koodali

Thursday, April 12, 2018

ఓం..కొన్ని విషయములు..


 పెద్దవాళ్ళు తెలియజేసిన విషయాలలో కొన్ని పరస్పరవిరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తాయి.

 ఉదా..నిదానమే ప్రధానం..ఆలస్యం అమృతం విషం. ఈ రెండు వాక్యాలూ పరస్పరవిరుద్ధంగా ఉన్నాకూడా రెండూ సరైనవే. పరిస్థితిని బట్టి అన్వయించుకోవలసి ఉంటుంది.

 ఉదా..అగ్నిప్రమాదం  వల్ల ఇల్లు తగలబడుతుంటే ..నిదానమే ప్రధానం ..అని కూర్చోకుండా, ఆలస్యం అమృతం విషం .. అనే పద్ధతి ప్రకారం వెంటనే మంటలను ఆర్పవలసి ఉంటుంది. 

ఉదా..భార్యాభర్తల గొడవల్లో .. ఆలస్యం అమృతం విషం ..అని  వెంటనే వాళ్ళకు విడాకులు ఇవ్వడం కాకుండా , నిదానమే ప్రధానం .. అనే పద్ధతిని అవలంబించడం ద్వారా సర్దుకుపోవడానికి వారికి కొంత వ్యవధిని ఇవ్వవచ్చు.  

*******************

చాలామంది విషయంలో తాము చేసిన పనులు సరైనివిగా అనిపిస్తాయి. తప్పు చేసిన వాళ్లు కూడా తాము చేసింది కరెక్టే అనుకోవచ్చు. 

అయితే,  ఎవరు చేసిన  కర్మల ప్రకారం  వారికి తగిన  ఫలితాన్ని దైవం నిర్ణయిస్తారు. 

  కొన్నిసార్లు ముందే ఒక ప్రణాళిక ప్రకారం కొన్ని సంఘటనలు జరుగుతాయి.

 ఉదా..భూమిపై పాపభారం పెరిగిపోయినప్పుడు,  దైవం ఒక ప్రణాళిక ప్రకారం భూమిపై పాపభారాన్ని తగ్గించటం జరుగుతుందని పెద్దలు తెలియజేసారు . 

ఉదా .. దైవం తలచుకుంటే రావణాసురుని వంటి రాక్షసులను చంపటం పెద్ద పనేమీ కాదు. అందుకోసం సీతారాముల వనవాసం, సీతాపహరణం, ఇవన్నీ జరగనవసరం లేదు.

 అలా ఆ జీవితకధలను నడిపించటం వల్ల ( రామాయణ, భారత ) ఆ  కధలలో వచ్చే ఎన్నో పాత్రలు , ఎన్నో సంఘటనలు ..వాటినుంచి లోకానికి ఎన్నో విషయాలు తెలియజెప్పటం జరుగుతుందనిపిస్తుంది.

పురాణేతిహాసాల ద్వారా జీవితంలో ఎలా ప్రవర్తించితే ఫలితాలు ఎలా ఉండవచ్చో.....  అందరూ తెలుసుకుని ముందు జాగ్రత్తలతో జీవితాలను తీర్చిదిద్దుకోవచ్చు.

**************

ప్రాచీన గ్రంధాల  ద్వారా పెద్దలు  ఎన్నో చక్కటి విషయాలను తెలియజేసారు. అయితే,  కొన్ని  విషయాలలో  కాలక్రమేణా కొన్ని మార్పులుచేర్పులు జరిగాయని అంటారు. 

నేను  ఒక  దగ్గర  చదివిన  దాన్ని  బట్టి   ఇలా  తెలుస్తోంది....

" ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన   కొన్ని  ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది. "...అని. 

  అంటే,  కొందరు.....పురాణేతిహాసాలలో  తమకు  తోచినట్లు  మార్పులుచేర్పులు  చేసి  వ్రాసారని  అభిప్రాయం. 

పురాణేతిహాసాలలో కొత్తగా చేర్చారని భావించినవాటిని ప్రక్షిప్తాలు అంటారనుకుంటున్నాను. ఈ  ప్రక్షిప్తాలు రాసేవారిలో భక్తులూ ఉండవచ్చు, భక్తులు కాని వాళ్ళూ ఉండవచ్చు.

 పురాణేతిహాసాలలోని విషయాలను  అపార్ధం చేసుకోకుండా....
సరిగ్గా అర్ధం చేసుకొని  జీవితాలను తీర్చిదిద్దుకోవాలి.

పురాణేతిహాసాలు  ఎంతో  గొప్పవి. వాటిని అందించిన  దైవానికి , పెద్దలకు  అనేక కృతజ్ఞతలు. 


***********
 ప్రతి చిన్న విషయాన్ని గురించీ  అతిగా ఆలోచిస్తూ, అతిగా వాదించుకుంటూ సమయాన్ని వృధాచేయడం కన్నా,  విచక్షణతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం,  మనల్ని సరైన దారిలో నడిపించమని దైవాన్ని శరణువేడుకోటం మంచిది.



No comments:

Post a Comment