koodali

Monday, June 13, 2022

దైవం దయ ఉంటే అన్నీ ఉంటాయి...

 

మనలో చాలామందికి దైవభక్తి ఉంటుంది.
అయితే, దైవం మాత్రమే శాశ్వతం..సంసారం అశాశ్వతం అని తెలిసికూడా..సంసారలంపటాలు..సుఖం అనిపించినప్పుడు సంతోషపడటం, కష్టం అనిపించినప్పుడు బాధపడటం చేస్తుంటాం. అలా చేయటం కూడా సామాన్య మానవులకు సహజమే.

ఎక్కడో అసామాన్యులకు తప్ప సాధారమానవులకు జీవితంలో సంసారలంపటం ఉండటం కూడా సహజమే.అలాగే జగన్నాటకం నడుస్తోంది.

మన మనస్సే అనుకుంటాం కానీ, దానిని మన అదుపులో పెట్టుకోవటం చాలా కష్టం. అలా మన మనస్సును మన అదుపులో ఉంచుకోగలిగితే ఎంతో బాగుంటుంది.


అది రానంతవరకూ బాధలు తప్పవు.మన మనస్సునే మనం అదుపులో ఉంచుకోలేనప్పుడు ప్రపంచంలో వేరేవాటిని ఏం చేయగలం?

 కనీసం కష్టాలలో అతిగా బాధపడకుండా సుఖాలలో అతిగా సంతోషపడకుండా మన ధర్మాన్ని చక్కగా  పాటిస్తూ ఫలితాన్ని దైవానికి వదిలి, తామరాకుమీద నీటిబొట్టులా జీవిస్తే బాగుంటుంది.

 అయితే, ఆ స్థితప్రజ్ఞత రావాలంటే ఎంతో కృషిచేయాలి. కనీసం వృద్ధాప్యంలో వచ్చినా మంచిదే. అంతా దైవం దయ.

ఇలా ఆలోచిన కొద్దీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎన్ని చెప్పుకున్నా చెప్పుకునేవి ఉంటూనే ఉంటాయి. అయితే, అతిగా చెప్పుకోవటం ఎందుకులెండి. ఏవో కొన్ని విషయాలను వ్రాయాలనిపించి ఇవన్నీ వ్రాసాను కానీ, నేను ఎక్కువగా బ్లాగ్ వ్రాయాలనుకోవటం లేదు.
.....

ఆలోచించే కొద్దీ ఒకదానితరువాత ఒకటి  కొత్త ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అవన్నీ వ్రాసినా మళ్ళీ  కొత్త ఆలోచనలు వచ్చి, అప్పుడు అలా కాకుండా ఇలా వ్రాస్తే బాగుండేది అని సరిదిద్దాలనిపిస్తుంది. ఇందతా ఒక మాయాప్రపంచం. అంతులేని కధ.

 ప్రపంచంలో విజ్ఞానానికి అంతులేదు. ఎంత తెలుసుకున్నా తెలుసుకునేవి ఉంటూనే ఉంటుంది. మనం సుఖంగా ఉండాలంటే  ఎంతవరకూ అవసరమో అంతవరకు తెలుసుకుంటే చాలు. అతి అనవసరం. ఎక్కువగా తెలుసుకోని వాళ్ళు కూడా తమకు అవసరమైనంత తెలుసుకుని, దైవంపై భారం వేసి హాయిగా ఉండవచ్చు.

 మనకు ఒక సామెత ఉంది. అన్నీ తెలిసిన ఒకరు అమావాస్య నాడు పోతే.. ఏమీ తెలియని ఒకరు ఏకాదశినాడు పోయారని.

 కంప్యూటర్లు, ఫోన్లు ఎక్కువగా వాడితే అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. విజ్ఞానం అయినా అంతే. ప్రపంచంలోని విషయాలన్నీ తెలుసుకుని ఏం చేస్తాం..ఏది ఎంతవరకో అంతవరకూ ఉంటే మంచిది.

 చిన్నపిల్లలు చూడండి వాళ్ళకేమీ తెలియదు హాయిగా ఉంటారు.పెద్దవారు చిన్నపిల్లల్లా ఉండక్కర్లేదు కానీ, ఎంతలో ఉండాలో అంతలో ఉంటే చక్కగా ఉంటుంది.

అందుకే వైరాగ్యంలో ఆనందం ఉంటుందని అంటారు.

అతిగా ఆలోచిస్తే బుర్ర వేడెక్కి అనారోగ్యాలు వచ్చే అవకాశముంది.అందుకే, మెదడుకు కూడా రెస్ట్ ఇవ్వాలని ఎక్కువ ఆలోచించకుండా కొంతసేపైనా ధ్యానం చేస్తే మంచిదని అంటున్నారు.

ఎక్కువగా తెలయని వాళ్ళు కూడా తమకు అవసరమైనంత తెలుసుకుని  దైవంపై భారం వేసి హాయిగా ఉండవచ్చు.
దైవం దయ ఉంటే అన్నీ ఉంటాయి.

 

3 comments:

  1. చాలామంది ప్రజలకు డబ్బు వ్యామోహం బాగా పెరిగింది, ఇంకా అనేక వ్యామోహాలూ పెరిగాయి. దీనివల్ల ప్రజలు మనశ్శాంతిని కోల్పోతున్నారు.

