చాలామంది జీవితంలో ముందు ఏం జరుగుతుందోనని ఉత్సుకతతో జాతకాలను చూపించుకుంటారు. జాతకం మంచిగా ఉంటే సంతోషాన్ని , ఏమైనా తేడాగా ఉంటే బాధను పొందుతారు.
( ఈ రోజుల్లో జాతకాలు చెప్పటం సరిగ్గా తెలిసిన వారు అరుదుగా ఉన్నారు .)
ఆ జాతకమంతా పూర్వం తాను చేసిన మంచిచెడు కర్మల ఫలితమేనని తెలిసినా జీవితంలో చెడు జరగకూడదనే ప్రతివ్యక్తి కోరుకోవటం జరుగుతుంది.
*******************
రాసిపెట్టిఉన్నది ఎలాగూ తప్పనప్పుడు మనం ఏం చేయగలం ? అని చాలామంది నిరాశగా అనుకుంటారు. అలా భావించటం పొరపాటు.
దైవానుగ్రహాన్ని పొందగలిగితే భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉందని కొందరి చరిత్రల ద్వారా పెద్దలు తెలియజేసారు..
ఉదా..సతీ సావిత్రి చరిత్రలో సావిత్రి యమధర్మరాజును మెప్పించి , సత్యవంతుని ఆయుర్దాయాన్ని పెంచుకోవటమే కాకుండా ఎన్నో వరాలనూ పొందటం జరిగింది.
భక్త మార్కండేయుని చరిత్రను గమనించినా ..దైవానుగ్రహాన్ని పొందగలిగితే మంచి జరుగుతుందని తెలుస్తుంది.
*********
జాతకంలో చెడు సూచనలు కనిపించినప్పుడు బాధపడుతూ కూర్చోకుండా .. తమ చెడు ప్రవర్తనను మార్చుకుని, దైవప్రార్ధన, పుణ్యకార్యాలు చేయటం, సత్ప్రవర్తనతో మెలగటం, ఇలాంటివి చేయటం ద్వారా రాబోయే కష్టం చాలావరకూ తగ్గే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు.
పూర్వం ఎందరో ఇలా చేసి తమ జీవితాలను సరిదిద్దుకున్న సంఘటనలు గ్రంధాలలో కనిపిస్తాయి.
*************
ఈ రోజుల్లో కూడా ..జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనను కలిగిఉన్నప్పుడు , ప్రభుత్వం వారు , వారి శిక్షా కాలాన్ని తగ్గించి ముందే వదిలిపెట్టడం, ఒకోసారి శిక్షను రద్దు చేయటం జరుగుతోంది కదా!
************
భగవంతుడు ఎంతో దయామయుడు. చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపపడిన వారిని వారు తప్పక క్షమిస్తారు.
షిరిడి సాయిబాబా .. భక్తులు తమ జాతకాలలోని దోషాల గురించి భయపడినప్పుడు, వారిని భయపడవద్దనీ, ఆ జాతకాలను ప్రక్కన పెట్టి, తనపైన భారం వేయమని చెప్పిన సంఘటనలు జరిగాయి.
ఇంకా, శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము గ్రంధములో భీమాజీపాటీలు కధ వద్ద , షిరిడి సాయి భక్తుడు తన స్వప్నములో బాధలుపడటం ద్వారా... సాయి అతని జబ్బును పోగొట్టడం గురించి తెలుసుకోవచ్చు.
(.గతజన్మలోని పాపకర్మల ఫలితముగా జబ్బు రాగా దానిలో జోక్యము కలుగజేసికొనుటకు బాబా యిష్టపడకుండెను.కాని రోగి తనకు వేరే దిక్కులేదనియు, నందుచే చివరకు వారి పాదముల నాశ్రయించితిననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. వెంటనే బాబా హృదయము కరిగెను. భక్తుడు స్వప్నములో బాధలుపడటం .. సాయి అతని జబ్బును పోగొట్టడం జరుగుతుంది.)
ఎందరో పూజ్యులు.. తమను ఆశ్రయించిన భక్తులను వారి పూర్వకర్మ ఫలితాలనుండి రక్షించిన సంఘటనలు గ్రంధాలలో చెప్పబడ్డాయి.
**************
కొందరు ఎంత మంచిగా జీవిస్తున్నా వారి జీవితం కష్టాలమయంగానే ఉంటుంది. అంటే.. వారు క్రితం జన్మలో అంత ఎక్కువ తప్పులు చేసారని అర్ధం చేసుకోవాలి.( ఇలా కాకుండా మనకు తెలియని ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.)
అలాంటివారు ఈ జన్మలో ఎంతో శ్రమకు ఓర్చి నియమనిష్టలు కలిగిఉండటం, దానధర్మాలు చేయటం ద్వారా ఆ కష్టాలనుంచీ బైట పడగలరు.
****************
దైవం ఎన్నో జీవులకు ఇవ్వని తెలివితేటలను మానవులకు ఇచ్చారు. అయితే, ఎన్నో జీవులు లోకానికి ఉపయోగపడుతుండగా , మనుషులు మాత్రం దైవానికి ఇష్టం లేని అధర్మమైన పనులు చేస్తూ.. సమాజానికి సమస్యగా తయారవుతున్నారు. ఇలా ప్రవర్తించటం సరైనది కాదు.
**********
* ఏ జాతకాలూ తెలుసుకోకపోయినా చెడుపనులకు దూరంగా ఉంటూ, సత్ప్రవర్తనను కలిగిఉండి దైవంపైన భారం వేసి జీవించే వ్యక్తికి దైవమే సరియైన దారిని చూపిస్తారు.
No comments:
Post a Comment