ఒకప్పుడు మేము ముంబాయిలో ఉన్నప్పుడు 13 వ అంతస్తులో ఉండేవాళ్లం.ఆ ఇంటికి అద్దాలతో ఉన్న బాల్కనీలు చక్కగా ఉన్నాయి. వెళ్ళిన కొత్తలో బాల్కనీ నుంచి అన్నీ భలే కనిపిస్తున్నాయని బాల్కనీలో కూర్చోవటం జరిగింది.
ఒకరోజు ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్లినప్పుడు నేను బాల్కనీలో కూర్చున్నాను. కొంతసేపటి తరువాత ఇంట్లోకి వెళ్దామని చూస్తే ఎంత ప్రయత్నించినా గ్లాస్ డోర్ రావటం లేదు. పొరపాటున గ్లాస్ డోర్ స్పీడుగా వేస్తే అది లాక్ అయినట్లుంది.
అలాంటి గ్లాస్ డోర్లు మాకు కొత్త. అలా లాక్ అవుతాయని నాకు తెలియదు. చాలా భయం వేసింది. నా దగ్గర ఫోన్ కూడా లేదు. 13 అంతస్తుల పైనుంచి పిలిచినా క్రింద ఎవరికి వినపడలేదు.
క్రింద రెండు దేవాలయాలు కనిపిస్తున్నాయి. దూరంగా సముద్రం నుండి ఒక పాయ లాంటిది కనిపిస్తుంది. దైవాన్ని ప్రార్దించుకున్నాను.
(నవి ముంబై ప్రాంతం)
ఆ ఇంటికి వెళ్ళిన కొత్తలో ఈ సంఘటన జరిగింది. మా బాల్కనీకి ఆనుకుని పక్కింటివారి బాల్కని ఉంది. పక్కింటివారు నాకు పరిచయం లేదు. పిలిచాను కానీ వాళ్ళు పలకలేదు.
ఆ బాల్కనీలో చిన్న అలమార ఉంది. అందులో ఒక పాత ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంది. ఆ బాటిల్ తో పక్కింటివారి బాల్కనీ వైపు గట్టిగా కొట్టాను. ఆమె లోపల ఉన్నట్లున్నారు. వారికి వినిపించలేదు.
మా వాళ్లు బయట నుంచి తిరిగి వచ్చే వరకు నేను బాల్కనీలో అలా ఉండలేను అనిపించింది. నాకు టాయ్‌లెట్ కూడా వెళ్ళాలనిపించింది.
దైవాన్ని ప్రార్ధించుకున్నాను. నేను మరలమరల పక్కవారి బాల్కనీకి బాటిల్‌తో కొట్టి సౌండ్ చేసాను.
కొంతసేపటికి పక్కింటి ఆమె, వారి బాల్కనీకి వచ్చారు. ఆమె నన్ను చూసి బయటకు వెళ్లి, ఇంకొక ఆమెను తీసుకొచ్చి ఇద్దరూ మా ఇంటి తలుపును బయటనుంచి తీసి నన్ను కాపాడారు. మా ఇంటి ఓనర్ మా ఇంటి ఇంకో తాళాన్ని వాళ్ల వద్ద ఉంచారట.
నాకు పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. దైవము దయ వల్ల అలా రక్షించబడ్దాను.
ఆ సమయానికి పక్కింటి వాళ్ళు వారి ఇంట్లో లేకపోతే నాకు చాలా కష్టమయ్యేది.
చిన్నపిల్లలు ఎవరైనా అలా ఇరుక్కుపోతే కష్టం కదా.. అందుకే జాగ్రత్తగా ఉండాలని ఇవన్నీ వ్రాసాను.
అక్కడ వాటర్ బోటిల్ ఉండటం, దానితో పక్కవాళ్లను పిలవాలని ఆలోచన రావటం, పక్కవాళ్ళు ఆ సౌండ్ విని రక్షించటం.. ఇవన్నీ భగవంతుని దయ వల్లనే జరిగాయి.
అంతా దైవము దయ. దైవానికి అనేక కృతజ్ఞతలు.
.............
మరికొన్ని విషయాలు..
సమాజంలో, గొడవలు..నేరాలు..ఘోరాలు ఎక్కువయ్యాయి. ప్రపంచంలో ఏది ఎందుకు జరుగుతుందో అర్ధం కావటం లేదు. అంతా మంచిగా ఉండాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను. దైవమే దిక్కు.
..........
మనుషులు కొందరు తమ స్వార్ధం, అత్యాశ..వంటి గుణాలతో ప్రపంచంలో బాధలకు కారణమవుతున్నారు. మనుషులు మంచిగా ప్రవర్తిస్తే బాగుంటుంది.
దైవము
జీవులకు అవసరమైనవి ఎన్నో ఇస్తున్నారు. జీవులకు అవసరమైన..గాలి, నీరు,
ఆహారానికి ఎన్నో మొక్కలు..ఇలా ఎన్నో ఉన్నాయి. ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు
కూడా ఉన్నాయి. దైవానికి అనేక కృతజ్ఞతలు.
