koodali

Monday, April 23, 2018

ఇవన్నీ సమాజంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ...



ప్రసారమాధ్యమాల ద్వారా ప్రసారమవుతున్న అశ్లీలత గురించి ఎప్పటినుంచో ఎందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా సరైన చర్యలు చేపట్టడం లేదు.

ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాలు, సీరియల్స్, అంతర్జాలం ..ద్వారా ప్రసారమవుతున్న  కొన్ని ప్రసారాల విషయంలో చాలామంది  అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా కూడా, వేసే వాళ్లు తీస్తున్నారు..చూసే వాళ్లు చూస్తున్నారు. 

గత యాభై ఏళ్ళ క్రిందటతో పోలిస్తే సమాజంలో చాలా మార్పు వచ్చింది. పాతకాలంలో మత్తుమందు తాగిన వారి పట్ల కొంత చిన్నచూపు ఉండేది. 

ఇప్పుడు మత్తుమందు త్రాగనివారిని చిన్నచూపు చూసేవిధంగా సమాజంలో మార్పులు వచ్చాయి. స్త్రీ పురుషుల సంబంధాల విషయంలో కూడా ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. 

ఈ రోజుల్లో సినిమాలు, సీరియల్స్, అంతర్జాలం, సెల్ఫోన్ల ద్వారా ఎన్నో అసభ్యకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇలాంటివాటి  ప్రభావం సమాజంపై ఎంతో ఉంటుంది. 


సినిమాలల్లో కొన్ని మంచి సినిమాలు వచ్చాయి. నిజమే, అయితే, ఎన్నో అసభ్యకరమైన దృశ్యాలను కూడా సినిమాల్లో చూపించారు.


టూ పీస్ దుస్తులు బికినీ దుస్తులు ధరించిన మహిళలు,   హీరోహీరోయిన్లు ఒకరిపై ఒకరు పడి దొర్లటం, స్త్రీపురుషుల సరససల్లాపాలు, మద్యం త్రాగటం, రేప్ చేయటం,  ఇతరులను చంపటం... ఇలాంటివెన్నో చూపిస్తున్నారు. 

 రేప్ చేయటం,  ఇతరులను చంపటం,   స్త్రీపురుషుల సరససల్లాపాలు,....వంటివి  పిల్లల కంటపడటం  బయట  సాధారణంగా జరగదు.. ఇవన్నీ  సమాజంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.

ఇలాంటి   దృశ్యాలను చూస్తున్న  చిన్నపిల్లలు, యువత ..  మనస్సు ఎలా ఉంటుందో ఆలోచించండి. 

 ఇవి  కొందరు పెద్దలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. 

సమాజంలో జరిగేవే చూపిస్తున్నాం .. అంటారు సినిమావాళ్లు. . 

భార్యాభర్త సరససల్లాపాలు  సమాజంలో జరిగేవే ..అయినా..సినిమాలో అదంతా చూపిస్తే ఊరుకుంటారా?

ప్రసారమాధ్యమాల  ద్వారా రేపులు, మర్డర్లు.. చూసిచూసి అవన్నీ సాధారణంగా జరిగే  విషయాలే ..అనుకునే పరిస్థితి కొందరిలో కలగవచ్చు. కొందరు, అలాంటివి చేయడానికి ప్రయత్నించినా ఆశ్చర్యపడనవసరం లేదు.

 మంచి సినిమా అని వెళితే, కొన్నిసార్లు   అందులో కూడా ఐటం సాంగ్ వస్తుంది.


 ఐటం సాంగ్స్ అంటూ.. హీరోతో సహా కొందరు మగవాళ్లు ఒకమ్మాయితో అసభ్యంగా పాట పాడుతూ డాన్స్ చేయటం చూపిస్తున్నారు. 

పొర్న్ వంటి వాటికి  కూడా  అడ్డుకట్ట వేయాలి. అంతర్జాలం, సెల్ఫోన్స్..ద్వారా ప్రసారమవుతున్న  హానికారక ప్రసారాలకు అడ్డుకట్ట వేయాలి. 






సమాజానికి హాని చేయటం సరైనది కాదు....


చిన్నపిల్లల పట్ల అత్యాచారం కేసుల్లో మరణశిక్ష విధించాలని కేంద్రం నిర్ణయించటం మంచివిషయం.


 ఇంకా పెద్ద వయస్సున్న అమ్మాయిల పట్ల  దాడుల చేసే వారిని కూడా శిక్షించాలి. అయితే, ఈ కేసులలో తప్పుడు కేసులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 


ఇంకో బాధాకర విషయమేమిటంటే , మగపిల్లలు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటివి కూడా జరగకుండా చూడాలి.


మగపిల్లల పట్ల లైంగికదాడులను జరిపే వారిని కూడా కఠినంగా శిక్షించాలి.


 పాతకాలంలో నేరాలు జరిగేవి కానీ, ఇంత పెద్దమొత్తంలో జరిగేవి కావు. నిర్భయ చట్టం తెచ్చినా నేరాలు తగ్గటం లేదు.



