koodali

Wednesday, April 15, 2020

ప్రజలు ఆందోళన చెందే విధంగా ...



 మీడియాలో ..  లాక్డౌన్ ఇలాగే ఉంటే రాబోయే కాలంలో ఆర్ధికపరిస్థితి  కృంగిపోయి ,  జనం ఉద్యోగాలు లేక ఊళ్ళమీద పడే పరిస్థితి వచ్చేస్తోందంటూ చెబుతున్నారు.


అసలే కరోనా భయంతో ఇంట్లో ఉండలేక, బయటకు వెళ్ళలేక నలిగిపోతున్న కొందరు జనాలకు  ఇవన్ని వింటే..  మరింత  ఆందోళన కలిగే  అవకాశముంది. 

వేరేదారిలేక తప్పనిసరి పరిస్థితిలో లాక్డౌన్ పెట్టారుకానీ, ఊరికే లాక్డౌన్ అనలేదు.

ఆర్ధికవ్యవస్థ దెబ్బతింటుందనే భయంతో లాక్ డౌన్ విధించడాన్ని ఆలస్యం చేసిన దేశంలో 
 ఆరోగ్య పరిస్థితి ఎలా విషమించిందో విన్నాం.

 అయినా , ఆర్ధికమాంద్యం అనేది ప్రపంచానికి ఇప్పుడు కొత్త కాదు, ఇప్పటికి చాలాసార్లు ఆర్ధికమాంద్యం వచ్చింది, మళ్ళీ కోలుకుంది ..మళ్లీ ఆర్ధిక మాంద్యం వస్తుంది...   మళ్ళీ కోలుకుంటుంది .

లాక్డౌన్ వల్ల పారిశ్రామికవేత్తల సంపద విలువ మరికొంత తగ్గవచ్చు, ప్రజలకు కొంత కష్టం కలగవచ్చు, అంతకుమించి పెద్ద ఉపద్రవాలేమీ రావు.

అదేపనిగా ఆర్ధికమాంద్యం అంటూ భయపడినా .. ఇప్పుటికిప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేదు. 

ఆగలేక అందరూ ఒకేసారి బయటకు వస్తే, కరోనా వేగంగా వ్యాపిస్తే ఏంటి గతి?

అయినా లాక్డౌన్ నెలలతరబడి ఏమీ ఉండదు కదా! కొన్ని రోజులు ఓపిక పడితే ..త్వరగా పరిస్థితి చక్కబడుతుంది.

ఆర్ధికపరిస్థితి గురించి నిపుణులు చర్చించటం అవసరమే కానీ, 

మీడియాలో విస్తృతంగా చర్చించటం వల్ల చూస్తున్న ప్రజలలో  కొందరు తమ భవిష్యత్తు  గురించి అధికంగా ఆందోళన చెందే అవకాశం ఉంది. 

ఉన్న పరిస్థితి గురించి ప్రజలకు కొంతవరకూ తెలియటం కూడా అవసరమే కానీ, మరీ భయపడేవిధంగా చెప్పవద్దు.

ఏమీ కాదు, అంతా సర్దుకుంటుంది. మనం కొంత  శ్రమపడితే ఆర్ధికమాంద్యం  నుంచి  తట్టుకోగలం .. అని ప్రజలకు భరోసా ఇవ్వాలి.

ఈ క్లిష్టసమయంలో ప్రభుత్వాలు, అధికారులు, ఎన్నో రంగాల ప్రజలు ఎంతో సహాయాన్ని అందిస్తున్నారు.

లాక్డౌన్ తరువాత త్వరలో  మళ్లీ ప్రజలు పనులు చేసుకుంటారు, మళ్ళీ పరిస్థితి మెరుగవుతుంది.


6 comments:

  1. పాతకాలంలో వ్యవసాయం, చేతివృత్తులు ఉన్న రోజుల్లో ఉపాధికోసం ఇంకొకరిపై ఆధారపడే అవసరం ఎక్కువగా ఉండేదికాదు. ఎవరి పని వారు చేసుకునేవారు. అప్పట్లో నిరుద్యోగ సమస్య అంతగా ఉండేది కాదు.

    ఇప్పటి యాంత్రికకాలంలో నిరుద్యోగ సమస్య బాగా ఉన్నది. ఉద్యోగం కావాలంటే ఇంకొరిని అడగాలి.వందలు, వేలకోట్ల సంపద ఉన్న పెట్టుబడిదారులు ఒకవైపు, ఉపాధి కోసం వారిపై ఆధారపడుతున్న ప్రజలు ఇంకొకవైపు ఉంటున్నారు.

    పాతకాలంలో యుద్ధం వచ్చినప్పుడో, నెలలతరబడి కరువు వచ్చినప్పుడో ఆర్ధికమాంద్యం వచ్చేది . ఆధునిక కాలంలో కొన్ని రోజులు లాక్డౌన్ చేస్తేనే ఆర్ధికమాంద్యం రావటం , ఆధునిక ఆర్ధికవ్యవస్థలోని డొల్లతనాన్ని సూచిస్తోంది.

    పరిశ్రమలు అవసరమే కానీ, సహజవనరులను, ప్రకృతిని, ప్రాణుల ఆరోగ్యాన్ని నాశనం చేసే స్థాయిలో పారిశ్రామీకరణ పెంచుకోకూడదు.

    ReplyDelete

  2. పాతకాలంలో ఇంత జనాభా ఉండేవారు కాదు. అప్పుడు ఎక్కువ యంత్రాలు ఉండేవి కావు కాబట్టి , వస్తువుల తయారీకి ఎక్కువ రోజులు పట్టేది.

