koodali

Wednesday, December 20, 2017

మంచి భవిష్యత్తు అంటే....మరియు..

ఈ రోజుల్లో చాలామంది  తల్లితండ్రి  ఏమంటున్నారంటే, 

 పిల్లలకు  మంచి భవిష్యత్తు కోసమే మేం బోలెడు  డబ్బు సంపాదిస్తున్నాం.. వాళ్లను చిన్నతనం నుంచి బాగా చదివిస్తున్నాం.. అంటారు. 

మంచి భవిష్యత్తు అంటే ఏమిటి?  


చిన్నతనంలో  ఉదయం నుంచి రాత్రి వరకూ బండ చదువులు ..తరువాత ఉద్యోగం కోసం ఎదురుచూపులు..

ఉద్యోగంలో టార్గెట్లతో అలసట.. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ? ఎప్పుడు పోతుందో ? తెలియక టెన్షన్.. 


పెద్ద వయస్సులో జబ్బులతో పోరాటం.. ఇదేనా  మంచి భవిష్యత్తు అంటే?

 పిల్లలకు చిన్నతనంలో ఆటపాటలు లేవు. పెద్దయిన తరువాత సాయంకాలం తీరికగా గడపటమూ  లేదు, ఎప్పుడూ బిజీబిజీ ..


 మళ్ళీ పనిచేయటం కొరకు..కొంత విశ్రాంతి ..ఇలాంటి జీవితం కోసమా అంత ఆరాటం?

 ఇలాంటి జీవితాల వల్లే కుటుంబాలలో భార్యాభర్త మధ్య గొడవలు వస్తున్నాయి. 


పిల్లలు తమ బాధలు పట్టించుకునే వారు లేక మత్తుమందులకు అలవాటు పడటం, ఆత్మహత్యలు వంటి వాటికి పాల్పడుతున్నారు.

జీవితంలో ఏదైనా సాధించాలంటే కొంత శ్రమపడాలి. 


అయితే, ఆ శ్రమ మరీ ఎక్కువయితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. 

ఉదా..శిల శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు పడాలని చెబుతారు....  అయితే, శిల్పాన్ని చెక్కేటప్పుడు  సున్నితంగా, జాగ్రత్తగా చెక్కాలి. 


 బండగా ఉలి దెబ్బలు పడితే శిల రూపు మారి, శిల్పం ఆకారం చెడిపోయే ప్రమాదం ఉంది.


చెక్కతో  బొమ్మ చేయాలన్నా సున్నితంగానే చెక్కాల...బండగా కత్తి గాటు పడితే చెక్క బొమ్మ విరిగిపోయే ప్రమాదం ఉంది. 


జీవితంలో పైకి రావాలంటూ పిల్లల్ని  చిన్నతనం నుంచే  విపరీతమైన శ్రమకు గురిచేస్తే,  పిల్లల శారీరిక,  మానసిక ఆరోగ్య పరిస్థితి దెబ్బతినే ప్రమాదమూ ఉంది. 


పిల్లలు జీవితంలో ఉన్నతస్థితికి రావాలంటే  వారికి  ఒక పద్దతి ప్రకారం చక్కగా నేర్పించాలి.


అంతేకాని, బండగా, విపరీతంగా కష్టపెట్టినంత మాత్రానా ఉన్నతస్థితికి వస్తారనుకోవటం సరైనది కాదు.


*************
చక్కగా జీవించడానికి బోలెడు డబ్బు అవసరం లేదు. 

 అంతులేని కోరికలు, అత్యాశ..వంటివి  తగ్గించుకుంటే  సమాజం బాగుంటుంది. 

అత్యాశ వంటివి లేనప్పుడు  అధికధరలు, సంపద కొందరి దగ్గరే ప్రోగుపడటం వంటివి తగ్గుతాయి. అప్పుడు ఆర్ధిక అసమానతలూ తగ్గుతాయి. 


ఈ రోజుల్లో వస్తువ్యామోహం బాగా పెరిగింది.  


 కొత్త వస్తువులను  సంపాదించటం కొరకు విపరీతంగా కష్టపడుతున్నారు. జీవితం అంతా ధారపోస్తున్నారు.

మోక్షాన్ని పొందటం కోసం కొంత కష్టపడ్డారంటే అర్ధం ఉంది.

 అశాశ్వతమైన  వస్తువులు  వంటి  వాటికోసం  జీవితమంతా విపరీతంగా  కష్టపడటం మాత్రం అవివేకం.


*************
మరి కొన్ని విషయాలు ....  

ఎవరైనా క్రూరమైన పనులు చేస్తే అలాంటివాళ్ళకు కఠినమైన శిక్షలు పడాలని అనిపిస్తుంది. 

అయితే ఎవరైనా పాపాలు చేస్తే వాళ్ళకు శిక్షలు పడాలని అనుకోవటం కన్నా, వాళ్ళకు చెడు బుద్ది పోయి మంచి బుద్ధి కలగాలని కోరుకోవటం మరింత బాగుంటుంది..ఎందుకంటే,పాపాలు చేసినవాళ్లు శిక్షలు అనుభవించేటప్పుడు వాళ్ళు కూడా బాధపడతారు కదా!

అయితే, సమాజంలో కఠినశిక్షలు లేకపోతే ప్రజలకు భయమనేది లేకుండా పోతుంది. అప్పుడు ప్రజలు ఎక్కువగా పాపాలు చేసే అవకాశముంది.

 ఇవన్నీ గమనిస్తే, సామాన్య పాపాలు చేసేవారికి సామాన్య శిక్షలు ఉంటాయి. 

ఇక, క్రూరమైనపాపాలు  చేసిన వారి విషయంలో కఠినశిక్షలు విధించే విషయాన్ని దైవం చూసుకుంటారు.

అందరికీ సద్భుద్ది కలగాలని కోరుకోవటం మంచిది. 

ఇతరులను హింసించేవారికి కఠిన శిక్షలు పడకుండా, వారి బుద్ధి మంచిగా మారాలని కోరుకోవటం కొన్నిసార్లు అంత తేలికైన పనికాదు.

 అయినా, ఎవరికి.. ఎప్పుడు.. ఏమివ్వాలో.. దైవానికి తెలుసు.




No comments:

Post a Comment