నేరాల  పెరుగుదలకు మూలకారణాలను కనుగొని సమస్య తీవ్రతను తగ్గించటానికి ప్రయత్నించాలి. మత్తుమందుల  నిరోధానికి చర్యలు తీసుకోవాలి. 


అసభ్యప్రసారాలను చూసిన ప్రభావం వల్ల , అప్పటికి  అందుబాటులో ఉన్న బలహీనులైన చిన్నపిల్లల పట్లా, వృద్ధుల పట్లా కూడా అత్యాచారాలు జరగవచ్చు. 



 పాతకాలంలో,  ఆధునిక పోకడల గురించి  నగరాలలో ఉండే కొద్దిమంది ప్రజలకు మాత్రమే తెలుసు.ఆ  కొద్దిమంది ఆధునిక పోకడలను అనుసరించేవారు. 



అయితే,  దృశ్యమాధ్యమాలు పెరగటం వల్ల , మారుమూల పల్లెల వరకూ అందరికీ అన్ని విషయాలూ  తెలుసుకునే అవకాశం వచ్చింది. 



కొందరి విషయంలో  మంచి కన్నా చెడు ఎక్కువ ఆకర్షిస్తుందని అంటారు కదా! గత కొన్ని సంవత్సరాలలో  ప్రజల పోకడలో చాలా మార్పులు వచ్చాయి. 



అసభ్యకర దృశ్యాలను తీస్తున్నప్రజలదీ  తప్పే...అలాంటి వాటిని చూస్తున్న ప్రజలదీ తప్పే. 



మత్తుమందులు , అసభ్యకర విషయాలు, అవినీతి, అత్యాశ..ఇలాంటివాటితో సమాజానికి హాని చేయటం సరైనది కాదు.





స్త్రీలు పురుషులు...కొన్ని విషయాలు..


పాతకాలంలో స్త్రీలు ఇంటిపట్టున ఉండే రోజుల్లో స్త్రీలకు కొన్ని కష్టాలు ఉన్నాయి నిజమే.. అయితే, ఈ రోజుల్లో స్త్రీల కష్టాలు  మరింతగా పెరిగాయి. 

ఆధునిక కాలంలో స్త్రీ స్వేచ్చ పేరుతో  సంపాదనా భారం కూడా  స్త్రీలపై పడటం వల్ల స్త్రీలు బయటకు రావటం  జరుగుతోంది. ఇందువల్ల  కూడా స్త్రీలను లైంగికంగా వేధించటానికి పురుషులకు బోలెడు అవకాశాలు పెరిగాయి.


 ఈ రోజుల్లో ప్రేమపేరుతో ఎందరో యువతులు మోసపోతున్నారు. వివాహేతరసంబంధాల కేసులూ ఎక్కువయ్యాయి.


 కొన్నిసంవత్సరాలక్రితం  మాకు పొరుగింట్లో  ఉన్న ఒకామె  విమెన్స్ హాస్టల్ వార్డెన్ గా చేసి రిటైర్ అయ్యారు. ఆమె కొన్ని విషయాలను  చెప్పారు. కొన్ని మంచి విషయాలు చెప్పారు, కొన్ని చెడ్దవిషయాలూ  చెప్పారు.


చెడ్ద విషయాలు ఏమిటంటే,  ఈ రోజుల్లో కొందరు స్త్రీపురుషుల సంబంధాల గురించి  ఆమె చెప్పిన కొన్ని విషయాలు వింటే ..బాబోయ్ ! సమాజం ఇలా తయారయిందా? అని భయమేసింది.


మా బంధువుల అమ్మాయి ఒక సంస్థలో కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. అక్కడ లైంగిక వేధింపుల వ్యవహారాలను గమనించి, పరిస్థితి ఇలా ఉందేమిటని ? తోటి  ఉద్యోగస్తురాలిని అడగగా ఆమె ఏం చెప్పారంటే...  


 ఉద్యోగం చేయడం అవసరం కాబట్టి, తప్పనిపరిస్థితిలో తాను అవన్నీ భరించవలసి వస్తోందని చెప్పారట. 


 ఇవన్నీ విని, తను అక్కడ ఉద్యోగం మాని, తక్కువ జీతమైనా ఫరవాలేదని వేరే సంస్థలో ఉద్యోగానికి చేరింది.


  ఈ రోజుల్లో కొన్ని కాలేజీల్లో, పాఠశాలల్లో కూడా కొన్ని లైంగిక వేధింపుల గురించి మీడియా ద్వారా వార్తలు వింటున్నాము.


 తాత్కాలికంగా పనిచేసే చోట కూడా ఇలాంటి వేధింపులు ఉండే అవకాశం ఉంది. సినిమా రంగంలో కూడా ఇలాంటి వేధింపుల గురించి విన్నాము. 


అక్కడా ఇక్కడా అని కాకుండా,  చాలా విరివిగా స్త్రీలపట్ల లైంగిక వేధింపుల బాధల గురించి వార్తలు తెలుస్తున్నాయి. 


 ఇవన్నీ గమనించే పాతకాలం వారు స్త్రీలకు సంపాదనా బాధ్యత ఇవ్వకుండా , ఇంటిబాధ్యత అప్పగించి ఉంటారనిపిస్తోంది.



