koodali

Monday, August 1, 2016

ప్రత్యేక హోదా మరియు.........

ప్రత్యేక హోదా మరియు......... కేంద్రం రాష్ట్రానికి ఎంతో చేసిందని కొందరు చెప్పటం సరైనది కాదు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు, రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి చర్యలు, పన్ను రాయితీలు..వంటి ఎన్నో వాగ్ధానాలు చేసారు. విశాఖ రైల్వే జోన్ విషయమూ అలాగే ఉంది. రాయలసీమ మరియు ఉత్తరాంధ్రా విషయంలోనూ ఇప్పటివరకూ ప్రత్యేక రాయితీలను ప్రకటించలేదు. విద్యా సంస్థల వల్ల రాష్ట్రానికి వచ్చే గొప్ప ఆర్ధిక లాభమేమీ లేదు. రహదారులు, విద్యా సంస్థలు వంటి వాటి విషయంలో ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఆంధ్రప్రదేశ్కూ ఇచ్చారు.. ఇందులో ఆంధ్రప్రదేస్కు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ఇప్పటికే రెండు సంవత్సరాలు గడచిపోయాయి. ఎప్పటికప్పుడు ఇదిగో... అదిగో అంటూ తాత్సారం చేస్తున్నారు. ప్రత్యేక హోదా , పన్ను రాయితీలు మరియు ఇతర విషయాల అమలు ఎప్పుడు చేస్తారు ? రాష్ట్రాన్ని విభజించినప్పుడు కేవలం తెలంగాణా అభిప్రాయాలకు మాత్రమే విలువ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అమలు చేయమంటే మాత్రం ఇతర రాష్ట్రాల వాళ్ల అభిప్రాయాలు కూడా కావాలంటున్నారు. అంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలకు విలువ లేదా? రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం చేసే విషయంలో ఆసక్తిగానే ఉండేవారనిపించేది. అయితే , రాష్ట్ర విభజన సమయంలో ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరిన కొందరి సలహాల వల్ల బీజేపీ పెద్దల ప్రవర్తనలో మార్పు వచ్చిందేమో అనిపిస్తోంది. అయినా, దేశంలో కాంగ్రెస్ , బీజేపీ మాత్రమే కాకుండా మూడో పార్టీ ఉండటం అవసరం అనిపిస్తోంది. ఆం ఆద్మీ పార్టీ మూడో పార్టీగా బలపడుతుందనుకుంటే ఆ పార్టీ వాళ్ళు ప్రజల ఆశలు వమ్ము చేసారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒంటరిగా అధికారంలోకి రావాలని అత్యాశ పడుతోంది. అయితే, భవిష్యత్తులో జాతీయపార్టీలు ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితి బలంగా ఉందనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే తమకూ ఇవ్వాలని ఇతర రాష్ట్రాలు కోరటం అన్యాయం. ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా లేకుండా ఆర్ధికంగా కూడా వెనుకబడి ఉండటం వల్ల ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి ఉంది. చక్కటి రాజధాని మరియు ఆర్ధికంగా చక్కగానే ఉన్న రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోరటం అన్యాయం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఏ ప్రాతిపదికన ఇవ్వాలి ? అని కొందరు అనటం విడ్డూరం. ఆర్ధికంగా వెనుకబడి ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇవ్వవచ్చని ఉంది. ఆర్ధికంగా వెనుకబడి ఉన్న ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా మరియు పన్ను రాయితీలు ఇవ్వాలి..... అంతేకాదు. ఆంధ్రప్రదేశ్ ను ఇతర రాష్ట్రాలతో పోల్చటానికి వీలు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా కాంగ్రెస్, బీజేపీ కలిసి రాష్ట్ర విభజన చేసారు కాబట్టి .....ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు ఇతర సహాయాలు చేయవలసి ఉంది.

No comments:

Post a Comment