koodali

Monday, April 23, 2018

స్త్రీలు పురుషులు...కొన్ని విషయాలు..


పాతకాలంలో స్త్రీలు ఇంటిపట్టున ఉండే రోజుల్లో స్త్రీలకు కొన్ని కష్టాలు ఉన్నాయి నిజమే.. అయితే, ఈ రోజుల్లో స్త్రీల కష్టాలు  మరింతగా పెరిగాయి. 

ఆధునిక కాలంలో స్త్రీ స్వేచ్చ పేరుతో  సంపాదనా భారం కూడా  స్త్రీలపై పడటం వల్ల స్త్రీలు బయటకు రావటం  జరుగుతోంది. ఇందువల్ల  కూడా స్త్రీలను లైంగికంగా వేధించటానికి పురుషులకు బోలెడు అవకాశాలు పెరిగాయి.


 ఈ రోజుల్లో ప్రేమపేరుతో ఎందరో యువతులు మోసపోతున్నారు. వివాహేతరసంబంధాల కేసులూ ఎక్కువయ్యాయి.


 కొన్నిసంవత్సరాలక్రితం  మాకు పొరుగింట్లో  ఉన్న ఒకామె  విమెన్స్ హాస్టల్ వార్డెన్ గా చేసి రిటైర్ అయ్యారు. ఆమె కొన్ని విషయాలను  చెప్పారు. కొన్ని మంచి విషయాలు చెప్పారు, కొన్ని చెడ్దవిషయాలూ  చెప్పారు.


చెడ్ద విషయాలు ఏమిటంటే,  ఈ రోజుల్లో కొందరు స్త్రీపురుషుల సంబంధాల గురించి  ఆమె చెప్పిన కొన్ని విషయాలు వింటే ..బాబోయ్ ! సమాజం ఇలా తయారయిందా? అని భయమేసింది.


మా బంధువుల అమ్మాయి ఒక సంస్థలో కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. అక్కడ లైంగిక వేధింపుల వ్యవహారాలను గమనించి, పరిస్థితి ఇలా ఉందేమిటని ? తోటి  ఉద్యోగస్తురాలిని అడగగా ఆమె ఏం చెప్పారంటే...  


 ఉద్యోగం చేయడం అవసరం కాబట్టి, తప్పనిపరిస్థితిలో తాను అవన్నీ భరించవలసి వస్తోందని చెప్పారట. 


 ఇవన్నీ విని, తను అక్కడ ఉద్యోగం మాని, తక్కువ జీతమైనా ఫరవాలేదని వేరే సంస్థలో ఉద్యోగానికి చేరింది.


  ఈ రోజుల్లో కొన్ని కాలేజీల్లో, పాఠశాలల్లో కూడా కొన్ని లైంగిక వేధింపుల గురించి మీడియా ద్వారా వార్తలు వింటున్నాము.


 తాత్కాలికంగా పనిచేసే చోట కూడా ఇలాంటి వేధింపులు ఉండే అవకాశం ఉంది. సినిమా రంగంలో కూడా ఇలాంటి వేధింపుల గురించి విన్నాము. 


అక్కడా ఇక్కడా అని కాకుండా,  చాలా విరివిగా స్త్రీలపట్ల లైంగిక వేధింపుల బాధల గురించి వార్తలు తెలుస్తున్నాయి. 


 ఇవన్నీ గమనించే పాతకాలం వారు స్త్రీలకు సంపాదనా బాధ్యత ఇవ్వకుండా , ఇంటిబాధ్యత అప్పగించి ఉంటారనిపిస్తోంది.



  ఇప్పడు కూడా  కొందరు స్త్రీలు లైంగిక వేధింపుల బాధ లేకుండా చక్కగా ఉద్యోగం చేస్తున్నారు. అలాంటి స్త్రీలు అదృష్టవంతులు. 


 కొందరు స్త్రీలు లైంగికవేధింపులు భరిస్తూ తప్పనిపరిస్థితిలో పని చేస్తున్నారు. 


మరికొందరు స్త్రీలేమో తాము కూడా ఇష్టపూర్వకంగా  అక్రమసంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు. ఇలాంటి సంఘటనల వల్ల ఎన్నో సంసారాలు విచ్చిన్నమవుతున్నాయి. 


కొందరు స్త్రీలు కూడా సాటి స్త్రీల కష్టాలకు కారణమవుతున్నారు.


************

స్త్రీ స్వేచ్చ అంటూ స్త్రీలు మరింతగా బయటకు రావాలని కొందరు అంటున్నారు. 


మరి, బయటకు వచ్చిన స్త్రీల  రక్షణ భాధ్యత ఎవరు తీసుకుంటారు ? స్త్రీలకు ఎలాంటి హాని జరగకుండా వారు బాధ్యత వహిస్తారా ?


 ఈ రోజుల్లో స్త్రీ బయటకు వచ్చి చదువుకుని, ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే స్త్రీలనే వివాహం చేసుకోవడానికి చాలామంది పురుషులు ఇష్టపడుతున్నారు. ఈ విధంగా స్త్రీలపై అదనపు పనిబాధ్యత పడింది. ఈ విధంగా కూడా పురుషులకు లాభం జరిగింది. 


*****************


 ఎవరు ఎంత వాదించినా కొన్ని పనులు  స్త్రీలు చేస్తే పద్ధతిగా ఉంటుంది. కొన్ని పనులు పురుషులు చేస్తే పద్ధతిగా ఉంటుంది.


 ఇంటిబాధ్యత స్త్రీలైతే ఓర్పుగా చేయగలరు. బయటకెళ్లి సంపాదించే పని పురుషులు చేస్తే లైంగిక వేధింపుల గొడవుండదు. ఈ మాటలు చాలామందికి నచ్చవని నాకు తెలుసు.


స్త్రీలు బయటకు వెళ్ళి సంపాదించడం తప్పదనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  


  స్త్రీలు లైంగిక వేధింపులు బారిన పడకుండా ఉపాధి పొందడానికి, పురుషులతో సంబంధం లేకుండా స్త్రీలే  డ్వాక్రా వంటి సంఘాల ద్వారా ఉపాధి పొందాలి. 


స్త్రీలే పరిశ్రమలు ఏర్పాటుచేసుకుని తక్కువ పనిగంటలు పనిచేస్తూ కూడా ఉపాధి పొందవచ్చు.  


ఎక్కడయినా   స్త్రీలు  లైంగిక వేధింపులకు గురయితే అందరు స్త్రీలూ సంఘటితంగా నిలబడి ఎదుర్కోవాలి.  అన్యాయానికి గురయ్యి ఆర్ధికంగా ఆసరా లేని స్త్రీలకు మహిళాసంఘాలు ఆసరా ఇవ్వాలి.


విరాళాల ద్వారా స్త్రీ నిధిని ప్రోగుచేసి ఆదరణ కరువయిన స్త్రీలకు ఇచ్చి ఆదుకోవాలి. అలాంటి స్త్రీలను సంఘటితపరిచి నివాసం, ఉపాధి వంటివి కల్పించాలి.వారికి పిల్లలుంటే  ఆదుకోవాలి.






No comments:

Post a Comment