  ఇప్పడు కూడా  కొందరు స్త్రీలు లైంగిక వేధింపుల బాధ లేకుండా చక్కగా ఉద్యోగం చేస్తున్నారు. అలాంటి స్త్రీలు అదృష్టవంతులు. 


 కొందరు స్త్రీలు లైంగికవేధింపులు భరిస్తూ తప్పనిపరిస్థితిలో పని చేస్తున్నారు. 


మరికొందరు స్త్రీలేమో తాము కూడా ఇష్టపూర్వకంగా  అక్రమసంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు. ఇలాంటి సంఘటనల వల్ల ఎన్నో సంసారాలు విచ్చిన్నమవుతున్నాయి. 


కొందరు స్త్రీలు కూడా సాటి స్త్రీల కష్టాలకు కారణమవుతున్నారు.


************

స్త్రీ స్వేచ్చ అంటూ స్త్రీలు మరింతగా బయటకు రావాలని కొందరు అంటున్నారు. 


మరి, బయటకు వచ్చిన స్త్రీల  రక్షణ భాధ్యత ఎవరు తీసుకుంటారు ? స్త్రీలకు ఎలాంటి హాని జరగకుండా వారు బాధ్యత వహిస్తారా ?


 ఈ రోజుల్లో స్త్రీ బయటకు వచ్చి చదువుకుని, ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే స్త్రీలనే వివాహం చేసుకోవడానికి చాలామంది పురుషులు ఇష్టపడుతున్నారు. ఈ విధంగా స్త్రీలపై అదనపు పనిబాధ్యత పడింది. ఈ విధంగా కూడా పురుషులకు లాభం జరిగింది. 


*****************


 ఎవరు ఎంత వాదించినా కొన్ని పనులు  స్త్రీలు చేస్తే పద్ధతిగా ఉంటుంది. కొన్ని పనులు పురుషులు చేస్తే పద్ధతిగా ఉంటుంది.


 ఇంటిబాధ్యత స్త్రీలైతే ఓర్పుగా చేయగలరు. బయటకెళ్లి సంపాదించే పని పురుషులు చేస్తే లైంగిక వేధింపుల గొడవుండదు. ఈ మాటలు చాలామందికి నచ్చవని నాకు తెలుసు.


స్త్రీలు బయటకు వెళ్ళి సంపాదించడం తప్పదనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  


  స్త్రీలు లైంగిక వేధింపులు బారిన పడకుండా ఉపాధి పొందడానికి, పురుషులతో సంబంధం లేకుండా స్త్రీలే  డ్వాక్రా వంటి సంఘాల ద్వారా ఉపాధి పొందాలి. 


స్త్రీలే పరిశ్రమలు ఏర్పాటుచేసుకుని తక్కువ పనిగంటలు పనిచేస్తూ కూడా ఉపాధి పొందవచ్చు.  


ఎక్కడయినా   స్త్రీలు  లైంగిక వేధింపులకు గురయితే అందరు స్త్రీలూ సంఘటితంగా నిలబడి ఎదుర్కోవాలి.  అన్యాయానికి గురయ్యి ఆర్ధికంగా ఆసరా లేని స్త్రీలకు మహిళాసంఘాలు ఆసరా ఇవ్వాలి.


విరాళాల ద్వారా స్త్రీ నిధిని ప్రోగుచేసి ఆదరణ కరువయిన స్త్రీలకు ఇచ్చి ఆదుకోవాలి. అలాంటి స్త్రీలను సంఘటితపరిచి నివాసం, ఉపాధి వంటివి కల్పించాలి.వారికి పిల్లలుంటే  ఆదుకోవాలి.






Tuesday, April 17, 2018

ఆ సంఘటనలు చాలా బాధాకరమైనవి...





ఈ మధ్య కొందరు స్త్రీల పట్ల , కొందరు చిన్నపిల్లల పట్ల కూడా జరిగిన అత్యాచారాల గురించి తెలుస్తున్న వివరాలను గమనిస్తే చాలా బాధగా అనిపిస్తోంది.


 చిన్నపిల్లల పట్ల కర్కశంగా ప్రవర్తించిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలి.



 ఆ శిక్ష ఎలా ఉండాలంటే ...మరెవ్వరైనా  అలా ప్రవర్తించడానికి భయపడేలా ఆ శిక్షలు  ఉండాలి.



Monday, April 16, 2018

ఓం..కొన్ని విషయములు మరియు కొన్ని సందేహాలు...


శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమును  మనకు ఇష్టం వచ్చినట్లు కలిపేసి లేక మనకు ఇష్టం వచ్చినట్లు విడగొట్టి   పారాయణ  చేయకూడదని పండితులు తెలియజేసారు..  

ఉదా..... 
శ్రీ లలితాదేవి యొక్క కొన్ని నామములు   .... 

* అజా 
* క్షయవినిర్ముక్తా  
* ముగ్ధా 
* క్షిప్రప్రసాదినీ

 అజా   క్షయవినిర్ముక్తా   ముగ్దా   క్షిప్రప్రసాదినీ .. అని  పారాయణ చేయాలట .

