koodali

Wednesday, August 24, 2016

కొన్ని విషయాలు.... ఎండల్లో ఊరేగింపుల వల్ల పిల్లలు..


కృష్ణా పుష్కరాలు ముగింపు కార్యక్రమాలు కూడా బాగున్నాయి.

 అయితే సింధు రాక సందర్భంగా జరిగిన  ఊరేగింపు బాగా ఎండలో జరిగింది.

 ఎందరో  పిల్లలు కూడా ఆ ఎండలో రోడ్డుకు ఇరువైపులా  ఉండటం టీవీలలో చూశాము.  

ఎండల్లో ఊరేగింపుల వల్ల అందరూ అలసిపోతారు. 

ఆహ్వానితులు.... ఆహ్వానించేవాళ్లు కూడా ఎండకు అలసిపోతారు.

స్టేడియంలో సన్మానం మరియు  సాయంత్రం హారతి కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించటం బాగుంది.

 అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు.





Monday, August 22, 2016

కృష్ణా పుష్కరాలలో..........

 కృష్ణా పుష్కరాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటానికి ప్రభుత్వం వారు చాలా చర్యలను చేపట్టారు.

 విజయవాడలో చూస్తే .. ఎక్కడికక్కడ డస్ట్ బిన్లను ఏర్పాటు చేసారు. సిబ్బంది ఎక్కడికక్కడ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. 


ప్రజలు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా చెత్తడబ్బాలలోనే చెత్తను వేస్తే పరిసరాలు శుభ్రంగా ఉంటాయి.

ఘాట్లో కూడా ఎందరో వాలంటీర్లు , పోలీసు వారు భక్తులకు సహాయం చేస్తున్నారు.

పిల్లలు, పెద్దవాళ్ళకు టాగ్స్  వేయటం  అనేది ఎంతో చక్కటి ఆలోచన.

అన్నదానం కూడా జరుగుతోంది.

అయితే,  నేను ఒక దగ్గర  గమనించిన విషయం ఏమిటంటే..  కొంతమంది పొంగలిని  మొత్తం తినకుండా చెత్త బుట్టలో పడేసారు.

ఆహారాన్ని వృధా చేయకూడదని తెలిసి కూడా ప్రజలు ఇలా వృధాగా పారవేయటం బాధాకారం. ఎక్కువ తినలేమనుకున్నప్పుడు ఎక్కువ  తీసుకోకుండా ఉండాలి.

పుష్కరాలకు లక్షలాది భక్తులు వచ్చినా కూడా పరిసరాలు శుభ్రంగా ఉంచటంలో ఎందరో  సిబ్బంది  చక్కగా కృషిచేసారు.
...........................


తిరుమలలో కూడా రోజూ ఎందరో భక్తులు వచ్చినా కూడా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతారు.

  తిరుమల చూస్తే భారతదేశం అంతా తిరుమలలా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది.

భారతదేశం అంతటా తిరుమలను ఆదర్శంగా తీసుకుని చర్యలు చేపడితే బాగుంటుంది.


 తిరుమలలో  ప్రతి రోజూ ఎందరో భక్తులు వస్తున్నా కూడా అన్నదానం అద్భుతంగా  నిర్వహిస్తున్నారు. అక్కడ తక్కువ ధరకే  ఆహారం లభించే జనతా క్యాంటీన్లు వంటివి కూడా ఉన్నాయి. 

...............................


 దేశం అంతటా  పేదవారికి తక్కువ ధరకు ఆహారం లభించే  క్యాంటీన్ల వంటివి ఏర్పాటు చేయటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం, మొక్కలు ఎక్కువగా నాటి పెంచటం, ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవటం..వంటి చక్కటి కార్యక్రమాలు మరింతగా జరిగేలా అందరూ కృషి చేయాలి.



ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు.. చిత్తశుద్ధితో కృషి చేస్తే  భారతదేశం ప్రపంచంలోనే ఆదర్శ దేశం అవుతుందనటంలో ఎటువంటి సందేహమూ లేదు.


Wednesday, August 10, 2016

ఓం..





శ్రావణ శుక్రవారం  వరలక్ష్మీ వ్రతం.. శ్రావణ పూర్ణిమ..హయగ్రీవ జయంతి..ఈ సంవత్సరపు శుభప్రదమైన  అమరనాధ్ యాత్ర  శ్రావణ పౌర్ణమికి  పూర్తవుతుంది..శ్రావణ శనివారం శనిదేవుని పూజ..శ్రావణ మాసంలో ఎన్నో విశేషాలు ఉంటాయి.

