koodali

Friday, April 7, 2017

ముహూర్తములు..కొన్ని విషయములు.మూడవభాగము..


ఇంకో విషయము  ఏమిటంటే, హిందువులు కాలాన్ని సూర్యోదయం నుంచి లెక్కిస్తారంటారు.

ఉదా..సూర్యోదయం నుండి మరుసటి రోజు అని చెబుతారు.
గౌరీ పంచాంగం, రాహుకాలం, యమగండం..మొదలైనవి సూర్యోదయం నుండి లెక్కిస్తారనుకుంటున్నాను.( నాకు తెలిసినంతలో..)

 అయితే, కొన్ని పంచాంగములలో ..రజస్వల ..మొదలైన సందర్భాలలో రాత్రి ఆఖరి జాము సమయాన్ని మరుసటి దినం అని లెక్కిస్తారనుకుంటున్నాను.

ఉదా..రాత్రి వేళ నిర్ణయం..రాత్రి రజస్వల అయినచో రాత్రిని మూడుభాగములు చేసి, రెండు భాగముల కాలము పూర్వ దినము, మూడవ భాగకాలము పరదినమునకు చెందును.అని వ్రాసారు.

ఇలాంటప్పుడు, కొన్ని సందర్భాలలో సూర్యోదయం నుంచీ రోజు ప్రారంభమవటం, కొన్ని సందర్భాలలో సూర్యోదయానికి ముందే మరుసటి రోజు ప్రారంభమవటం అని ఉంటుందా ? అనేది తెలియటం లేదు.

***************

 సూర్యోదయం విషయంలో.. ఉషః కాలం, అరుణోదయకాలం, ప్రాతః కాలం..అని చెబుతారు కదా!

మరి అరుణోదయకాలం అంటే సూర్యకాంతి కనిపిస్తుందని అర్ధమా? అలాంటప్పుడు అప్పటినుంచే మరుసటి రోజు లెక్క వేసుకోవచ్చా?

ఒకవేళ  సూర్యోదయానికి ముందే మరుసటి రోజు ప్రారంభమయినట్లు లెక్క వేస్తే, గౌరీ పంచాంగంలో ముహూర్తములు సూర్యోదయానికి ముందే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.అలా లెక్క వేసుకోవచ్చా?లేక 

 గౌరీ పంచాంగం సూర్యోదయం నుంచే లెక్క వేసుకోవాలా?
***************

 ఇవన్నీ గమనిస్తే,  కొన్ని సందర్భాలలో సూర్యోదయం నుంచీ రోజు ప్రారంభమవటం, కొన్ని సందర్భాలలో సూర్యోదయానికి ముందే మరుసటి రోజు ప్రారంభమవటం అని ఉంటుందా ? అనేది తెలియటం లేదు.

గౌరీ పంచాంగం  చూస్తే తెలుగు కు.. తమిళ్ కు..కొన్ని దగ్గర  తేడాలున్నట్లు నాకు అనిపించింది.ఈ విషయం అర్ధం కావట్లేదు.


1 comment:


  1. వివాహపొంతనాల విషయాలను గమనించితే, నాకు కొన్ని సందేహాలు కలిగాయి.

    ఈ మధ్య మాట్రిమొని గమనించితే, అందులో చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు వివాహాలు జరగక చాలాకాలంగా అలాగే ఉంటున్నట్లు తెలుస్తోంది.. ఇందుకు అనేక కారణాలుండవచ్చు.

    వధూవరులు ఒకరికొకరు నచ్చకపోవటం, ఆర్ధిక పరిస్థితి, ఉద్యోగం..ఇలా ఎన్నో కారణాలుంటాయి.

    అయితే, ఈ మధ్య జాతకాలు కలవటం.. అనే విషయాన్ని కూడా అందరూ బాగా పట్టించుకుంటున్నారట. సంబంధం అన్నీ నచ్చినప్పుడు కూడా నక్షత్రం కలవలేదని సంబంధం వదులుకుంటున్న సందర్భాలూ ఉంటున్నాయి.

    అయితే, జాతకాలు కుదరకపోతే జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు వస్తాయని చెబున్నారు. అవి వింటే భయం కలుగుతుంది. ఇందువల్ల, జాతకాల గురించి పండితులను సంప్రదించటం మంచిది.