 అజాక్షయ   వినిర్ముక్తా   ముగ్దాక్షి   ప్రప్రసాదినీ .. అని పారాయణ  చేయకూడదట. 

****************

 శ్రీ ఆదిత్యహృదయము ను పఠించేటప్పుడు ఒక దగ్గర నాకు ఒక సందేహం కలిగింది. 

హిరణ్యగర్భ శ్శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఽదితేః పుత్ర శ్శంఖ శ్శిశిరనాశనః ||  అని చదివేటప్పుడు .. 

 అగ్నిగర్భోఽదితేః పుత్ర శ్శంఖ శ్శిశిరనాశనః..అని వరసగా  గబగబా పఠించటం కాకుండా, శ్శిశిరనాశనః  .. అని చదవటంలో కొద్దిగా గాప్ ఉండాలేమో ? అనిపించింది. 

 అగ్నిగర్భోఽదితేః పుత్ర  తరువాత  కొద్దిగా గాప్ ఇచ్చి, శ్శంఖ శ్శిశిరనాశనః  .. అని  చదవాలా  ?   లేక

 అగ్నిగర్భోఽదితేః పుత్ర శ్శంఖ  తరువాత  కొద్దిగా  గ్యాప్  ఇచ్చి, శ్శిశిరనాశనః..అని చదవలా?  లేక 

 . అగ్నిగర్భోఽదితేః పుత్ర శ్శంఖ శ్శిశిరనాశనః ||  అని చదివేటప్పుడు ..మొత్తం వరుసగా  చదవవచ్చా?  ..లేక .. కొద్దిగా గాప్ ఇచ్చి చదవాలా  అనేది  నాకు తెలియదు. 

కొన్ని చోట్ల ఇలా కూడా ఉంది....అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ||అని. 

 నాకు సంస్కృతం తెలియదు కాబట్టి , ఈ విషయం గురించి నేను సరిగ్గా చెప్పలేను.   ఈ విషయం గురించి పండితులను సలహా అడిగి పఠించడం మంచిది. లేక  నెట్ లో ఆదిత్యహృదయం వినవచ్చు. 

ADITYA HRUDAYAM WITH TELUGU LYRICS AND MEANING..వద్ద అర్ధమును చదవగలరు. 





Saturday, April 14, 2018

దైవం.. మరి కొన్ని విషయాలు...

 ఈ మధ్య  నెట్  లో  కొన్ని విషయాలను  చూసి.. నాకు తోచిన అభిప్రాయాలను  వ్రాయాలనిపించి వ్రాసాను.

  **********

సృష్టి ఎలా ఏర్పడింది? అనే  ప్రశ్నకు,   దైవం  వల్ల   సృష్టించబడింది.. అని  ఆస్తికులు ఖచ్చితమైన   సమాధానం  చెప్పగలరు.

సృష్టి ఎలా ఏర్పడింది?  అనే  ప్రశ్నకు, నాస్తికులు ఏమంటారంటే.. సృష్టి దానికదే ఏర్పడిందని అంటారు.

కొందరు నాస్తికులు  ఏమంటారంటే, దైవం  ఎలా ఏర్పడ్డారని  ప్రశ్నిస్తారు.

సృష్టి దానికదే ఏర్పడటం సంభవమని  వారు నమ్ముతున్నప్పుడు..  మరి, దైవం తమకు తామే ఏర్పడలేరా
ఏమిటి ..దైవానికి ఆది అంతములు లేవు. 
........

గాలిలో  ఎగిరే  పక్షులకు  తేలికైన  రెక్కలు  ఉండటం,  నీటిలో  చేపలకు  ఈదటానికి  తగ్గట్లు  శరీరం  ఉండటం,  అతి  చిన్న  చీమకు  ఉండే  శ్రమశక్తి, గతితప్పకుండా  వచ్చే  సూర్యచంద్రులు,  వాటివల్ల జీవించే  మొక్కలు,  భూమికి  గల  గురుత్వాకర్షణ  శక్తి, శరీరంలో గుండె కొట్టుకోవటం, జీర్ణప్రక్రియ ఇవన్నీ.. ఇంత పద్ధతిగా సృష్టి నిర్మాణం  జరగాలంటే గొప్ప ఆలోచనాశక్తి ఉంటేనే సాధ్యం.


******************
కర్మ ప్రకారం ఫలితం ఉండటమూ నిజమే, బ్రహ్మవ్రాత అనేదీ నిజమే , శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు.... అనేదీ నిజమే. 

జన్మను ఎత్తిన తరువాత ఎలాంటి కర్మలు చేయాలనే స్వేచ్చ వ్యక్తులకు ఉంటుంది. వారు చేసే కర్మల ప్రకారం ఫలితం ఉంటుంది. వ్యక్తి చేసిన కర్మ ప్రకారం కలిగే ఫలితాన్ని ...బ్రహ్మ వ్రాత , శివుని ఆజ్ఞ ..లేక ఇంకా ఎలాగైనా అనుకోవచ్చు. 

