koodali

Friday, April 17, 2020

లాక్ డౌన్ వల్ల.. ప్రజలకు తక్కువ డబ్బు ఖర్చు అవుతోంది. ..



బయటకు ఎక్కువదూరం వెళ్లట్లేదు కాబట్టి పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది. 

విందులు, వినోదాలు లేవు కాబట్టి ఆ ఖర్చు తగ్గింది.

 షాపింగ్ తగ్గింది కాబట్టి విపరీతంగా దుస్తులు, ఫాన్సీ వస్తువులు.. కొనేవారికి ఆ డబ్బు మిగిలింది.

 బయటకు వెళ్లి తినటం లేదు కాబట్టి హోటల్ బిల్లు తగ్గింది.  

ఆడవాళ్లు బ్యూటీపార్లర్లకు వెళ్లటం లేదు కాబట్టి ఆ విధంగా ఖర్చు తగ్గింది. 

మగవాళ్ళకేమో మందుపార్టీల వంటివి లేవు..

సినిమాలు, షికార్లు లేవు కాబట్టి  అలా ఖర్చు తగ్గింది.
ఇంకా చాలా ఖర్చులు తగ్గాయి.

************
ప్రజలకు విశ్రాంతి, వినోదం వంటివి కూడా అవసరమే.

 అయితే కొందరు ప్రజలు...  జీవితంలో నైతికవిలువలు, డబ్బు విషయంలో  పొదుపు వంటి విషయాలను వదిలి,  వీలున్నంతలో డబ్బు ఖర్చు పెట్టి జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే అభిప్రాయానికి వచ్చారు.

అవినీతికి పాల్పడైనా సరే డబ్బు సంపాదించి , ఖర్చుపెట్టడం చేస్తున్నారు.

దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా! పద్ధతిగా ఉన్నంతవరకు అంతా బాగుంటుంది. పద్ధతి తప్పితే కష్టాలు తప్పవు.

**********
గత 50 సంవత్సరాలలో ప్రజల జీవితవిధానంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. 

అప్పట్లో ఒక వ్యక్తి జీతం సుమారు 50 రూపాయలు కానీ 500 రూపాయలు గానీ ఉంటే ...కిలో బియ్యం 5 రూపాయలు ఉండేవి.


ఇప్పుడు జీతాలు 5,000 వేలు గానీ 50,000 వేలు గానీ ఉంటే కిలో బియ్యం 50 రూపాయలు ఉన్నాయి. 


డబ్బు విలువ తగ్గిపోతోంది. జీతాలు పెరిగితే ధరలు పెరుగుతున్నాయి.


 జీతాలు పెరగటానికి అవకాశం లేని వాళ్లు నిత్యావసరాలు కొనలేక ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. 

జీతాలు తగ్గాలి, ధరలు కూడా తగ్గాలి.


ప్రజలు జనాభా నియంత్రణ విధానాలు కూడా పాటించాలి.


చాలామంది ప్రజలు విలాసాలనే నిత్యావసరాలుగ మార్చుకుని బ్రతకటానికి అలవాటుపడ్దారు.

***********
యంత్రాలు వచ్చాక వస్తు వినియోగం బాగా పెరిగింది. 

ఇన్ని వస్తువులను తయారుచేయటానికి ఎన్నో ఖనిజాలు అవసరమవుతాయి. 

ఖనిజాలు భూమిలో తయారుకావటానికి వేల సంవత్సరాలు పడుతుందట. అందువల్ల ఖనిజసంపదను పొదుపుగా వాడుకోవాలి. 

పాతకాలంలో ఇప్పుడు వాడినంత ఎక్కువగా వస్తువుల వాడకం లేదు. ...  అయినా, అప్పటివాళ్ళు చక్కగా జీవించారు. 

ఇప్పుడు వస్తువినియోగం విపరీతంగా పెరిగింది...ఉపాధి కోసం అనీ, ఆర్ధిక వృద్ధిరేటు అనీ కర్మాగారాలలో ఎక్కువగా వస్తువులను తయారుచేస్తున్నారు. 

 విపరీతంగా ఖనిజాలను త్రవ్వేసి వస్తువులను తయారుచేసి వాడటం, వాతావరణ కాలుష్యం వంటి చర్యలు సరైనవి కావు. 

నైతికవిలువలతో జీవించటం, తక్కువ వస్తువులతో సరిపెట్టుకుని తృప్తిగా జీవించటం, పొదుపు వంటివి పాటించటం మంచిది.

