koodali

Friday, August 26, 2011

దైవం చేతిలో చంపబడ్డా సరే, అందరు రాక్షసులకు మోక్షం ఉండదని..........2 వ భాగం.

 

ఇంతకు ముందు టపాలో దైవం వల్ల సంహరించబడ్డ రాక్షసుల గతి గురించి వ్రాయటం జరిగింది.

ఇంకా, మహిషాసురుని సంహారానంతరము దేవతలు అమ్మవారిని స్తుతించిన సందర్భంలో , అలా సంహరించబడ్డ రాక్షసులను అమ్మవారు స్వర్గానికి పంపుతారని దేవతలు అన్నట్లుగా ఉన్నది.


అమ్మవారు దయాళువు కాబట్టి , దేవతలు అలా అని ఉంటారు.

అయితే దేవతలు అన్నట్లుగా ఆ రాక్షసులను సంహరించటమే వారికి మేలు చెయ్యటం.

(అంటే, వారు మరిన్ని పాపాలు చేసి మరింత పాపం మూట కట్టుకోవటం జరగదు కాబట్టి, ) .


నేను ఈ రోజు శ్రీ దేవీ భాగవతము చదివినప్పుడు అందులో మహిషాసుర వధ జరగటానికి ముందు భాగం కొంత చదివాను. అందులో ..

మహాదేవి ,మహిషాసురునితో యుద్ధం చేయబోయే ముందు ....... మహిషాసురుడు మొదలు తాను యుద్ధానికి రాకుండా తన మంత్రిని అమ్మవారి వద్దకు రాయబారిగా పంపుతాడు.


* ఆ రాక్షస మంత్రి మాటలను వింటూనే మహాదేవి విరగబడి నవ్వి, కొన్ని మాటలు అతనితో మాట్లాడుతూ,

* ఇంకా కొన్ని మాటలను చెప్పి వాటిని మహిషాసురునికి చెప్పమని చెప్పటం జరిగింది.

* అందులోని కొన్ని మాటలు... సర్వ దైత్యులను సంహరించడం కోసం వచ్చాను.

* మహిషుణ్ణి మట్టుబెట్టమని ఈ దేవతలు ప్రార్ధిస్తే వచ్చాను.. (అంటూ ) ...వెళ్ళు నీ ప్రభువుతో చెప్పు. నా మాటగా చెప్పు.


* రాక్షసాధమా ! జీవితేచ్ఛ ఉంటే వెంటనే పాతాళానికి పారిపో . లేదంటే ప్రాణాలను కోలుపో . ఎన్నో పాపాలు చేశావు . అన్నింటికీ శిక్షగా నిన్ను సంహరిస్తాను . బాణాలతో నీ శరీరమంతా తూట్లు పొడుస్తాను. యమలోకానికి పంపిస్తాను .


* ఈ పాటి నా దయాళుత్వాన్ని తెలుసుకుని వెంటనే పాతాళానికి పారిపో . ప్రాణాలు నిలుపుకో. నిన్ను చంపితే దేవతలకు స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది.


* ఈ స్వర్గాన్నీ ఈ భూమినీ ఈ సముద్రాన్నీ విడిచిపెట్టి పారిపో . పాతాళానికి పారిపో . యుద్ధం చెయ్యాలని కోరికగా ఉంటే వెంటనే బయలుదేరి రా . మహావీరులతో మహాబలాలతో తరలిరా.

* అందరినీ ఒకేసారి యమలోకానికి పంపిస్తాను.

* ప్రతి యుగంలోనూ నీ వంటి మహామూఢుల్ని ఎంతోమందిని సంహరించాను...అంటూ ఇలా ఎంతో చెప్పటం జరిగింది.


ప్రాణాలను దక్కించుకోవాలంటే పాతాళానికి పారిపొమ్మని అమ్మవారు దయతో ఎన్నిసార్లు చెప్పినా వినక మహిషాసురుడు యుద్ధం చేసి ప్రాణాలను కోల్పోయాడు.


ఇక్కడ అమ్మవారి మాటలను విశ్లేషించే శక్తి నాకు అంతగా లేదు . కానీ , నాకు తెలిసినంతలో ఇలా అనిపిస్తోంది. .


* ఆ రాక్షసులు చనిపోయాక స్వర్గానికి వెళ్ళరనీ, యమలోకానికే వెళ్తారనీ తెలుస్తోంది.

అమ్మవారి చేతిలో ప్రాణాలు విడిచినా కూడా , పాపాలు చేశారు కాబట్టి యమలోకానికే వెళ్ళవలసి వచ్చినప్పుడు,

మరి ఈ రోజుల్లో చాలా మంది ఎన్నో పాపాలు చెసేసి పాప పరిహారార్ధం కొన్ని పూజలు చేస్తే చాలు . ఇక పాపం పోతుందనే భ్రమలో ఉన్నారు.


ఆ భ్రమతో దండిగా మళ్ళీ పాపాలు చేస్తున్నారు. ఎన్ని పాపాలు చేసినా అమ్మవారు క్షమించేస్తారులే అని.

అయితే కొన్ని గ్రంధాలలో పాపపరిహారార్ధం ప్రాయశ్చిత్తాలు చెప్పబ
డ్డాయి నిజమే.

కానీ అవి ఎవరికొరకంటే, తెలిసోతెలియకో పాపాలు చేసి తరువాత చేసిన పాపాలకు విపరీతంగా బాధపడుతూ పశ్చాత్తాపపడుతున్న వారి కొరకు మాత్రమే ఈ ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి.


అంతేకానీ , ఎప్పటికప్పుడు పాపాలు చేయటం, ఆనక ప్రాయశ్చిత్తాలు చేసుకోవటం, మళ్ళీ పాపాలూ చేయటం ఇలా అతితెలివిగా ప్రవర్తించే వారికోసం ప్రాయశ్చిత్తాలు, పూజలు చెప్పబడలేదు. 


అందుకని ఇటువంటివారు పాపాలు చేయటం మానుకోవాలి. ఇలాంటి కొందరు దైవాన్ని కూడా ఏమార్చగలమనే భ్రమలో ఉన్నారు. 


ఇక, రేపు శనిత్రయోదశి. గత కొంతకాలంగా " మా " టివిలో శనిదేవుని కధలు సాయంకాలం 6 గంటలకు వస్తున్నాయి. బాగుంటున్నాయి.

"మా " టివిలో కొన్ని ప్రొగ్రాంస్ నాకు నచ్చవు. కానీ ఈ ప్రొగ్రాం ,ఇంకా కొన్ని ప్రోగ్రాంస్ బాగుంటాయి.

వ్రాసినదానిలో పొరపాట్లు ఉన్నచో దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను. అంతా దైవం దయ.

 

No comments:

Post a Comment