చాలామంది విషయంలో తాము చేసిన పనులు సరైనవిగా అనిపిస్తాయి. తప్పు చేసిన వాళ్లు కూడా తాము చేసింది కరెక్టే అనుకోవచ్చు. 

అయితే,  ఎవరు చేసిన  కర్మల ప్రకారం  వారికి తగిన  ఫలితాన్ని దైవం నిర్ణయిస్తారు. 


****
దైవకృపను పొంది భవిష్యత్తును మార్చుకోవచ్చని  సతీ సావిత్రి, మార్కండేయుడు..వంటి ఉదాహరణల  ద్వారా  పెద్దలు తెలియజేసారు.
***
 
 వ్యక్తులు చేసిన కర్మల ఫలితం ప్రకారం  చెడు జరగాలని  ఉందనే సూచనను  జ్యోతిష్యం ద్వారా తెలుసుకుంటే , వర్తమానంలో సత్ప్రవర్తన, ఇతరులకు సాయం చేయడం, పూజలద్వారా పరిహారాలను ఆచరించడం వంటి... వాటి ద్వారా చెడు ఫలితాలను గణనీయంగా తగ్గించుకునే అవకాశముంది.


( అయితే , జ్యోతిష్యం తెలుసుకోవడానికి ఉపాసనాబలం చక్కగా ఉన్న వ్యక్తుల ద్వారా తెలుసుకోవటం మంచిది. చెడు ఫలితాలను తగ్గించుకోవాలంటే పరిహారం ఆచరించడంతోపాటు సత్ప్రవర్తన కూడా అవసరం. ) 

***********
భవిష్యత్తులో శాస్త్రవేత్తలు  కొన్ని మూలకాలను కలిపి జీవాన్ని సృష్టించినా కూడా అందులో ఆశ్చర్యం ఏముంది ? 

ఈ ప్రయోగాలకు వాడే మూలకాలను శాస్త్రవేత్తలు ఎక్కడినుంచి తెస్తారు? అవి దైవసృష్టిలోని మూలకాలే . 


దైవసృష్టిలోని వాతావరణాన్ని ఉపయోగించుకుంటూ, ఆ గాలి పీల్చుతూ, ఆహారాన్ని తింటూ వీటన్నింటికీ కారణమైన  దైవాన్ని  గుర్తించడానికి  మాత్రం కొందరు   ఒప్పుకోకపోవటం ఎంతో అన్యాయం.  

సృష్టిలోని వాతావరణం, ఆకాశం, సూర్యరశ్మి, జలం, అగ్ని, భూమి, నీరు, మూలకాలు.. ఇవన్నీ శాస్త్రవేత్తలు సృష్టించినవి కాదు. ఇవన్నీ దైవం సృష్టించినవి.

 దైవసృష్టిలోని మూలకాలను, ముడిసరుకును ఉపయోగించి...మనుషులు వస్తువులను తయారుచేసి, అవన్నీ మేమే తయారుచేసాం, ఎంతో ఆలోచించి ఈ వస్తువులను తయారుచేసాం..అని చెప్పుకుంటారు. 

మా ఆలోచనలతో వస్తువులను తయారుచేసాం.. అని చెప్పుకుంటున్నప్పుడు..ఇంత వైవిధ్యభరితమైన సృష్టి వెనుక అత్యద్భుమైన ఆలోచనాశక్తి తప్పకుండా ఉంటుంది.. అని కూడా తెలుసుకోవాలి.

  మరి, ఇంత వైవిధ్యభరితమైన సృష్టి వెనుక ఎంతో అత్యద్భుతమైన ఆలోచనాశక్తి కలిగిన శక్తి తప్పకుండా ఉంటారు. ఈ శక్తినే ఆస్తికులు దైవం అని అంటారు.  

విజ్ఞానమంతా దైవసృష్టిలోనే ఉంది. ఇప్పటికి మనుషులు తెలుసుకున్న విజ్ఞానం చాలా తక్కువ. దైవమే అత్యద్భుతమైన సైంటిస్ట్.

************
  రోగకారణమైన బాక్టీరియా గురించి తెలియకపోతే చికిత్సను, మందులను అందించలేరు కదా! 

 బాక్టీరియా గురించి అప్పటివారికి తెలియబట్టే ఆయుర్వేదవైద్యం ద్వారా ఎన్నో చికిత్సలను అందించారు.

***************
 మంత్రాల గురించి హేళనగా మాట్లాడటం సరికాదు.. మంత్రాలను ఒక పద్దతిలో సరిగ్గా ప్రయోగిస్తే గొప్ప శబ్దశక్తి వెలువడుతుందని అంటారు. మంత్రాల ద్వారా ఎన్నో శక్తులను పొందినవారి గురించి గ్రంధాల ద్వారా తెలుస్తుంది.

 ఆధునిక శాస్త్రాల ద్వారా కూడా శబ్దశక్తి  గురించి తెలుసుకున్నారు. ఉదా.. అల్ట్రాసౌండ్.

