koodali

Wednesday, September 26, 2012

ఒకసారి త్రిమూర్తులు మణిద్వీపానికి వెళ్ళి..కొన్ని విషయములు...


ఓం.

  కొందరు  ఏమంటారంటే,  సృష్టిలో   మొదట  ఏకకణ జీవులు, తరువాత   బహుకణ జీవులు, తరువాత పక్షులు,  జంతువులు,  మనుషులు  ఇలా .... క్రమంగా  తెలివితేటలు  యాదృచ్ఛికంగా    పెరగటం  జరిగింది , 


కాబట్టి,    మనుషులే  విశ్వంలో  గొప్పవారు  అంటారు.   మళ్ళీ  ఇతరగ్రహాలలో  మనకన్నా  తెలివిగలవారు  ఉన్నట్లు  సంకేతాలు  అందుతున్నాయి.   అనీ   అంటారు.

అయితే,  మనిషి   పుట్టుక  కంటే  ముందే  విశ్వంలో  సూర్యచంద్రులు, వాతావరణం,   గాలి,   నీరు ,   భూమికి  గురుత్వాకర్షణ  శక్తి  .....వంటివన్నీ  ఉన్నాయి.


మరి ,
మనిషి  కన్నా  ముందే  జీవుల  మనుగడకు   అవసరమైన  ఇవన్నీ  జీవులకోసం  అమర్చిందెవరు  ?  ఇంకెవరు  దైవం. 

ఈ  జగన్నాటకం  సాగటానికి  వీలుగా  ఎంతో  పద్ధతిగా  ఇవన్నీ  ఏర్పాటు  చేయబడ్డాయి. 

..................

ఒకసారి  త్రిమూర్తులు  మణిద్వీపానికి  వెళ్ళి  పరమాత్మ  అయిన  ఆదిపరాశక్తిని  దర్శించి  స్తుతించారు. 

అప్పుడు  బ్రహ్మదేవుడు..అమ్మా! నాదొక  చిన్న సందేహం ..అంటూ..


..ఏకమేవాద్వితీయం బ్రహ్మ. అని  కదా  వేదాలు  చెబుతున్నాయి.  అది  నువ్వా,  లేక  నీ  విభుడైన  పరాత్పర  మహాపురుషుడా  ?....  అని  ఎన్నో  విషయములను  అడుగగా.........

చతుర్ముఖా!  నాకూ నా  పురుషుడికి  భేదం  లేదు. ఎప్పుడూ  ఏకత్వమే.  అతడే  నేను. నేనే  అతడు.  భేదం  మతి  విభ్రమం. మా మధ్య  ఉన్న సూక్ష్మమైన   అంతరాన్ని  తెలుసుకున్నవాడు  నిస్సంశయంగా  సంసార విముక్తుడు.  బ్రహ్మం ఎప్పుడు  ఏకమే.  అద్వితీయమే.  ఏకమేవాద్వితీయం  బ్రహ్మ. సందేహం   లేదు.  కానీ సృజన  సమయంలో  ద్వైత  భావాన్ని  పొందుతుంది.  ఒకటే  దీపం  ఉపాధి  యోగం  వల్ల  రెండు  అయినట్టూ ,  నీడయే  అద్దంలో  పడి  ప్రతిబింబమైనట్టూ  మేము  ద్విధాత్వం  (  ద్వైత  భావం  )  పొందుతూంటాం. ......అంటూ ....పరమాత్మ  అయిన  ఆదిపరాశక్తి ,....   ఇంకా  ఎన్నో  విషయాలను  చెప్పటం  జరిగింది.

అలా  ఎన్నో  విషయాలను  బోధించి...త్రిమూర్తులతో....


.....విషమపరిస్థితి  ఏదైనా  ఎదురైనప్పుడు  నన్ను  స్మరించండి.  స్మరణ  మాత్రం  చేతనే  నేను  మీకు  దర్శనం  అనుగ్రహిస్తాను.  అలాగే  సనాతనుడైన  పరమాత్మను  కూడా  తలుచుకోండి.   మా  ఇద్దరినీ  తలుచుకుంటే  మీకు  కార్యసిద్ధి  నిస్సంశయంగా  కలుగుతుంది......... అని  కూడా  అభయప్రదానాన్ని  చేయటం  జరిగింది.


 ........................
  భూమిపైన  జీవుల   పుట్టుక  కంటే  ముందే    సూర్యచంద్రులు,   గాలి, నీరు ,   వాతావరణం,    భూమికి  గురుత్వాకర్షణ  శక్తి  .....వంటివన్నీ  ఉన్నాయి.  

మనిషి  కన్నా  ముందే  ఇవన్నీ  ఏర్పాటు  చేయబడి  ఉన్నాయి  అంటే ,   ఎంతో  గొప్ప  ఆలోచనాశక్తి  గల  శక్తి  ఎప్పుడూ   ఉన్నట్లు  స్పష్టంగా  తెలుస్తోంది.    ఇవన్నీ  జీవులకోసం  అమర్చిన  ఆ  శక్తినే  ఆస్తికులు  దైవం  అంటారు. 

 ఇవన్నీ  గమనిస్తే  సృష్టికి   కర్త    దైవం .... అని  స్పష్టంగా  తెలుస్తోంది.


  ఇక, ఆదిఅంతము  లేని  దైవం ,వంటి  విషయాల  గురించి  జగన్మాతాపితరులైన  పరమాత్మ ఆదిపరాశక్తికే  తెలుస్తాయి. 


 జగన్మాతా  పితరులైన   పరమాత్మ ఆదిపరాశక్తికి   అనేక  వందనములు.

వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.




1 comment:

  1. అచ్చు తెలుగు పుస్తకాల గురించి తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలండి.

    ReplyDelete