    నిదానంగా వస్తువులు తయారుచేయటం వల్ల ఎక్కువకాలం పని ఉంటుంది. నిరుద్యోగ సమస్య కూడా అంతగా ఉండదు.సహజవనరుల వాడకం కూడా తగ్గుతుంది.

    ఇప్పుడు యంత్రాల వల్ల ఒక్క గంటలోనే ఎన్నో వస్తువులను తయారుచేస్తున్నారు.ఇప్పుడు కొందరు పారిశ్రామికవేత్తలు కార్మికులకు ఉద్యోగాలను ఇవ్వటం తగ్గించి, యంత్రాలను పెంచుకుని వస్తువులను తయారీకి ఇష్టపడుతున్నారు.

    ఇందువల్ల నిరుద్యోగసమస్య పెరుగుతుంది. యంత్రాలతో వేగంగా వస్తువులను తయారుచేయటం వల్ల సహజవనరులు కూడా వేగంగా తరిగిపోతాయి.

    ఇప్పుడు చాలామంది ఇళ్ళలో ఉండే వస్తువులలో వాడేవి తక్కువ. షాపింగ్ కు వెళ్లి కొని ఇంట్లో పడేస్తుంటారు. కొన్ని వస్తువులు ఫంక్షన్స్ కు వెళ్తే గిఫ్టులుగా ఇస్తుంటారు.
    ఎక్కువ వస్తువులను కొనటం వల్ల సహజవనరులు తగ్గిపోతాయి. అందువల్ల, అవసరమైన వస్తువులను మాత్రమే వాడాలి.


    ReplyDelete

  3. ఇలాంటి పరిస్థితిలో కూడా మనుషుల అత్యాశ ఏ మాత్రం తగ్గలేదు.

    ఉదా..కొందరు దళారులు రైతుల దగ్గర టమోటోలను 2 రూపాయలకు కొని బయట 15 రూపాయలపైన అమ్ముతున్నారు.

    అటు కష్టపడే రైతులూ నష్టపోతున్నారు..ఇటు వినియోగదారులూ నష్టపోతున్నారు.

    ReplyDelete

  4. ప్రజలకు ఉద్యోగాలు కల్పించటం కష్టమైన పనేమీ కాదు. వస్తువుల తయారీ మాత్రమే కాకుండా ప్రపంచంలో ఇంకా చాలా పనులున్నాయి.

    ఉదా.. రోడ్లపై ఎన్ని గుంటలున్నాయో చూసి పూడ్చటం, దేశంలో రహదార్ల ప్రక్కన, చెరువుల ప్రక్కన, ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ మొక్కలు నాటి అవి బాగా పెరిగేలా పెంచటం, ఇంకా ఉద్యోగాలు సృష్టించాలంటే ప్రతి ఒక్క మొక్కకు ఒక్కొక్క ఉద్యోగిని ఉద్యోగంలో నియమించవచ్చు.

    ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో పనులు ఉంటాయి. నిరుద్యోగ సమస్య ఎందుకుంటుంది ?

    ప్రభుత్వాలు దేశంలోని సహజవనరులను తన అధీనంలో ఉంచుకుని, ప్రభుత్వరంగ సంస్థలను సమర్ధవంతంగా నడిపించాలి. ఉద్యోగుల జీతాలను తగ్గించాలి. అలా వచ్చిన ఆదాయంతో మరెందరికో ఉపాధిని కల్పించవచ్చు.

    ధనవంతులు అదే పనిగా సంపదను ప్రోగుచేసుకోవటం మానేయాలి. పరిశ్రమల యజమానులు లాభాలలో తమ వాటాను తగ్గించుకుని, ఎక్కువమందికి ఉద్యోగాలివ్వాలి. ఉద్యోగస్తులు జీతాలను తగ్గించుకోవాలి.

    వ్యాపారస్తులు న్యాయమైన ధరకు వస్తువులను అమ్మాలి. జనాభా విపరీతంగా పెరగకూడదు.

    ఇవన్నీ జరిగితే సమాజంలో సంపద అందరికీ న్యాయంగా లభిస్తుంది. నిరుద్యోగ సమస్య ఉండదు. పేదరికం ఉండదు.

    ReplyDelete
  5. దైవం సృష్టిలో వాతావరణం, గాలి, నీరు, విత్తనాలు..మరెన్నో సృష్టించి ఇచ్చారు. వీటిలో మనుషులు సృష్టించినవేమీ లేవు.

    ఒక విత్తనం వేస్తే మొక్క వచ్చి పెరిగి మరెన్నో విత్తనాలు వస్తాయి. ఆహారం కొరత ఎందుకుంటుంది?

    దైవం అన్నీ సమకూర్చి ఇచ్చినా కూడా... ప్రపంచంలో కొందరు ఆహారం లేక చనిపోతున్నారంటే అందుకు కొందరు మనుషుల అత్యాశ, లోభం..వంటి కారణాల వల్ల మరియు కొందరు మనుషుల అసమర్ధత వల్ల.


    ReplyDelete

  6. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలలో కూడా నిరుద్యోగ సమస్య, ఆర్ధికమాంద్యం ఎప్పటి నుంచో ఉన్నాయి.

    ఈ విషయాలను గమనిస్తే, ఆధునిక ఆర్ధికవ్యవస్థ ధనవంతులను మరింత ధనవంతులుగా, పేదవారిని మరింత పేదవారుగా చేస్తున్నట్లు అనిపిస్తోంది.

    ReplyDelete