    ***********

    కొందరు ఏమంటారంటే ..పాతకాలంలో జాతకాలు చూడకుండా వివాహం చేసుకున్నా కూడా బాగానే ఉండేవారు ... ఈ మధ్యకాలంలో జాతకాలు కలిసాయని వివాహాలు చేసుకున్నవాళ్లు మాత్రం అందరూ బాగుంటున్నారా ? అంటూన్నారు.

    జాతకాలు కుదిరాయని వివాహం చేసుకున్న తరువాత దంపతుల మధ్య గొడవలు రావటానికి అనేక కారణాలుండవచ్చు.

    జన్మించిన సమయం సరిగ్గా చూసిఉండకపోవచ్చు, జాతకం చూడటంలో పొరపాటు వచ్చిఉండవచ్చు, పెద్ద గండాలు లేకుండా చిన్న కష్టాలు వచ్చినా అవే పెద్ద కష్టాలు అనుకోవటం కావచ్చు, వర్తమానంలో తెలిసి తెలియక చేస్తున్న పాపాల వల్ల కష్టాలు రావచ్చు..ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి.

    జాతక విజ్ఞానాన్ని తప్పు పట్టటం సరైనది కాదు.. ఆ విజ్ఞానాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలి.

    **********
    నాకు కలిగిన కొన్ని సందేహాలు.... ఒక కాలెండర్లో, ఒక పంచాంగంలో..ఒకే నక్షత్రం యొక్క సమయం విషయంలో..గంట సమయం తేడా ఉండటం గమనించి నాకు ఆశ్చర్యం కలిగింది.

    సమయం విషయంలో ఇంత తేడా ఉంటే ..ఈ గంట మధ్యలో జన్మించిన పిల్లలు ఏ నక్షత్రంలో జన్మించినట్లు ?

    గంట సమయం తేడా ఉంటే.. జాతకం లో మార్పులు ఉండే అవకాశం ఉంది..ఇలాంటప్పుడు, ఈ పిల్లలకు భవిష్యత్తులో వివాహపొంతన విషయంలోనూ తేడాలు వస్తాయి.


    కాలెండర్, పంచాంగం .. రాష్ట్రంలోని వేరువేరు ప్రదేశాలలో ప్రింట్ వేసినా కూడా ఒకే రాష్ట్రంలో గంట సమయం తేడా ఉండదు కదా? మరి ఎందుకు ఇలా జరిగిందో అర్ధం కాదు.

    *************
    ఇంకో విషయం..

    ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జాతకాలను పట్టుకుని ఇద్దరు పండితుల వద్దకు వెళ్తే.. ఒకరు అబ్బాయి అబ్బాయి జాతకాలు కలవలేదని చెప్తే..ఇంకొక పండితులు అమ్మాయి అబ్బాయి జాతకాలు కలిసాయి, వివాహం చేసుకోవచ్చని అన్నారు. ఇలాంటప్పుడు ఏం చేయాలో అర్ధం కాదు.

    ఇవన్నీ గమనిస్తే ఏమనిపిస్తుందంటే, వివాహపొంతన విషయంలో మరీ పట్టింపులకు పోకుండా దైవాన్ని ప్రార్ధించుకుని సంబంధం
    నచ్చితే ముందుకువెళ్ళటం మంచిదనిపిస్తుంది.

    ***************

    కొందరు మధ్యవర్తులు ఏమంటున్నారంటే, ఇంతకుముందు మేము చకచకా చాలా వివాహాలు కుదిర్చేవాళ్ళం..ఇప్పుడు జాతకాల విషయంలో విపరీతమైన పట్టింపు వల్ల కూడా వివాహాలు కుదర్చాలంటే చాలా కష్టంగా ఉందంటున్నారు.

    ఈ రోజుల్లో అసలే చదువుల వల్ల పిల్లలకు వివాహాలు ఆలస్యమవుతున్నాయి. ఇంకా తాత్సారం చేస్తే సంతానం కలగటం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది.

    ప్రతి విషయానికి విపరీతమైన సందేహాలతో హిందువులు ప్రతిపనినీ వాయిదా వేయటం సరైనది కాదు.

    ముఖ్యంగా దైవభక్తి, ధర్మబద్ధమైన జీవితం ఉండాలని కోరుకోండి.

    ReplyDelete