koodali

Wednesday, July 27, 2011

ఇలాంటి విషయాలలో మనకు తెలియని ఎన్నో అర్ధాలు దాగుంటాయి.



ఆదిపరాశక్తి అయిన పరమాత్మ విశ్వాన్ని సృష్టించారు.

ఈ విషయాలగురించి ఇప్పుడు నా బోటి సామాన్యులు అంతగా అర్ధం చేసుకోవటం కష్టం. అయితే నాకు తెలిసినంతలో చెప్పుకోవాలని..

సృష్టిలో , దేవతలు, మానవులు, పశుపక్ష్యాదులు , దానవులు, ఉన్నారు. దేవతలు, మానవులు, దానవులు,  వీరందరి ధర్మాలు, గుణాలలో భేదం ఉంటుంది.

విశ్వంలో ఎన్నో లోకాలున్నట్లు పెద్దలు తెలియజేసారు. "ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములో పెద్దలు ఎన్నో విషయాలను చెప్పటం జరిగింది.


శ్రీ యోగానంద గారి గురుదేవులైన శ్రీ యుక్తేశ్వర్ గారు తాము పరమపదించిన కొన్ని రోజుల తరువాత పునరుత్ధానం చెంది ఆయా లోకాల గురించి తమ శిష్యునికి చెప్పటం జరిగింది.

అందులో కొన్ని విషయములు........
"సూక్ష్మ శరీరులతో నిండిన సూక్ష్మ గ్రహాలు చాలా ఉన్నాయి."

అక్కడి వాళ్ళెవరూ స్త్రీ గర్భాన జన్మించిన వారు కారు: సూక్ష్మలోకవాసులు తమ విశ్వ సంకల్ప శక్తి సహాయంతో ప్రత్యేక ( అవయవ ) నిర్మాణమూ ,సూక్ష్మ శరీరమూ గల సంతానాన్ని సృష్టించుకుంటారు.

సూక్ష్మలోకవాసులందరి మధ్య భావసంపర్కం పూర్తిగా , మానసికప్రసార ( టెలిపతీ ) సూక్ష్మదూరదర్శనాల ( ఆస్ట్రల్ టెలివిజన్ ) ద్వారా జరుగుతుంది.

మానవుడు ప్రధానంగా ఘన,ద్రవ,వాయు పదార్ధాల మీదా గాలిలో ఉన్న ప్రాణ శక్తి మీదా ఆధారపడి ఉన్నవాడు : కానీ సూక్ష్మలోకవాసులు ప్రధానంగా విశ్వకాంతి మీదే ఆధారపడి బతుకుతారు.

సూక్ష్మలోక జీవులు తమ రూపాల్ని సంకల్పానుసారంగా సాక్షాత్కరింపజేయటం , అదృశ్యం చేయటం చేస్తూంటారు.

సూక్ష్మ ప్రపంచం అత్యంత ఆకర్షణీయమైనదీ పరిశుభ్రమైనదీ పరిశుద్ధమైనదీ సువ్యవస్థితమైనదీ.

ఇలా ఎన్నో విషయాలు శ్రీ యోగానంద గారి గురుదేవులైన శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యునికి చెప్పటం జరిగింది.

నాకు ఇలా అనిపించింది.......

ఇతరలోకాల వారికి , మానవులకు ఇన్ని తేడాలు ఉన్నప్పుడు మరి మానవులకు దేవతలకు ఎన్నో తేడాలుంటాయి. మనం దేవతల చర్యలను మన ఆలోచనాకోణం నుండి మాత్రమే చూస్తాము.

కానీ, దేవతలకు మానవులకు ఉన్న రీతిలో రాగద్వేషములు ఉండవు.

దేవతల చర్యలు మానవులకు ఉన్నటువంటి రాగద్వేషాలను పోలి ఉండవు. దేవతల చర్యలను మానవ ధర్మాలు,గుణముల కోణం నుండి చూడకూడదు.

ఉదా..ఇంద్రుడు తపస్సు చేసే వారి వద్దకు అప్సరసలను పంపి వారి తపస్సులను భగ్నం చేయటానికి ప్రయత్నిస్తారు అని కొందరు అంటారు.

కానీ ఇంద్రుడు అప్సరసలను పంపటం ద్వారా.. తపస్వుల పట్టుదలను పరీక్షిస్తారు అని కూడా అనుకోవచ్చు.

ఇంకా , చంద్రునికి తన భార్యలలో రోహిణి అంటే ఎక్కువ ఇష్టం అని చెబుతారు.

చంద్రునికి ఉచ్ఛస్థానం వృషభరాశి . అందులో కృత్తిక ,మృగశిర నక్షత్రములు పూర్తిపాదములతో ఉండవు. రోహిణి నక్షత్రం మాత్రమే అన్ని పాదములతో ఉంటుంది.

అందుకని...చంద్రునికి ఉచ్ఛస్థానమయిన వృషభంలో రోహిణి నక్షత్రం పూర్ణంగా ఉంటుంది కాబట్టే.. అని కూడా అర్ధం చేసుకోవచ్చు...

అందుకే దేవతల చర్యలను మానవగుణముల కోణం నుండి చూడకూడదు.

దేవతలు మానవులుగా అవతరించిన సందర్భంలో మాత్రము , వారి చర్యలను కొంతవరకు , మానవధర్మముల కోణము నుండి చూడవచ్చు అనిపిస్తుంది..
 
ఇలాంటి విషయాలలో మనకు తెలియని ఎన్నో అర్ధాలు దాగుంటాయి.

ప్రతి
దాన్ని అపార్ధంచేసుకోవటం కాకుండా , దైవం దయ కోసం ప్రయత్నించాలి అందరూ .అప్పుడే ప్రశాంతత లభిస్తుంది.

ఇందులో పొరపాట్లు ఉన్నచో భగవంతుడు క్షమించవలెనని ప్రార్ధిస్తున్నానండి.



No comments:

Post a Comment