**************
ఇంత విభిన్నమైన సృష్టి ఎంతో అద్భుతమైన ఆలోచనాశక్తి ఉన్న శక్తికే సాధ్యం.  సృష్టిలో  మనకు  తెలిసిన  విజ్ఞానం  సముద్రంలో  నీటిబొట్టంత  అయితే,  మనకు  తెలియని  విజ్ఞానం  సముద్రమంత,  ఇంకా  ఎక్కువ  కూడా.

 ప్రతి చిన్న విషయాన్ని గురించీ  అతిగా ఆలోచిస్తూ, అతిగా వాదించుకుంటూ సమయాన్ని వృధాచేయడం కన్నా,  విచక్షణతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం,  మనల్ని సరైన దారిలో నడిపించమని దైవాన్ని శరణువేడుకోటం మంచిది.
 
 
 

Thursday, April 12, 2018

ఓం..కొన్ని విషయములు..


 పెద్దవాళ్ళు తెలియజేసిన విషయాలలో కొన్ని పరస్పరవిరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తాయి.

 ఉదా..నిదానమే ప్రధానం..ఆలస్యం అమృతం విషం. ఈ రెండు వాక్యాలూ పరస్పరవిరుద్ధంగా ఉన్నాకూడా రెండూ సరైనవే. పరిస్థితిని బట్టి అన్వయించుకోవలసి ఉంటుంది.

 ఉదా..అగ్నిప్రమాదం  వల్ల ఇల్లు తగలబడుతుంటే ..నిదానమే ప్రధానం ..అని కూర్చోకుండా, ఆలస్యం అమృతం విషం .. అనే పద్ధతి ప్రకారం వెంటనే మంటలను ఆర్పవలసి ఉంటుంది. 

ఉదా..భార్యాభర్తల గొడవల్లో .. ఆలస్యం అమృతం విషం ..అని  వెంటనే వాళ్ళకు విడాకులు ఇవ్వడం కాకుండా , నిదానమే ప్రధానం .. అనే పద్ధతిని అవలంబించడం ద్వారా సర్దుకుపోవడానికి వారికి కొంత వ్యవధిని ఇవ్వవచ్చు.  

*******************

చాలామంది విషయంలో తాము చేసిన పనులు సరైనివిగా అనిపిస్తాయి. తప్పు చేసిన వాళ్లు కూడా తాము చేసింది కరెక్టే అనుకోవచ్చు. 

అయితే,  ఎవరు చేసిన  కర్మల ప్రకారం  వారికి తగిన  ఫలితాన్ని దైవం నిర్ణయిస్తారు. 

  కొన్నిసార్లు ముందే ఒక ప్రణాళిక ప్రకారం కొన్ని సంఘటనలు జరుగుతాయి.

 ఉదా..భూమిపై పాపభారం పెరిగిపోయినప్పుడు,  దైవం ఒక ప్రణాళిక ప్రకారం భూమిపై పాపభారాన్ని తగ్గించటం జరుగుతుందని పెద్దలు తెలియజేసారు . 

ఉదా .. దైవం తలచుకుంటే రావణాసురుని వంటి రాక్షసులను చంపటం పెద్ద పనేమీ కాదు. అందుకోసం సీతారాముల వనవాసం, సీతాపహరణం, ఇవన్నీ జరగనవసరం లేదు.

 అలా ఆ జీవితకధలను నడిపించటం వల్ల ( రామాయణ, భారత ) ఆ  కధలలో వచ్చే ఎన్నో పాత్రలు , ఎన్నో సంఘటనలు ..వాటినుంచి లోకానికి ఎన్నో విషయాలు తెలియజెప్పటం జరుగుతుందనిపిస్తుంది.

పురాణేతిహాసాల ద్వారా జీవితంలో ఎలా ప్రవర్తించితే ఫలితాలు ఎలా ఉండవచ్చో.....  అందరూ తెలుసుకుని ముందు జాగ్రత్తలతో జీవితాలను తీర్చిదిద్దుకోవచ్చు.

**************

ప్రాచీన గ్రంధాల  ద్వారా పెద్దలు  ఎన్నో చక్కటి విషయాలను తెలియజేసారు. అయితే,  కొన్ని  విషయాలలో  కాలక్రమేణా కొన్ని మార్పులుచేర్పులు జరిగాయని అంటారు. 

నేను  ఒక  దగ్గర  చదివిన  దాన్ని  బట్టి   ఇలా  తెలుస్తోంది....

" ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన   కొన్ని  ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది. "...అని. 

  అంటే,  కొందరు.....పురాణేతిహాసాలలో  తమకు  తోచినట్లు  మార్పులుచేర్పులు  చేసి  వ్రాసారని  అభిప్రాయం. 

పురాణేతిహాసాలలో కొత్తగా చేర్చారని భావించినవాటిని ప్రక్షిప్తాలు అంటారనుకుంటున్నాను. ఈ  ప్రక్షిప్తాలు రాసేవారిలో భక్తులూ ఉండవచ్చు, భక్తులు కాని వాళ్ళూ ఉండవచ్చు.

