koodali

Wednesday, April 15, 2020

కరోనా వల్ల కొంత మంచి కూడా జరిగింది....


ఒక ప్రక్క కొరోనా వచ్చి పెద్ద పెద్దదేశాలే బెంబేలెత్తిపోతున్నాయి. అక్కడ కొందరు ధనవంతులు కూడా ఈ జబ్బు బారిన పడినట్లు వింటున్నాం.  

ఇలాంటి కష్టకాలంలో ఎందరో దాతలు పేదలకు ఆహారాన్ని అందిస్తున్నారు.

కొందరు దాతలు మూగజీవులైన జంతువులకు కూడా ఆహారాన్ని అందిస్తున్నారు.

కర్రోనా జబ్బు విదేశాల్లో తరహాలో పెరిగిపోతే .. అధిక జనాభా ఉన్న భారతదేశం తట్టుకోవటం కష్టం.

పరిస్థితి అదుపు తప్పితే పేదలు, ధనవంతులు అనే తేడా లేకుండా ఎవర్కైనా జబ్బు వచ్చే పరిస్థితి రావచ్చు.


 భారతదేశంలో  కేసులు బాగా పెరిగితే  వైద్య సిబ్బంది  కూడా సరిపోకపోవచ్చు.

కరోనా త్వరగా వ్యాప్తి చెందే  తరహా ఉన్న జబ్బు. దీని వివరాలు ఇంకా సరిగ్గా తెలియట్లేదు. అందువల్ల  కొంత ఓపికగా ఉండటం మంచిది.

 లాక్డౌన్ వల్ల కొందరు  పారిశ్రామికవేత్తల సంపద విలువ కొంత తగ్గిందట. 

లాక్డౌన్ వల్ల ఆర్ధికపరిస్థితి కొంత దెబ్బతినవచ్చు.. అయితే,  కరోనా రాక ముందు కూడా భారతదేశ ఆర్ధికపరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు కదా!


 దేశంలో కరోనా రాకముందు కూడా పేదరికం ఉంది. దీనిక కారణాలు ఎన్నో ఉన్నాయి. సంపద కొద్దిమంది వద్ద ప్రోగుబడిఉండటం, అధిక జనాభా..వంటి ఎన్నో కారణాలున్నాయి.


అధిక సంపద కొందరి వద్దే ప్రోగుపడకుండా  ప్రభుత్వాలు కఠినచర్యలు తీసుకోవాలి. టాక్సులు ఎగ్గొట్టేవారు, వారి సంతానం విదేశాలకు వెళ్ళకుండా కట్టడి చేయాలి.

 జనాభా విపరీతంగా పెరిగితే  ఆహారకొరత, ఉపాధి దొరకకపోవటం వంటి సమస్యలు వస్తాయి.ఇప్పటికే ఎందరో ప్రజలు విదేశాలకు వలసలు వెళ్తున్నారు. ప్రజలు కూడా ఇవన్నీ గమనించాలి.

అధిక జనాభా వల్ల కలిగే నష్టాల గురించి ప్రభుత్వాలు కూడా బాగా  ప్రచారం చేయాలి.


మనదేశంలో కావలసినంత సహజవనరులున్నాయి. అయినాకూడా కొన్నిసార్లు ఆహారధాన్యాలను కూడా దిగుమతి చేసుకోవటం జరిగింది.

మన దేశానికి అవసరమైన ఉత్పత్తులను, వస్తువులను మనమే తయారుచేసుకుంటే ఇక్కడి వారికి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. 

ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అయినా, ఆచరణలో సరిగ్గా అమలుకావటం లేదు.

  భారతదేశంలో కోట్లాదిరూపాయలు ఆస్తి ఉన్న వాళ్ళెందరో ఉన్నారు. వీరిలో చాలామంది విరాళాలు ఇస్తున్నారు. 

   ధనవంతులు అందరూ పేదవారికి సహాయం చేస్తే లాక్డౌన్ కష్టాలు చాలావరకూ తగ్గుతాయి.

ఈ కష్టకాలంలో పరిస్థితి అదుపు తప్పకుండా ఎందరో వ్యక్తులు ఎంతో కృషి చేస్తున్నారు.

***********

 అత్యవసర సర్వీసులు, వ్యవసాయం, సరుకుల రవాణా, తప్పనిసరిగా సొంత ఉళ్ళకు వెళ్ళవలసిన వారిని గుంపులుగా కాకుండా విడతల వారిగా పంపటం వంటివి చేయవచ్చు.

*************

 లాక్డౌన్ కొన్ని రోజులే కదా! ఈ కొద్దిరోజులకే ఎన్నో నగరాలలో గాలి శుభ్రపడిందంటున్నారు. వాతావరణకాలుష్యం తగ్గిందట.

 గంగానది నీరు తేటబడిందట. పక్షుల కిలాకిలారావాలు బాగా వినిపిస్తున్నాయి.


 స్వచ్చమైన వాతావరణం ఉండటం కూడా  గొప్ప సంపదే. ఇప్పుడు పరిశ్రమలు, వాహనాలు మూలన కూర్చున్నందువల్ల వాతావరణం బాగుపడింది. 

ఆశ్చర్యం ఏమిటంటే, ఏప్రిల్  లో  కూడా  ఎక్కువ వేడి అనిపించటం లేదు.

ఎండ ఉన్నా కూడా చెమట, వడగాలులు తగ్గాయి. విద్యుత్, ఏసీలు వంటివి వాడుతూనే ఉన్నాము.అయినా పర్యావరణం  చాలా మెరుగుపడింది.

కొన్ని రోజులు లాక్డౌన్ ఉంటే  పర్యావరణం బాగుపడుతుంది.

పర్యావరణం బాగుపడితే ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది.  రాబోయే అనారోగ్యాలు తగ్గుముఖంపడతాయి.

 ప్రజలు ఆరోగ్యం బాగుంటే ఎంతో డబ్బు ఆదా అవుతుంది.

 ఆ మధ్యన  డిల్లీ వంటి నగరాల్లో వాతావరణకాలుష్యం విపరీతంగా పెరిగి, ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలుష్యాన్ని తగ్గించలేకపోయారు.

పర్యావరణ కాలుష్యం వల్ల కాన్సర్ వంటి రోగాలూ పెరుగుతున్నాయి.


మన అంతులేని ఆర్ధిక అవసరాలకోసం ప్రకృతిని కలుషితం చేయటం వల్ల  కరోనా వంటి జబ్బులు వస్తున్నాయి.

ఇప్పటికైనా ప్రజలు మేల్కొని , పర్యావరణం కలుషితం కాని విధంగా జీవించటం నేర్చుకుంటేనే ప్రకృతి కాపాడుతుంది.

 లేకుంటే కరోనా వంటి వ్యాధులు మళ్ళీమళ్లీ రావచ్చు. అలా రాకుండా పద్ధతిగా జీవించాలి.



No comments:

Post a Comment