. అతను బస్సు తలుపు నుండి క్రిందకు పడే ప్రమాదం కొద్దిలో తప్పింది. ఇంకొకసారి ఒక చిన్నపాపను ఎత్తుకుని తల్లి ఆ సీట్లో కూర్చుంటే కుదుపు వస్తే పాప చేతిలోనుంచి జారే ప్రమాదముంది కాబట్టి, వెనక్కు వెళ్ళి కూర్చోమని చెప్పాను నేను .
ఎడమవైపున ఉండే మొదటి సీటు కండక్టరుకు కేటాయించి , సీటుకు ముందు చిన్న సేఫ్టీ రాడ్ ఏర్పాటు చేస్తే కండక్టర్కు సురక్షితంగా ఉంటుంది.. ( బస్సు తలుపు నుంచి జరిగే రాకపోకలకు అడ్డులేని విధంగా సేఫ్టీ రాడ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.)
.......................
ఇవండి నేను గమనించిన విషయాలలోని కొన్ని సంగతులు.( బస్సు ప్రయాణం అలవాటు లేనివారికి ఈ విషయాలు సరిగ్గా అర్ధం కావేమో ? )
మనం ఘనమైన భారతదేశపౌరులం, మనకు హక్కులే కాని బాధ్యతలు లేవు. మీరు చెప్పినవేవీ జరగవని చెప్పడానికి చింతిస్తున్నాను. మనకి సమాజిక దృక్పధం తక్కువ కాదు అసలు లేదు.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteనిజమేనండి, సమాజాన్ని గమనించితే నాకు కూడా కొన్నిసార్లు నిరాశగానే ఉంటుంది. అయితే దేశం అభివృద్ధి చెందాలనే ఆశతో ఇలా...
తమిళనాడు, కర్ణాటక లో ఆటో చార్జీలకన్నా చాలా తక్కువగా వుంటాయి బస్సు చార్జీలు..అందుకే చాలా మంది ప్రజలు బస్సులనే ప్రిఫర్ చేస్తారు.. రూట్లు కూడా ప్రజలకు అనుకూలంగా వుంటాయి.. బస్సుల ఫ్రీక్వెన్సీ ఎక్కువ.. ఇవన్నీ రాష్ట్ర రోడ్డు రవణా వ్యవస్థను పతిష్ట పడుస్తాయి.. మనకి ఒక్క హైదరాబాదులో తప్ప మిగిలిన వూళ్ళలో బస్సు రూట్లు ప్రజలకు అనుకూలంగా వుండవు.. అందుకే జనం ఆటోల మీద ఆధార పడతారు.. మిగిలిన విషయాలు బాగా రాసినా.. ఇప్పటికే నష్టాలలో వున్న మన ఆర్.టీ.సీ ఇద్దరు కండక్టర్లను నియమించే స్థితిలో లేదు..
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteనిజమేనండి, మీరన్నట్లు ఆర్.టీ.సీ ఇప్పటికే నష్టాలలో వున్నా కూడా ఇద్దరు కండక్టర్లను నియమించినందు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయనిపిస్తోందండి.
నేను ఇద్దరు కండక్టర్లు అన్నది సిటీబస్సుల విషయంలోనండి......
సిటీబస్సులలో, ముందు ఒకరు, వెనుక ఒకరు కండక్టర్లు ఉండటం వల్ల , ప్రతి ఒక్క ప్రయాణీకుని నుంచి సక్రమంగా టికెట్ వసూలు చేయటం జరుగుతుంది.
ఎంత రష్ ఉన్నా కూడా ప్రతి ఒక్క ప్రయాణీకుని వద్ద ఉన్న బస్ పాస్ పరిశీలించి అందులోని తేదీని చెక్ చేయటం జరుగుతుంది.
అప్పుడు ప్రయాణీకులు తమ వద్ద ఉన్న పాతపాస్ తోనే ప్రయాణించటం కుదరదు.
ప్రయాణీకులు తమ బస్ పాస్ ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయించటం వల్ల ఆర్టీసీ ఆదాయం పెరిగే అవకాశం ఉందనిపిస్తోందండి.