koodali

Thursday, April 9, 2020

ఎవరూ ఆహార కొరతతో బాధపడకుండా...


మనదేశంలో ప్రభుత్వాలు ..లాక్ డౌన్ ప్రకటించటం మంచిదయింది. ఇంకా కొంతకాలం లాక్డౌన్ పొడిగించటం కూడా ఎంతో అవసరం.

అయితే, సడన్ గా లాక్డౌన్ చేయటం వల్ల.. కొందరు ప్రజలు తమ బంధువుల ఇళ్లకు వెళ్లి అక్కడే ఉండవలసిరావటం, పనివల్ల ఇతర ఊళ్లకు వెళ్లిన వాళ్లు సొంత ఉళ్ళకు రాలేకపోవటం వంటి వార్తలు వింటున్నాము.

కొందరు విద్యార్ధులు, ఉద్యోగస్తులు , వలసకార్మికులు కూడా సొంత ఉళ్ళకు గుంపులుగా ప్రయాణమయిన దృశ్యాలను చూశాం. 

అయితే, వాళ్ళను ఎక్కడికక్కడే ఆపి ప్రభుత్వాలే వారికి వసతి, ఆహారాన్ని అందించటం జరుగుతోంది.

అలా గుంపులుగా వచ్చినప్పుడు,  వారి మధ్య వైరస్ అంతగా వ్యాపించినట్లుగా వార్తలు వినలేదు. అంతా దైవం దయ.

ప్రభుత్వం, కొందరు ప్రజలు, సంస్థల వారు కూడా అన్నదానం నిర్వహిస్తున్నారు.

అయితే, ప్రభుతం అందిస్తున్న ఆహారశిబిరాల వద్దకు  అందరూ రాకపోవచ్చు. 

దూరంగా ఉన్నవారు ఆహార శిబిరాల వద్దకు రావాలన్నా కష్టమే.

 బయటకు వస్తే ఎందుకు బయటకు వచ్చారని అడుగుతారు కదా!

ఇలాంటిపరిస్థితిలో కొన్ని హోటల్స్ వారికి అనుమతినిచ్చి, ఫోన్ ద్వారా ఆహారం తెప్పించుకునే అవకాశముంటే బాగుంటుంది.(ఇలాంటి అవకాశం ఇచ్చారేమో నాకు తెలియదు.)

బాచిలర్స్లో తక్కువ ఆదాయం ఉండేవారు కూడా ఉంటారు కాబట్టి, తక్కువ ధరకు ఆహారం అందే విధంగా కూడా ఏర్పాటు చేయాలి.

ఇప్పుడు కొంతమందికి వాళ్ళు పనిచేసే సంస్థలు తగినంత జీతాలు కూడా ఇవ్వటం లేదని అంటున్నారు.

 ఎప్పుడు ఎవరికి జబ్బు వస్తుందో తెలియని ఈ సమయంలో కూడా డబ్బే సర్వస్వం.. అని బ్రతుకుతున్న  వారి గురించి కూడా వింటున్నాము.

ఉదా..పరిశ్రమల యజమానులు కొందరు తమ వద్ద పనిచేసే కార్మికులకు ఈ నెల జీతం ఇవ్వటం లేదట.  

ఒక్క నెల జీతం కార్మికులకు ఇస్తే యజమానుల సంపద అంతా తగ్గిపోతుందా? వారు వారివద్ద పనిచేసే కార్మికులే కదా!

ఉదా..కొందరు అద్దె ఇళ్ల యజమానులు  నెల అద్దె కట్టలేదని అద్దెకు ఉంటున్న వారిని ఇళ్లు ఖాళీ చేయమంటున్నారట. అద్దె కొరకు కొన్ని రోజులు  ఓపికపట్టవచ్చు  కదా?

*****************

ఇంతకాలంగా చాలామంది బాచిలర్స్ రోడ్ల ప్రక్కన బండ్ల  వద్ద  తక్కువ ధరకు లభించే ఆహారాన్ని తిని కడుపు నింపుకునే వారు. 

ప్రస్తుతం సడన్ గా ఎవరూ ఊహించని పరిస్థితి ఏర్పడి, లాక్ డౌన్ సందర్భంగా రోడ్ల ప్రక్కన బండ్లు లేవు కదా!

