koodali

Monday, April 24, 2017

జీవుల మంచి కోసమే...


 
 ప్రాచీన కాలంలో జరిగినట్లుగా అనేక కధలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రాచీనులు తెలియజేసినవి కాకపోవచ్చు. కాలక్రమంలో గ్రంధాలలో వచ్చి చేరి ఉండవచ్చు. ఏవి నిజమో? ఏవి కల్పితాలో? భగవంతునికే తెలియాలి.

 ఒకప్పుడు శివుడు శనిదేవుని ప్రభావానికి భయపడి శనైశ్చరునికి కంటబడకుండా ఉండటం కోసం మారువేషంలో దాక్కోవటం జరిగిందనే విధంగా కొన్ని కధలు ప్రచారంలో ఉన్నాయి.

 ఈ కధలు కల్పితం కావచ్చు, కల్పితం కాదనుకున్నా కూడా , ఈ కధలను కొన్ని కోణాలలో ఇలా కూడా భావించవచ్చు .

 శివుడు శనైశ్చరునకు గురువు. శివుడే శనైశ్చరునికి న్యాయాధిపతి పదవిని ఇచ్చారంటారు.

 తన గురువైన శివుడంటే శనైశ్చరునికి ఎంతో గౌరవం. శివుని కష్టపెట్టాలని శనైశ్చరుడు అనుకోవటం జరగదు.

 శనైశ్చరుని ప్రభావం గురించి భయపడి శివుడు మారువేషం ధరించటం అనే విధంగా ఉండదు.

 శివుని అంశ అయిన హనుమంతులవారు ఒకప్పుడు శనైశ్చరునికి సహాయం చేయటం వల్ల, శనివారం హనుమంతుని పూజించిన భక్తుల పట్ల శనైశ్చరుని దయ ఉంటుందని చెప్పినట్లు అంటారు.

 ఈ విషయాన్ని గమనిస్తే , శివుని అంశ అయిన హనుమంతుడు శనైశ్చరునికి సహాయం చేసినప్పుడు ....శివుడు శనైశ్చరుని ప్రభావం గురించి భయపడి మారువేషం ధరించటం అనే విధంగా ఉండదు.

 అయితే, శనైశ్చరుని ప్రభావం నుంచి శివుడు కూడా తప్పించుకోలేదు..అని చెబితే, ఆ భయం వల్ల ప్రజలు ఏలినాటి శని కాలంలోనైనా ధర్మబద్ధమైన పనులు చేసే అవకాశం ఉంది. అందువల్ల కూడా ఆ దైవలీల అలా జరిగి ఉండవచ్చు.


 కొందరు మనుషులు గతకాలంలో పాపాలు చేసి ,తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడుతూ.. ప్రస్తుత కాలంలో మంచి  పనులు చేస్తుంటారు. ఏలినాటి శని కాలంలో కలిగే కష్టాలకు భయపడేవాళ్ళలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు.


 అయితే, గతంలో తాము చేసిన పాపాలకు పడే శిక్ష గణనీయంగా తగ్గాలంటే.. ఏలినాటి శని అంటే విపరీతంగా భయపడటం తగ్గించుకుని .. శనైశ్చరుని, హనుమంతుని, ఇంకా వారికి తోచిన దేవతలను పూజిస్తూ, చెడ్డపనులు చేయటాన్ని మానటం, మంచిపనులు చేయటం..ద్వారా దైవకృప కొరకు ప్రయతించవచ్చు. వారి ప్రయత్నాన్ని బట్టి దైవకృపను పొందవచ్చు .

ఈ విధంగా కొంచెం దయ, కొంచెం కఠినత తో సమతుల్యత ఉండేటట్లుగా   పెద్దలు  విషయాలను తెలియజేసి ఉండవచ్చు.

 సామాన్యంగా ఏలినాటిశని జీవితంలో మూడుసార్లు వస్తుందంటారు.ఈ విషయాన్ని గమనిస్తే శనైశ్చరుని ప్రభావం వ్యక్తి జీవితంపై ఎక్కువగానే ఉంటుందనిపిస్తుంది.మంచి పనులు చేస్తే శనైశ్చరుని కృప కలుగుతుంది. 
...............

 శనైశ్చరుడు లోకాన్ని న్యాయబద్ధంగా నడిపించటానికి న్యాయమూర్తి పాత్ర నిర్వహిస్తారంటారు. ఇక్కడ కొన్ని విషయాలను చెప్పుకోవాలి.


 ప్రజలు అందరూ ధర్మబద్ధంగా ప్రవర్తించాలంటే దయగా ఉండటం తో పాటూ కొన్నిసార్లు కొంత కఠినంగా ఉండటమూ అవసరమే.

 లౌకిక జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటేనే కొన్ని కష్టాలు, కొన్ని త్యాగాలు అవసరమవుతాయి...

 .అలాంటప్పుడు మనిషి జీవితలక్ష్యమైన దైవాన్ని పొందటానికి కొంతయినా నియమాలు, కష్టాలు ఉంటాయి కదా!

 కొందరు ఏమనుకుంటారంటే, శనిదేవుడు ప్రజలను శిక్షిస్తారు అంటారు. అలా అనుకోవటం తప్పు.

 శనిదేవుడు న్యాయ పరిరక్షకుడు. కాబట్టి , ఎవరైనా పాపాలు చేస్తే వారికి తగ్గ శిక్షను విధించి, తద్వారా వారిని మంచి మార్గానికి తీసుకు వస్తారు.

 లోకంలో శిక్షలంటూ లేకపోతే ప్రజలలో పాపభీతి తగ్గిపోతుంది కదా ! న్యాయస్థానాలలో జడ్జీలు కూడా శిక్షలను విధిస్తారు .

 శనైశ్చరులు.. మనుషుల పరిస్థితిని బట్టి దయను, కొంత కఠినతను చూపిస్తూ మనుషులు జీవితంలో పూర్తిగా భోగాలలో మాత్రమే మునిగిపోకుండా,  జీవిత లక్ష్యమైన దైవాన్ని పొందాలని గుర్తు చేస్తూ,  మనుషులు సరైన మార్గంలోకి రావాలని హెచ్చరిస్తూ నడిపించే దైవము.

 పిల్లల పట్ల ప్రేమ ఉన్న తల్లిదండ్రులు, గురువులు కూడా , కొందరు పిల్లలు తప్పు దారిలో వెళ్తూ, ఎన్నిసార్లు హెచ్చరించినా విననప్పుడు పిల్లల మంచి కోసం పెద్దవాళ్ళు కొన్నిసార్లు కొంత కఠినంగా వ్యవహరించవలసి రావచ్చు.


 దైవం కూడా కొందరు జీవులను సరైన మార్గంలోకి తేవటానికి దయతో పాటూ కొన్నిసార్లు కొంత కఠినంగా ఉండవలసి రావచ్చు.అది జీవుల మంచి కోసమే.

 ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ వద్ద కూడ చూడగలరు.
 


No comments:

Post a Comment