అధర్మం చేసైనా సరే, డబ్బు సంపాదించి విలాసంగా జీవించాలనే పద్ధతి సరైనది కాదు.

*************
 ఒక్క వైరస్ తో ప్రపంచమంతా స్థంభించిపోయింది.

భవిష్యత్తులో మనుషులు తమ జీవనసరళిని సరైన విధంగా మార్చుకోవాలి. లేకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకోవటం ఉండదు.




3 comments:

  1. డబ్బునోట్ల ద్వారా కూడా అంటువ్యాపించే అవకాశముందని అంటున్నారు. కొందరు వేలికి ఉమ్మితడి చేసుకుని నోట్లు లెక్కపెడుతుంటారు.

    ఆ మధ్య మనదేశంలో ప్లాస్టిక్ నోట్లను చలామనిలోకి తెస్తామన్నారు. ఆ సంగతి ఏమయ్యిందో?


    ReplyDelete

  2. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత మనుషులు దూరం పాటిస్తూ పనులు చేసుకోవచ్చు. రోగనిరోధకశక్తి పెరిగేలా ఆహారాన్ని తీసుకోవాలి. సూర్యరశ్మిలో కొంతసేపు ఉందాలి.

    సినిమా ధియేటర్లు కొంతకాలం మూసివేయవచ్చు. బస్సులలో దూరంగా కూర్చోవాలి. బస్సు దిగిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.బస్సులో ఉన్నంతసేపు చేతులతో ముఖాన్ని ముట్టుకోకూడదు.

    బయటకు వెళ్ళినప్పుడు చేతులతో కళ్ళు నలపటం, ముక్కు తుడుచుకోవటం, గోళ్ళు కొరకటం వంటివి తగ్గించుకోవాలి. ఇలా కొన్ని విధానాలను పాటిస్తూ పనులను చేసుకోవచ్చు.

    ReplyDelete

  3. జనానికి జబ్బులు తగ్గితే వైద్యులు, మందుల కంపెనీ వాళ్ళు ఎలా బ్రతకాలి ? అని అనుకుంటే తప్పు.

    ప్లాస్టిక్ వల్ల కాలుష్యం పెరుగుతోంది కాబట్టి ప్లాస్టిక్ వాడద్దు అంటే..ప్లాస్టిక్ తయారీ ఆపేస్తే దానిపైన ఆధారపడే వేలాదిమంది ఎలా బ్రతకాలి ? అనుకుంటే తప్పు .

    ప్రపంచం పర్యావరణం ఏం అయిపోయినా పరవాలేదు...మనుషుల యొక్క ఆర్ధికపరిస్థితి ముఖ్యం అనుకుంటే తప్పు.

    బ్రతకటానికి ఆహారం, వసతి, విద్య, ఆరోగ్యం, రక్షణ..ఇలాంటివి ఉంటే చాలు చక్కగానే బ్రతకొచ్చు.

    అయితే, కొందరు మనుషులు తమ అవసరాలను విపరీతంగా పెంచేసుకోవటం వల్ల వారికి ఎక్కడి డబ్బులూ సరిపోవటం లేదు.

    ఆధునిక కాలపు పారిశ్రామిక విధానాలు లేకపోయినా పాతకాలంలో చక్కగానే బ్రతికారు.

    ప్రపంచం అంతా నాశనం అయిపోయినా పరవాలేదు...మనుషుల యొక్క ఆర్ధికపరిస్థితి ముఖ్యం అనుకుంటే తప్పు.

    పర్యావరణ కాలుష్యం వంటి వాటి వల్ల కరోనా వంటివి వస్తున్నాయి. అలాంటివి వస్తే ఎంతో ప్రాణ నష్టం, ఆర్ధిక నష్టం.

    మనుషులు జబ్బులతో బాధపడుతుంటే ఇక ఏం పనిచేస్తారు ? పని చేయలేనప్పుడు ఆర్ధికపరిస్థితి గురించి ఏం ఆలోచించాలి ?

    అందువల్ల ప్రజలకు ఇష్టం ఉన్నా.. లేకపోయినా .. ఇక మీదట పర్యావరణాన్ని పాడుచేయని విధంగా ఉపాధి కల్పించుకోవటాన్ని నేర్చుకోవాలి.

    అంతేకానీ, పర్యావరణాన్ని ధ్వంసం చేసుకుంటూ ముందుకువెళ్తామంటే ఇప్పుడు కరోనా తగ్గినా ఇంకో మరోనా రావచ్చు.

    ప్రకృతి ముందు మనుషుల శక్తి చాలా చాలా తక్కువ.

    ReplyDelete