********************
మన గతజన్మలలో ఉన్నవాటి గురించి ఇప్పుడు కూడా తెలిస్తే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది కొన్నిసార్లు. గతజన్మలలో మనకు తెలిసినవి ఏమైనా ఇప్పుడు కూడా ఉంటే బాగుండనిపిస్తుంది.
గతజన్మలలో మనతో ఉన్న వారు ఇప్పుడు మనతో ఉండవచ్చు..లేకపోవచ్చు. ఇప్పుడు ఉన్నా కూడా మనము వారిని గుర్తించలేకపోవచ్చు. అయితే, దైవము ఎప్పుడూ ఉంటారు..సూర్యుడు, చంద్రుడు, భూమి..గతజన్మలలో కూడా మనతో ఉన్నారు.
గత జన్మలలో మనతో ఉన్న అప్పటి సూర్యుడు, చంద్రుడు, భూమి..ఇప్పుడు కూడా ఉన్నారు. మనము వాటిని గుర్తించగలము. ఇది ఎంతో ఆశ్చర్యకరము, ఆనందకరమైన విషయము.
దైవము జీవులకు జన్మజన్మల బంధువు, శాశ్వతమైన వారు.
********************
anrdDecember 7, 2023 at 5:07 PM
కొన్ని అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ బయటవారు కనిపించేటట్లు ఉంటుంది. అయితే, కొన్నిచోట్ల పూర్తిగా క్లోస్ చేసిన తలుపులతో ఉండే లిఫ్ట్ ఉంటుంది. ఇలాంటి లిఫ్ట్ ఏ కారణం చేతనైనా కొద్దిసేపు ఆగిపోతే అందులో వారు భయపడతారు. చిన్నపిల్లలయితే ఇంకా భయపడతారు.
ఇలాంటి లిఫ్ట్‌ల్లో ఒక తలుపుకు పైనుంచి క్రిందకు కొద్దిగా ఖాళీ ఉండేటట్లు, అంటే పొడుగుగా ఉండే కిటికీలాగ చేసి దానికి మెష్ అమర్చి తయారుచేస్తే ఎప్పుడయినా ఆగిపోతే అందులో ఉన్నవారికి గాలి ఆడుతుంది, బయటకు కనిపిస్తుంది.చిన్నపిల్లలకు కూడా బయట కనిపించేలా ఉండాలి. అయితే చేతి వేళ్ళు పట్టకుండా సన్నటి మెష్ అమర్చాలి. లిఫ్టులో వాచ్ మెన్ కు తెలిసేలా ఫోన్ కూడా పెట్టవచ్చు.
చాలా అపార్ట్ మెంట్స్ లో ఇళ్లలో పనిచేసేవారిని, కూరలు అమ్మేవారిని లిఫ్ట్ వాడనివ్వరు. అన్ని మెట్లు ఎక్కాలంటే ఎవరికైనా కష్టమే. ఆ వర్కర్స్ వచ్చి పనిచేయకపోతే చాలామందికి కుదరదు. అందువల్ల వర్కర్స్ నూ లిఫ్ట్ వాడనివ్వాలి. అలా కుదరదు అంటే, కనీసం పైకి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ ఉపయోగించి, క్రిందకు దిగేటప్పుడు మెట్లను వాడవచ్చు.
........
Reply
anrdDecember 7, 2023 at 5:07 PM
ఎత్తైన అపార్ట్‌మెంట్స్‌లో కొందరు బాల్కనీల్లో అద్దాలు డోర్లు అమరుస్తారు. అవి లోపల నుండి బోల్ట్ ఉంటాయి. బాల్కనీకి వెళ్లి తటాలున డోర్ వేస్తే క్లోస్ అయ్యి మనుషులు బాల్కనీలోనే ఉంటారు. ఇంట్లో ఎవరైనా ఉంటే ఫరవాలేదు. లేకపోతే బాల్కనీ నుంచి అరచి బైటవారిని పిలిచి, ఇంటి తలుపు ఎలాగోలా తెరిచి లోపలికి వెళ్లి బాల్కనీ అద్దాలతలుపు తెరవాలి.
ఇక 12వ అంతస్తు లో బాల్కనీలో చిక్కుకున్నవారు ఎంత అరిచినా క్రింద ఉన్నవారికి వినపడదు. పక్కన పోర్షన్లో వినిపించేటట్లు ఎవరైనా ఉండాలి. చేతిలో ఫోన్ ఉండాలి. ఫోన్ చార్జిన్గ్ ఉండాలి. బాల్కనీల్లో ఫోన్ అమర్చుకుంటే వాచ్మెన్ ను పిలవచ్చు.
లేకపోతే ఒక గట్టితాడుకు చిన్న బకెట్ కట్టి అన్ని బాల్కనీల్లో ఉంచుకోవాలి. ఎవరైనా ఇరుక్కుపోతే బకెట్ క్రిందకు వెయ్యచ్చు. బాల్కనీలో ఒకచిన్న అల్మారా కట్టి, అందులో చిన్నబుక్, పెన్ పెట్టుకుంటే బాల్కనీలో ఇరుక్కుపోయిన విషయం పేపర్లో వ్రాసి, బకెట్లో వేసి క్రిందకు వదలవచ్చు. క్రింద తిరిగేవారు చూసి కాపాడతారు.
No comments:
Post a Comment