    కష్టాలు రాకుండా ఉండాలంటే వ్యామోహాలను పెంచుకోకూడదు. వ్యామోహాలలో పడి కూడా పాపాలను చేస్తున్నారు.
    ......

    జీవితంలో పాపాలు చేయకుండా మనస్సును అదుపులో పెట్టుకోవాలి. సరైన దారిలో జీవించే శక్తిని ప్రసాదించమని దైవాన్ని ప్రార్దించుకోవాలి.

    ప్రార్ధించి ఊరుకోవటం కాకుండా, తాను కూడా ధర్మబద్ధంగా జీవించటానికి శాయశక్తులా ప్రయత్నించాలి. అప్పుడు దైవం సాయం చేస్తారు...ఇలా పెద్దవాళ్ళు పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలి.

    అలాగని ప్రతిరోజూ తలస్నానాలు, ఉపవాసాలు ఉండవలసిన అవసరం లేదు.

    ఎవరికయినా కష్టాలు ఉంటే, ఆ కష్టాలు తీరడానికి బాగా ప్రయత్నించాలి.

    అయినా ఎంతకీ కష్టాలు తీరకపోతే.. పూర్వపాపఫలం అనుకుని.. కష్టాలలో ఉన్నవారికి సాయం చేస్తూ దైవాన్ని ప్రార్ధిస్తూ ఉంటే క్రమంగా పాపకర్మ కరిగి కష్టాలు తీరే అవకాశం ఉంది.

    ReplyDelete
  2. స్టెం సెల్స్ వల్ల అనేక అనారోగ్యాలు తగ్గుతాయని ఆధునిక శాస్త్రవేత్తలు అంటున్నారు. బొడ్డుత్రాడునుంచి కూడా స్టెం సెల్స్ ను సేకరిస్తారు.

     అందువల్ల, విదేశాల్లో చాలామంది తమబిడ్డలు పుట్టినప్పుడు లభించే బొడ్డుత్రాడును భద్రపరుస్తున్నారు.

    పాతకాలంలో భారతదేశంలో కొందరు పెద్దవాళ్ళు.. శిశువులు జన్మించినప్పుడు లభించే బొడ్డుత్రాడును దాచి ఉంచేవారు. బొడ్డుత్రాడు యొక్క కొంత ముక్కను బాగా ఎండబెట్టి రాగిరేకులో ఉంచి, పిల్లల భుజానికి తాయెత్తులా కట్టేవారు. ఇది ఒక విధంగా ఆధునిక కాలంలో స్టెంసెల్ల్స్ భద్రపరిచే విధానం వంటిది అనుకోవచ్చు.

    బొడ్డుత్రాడుతో కొందరు వైద్యం చేస్తారు. అయితే ఈ రోజుల్లో బొడ్డుత్రాడును సేకరించాలంటే కష్టంగా ఉందని, బొడ్డుత్రాడు సేకరణకు అడ్డంకిగా ఉన్న కఠిన నియమాలను సులభతరం చేస్తే బాగుంటుందని వారు భావిస్తున్నారు.

    డెలివరి తర్వాత చాలామంది బొడ్డుత్రాడును పడేస్తారు. ఎలాగూ పడేసే దానిని వైద్యం అవసరం అయినవారికి ఇస్తే బాగుంటుంది.

    బొడ్డుత్రాడు చాలా పెద్దగా ఉంటుంది. అందులో ఎక్కువభాగాన్ని పేరెంట్స్ దాచుకుని, మిగిలిన కొంతభాగాన్ని వైద్యం అవసరం అయినవారికి ఇవ్వవచ్చు.

    ReplyDelete
  3. కొందరు ఏమంటారంటే, మనము గాలిని లోపలికి పీల్చినప్పుడు బయట ఉన్న మంచిశక్తి.. మనలోపలికి వెళ్తున్నట్లు భావించాలని, గాలిని బయటకు వదిలేటప్పుడు మనలోని చెడు.. బయటకు వెళ్ళిపోతున్నట్లు భావించాలని.. అలా చేస్తే మంచిదని తెలియచేస్తున్నారు.

     నాకు ఏమనిపించిందంటే, బయట నుంచి మనలోకి మంచి శక్తి వస్తున్నట్లు భావించటం మంచిదే..

     మనము గాలిని బయటకు వదులుతూ మనలోని చెడును బయటకు వదులుతున్నట్లు భావించటం గురించి నాకు ఏమనిపించిందంటే..

     మనలోని చెడు బయటకు పోవటం మంచిదేకానీ, అలా చేయటం వల్ల బయట వాతావరణాన్ని కలుషితం చేయటం అవుతుంది కదా..అనిపించింది.

    అంటే, మనము మనలోని చెడును బయటకు వదిలి, దానిని అలా వ్యాపింపచేయటం కంటే..

     గాలిని బయటకు వదులుతూ మనలోని చెడు బయటకు వెళ్లినట్లు భావించి, అలా బయటకు వెళ్ళిన వెంటనే అది మంచిశక్తిగా మారిపోయినట్లు భావించవచ్చు కదా .. అనిపించింది.

    ఇదంతా కాకుండా మనలో ఉన్న చెడు ..మనలోనే మంచిశక్తిగా మారినట్లు భావిస్తే ఇంకా మంచిది కదా
    ..అని కూడా అనిపించింది.

    భావించటమే కదా చేయవలసింది. భావనకు చాలా శక్తి ఉంటుందంటారు. భావన చేయటానికి కూడా కష్టం ఏముంది.

    ReplyDelete