****************
 కొందరు ఎక్కువ సంఖ్యలో దైవనామాలను అనటం కొరకు.. గబగబా చాలా స్పీడుగా అనేస్తారు. ఇలాంటప్పుడు గొంతునొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుందేమో? 

అలా చేయటం కన్నా, సంఖ్య తక్కువైనా.. దైవనామాలను నిదానంగా, ప్రశాంతంగా అనుకోవటం మంచిదని నాకు అనిపిస్తున్నది.


Monday, August 1, 2016

ప్రత్యేక హోదా మరియు.........

ప్రత్యేక హోదా మరియు......... కేంద్రం రాష్ట్రానికి ఎంతో చేసిందని కొందరు చెప్పటం సరైనది కాదు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు, రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి చర్యలు, పన్ను రాయితీలు..వంటి ఎన్నో వాగ్ధానాలు చేసారు. విశాఖ రైల్వే జోన్ విషయమూ అలాగే ఉంది. రాయలసీమ మరియు ఉత్తరాంధ్రా విషయంలోనూ ఇప్పటివరకూ ప్రత్యేక రాయితీలను ప్రకటించలేదు. విద్యా సంస్థల వల్ల రాష్ట్రానికి వచ్చే గొప్ప ఆర్ధిక లాభమేమీ లేదు. రహదారులు, విద్యా సంస్థలు వంటి వాటి విషయంలో ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఆంధ్రప్రదేశ్కూ ఇచ్చారు.. ఇందులో ఆంధ్రప్రదేస్కు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ఇప్పటికే రెండు సంవత్సరాలు గడచిపోయాయి. ఎప్పటికప్పుడు ఇదిగో... అదిగో అంటూ తాత్సారం చేస్తున్నారు. ప్రత్యేక హోదా , పన్ను రాయితీలు మరియు ఇతర విషయాల అమలు ఎప్పుడు చేస్తారు ? రాష్ట్రాన్ని విభజించినప్పుడు కేవలం తెలంగాణా అభిప్రాయాలకు మాత్రమే విలువ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అమలు చేయమంటే మాత్రం ఇతర రాష్ట్రాల వాళ్ల అభిప్రాయాలు కూడా కావాలంటున్నారు. అంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలకు విలువ లేదా? రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం చేసే విషయంలో ఆసక్తిగానే ఉండేవారనిపించేది. అయితే , రాష్ట్ర విభజన సమయంలో ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరిన కొందరి సలహాల వల్ల బీజేపీ పెద్దల ప్రవర్తనలో మార్పు వచ్చిందేమో అనిపిస్తోంది. అయినా, దేశంలో కాంగ్రెస్ , బీజేపీ మాత్రమే కాకుండా మూడో పార్టీ ఉండటం అవసరం అనిపిస్తోంది. ఆం ఆద్మీ పార్టీ మూడో పార్టీగా బలపడుతుందనుకుంటే ఆ పార్టీ వాళ్ళు ప్రజల ఆశలు వమ్ము చేసారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒంటరిగా అధికారంలోకి రావాలని అత్యాశ పడుతోంది. అయితే, భవిష్యత్తులో జాతీయపార్టీలు ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితి బలంగా ఉందనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే తమకూ ఇవ్వాలని ఇతర రాష్ట్రాలు కోరటం అన్యాయం. ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా లేకుండా ఆర్ధికంగా కూడా వెనుకబడి ఉండటం వల్ల ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి ఉంది. చక్కటి రాజధాని మరియు ఆర్ధికంగా చక్కగానే ఉన్న రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోరటం అన్యాయం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఏ ప్రాతిపదికన ఇవ్వాలి ? అని కొందరు అనటం విడ్డూరం. ఆర్ధికంగా వెనుకబడి ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇవ్వవచ్చని ఉంది. ఆర్ధికంగా వెనుకబడి ఉన్న ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా మరియు పన్ను రాయితీలు ఇవ్వాలి..... అంతేకాదు. ఆంధ్రప్రదేశ్ ను ఇతర రాష్ట్రాలతో పోల్చటానికి వీలు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా కాంగ్రెస్, బీజేపీ కలిసి రాష్ట్ర విభజన చేసారు కాబట్టి .....ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు ఇతర సహాయాలు చేయవలసి ఉంది.