ఈ రోజుల్లో స్త్రీపురుష సంబంధాల విషయంలో ఏవేవో జరుగుతున్నాయి.
కొందరు ఏమంటున్నారంటే, పురుషులు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నప్పుడు స్త్రీలు తిరిగితే తప్పేమిటని ? ప్రశ్నిస్తున్నారు.
అయితే, అక్రమ సంబంధాల వల్ల అందరికీ కష్టాలు వస్తాయని ఇలా మాట్లాడే వారికి తెలియదా?
ఈ రోజుల్లో , స్త్రీపురుషులు కలసిమెలసి తిరిగే పరిస్థితి వల్ల.. కొందరిలో అక్రమసంబంధాలు, వివాహేతర సంబంధాలు ఎక్కువయ్యాయి.
భార్యాభర్త కలసి ఉండే సమయం కన్నా, పరాయివాళ్ళు కలసి ఉండే సమయం ఎక్కువయ్యింది. ఈ పరిస్థితి చాలా కుటుంబాల్లో కల్లోలాలను కలిగిస్తోంది.
........................................
ఈ రోజుల్లో కొందరు స్త్రీలు, పురుషులు స్వేచ్చగా కలిసి జీవించటాన్ని ఇష్టపడుతున్నారు.
అంటే ఇక్కడ చెబుతున్నది.. జీవితాంతం కలిసి జీవించటం కాకుండా, సహజీవనం అంటూ.. ఇష్టం ఉన్నంతవరకు మాత్రమే కలిసి జీవించటం ...ఇష్టం పోయినప్పుడు ఎవరికి వారు విడిపోవటమనే పద్దతి.
మరి పెద్దవాళ్లు తమ ఇష్టం వచ్చినప్పుడు విడిపోయినప్పుడు, వాళ్ళకు జన్మించిన సంతానం సంగతేమిటి ?
బాధ్యతలు వద్దంటూ వివాహబంధానికే కట్టుబడని వాళ్లు .. సంతానం యొక్క బాధ్యతను తీసుకుంటారా ? తీసుకోరా?
సంతానాన్ని రోడ్దుమీదో లేక అనాధశరణాయంలోనో వదిలివెళ్లిపోతే ఆ పిల్లల కష్టాలకు ఎవరు బాధ్యులు ?
కుటుంబ సంబంధాలు లేని ఇలాంటి జీవనవిధానం నాగరికత అవుతుందా ? స్వేచ్చ అంటే ఇదేనా ?
పెద్దవాళ్లే వివాహేతర సంబంధాలంటూ మాట్లాడుతుంటే ఇక పిల్లలకు ఏం విలువలను నేర్పుతారు ?
.....................
స్త్రీలు బాధలు పడటంలో కొందరు మగవారి పాత్ర ఉన్నట్లే .... స్త్రీల బాధలకు కొందరు స్త్రీలు కూడా కారణమే.
కోడలిపై కిరోసిన్ పోసే అత్త స్త్రీనే కదా !
కాళ్ళు చేతులు పనిచేయని అత్తను కాలువ ప్రక్కన పడేసిన కోడలు స్త్రీనే కదా !
వివాహితుడైన పురుషుని వెంటపడి అతని భార్య, పిల్లల కష్టాలకు కారణమయ్యే స్త్రీ ....స్త్రీనే కదా !
***********
కొందరు ఏమంటారంటే, స్త్రీలను గౌరవించాలని అబ్బాయిలకు నేర్పండి అంటున్నారు.
పిల్లలను పెంచే విషయంలో తండ్రుల కన్నా తల్లుల పాత్రే ఎక్కువ.
తల్లులు పిల్లలను పెంచేటప్పుడు.... మగపిల్లలకు స్త్రీల పట్ల గౌరవం ఉండే విధంగా ...
ఆడపిల్లలకు పురుషుల పట్ల గౌరవం ఉండే విధంగా పెంచవచ్చు కదా! అలా పెంచితే చాలా సమస్యలు తగ్గుతాయి.
***********************
ఇంకొక విషయం ఏమిటంటే,
కొందరు తమకు వయస్సు పైబడిన తరువాత, తమ జీవితభాగస్వామి మరణించిన తరువాత..ఒంటరితనం భరించలేక తోడుకోసం అని మళ్ళీ వివాహం చేసుకోవటం జరుగుతోంది. ఇలా వృద్ధులకు వివాహాలు చేయడానికి ప్రత్యేకంగా కొన్ని సంస్థలు కూడా వెలిసాయి.
నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే, కొంతకాలానికి వాళ్ళల్లో ఒకరు చనిపోతే ఏం చేస్తారు? అప్పుడు జీవించి ఉన్నవాళ్ళు మళ్ళీ ఒంటరి వాళ్ళే కదా!
చనిపోయేవరకూ మళ్లీమళ్ళీ వివాహాలు చేసుకుంటూనే ఉంటారా?
మలివయస్సులో మళ్ళీపెళ్ళి వల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశముంది.
మలివయస్సులో మళ్ళీపెళ్ళి వల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశముంది.
No comments:
Post a Comment