చాలామంది బాచిలర్స్ కు వంటచేయటం రాదు. గదిలో స్టవ్ కూడా ఉండదు.  వంట చేయటం తెలియక గదుల్లో పొయ్యి కూడా లేనివారికి ఆహారం ఎలా లభిస్తుంది ?

కొందరు బాచిలర్స్.. కామెంట్స్ ద్వారా ఏం తెలియజేస్తున్నారంటే.. 

తాము చదువు, ఉద్యోగాల వల్ల వేరే ప్రాంతాల్లో ఉన్నామని, ప్రస్తుతం తమ దగ్గర సరిపడినంత డబ్బు లేదని, తాము ఒకపూట తినీ మరొక పూట తినక చాలా కష్టాలు పడుతున్నామని, లాక్డౌన్ పొడిగించే ముందు కొంత సమయం బ్రేక్ ఇస్తే ..తమ సొంత ఊళ్ళకు వెళ్తామని అంటున్నారు.


లాక్ డౌన్ కు రెండురోజులు బ్రేక్ ఇస్తే బాగానే ఉంటుంది..

అయితే, లాక్ డౌన్ కు బ్రేక్ ఇస్తే, మళ్ళీ పెద్ద ఎత్తున జనం గుంపులుగా వెళ్తే ప్రమాదముంటుంది అనుకుంటే మాత్రం..  బ్రేక్ ఇవ్వకపోవటం మంచిది.

తప్పనిసరిగా ఊరు వెళ్ళవలసిన కొద్దిమందికి మాత్రం అనుమతి ఇవ్వవచ్చు. 

అయితే, ప్రయాణికులు పెద్ద ఎత్తున గ్రూపులుగా కాకుండా తగుమాత్రం దూరం పాటించి ప్రయాణించాలి.

బయటకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి , భోజనం లభించక ఇబ్బందులు పడుతున్న బాచిలర్స్ ప్రభుత్వానికి ఫోన్ ద్వారా తమ ఇబ్బందులను తెలిపి, ఆహారం లభించే విధంగా ప్రభుత్వాల నుండి సహాయాన్ని పొందవచ్చు.
 
 చాలామంది దినసరి కూలీలు వంటి వారికి  కూడా  ఇప్పుడు బయటకు వెళ్ళి పనిచేసి, ఆహారం సంపాదించుకునే పరిస్థితి లేదు . 

ఇప్పుడు ఎవరూ బయటకు రావద్దు అని ఆంక్షలు ఉన్న నేపధ్యంలో ... ఎవరూ ఆహార కొరతతో బాధపడకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యత.

బయటకు వెళ్ళకూడదనే ఆంక్షల నేపధ్యంలో (సుమారు ఒక నెల వరకూ ?)  ఆహారం లభించక ఇబ్బందులు పడుతున్నవారికి ప్రభుత్వాలు ఆహారాన్ని అందిస్తే, ఆంక్షల  తరువాత ఎవరి పని వారు చేసుకుని ఆహారాన్ని సంపాదించుకుంటారు.



1 comment:


  1. కొందరు జనాభానియంత్రణ పాటించరు.

    కోడలు శారీరికంగా బలహీనంగా ఉన్నా కూడా మగపిల్లవాడు పుట్టే వరకు సమంతాననియంత్రణ ఆపరేషన్ వద్దని కోడళ్ళను శాసించే అత్తలు, భార్యను శాసించే భర్తలు ఉన్నారు. అలా కూడా జనాభా పెరుగుతూ ఉంటుంది.

    జనాభాను పెంచటం అనేది ఎవరి ఇష్టానికి వారికి వదిలేయకూడదు. ఇది దేశం మొత్తం సమస్య. జనాభా విపరీతంగా పెరిగితే ఆహారకొరత, నిరుద్యోగం, నేరాల పెరుగుదల, అపరిశుభ్రత ..వంటి ఎన్నో సమస్యలుంటాయి.

    కొన్ని విదేశాల్లో ఎక్కువ భూమి.. తక్కువ జనాభా వల్ల ఆ దేశాలు పరిశుభ్రంగా ఉన్నాయి.. భారతదేశంలో ఉన్న భూమికి.. జనాభా చాలా ఎక్కువ వల్ల అపరిశుభ్రత వంటి ఎన్నో సమస్యలున్నాయి.

    ReplyDelete