 పురాణేతిహాసాలలోని విషయాలను  అపార్ధం చేసుకోకుండా....
సరిగ్గా అర్ధం చేసుకొని  జీవితాలను తీర్చిదిద్దుకోవాలి.

పురాణేతిహాసాలు  ఎంతో  గొప్పవి. వాటిని అందించిన  దైవానికి , పెద్దలకు  అనేక కృతజ్ఞతలు. 


***********
 ప్రతి చిన్న విషయాన్ని గురించీ  అతిగా ఆలోచిస్తూ, అతిగా వాదించుకుంటూ సమయాన్ని వృధాచేయడం కన్నా,  విచక్షణతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం,  మనల్ని సరైన దారిలో నడిపించమని దైవాన్ని శరణువేడుకోటం మంచిది.



Saturday, April 7, 2018

దైవం.....


ఈ రోజుల్లో కొందరు నాస్తికులు ఏమంటున్నారంటే ,  సైన్స్ కు  దైవానికి, ఆస్తికులకు .. ఏమీ సంబంధం లేదంటున్నారు.  


  సైన్స్ అంటే కేవలం నాస్తికులకు మాత్రమే సంబంధించిన విషయం అన్నట్లు మాట్లాడటం ఏమిటి ? 

నాస్తికులు ఏమైనా ఈ సృష్టిని, అందులో సైన్స్ ను  సృష్టించారా? ప్రకృతి అంతటా సైన్స్  ఉన్నది. సైన్స్ అనేది అందరికీ సంబంధించిన విషయం. 


 సృష్టికర్త  దైవమే అసలైన శాస్త్రవేత్త. శాస్త్రవేత్తలలో దైవాన్ని నమ్మేవారూ ఉన్నారు.

ఆధునిక శాస్త్రాలలో ఉన్నదే విజ్ఞానం..  ప్రాచీనులు తెలియజేసిన  విజ్ఞానం   సైన్స్ కాదన్నట్లు కొందరు మాట్లాడుతున్నారు. 

 ప్రాచీన విజ్ఞానం అంతా ట్రాష్ ...ఆధునిక విజ్ఞానమే అసలైన విజ్ఞానం అనటం ...ప్రాచీన విజ్ఞానాన్ని,  ఆ విజ్ఞానాన్ని కనుగొన్నవారిని అవమానించటమే.

************

సృష్టి  ఎలా  ప్రారంభమయ్యింది ?  అనే  ప్రశ్నకు ,  దైవం  వల్ల   ప్రారంభమయ్యింది.  . అని  ఆస్తికులు   ఖచ్చితమైన   సమాధానం  చెప్పగలరు. 

సృష్టి  ఎలా  ప్రారంభమయ్యింది  ?  అనే  ప్రశ్నకు ,  నాస్తికులు   సరైన   జవాబు  చెప్పలేరు. సృష్టి దానికదే ప్రారంభమయిందని అంటారు.

కొందరు నాస్తికులు  ఏమంటారంటే, దైవం  ఎలా ఉద్భవించారని   ప్రశ్నిస్తారు. 

 సృష్టి దానికదే ఎలా ప్రారంభమయిందో  వీరు సమాధానం చెప్పగలరా? 


సృష్టి దానికదే  ప్రారంభమవటం సంభవమని  వారు నమ్ముతున్నప్పుడు.. 

 మరి,  దైవం తమకు తామే  ఉద్భవించలేరా....   

 సృష్టి దానికదే  ప్రారంభమయిందని  చెప్పే నాస్తిక భౌతికవాదులు... దైవం ఎలా  ఉద్భవించారని అడగటం విడ్డూరం.


**********

పదార్ధాల లక్షణాలను కనుగొని చెప్పే శాస్త్రవేత్తలే గౌరవనీయులైనప్పుడు, ఎన్నో పదార్ధాలను, మరెన్నింటినో సృష్టించిన  దైవం మరెంతో గౌరవనీయులు.

********* 

"Matter and energy cannot be created or destroyed " అనే సూత్రాన్ని .. గమనిస్తే శక్తి  మరియు పదార్ధం..ఎప్పుడూ ఉంటుందని తెలుస్తుంది.



నాస్తిక భౌతికవాదులు అంటున్నట్లు  సృష్టి ఆరంభంలో ఏమీ లేదనుకుంటే.. మరి , "Matter and energy cannot be created or destroyed "... అనే సూత్రం ప్రకారం నిత్యమూ ఉండవలసిన శక్తి, పదార్ధమూ ఏమైనట్లు? 


 ఒక విత్తనంలో మహావృక్షం దాగున్నట్లు ప్రపంచం అంతటా సూక్ష్మరూపంలో దాగుండే అవకాశం ఉందనిపిస్తుంది. 


 ప్రళయసమయంలో సృష్టి అంతా సూక్ష్మరూపంలో ఒదిగిపోవటం ,  తిరిగి సృష్టి ఆరంభ సమయంలో విత్తనం నుండి మహావృక్షం పెరిగినట్లు ప్రపంచం వ్యాపిస్తున్నదని అనుకోవచ్చు. 


