koodali

Monday, December 11, 2017

ఆచారవ్యవహారాలు ...మరి కొన్ని విషయములు...



ప్రజల మంచికోసం  ప్రాచీనులు  ఎన్నో చక్కటి ఆచారవ్యవహారాలను  తెలియజేసారు.

అయితే , ఆధునిక కాలంలో కొందరు ఆచారవ్యవహారాలను కొత్తగా మార్చుకుంటూ , తమకుతామే మోయలేనంతగా నెత్తిన వేసుకుని విసుగు తెచ్చుకుంటున్నారు.



ఆధునిక కాలపు పరిస్థితులను ఊహించిన పూర్వీకులు ఎన్నో విషయాలను తెలియజేసారు. 

ఉదా..కలికాలంలో కేవలం దైవనామాన్ని స్మరిస్తే చాలు ..గొప్ప ఫలితం లభిస్తుందని  కూడా  సడలింపులను తెలియజేయటం జరిగింది.


**************

ఆచారవ్యవహారాలలో ఏమైనా పొరపాట్లు వస్తే కష్టాలు వచ్చే అవకాశముందని కొందరు చెప్తుంటారు. ఇవన్నీ వింటుంటే భయంగా ఉంటుంది.

ఇలాంటప్పుడు దైవంపై ధ్యాస కన్నా ...ఆచారవ్యవహారాలను పాటించటానికి ఎక్కువ దృష్టి పెట్టవల్సి వస్తుంది.


ఆచారవ్యవహారాలను పాటించటం అవసరమే కానీ , దైవంపై ధ్యాస ఎంతో ముఖ్యం కదా!

మూఢత్వం పెంచే విధంగా కాకుండా,  విచక్షణతో  పాటిస్తూ.. దైవం పై ధ్యాస పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలన్నది నా అభిప్రాయం.


  ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించాలనుకుంటూ  విసుగు వచ్చేలా చేసుకోవటం కాకుండా..తమశక్తికి తగినంతలో  పూజలు చేయవచ్చు.

***************

 పెద్దలు తెలియజేసిన ఒక కధ...

ఒక భక్తుడు భక్తి పారవశ్యంలో పూజ చేస్తూ దైవానికి అరటిపండ్లను నివేదించబోయి, భక్తి పారవశ్యంలో అరటిపండ్లను ప్రక్కన పడవేసి వాటి తొక్కలు తీసి దైవానికి నివేదిస్తారు. 



ఆ భక్తుని భక్తికి మెచ్చిన దైవం అతనికి దర్శనాన్ని అనుగ్రహించారని అంటారు.

 తరువాత కొంతసేపటికి భక్తుడు తాను చేసిన పొరపాటు తెలుసుకుని.. 


ఈ సారి  పొరపాటు రాకుండా పూజ చేయాలనే తాపత్రయంలో భక్తి కన్నా, పూజను చేసే విధానంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించగా ఈసారి దైవం ప్రత్యక్షం కాలేదట.

 ఈ కధ ద్వారా ఏం తెలుస్తుందంటే,  పూజా విధానాలను, ఆచారవ్యవహారాలను చక్కగా పాటించటం మంచిదే కానీ, దైవంపై భక్తి అన్నింటికన్నా ముఖ్యం..  అని గ్రహించాలి.


శక్తి ఉన్నవారు ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించుకోవచ్చు. 


అంత ఓపిక లేనివారు తమకు వీలున్నంతలో పాటించుకోవచ్చు. ఎవరి శక్తిని బట్టి వారు దైవప్రార్ధన చేసుకోవచ్చు. 


1 comment:


  1. గతంలో చేసిన పాపకర్మల వల్ల వర్తమానంలో కష్టాలు వచ్చే అవకాశం ఉంది.

    కొన్ని ప్రక్రియల ద్వారా గత పాపకర్మను తగ్గించుకోవడానికి పెద్దలు కొన్ని పరిహారాలను తెలియజేసారు. పరిహార క్రియలు కొన్ని కష్టంగా అనిపించవచ్చు.

    మరి పాపాలు చేసినప్పుడు , చేసిన పాపాలు తొలగాలంటే కొంత కష్టపడక తప్పదు కదా !
    **************

    ధర్మబద్ధంగా జీవించేవారు దైవానికి ఇష్టులవుతారు. దైవభక్తి, సత్ప్రవర్తన ఉన్నప్పుడు దైవకృపకు పాత్రులవుతారు.

    సరైన దారిలో నడిచే శక్తినిమ్మని దైవాన్ని ప్రార్ధించాలి.

    ReplyDelete