ఇంతటి అద్భుతమైన విచక్షణతో కూడిన సృష్టి రచన జరగాలంటే  అద్భుతమైన ఆలోచనాశక్తి తప్పక అవసరం. ఆలోచన కూడా ఒక శక్తే. 


 దైవం యొక్క ఆలోచన కారణంగా ఇంతటి వైవిద్యభరితమైన సృష్టి రచన జరుగుతుంది. 

****

ఆధ్యాత్మికవాదులు, ఆధునిక  శాస్త్రవేత్తలు  చెప్పేదాని  ప్రకారం.. పదార్ధాన్ని శక్తిని సృష్టించలేము,  నాశనం  చేయలేము  అని , తెలుస్తోంది కదా!


 ఇవన్నీ  రూపాలను  మార్చుకున్నా కూడా ఎప్పుడూ  విశ్వంలో   ఉంటాయని  తెలుస్తోంది.


అంటే, ఆద్యంతములు లేని  ఒక మహాశక్తి ఎప్పుడూ  ఉంటుందని  మనకు తెలుస్తోంది.  ఈ శక్తి  ఊహాతీతమైన అద్భుతమైన  ఆలోచనా శక్తి  కూడా ఉన్నశక్తి. ( ఆలోచన కూడా  ఒక శక్తే..  )


సృష్టిలో ప్రాణశక్తి , ఆలోచనాశక్తి నిత్యమూ ఉంటాయి. అన్ని శక్తులూ  కలబోసిన మహా శక్తినే  ఆస్తికులు  దైవం అని  భావిస్తారు. 


 మనిషి యొక్క భౌతిక శరీరంగురించి ఆధునికులు కొంతవరకూ చెప్పగలుగుతున్నారు కానీ ,  ప్రాణశక్తి.. ఆలోచనాశక్తి.. మనస్సు బుద్ది వంటి విషయాల గురించి  ఆధునికులకు తెలిసింది చాలా తక్కువ. 


సృష్టిలో  మనకు  తెలిసిన  విజ్ఞానం  సముద్రంలో  నీటిబొట్టంత  అయితే,  మనకు   తెలియని  విజ్ఞానం   సముద్రమంత,  ఇంకా  ఎక్కువ  కూడా. 

**************

ఉద్భవించటం, ఆవిర్భవించటం, ఏర్పడటం,  ప్రారంభం ..ఇలాంటి ఎన్నో పదాలకు ఎన్నో అర్ధాలు ఉంటాయి. ఇలాంటి పదాలను వాడటంలో నేను ఏమైనా పొరపాట్లు చేస్తే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.




Tuesday, April 3, 2018

అరిగిపోతున్న చేతి వ్రేలిముద్రలు..



 చాలా విషయాలలో గుర్తింపు కోసం  
వ్రేలిముద్రలను తీసుకుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో చాలామందిలో చేతి ముద్రలు సరిగ్గా కనిపించటం లేదని అంటున్నారు.


 వ్రేలిముద్రలు అరగడానికి అనేక కారణాలుంటాయి.

పెద్ద వయస్సు వల్ల చేతిముద్రలు అరిగిపోతాయని  కొందరు  అంటున్నారు. అయితే, మధ్య వయస్సు వారిలో కూడా ఇలాంటి సమస్య వస్తోంది. 


 ఇంకో కారణమేమిటంటే... స్త్రీలు , పురుషులు   గిన్నెలు శుభ్రం చేయడం వల్ల ఇలాంటి సమస్య రావచ్చు. 


 గిన్నెలు తోమేటప్పుడు పాతకాలంలో కొబ్బరి పీచు, ఎండుగడ్డి  వంటివి వాడేవారు.


 ఆధునిక కాలంలో గరుకుగా ఉండే పీచు వాడుతున్నారు. 

గిన్నెలు శుభ్రం చేయడానికి  స్టీల్ పీచు ...వంటివి  వాడటం వల్ల కూడా  చేతుల  చర్మం పలచబడే ప్రమాదముంది.


 అందువల్ల  గరుకు పీచుతో  పాత్రలను శుభ్రం చేసేటప్పుడు  డైరెక్ట్ గా కాకుండా,   స్టీల్ పీచు పైన మామూలు మెత్తని పీచు కప్పి శుభ్రం చేయడం మంచిది.  


స్టీల్  వూలు   తయారీదారులు స్టీల్ పీచు పై భాగాన మెత్తని కవర్ ఉండేటట్లు తయారుచేయాలి.  పని చేసేటప్పుడు  గ్లవ్స్ వాడవచ్చు.  


ఇంకో కారణమేమిటంటే ,  కొందరు  తమ  చేతులను శుభ్రం చేయడానికి  రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఇందువల్ల కూడా చర్మం పలుచబడవచ్చు.

  చేతిముద్రలు అరిగే సమస్య వల్ల  ,  ముఖ కవళికలను  గుర్తించటం  వంటి   పద్ధతులను  ప్రవేశపెడుతున్నారు. 



 చేతి చర్మం పలుచబడితే చర్మం  వద్ద  మంట వచ్చే  అవకాశం ఉంది.

పనులు చేసేటప్పుడు  చర్మం  అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.